Home » మన రచయితలు » వర్షంFacebook Twitter Google
వర్షం

 

వర్షం

 

 

రావిశాస్త్రి చిరునామా అక్కరలేని రచయిత. వృత్తి లాయరైనా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. తెలుగు నవలా సాహిత్యానికి అల్పజీవి లాంటి మనో విశ్లేషణాత్మక నవలను అందించారు. ఉత్తరాంధ్ర మాండలిక భాషను సొగసుగా రచనల్లో వాడారు. కథను ఎలా రాయాలో తెలుసుకోడానికి గొప్ప ఉదాహరణలు రావి శాస్త్రి కథలు. అసలు కథను ఎక్కడ ప్రారంభించాలో, ఎలా మలుపు తిప్పి మెరుపులాంటి ముగింపు ఎలా ఇవ్వాలో రావి శాస్త్రికి బాగా తెలుసు. అతను రాసిన కథల్లో ప్రతి ఒక్కటీ ఓ పాఠం లాంటిదే. అలాంటిదే వర్షం కథ. సంకల్పం అనేది మనిషికి ఎంత అవసరమో ఓ పిల్లాడి చేత చెప్పిస్తాడు ఈ కథలో.
      క్లుప్తంగా కథా విషయానికి వస్తే- వర్షం దబాయించి కొడుతుంది. కలకత్తా వెళ్లాల్సిన సిటీబాబు అడివిపాలెం నుంచి వచ్చి వర్షం వల్ల కమ్మలపాక టీ దుకాణంలో చిక్కుకు పోతాడు. ఆ టీ దుకాణాన్ని ఒక తాత నడుపుతుంటాడు. అక్కడి నుంచి సిటీబాబు స్టేషన్ కు వెళ్లాలంటే రెండు కోసుల దూరం నడవాలి. లేదా బస్సు, లేదా బండి. వర్షం వల్ల అవేవి రావు. వర్షం మాత్రం మబ్బులు పట్టి, జోరుగా కురుస్తుంది. ఆ సిటీబాబు పేరు పురుషోత్తం. తాత వర్షంలో వెళ్లలేవని చెప్తాడు. పైగా- కత్తుల్లా మెరుపులు, కొండలు బద్దలు కొట్టినట్లు ఉరుములు, శివాలెత్తినట్లు గాలి, పగబట్టినట్లు వర్షం.. దాంతో పురుషోత్తంకు ఎటూ పాలుపోక అక్కడే నిలబడి ఆలోచనల్లో మునిగిపోతాడు.
          కలకత్తా వెళ్లాల్సిన పురుషోత్తం మామ మాట విని అడవిపాలెంలో మున్సబు కూతురుని చూడడానికి వెళ్తాడు. కలకత్తా అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా మేనమామ మాట కాదనలేక పెళ్లికూతుర్ని చూడడానికి అడివిపాలెం వెళ్తాడు. మున్సబుగారిది పాతకాలం నాటి పెంకుటిల్లు. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, తులసి మొక్క. దండెం మీద ఆరేసిన తెల్లచీర, దీపపు వెలుగులో దేవతలా పెళ్లికూతురు కనిపిస్తుంది. తనను నిదానంగా బరువైన రెప్పల్లోంచి చూస్తుంది. పెళ్లి కూతురుని, తల్లి కావాలని మాట్లాడిస్తుంది. పెళ్లికూతురి తటాకాల్లాంటి కళ్లు వెలిగే చుక్కల్ని, మెరిసే చంద్రుడ్నే కాదు మండేసూర్యుడ్ని కూడా స్పష్టంగా చూడగలవు. అలా ఆలశ్యం అయిపోయి మర్నాడు ఉదయం బంధువులింట్లో భోజనం చేసి ఎండ్లబండిమీద బయల్దేరతాడు పురుషోత్తం. మున్సబు గారి ఇంటి దగ్గరకు వచ్చే సరికి పెళ్లి కూతురు గడపలో నిలబడి వారగా చూస్తుంది. ఆ చూపు పురుషోత్తంని వెంబడిస్తుంది. ఎడ్లబండి సాగుతూ ఉంటే, అతనికి నర్సు జ్ఞాపకం వస్తుంది. ఆసుపత్రికి వెళ్లినప్పుడు పురుషోత్తం బరువును మెషిన్ మీద చూస్తుంది నర్సు. తర్వాత భయం వద్దు, జబ్బు నయం అవుతుంది అని భరోసా ఇస్తుంది. అప్పుడు పురుషోత్తం కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక కంటతడి పెడతాడు. చుట్టూ అందమైన ప్రకృతిని చూస్తూ, ఎండ్లబండిపై వస్తుంటే వర్షం ప్రారంభమవుతుంది. ఎలా కమ్మపాక టీ దుకాణంలోకి వచ్చేసరికి వర్షం బాగా ఎక్కువ అవుతుంది.     
