Facebook Twitter
నిశ్శబ్ద సాయం...

                      

 

నిశ్శబ్ద సాయం...

 

సమయం రాత్రి 11 గంటలు:
సిటీలో అదో పెద్దహాస్పిటల్. అందులో  ICU వార్డు కి ఆనుకొని ఉన్న హాలులో నీరజ, సునీత కూర్చొని ఉన్నారు. వాళ్ళదగ్గరకు ఒక నర్స్ వచ్చి “మీరు తీసుకొచ్చిన పేషెంట్ కి ట్రీట్ మెంట్ మొదలైంది” అని చెప్పి వెళ్ళిపోయింది.  ఈ లోపల నీరజ భర్త హాస్పిటల్ కి వచ్చారు. అతనికి నీరజ అన్ని విషయాలు వివరించింది.  “ప్రాణభయం లేకపోవచ్చు అన్నాడు,డాక్టర్”  “అంటే ష్యూర్ గా చెప్పలేదా”  “లేదు, కానీ చిన్న వయసు కాబట్టి తట్టుకునే శక్తి ఉంది అన్నారు” “అసలు ప్రోబ్ల్రం ఏంటి,”  నీరజ భర్త అడిగాడు  “అదే చెప్పాను ఇందాక,కడుపునిండాతిండి లేక ఆర్చుకుపోయడుట” ఇద్దరూ ఒకసారి అన్నారు. “ok! పదండి, 11గంటలు అయింది టైం, మనం చెయ్యాల్సినది మనం చేసేసాం. ఆ పైన దేవుడున్నాడు. తప్పకుండా ఆ అబ్బాయి కోలుకుంటాడు.”   “అవును! తప్పకుండా ఆ అబ్బాయికి నయం అవ్వాలని నేను ఆంజనేయస్వామికి మొక్కుకున్నాను” అంది నీరజ.   “నేను డిట్టో! నీరజా! పాపం ఇంత చిన్న పిల్ల వాడు,తల్లి కోసం,చెల్లెళ్ల కోసం కష్టపడటం నిజంగా మెచ్చుకోవాలి. అందుకే నేను మొక్కు కొన్నాను”   “అవును వాళ్ళ ఫ్యామిలి మెంబెర్స్  ఏరి ఎవరూ కనిపించటంలేదు” నీరజ భర్త అడిగాడు.  

“ఈ అబ్బాయి పక్కింట్లోఉండే కరీం, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడానికి వెళ్లాడు” “ఓకే !మిగతా వివరాలు వాళ్ళని  అడిగి తెలుసుకుంటారులే” అని తమలో తాము చెప్పుకుంటూ ఆ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. పైన జరిగిన సంభాషణల తాలూకు పూర్వాపరాలు తెలియాలంటే కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి, అప్పుడు సమయం సాయంత్రం 7గంటలు: ఎప్పటి లాగే ఆ రోజు సాయంకాలం బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ దగ్గర కంపెనీ బస్సు దిగారు నీరజ, సునీతా. మర్నాడు వాళ్ళ కంపెనీ కి ఫారెన్ డెలిగేట్స్  వస్తుండటం తో   చక్కటి  హేండీ క్రాప్ట్స్ వస్తువులను  కంపెనీ తరఫున బహుమతి గా ఇద్దామని వాళ్ళ బాస్ చెప్పడంతో, అవి కొనడానికి గన్ ఫౌండరీ దగ్గర ఉన్న లేపాక్షి  కి  వెళుతున్నారు.  ఇద్దరూ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ మల్టినేషనల్ కంపెనీ లో  హెచ్ ర్(HR) డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు.సునీత నీరజ కూడా పక్క పక్కనే ఉంటారు.

