Facebook Twitter
వివిన మూర్తి

వివిన మూర్తి

తెలుగు కథా సాహిత్యాన్ని కాలీపట్నం రామారావు, కొడవటిగంటి, రావి శాస్త్రి వంటి వారు సుసంపన్నం చేస్తున్న కాలంలోనే వారి ప్రభావంతో ఎందరో రచయితలు కలం పట్టారు. వారి దృక్కోణం నుంచి, వారి ప్రభావంతో కథలు రాశారు. సమాజానికి, సాహిత్యం ఎలా తోడ్పాటు అందిస్తుందో తమ కథలు ద్వారా నిరూపించారు. అలాంటి కథా రచయితల్లో గుర్తుంచుకోవాల్సిన రచయిత వివిన మూర్తి.

మారుతున్న సమాజ స్థితిని, ఆర్థిక మూలాల్లో వచ్చిన సూక్ష్మ, స్థూల పరిణామాల్ని పట్టుకొని కథల రూపంలో అందించారు వివిన మూర్తి. 1970ల నుంచి విరివిగా కథా రచన చేశారు. తెలుగు కథను పునరుద్ధరించాలి అని సదస్సులు, సమావేశాలు జరుగుతున్న కాలంలో కథను పీఠం ఎక్కించడానికి తన వంతు కృషి చేశారు వివిన మూర్తి.

వివిన మూర్తి తూర్పు గోదావరి జిల్లాలోని రామాపురంలో పుట్టారు. పాలిటెక్నిక్ పూర్తిచేశారు. కొంతకాలం చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో భారతీయ నౌకాదళానికి చెందిన క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేశారు. ఇందువల్ల గ్రామ వాతావరణాన్ని, నగర జీవితాన్ని అత్యంత సమీపంగా పరిశీలించే అవకాశం కలిగింది వివిన మూర్తికి. అందుకే వారి కథలు భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడీదారి సమాజాన్ని, అలానే ప్రపంచీకరణ దుస్థితిని సమగ్రంగా ఆకలింపుచేసుకున్నట్లు కనిపిస్తాయి. అలానే ఆ ఇతివృత్తాలకు తగిన శిల్పాలను ఎన్నుకోవడం వివిన మూర్తి ప్రత్యేకత. అసలు సాహిత్యంలోకి చాలా ఆలశ్యంగా వచ్చారు వివిన మూర్తి అని విమర్శకులు ప్రశంసిస్తారు. అంటే వివిన మూర్తి మొదట పద్యాలు రాసేవారు. ఓ కావ్యాన్ని కూడా వెలువరించారు.

సాహిత్య అక్షరాల

మహాత్మ్యం కార్యహీన

మాన్యతముల పౌ రోహిత్యం

సత్యధైర్య రాహిత్యం కీర్తికి సుఖరాజపథంలే..

ఇలా పద్యాలు రాసే వివిన మూర్తి కాలక్రమంలో అద్బుతమైన కథలు, నవలలు రాశారు. భాషలో, భావంలో, వస్తు ఎంపికలో అన్నింటిలో సమూలంగా మార్పు చెందారు. దీనికి కారణం వారి దృక్పథంలో వచ్చిన మార్పే అంటారు అభిమానులు.

వీరి మొదటి కథ "రొట్టెముక్క" 1976లో ప్రచురితం అయింది. వీరి నవలలు కూడా గొప్పవే. మొదటి నవల "వ్యాపార బంధాలు" 1986లో వచ్చింది. రెండో నవల "విమానం వచ్చింది". అద్బుతమైన శైలితో ఉంటుంది. ఇది 1989లో వచ్చింది. "హంసగీతి" అనే మరో నవల చారిత్రాత్మకమైన ఇతివృత్తంతో కూడుకున్నది. అత్యంత ప్రతిభతో ఆకాలం నాటి సమాజాన్ని చిత్రించారు ఇక కథా రచియితగా వివిన మూర్తి సుమారు నూటయాభై పైనే రాశారని అంచనా. అయితే ఇవి పూర్తి సంపుటాలుగా రాలేదు. కేవరలం 24 కథలు మాత్రమే "ప్రవాహం", "దిశ" అనే సంపుటాలుగా వచ్చాయి. వీటిపై పరిశోధనలు కూడా జరగలేదన్నది తెలుస్తున్న సత్యం. మొత్తంగా వీరి కథల్లో మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు ప్రభావితం చేస్తాయి అన్న భావన ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినా దోపిడీలో మార్పు రాలేదన్నది వీటిలో కనిపించే తత్త్వం. అందుకే సామాజిక బాధ్యత ఎరిగి కథలు రాసిన వ్యక్తిగా వివిన మూర్తిని గుర్తించాలి.