          టీ దుకాణం అంతా స్తబ్దతగా ఉంటుంది. తాత ముక్కాలిపీట మీద కూర్చొని చుట్ట తాగుతాడు. నీటిబొట్లు పాకపైనుంచి పాముల్లా జారుతూ ఉంటాయి. వర్షం మాత్రం ఆగదు. తాతా వర్షంలో బొగ్గులకోసం పంపిన తన మనవడికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వర్షంలో ఎలా వస్తాడో... ఎదురుపోవాలంటే వర్షం పెద్దగా ఉంది అని కంగారు పడుతుంటాడు. నిప్పు ముట్టిద్దామని పురుషోత్తమును అగ్గి అడుగుతాడు. లేదని తెలుసుకొని ఇంకా నిరుత్సాహపడతాడు. ఇనుప ఊసల్లా వర్షం పడుతుంటే పురుషోత్తం ఆలోచనల్లోకి వెళ్తాడు. తన గురించి తను ఆలోచిస్తాడు. కలకత్తా వెళ్లి వచ్చాక పెళ్లి చూపులకు వెళ్లాల్సింది. కానీ... ఎప్పుడూ అంతే... చదువుకోకపోతే చెడిపోతావు అన్నారు. చదువుకున్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు అన్నారు. బుద్ధిగా ఉన్నాడు. ఈత రాకుండా నీళ్లల్లో దిగకూడదు అన్నారు. దాన్నీ పాటించాడు. రాజమార్గాలు ఉండగా, సందులెమ్మట తిరగకు అన్నారు. సందులెమ్మట తిరగలేదు. అన్యాయం, అధర్మం, నీకేల అటువైపు... నీ పని నువ్వు చేసుకో అన్నారు. అలానే ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న పురుషోత్తంకు వర్షంలో తడుస్తూ, బొగ్గులమూట భుజాన వేసుకుని ధారల్ని చీల్చుకుని వస్తున్న తాత మనవడు కనిపిస్తాడు.
      లోపలకు వచ్చి, బొగ్గుల మూటను పాకలో ఓ వైపు విసిరేసి, బట్టలు పిండుకొని గంతులేస్తాడు. ఎలా వచ్చావు అని తాత అడిగితే ఒరసాన్ని సంపిడిసి పెడతాడీపోతురాజు అని సమాధానం ఇస్తాడు పిల్లోడు. ఆ మాట పురుషోత్తంలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అతనిలో నిస్తేజంగా ఉన్న శక్తిని బద్దలు కొట్టి పైకి తెస్తుంది. అంతే... తాతకు కూడా చెప్పకుండా ఒకటిన్నర గంటలో రెండుకోసుల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ చేరాలని ఆ పెద్ద వర్షంలో బయలుదేరుతాడు. మసక చీకట్లో తిన్నగా, సూటిగా ఈదురుగాలి కెదురుగా, వర్షాన్ని సరుకు చేయకుండా, తెర్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం... అతడ్ని తాత మెచ్చుకున్నాడు. అని కథ ముగిస్తాడు రావిశాస్త్రి.
         పాత్రల సంభాషణల్లో, కథ చెప్పడంలో అక్కడక్కడా అద్భుతంగా ఉత్తరాంధ్ర పలుకుబడులు వాడారు రావిశాస్త్రి. అలానే కథంతా అద్బుతమైన వర్ణనలు రాశారు. కథ వర్షంతో మొదలై, వర్షంతో ముగుస్తుంది. ఆ వర్షంలో ఒక వ్యక్తి పొందిన జీవన మార్గదర్శకాన్ని చెప్పారు. సందర్భాను సారంగా ప్రతీకలు వాడారు. మనిషి సంకల్పం కంటే సమస్య చిన్నదని ఓ పన్నెండేళ్ల పిల్లాడితో చెప్పించారు రావిశాస్త్రి. వీరి అన్ని కథలు గొప్పవైనా ఈ కథ ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు.       
                                                  

- డా.ఎ.రవీంద్రబాబు


తెలుగు వాగ్గేయ కారులలో ప్రముఖులు త్యాగరాజు గారు...
Mar 20, 2019
తెలుగు భాషలో ఆది కవి నన్నయ. ఈయన 11 వ శతాబ్దానికి చెందిన వారు...
Mar 19, 2019
యుద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళా మణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు
May 21, 2018
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల గురించి లోకానికి చాటే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
Dec 18, 2017
తెలంగాణలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ప్రశంసలు, విమర్శలూ ఎలా ఉన్నా...
Dec 14, 2017
భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు.
Sep 14, 2017
తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు.
Sep 12, 2017
ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా
Sep 5, 2017
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది.
Aug 31, 2017
తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి.
Aug 26, 2017
TeluguOne For Your Business
About TeluguOne