  లేపాక్షి నుండి అన్ని సామానులు తీసుకోని,బయటకు వచ్చి ఆటోకోసం నిలుచున్నారు. ఒక్క ఆటో కూడా  వీళ్ళు వెళ్ళే చోటుకి రమ్మంటే రావటం లేదు. అది వర్షాకాలం కూడా కావటంతో పెద్దగా ఉరుములు మెరుపులతో వానకూడా మొదలయింది. సమయం రాత్రి 9 గంటలు. ఇంతలో అక్కడున్న సెక్యురిటిగార్డ్ వీళ్ళు ఆటో కోసం నిలబడటం చూసి,  ఒక ఆటో ని పిలిచి ఎక్కించాడు. ఆటోవచ్చింది. చూడటానికి చిన్న గానే  ఉన్నాడు. పరవాలేదు అనుకొని,ఇద్దరు ఎక్కి  ఎక్కడికి వెళ్ళాలోచెప్పారు. మీటరు వేశాడా లేదా చూసుకున్నారు. నీరజ, సునీతా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు కొంచెం దూరం వెళ్ళాక ఆటో నెమ్మదిగా వెళ్ళడం మొదలెట్టింది. అంతే కాకుండా అతను సీట్లో  అసహనంగా అటు ఇటూ కదులుతూ డ్రైవ్ చేస్తున్నాడు. కబుర్ల  మధ్యలో  సునీత అది చూసి  నీరజ కు చెప్పింది.  నీరజ వెంటనే “ఏయి ఆటో అబ్బాయి  ఏంటీ అలా డ్రైవ్ చేస్తున్నావు?” అని గట్టిగా అడిగింది  “ఏం లేదమ్మా,కడుపులో వికారంగా ఉండి కొంచెం తల తిరుగుతోంది”అన్నాడు.అయితే వీళ్ళకి,అనుమానం వచ్చింది, తాగినడుపుతున్నాడని,ఇద్దరు గుసగుసగా అనుకున్నారు.

కాలేజీ అబ్బాయి లా ఉన్నాడు,అప్పుడే తాగుడుకి అలవాటు పడ్డాడు ఛీ,ఛీ! అనుకున్నారు.   ఇంతలో సడెన్ గా ఒక చోట ఆపి వాంతి చేసుకున్నాడు.  అది చూసే సరికి వాళ్ళు ఇది ఆ బాపతే అని నిర్ధారణకు వచ్చి , ఇక ఇందులో వద్దు  వేరే ఆటో మాట్లాడుకుందామని  కిందకు దిగబోతున్నారు. అంతలో, ఆ అబ్బాయి వీళ్ళు దిగడం చూసి “మేడం దిగకండి,నేను జాగ్రత్తగా తీసుకోని వెళతాను, మీరిచ్చే పైసలతో  మా అమ్మకి మందులు కొని  తీసుకెళ్లాలి” అని దీనంగా అన్నాడు.  అది విని కొంచెం వెనక్కు తగ్గారు. అప్పుడు దగ్గరగా అతనిని చూచింది సునీత. ఇందాక అంతగా  గమనించలేదు గాని బాగా చిన్న పిల్లాడు; 19 ఏళ్ళు ఉంటాయేమో, తెల్లగా సన్నగా ఉన్నాడు , మొహంలో పసితనం వీడలేదు. తాగావా అని అడగలేక “నీకు ఒంట్లో బాగా లేదేమో? అందుకని వేరే ఆటో మాట్లాడదాము  అనుకుంటున్నాము,సరే పద” అని మళ్ళీ లోపలకి ఎక్కి కూర్చొన్నారు.

అప్పుడు అతనిని మాటలలో దింపింది సునీత,  “నీ పేరు ఏంటి ,మీరు ఎంత మంది ?” అని    దానికి సమాధానం గా  “నా పేరు అఫ్జల్ మేడం,మేము మొత్తం ఆరు మంది,పెద్దోడి ని కూడా, పైసలు కమాయించే వాడినికూడా నేనే”,  “అదేంటి మీ అమ్మ నాన్న ఏమయ్యారు?” అని ఇద్దరు ఒకేసారి ప్రశ్నించారు.   “మానాన్న మొన్న జరిగిన దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళలో చనిపోయిండు. అమ్మకి గుండె జబ్బు ఉండే,తమ్ముళ్లు,చెల్లెళ్లు చిన్న వాళ్ళు.ఇక నేనే,నాన్న ఆటో నడుపుతున్నా.”  “నువ్వు చదువుకున్నావా?”అని అడిగింది నీరజ  “ఆ!మేడం!ప్రైవేటు గా,డిగ్రీ  చదువుతున్నాను.  అది అయ్యాక బ్యాంకు ఎగ్జామ్స్ కూడా రాస్తాను,మేడం, మీరు కూడా ఏదైనా ఉద్యోగాలు  ఉంటె చెప్పండి మేడం” అని అన్నాడు  “సరే నీ ఫోన్ నం చెప్పు ఏదైనా, ఉంటె చూస్తాను అంది”  ఫోన్  నెంబర్ ఇచ్చే లోపల  మళ్ళీ ఆటోని ఆపి వాంతి చేసుకున్నాడు. ఆ తరువాత ఆటోని ఆనుకొని నిస్త్రాణంగా వాలిపోయాడు. పాపం జాలి వేసింది ఆ అబ్బాయిని చూస్తే “ఏం చేస్తాము, వెళ్ళిపోదాం” అనుకొని ఇద్దరూ ఆటో దిగి  రెండడుగులు వేశారు.