వంకర చూపులు, ముంజలు, కృష్ణస్వప్నం, పయనం పలాయనం, పాడుకాలం, మాయ - మహామాయ, ప్రవాహం, దళిత సత్యం, చేటపెయ్య, స్పృహ, ప్రపంచమొక పద్మవ్యూహం... వంటి కథలు ఎన్నో వీరిలోని కథా రచయితను, శిల్ఫసౌందర్యాన్ని మనకు పట్టి చూపిస్తాయి. ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు సమాజం మారిని విధానాన్ని ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "వంకర చూపులు" కథలో ఓ ఇల్లాలు పాత గుడ్డలతో బొంత కుడుతుంది. ఆ బొంతను ఆ ఇంట్లో వారు దక్కించుకోవడంలో ఎవరి శ్రమ ఎంత అనేదే ఈ కథ ఇతివృత్తం. అత్త ఆ చీరల పెట్టుబడి నాది అంటుంది. ఆడపడచు శ్రమ చేయకుండా నాకు కావాలి అంటుంది. చివరకు కోడలు ఆ బొంతను పొందడంతో శ్రమించే వారికే ఫలితం దక్కాలి అని రచయిత చెప్తాడు. అలానే "ముంజెలు" కథలో పొలంలో ఉన్న తాటిచెట్ల ముంజెలు కూడా వ్యాపారం కావడంతో వాటిని అమ్ముకొని బతికే కూలి సత్తెయ్య కష్టాలుపడాల్సి వస్తోంది. ఇక ప్రపంచీకణ స్వభావాన్ని చిత్రించిన కథ "కృష్ణస్వప్నం". అమెరికా అధ్యక్షునికి కృష్ణుడు కలలో కనిపించి నాగరిక సమాజాన్ని నిర్మించాలంటే ఆయుధాలు అవసరం, అప్పుడు మేము కూడా ఖాండవ వనాన్ని దహనం చేసి, నాగులను ఊచకోత కోసం అని చెప్తాడు. నీవు నాకు వారసునివి అని బోధ చేస్తాడు. తర్వాత హృదయం లేని పెద్దభూతం అమెరికా అధ్యక్షుని ఎదుట ప్రత్యక్షమై చిన్న బిల్లాగా మారి అతని పొట్టలోకి పోతుంది. ఇలా కథను ఊహాత్మక శిల్పంతో రాయటం వివిన మూర్తి ప్రతిభకు నిదర్శనం.

కొత్తగా ప్రవేశించిన ప్రైవేటీకరణను, ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని కూడా తన కథల్లో చెప్పాడు వివిన మూర్తి. రావి శాస్త్రి లాగే "ఋక్కులు" పేరుతో కథలు రాశారు. వీరు రాసిన స్వేచ్ఛను గురించి "ఆద్వైతం", వాంఛను గురించి "యయాతి", భద్రత గురించి "స్పర్శ" వంటి కథలు ఉత్తమమైనవనే చెప్పాలి. గోదావరి నదిని గోదారిగాడుగా తన కథలో పాత్రచేసి అంతరార్థ కథానాన్ని, పురాణ పాత్రైన హరిశ్చంద్రుని పాత్ర చేసి పురా కథల కథనాన్ని, చనిపోయిన దూడ చర్మంలో గడ్డి కుక్కే పనిని ప్రతీకగా తీసుకొని ప్రతీకాత్మక కథల్ని రాశారు వివిన మూర్తి. ఇలా తెలుగు భాషలో సంక్లిష్టమైన సమాజాన్ని, అంతకంటే సంక్లిష్టమైన కథనాలతో పాఠకుల మదికి చేరేలా కథలు రాసిన వ్యక్తి వివిన మూర్తి. నేటికీ జీవితం పట్ల, సమాజం పట్ల నిబద్ధతతో కథలు రాస్తున్న అతి తక్కువ మందితో వివిన మూర్తి ఒకరు. కథానిలయం నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు.

ఇటీవలే "దిద్దుబాటు" కన్నాముందే 92 కథలు ఉన్నాయని వాటిని వెలుగులోకి తేవడానికి వెదుకులాడారు వివిన మూర్తి. కథలు రాయడమే కాదు, కథా సేవ చేస్తున్న కథాభిలాషి వివిన మూర్తి.

- డా.ఎ.రవీంద్రబాబు