కానీ ఇద్దరి మనస్సులో ఒకటే సారి అనిపించింది.  “చ! ఇలా మనకే జరిగితే” అని.  ఇంతలో నీరజ సెల్ మోగింది వాళ్ళ ఆయన ఫోన్ చేసారు. “ఎక్కడున్నారు? చాలా లేట్ అయింది. ఇంకా రాలేదేంటి?” అని. అప్పుడు నీరజ జరిగింది చెప్పింది. దానికి అతను వెంటనే  “సరే ఒక పని చెయ్యి, అతనిని హాస్పిటల్ తీసికొని వెళ్ళండి ముందు” అని చెప్పాడు. అంబులెన్సు కి ఫోన్ చేద్దాము అనుకునేంతలో వేరే ఆటో అతను వచ్చి  “ఏం జరిగింది మేడం” అని అడిగాడు.   “ఈ ఆటో అబ్బాయిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలి వస్తారా” అంటూ ఉండగానే అతనే ఆటో దిగి వచ్చి,అతన్ని చూసి   “అయ్యో! మా అజ్జు బేటా!, అంటూ వాళ్ళ వైపుకి తిరిగి,   “మావాళ్ళ పిల్లగాడేనమ్మా! ఏమైందో ఏమో? పర్వాలేదు స్పృహ లోనే ఉన్నాడు” అని అతనిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు.

అలా మాట్లాడుతూనే అతనిని చేతులతో మోసుకొని ఆటోలో  కూర్చోపెట్టాడు”   “ఇప్పుడు ఎలా వుంది బేటా” అని అడిగాడు  “దాహం వేస్తోంది” అని “నా ఆటో, నా ఆటో ఎలా? అమ్మికి ఆపరేషన్ కి డబ్బులు కావాలి”  అంటూ ఏదో  మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు  కానీ అతని వల్ల కావటం లేదు. “నీ ఆటోని నేను చూస్తానులే” అంటూ పక్కనే ఉన్న షాప్ అతను చెప్పాడు.  నీరజ తన బాగ్ లో ఉన్న నీళ్ళ బాటిల్ తీసి ఇచ్చింది.  ఆటో అతను తాగించాడు. మొత్తానికి అందరూ కలిపి హాస్పిటల్ కు తీసుకోని వచ్చారు.     అక్కడ రిసెప్షన్ లో ఇది అర్జెంట్ కేసు గా తీసుకోమని చెప్పారు.   అక్కడ ఉన్న వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని అడుగుతూ ఉంటే ఇద్దరూ ఒకే సారి చెప్పారు “మాకు ఏమీ తెలియదు. అతని ఆటో ఎక్కాము. అంతలో ఇలా జరిగింది. వెంటనే హాస్పిటల్ కి  తీసుకొచ్చాము అంతే” అన్నారు.  కాని హాస్పిటల్ స్టాఫ్ “మా రూల్స్ కి విరుద్ధంగా జాయిన్ చేసుకోలేము అనడంతో, నీరజ, సునీత కూడా కోపం వచ్చి ఆవేశం తో మాట్లాడటం,వీళ్ళని తీసికొచ్చిన ఆటోవాలా, కరీం. అతనుకూడా  రెండు చేతులూ జోడిస్తూ “సాబ్! మా అజ్జు బేటా, ప్రాణం నిలపండి అంటూ ప్రాధేయ పడుతూఉండటం  చూసిన ఒక  యువ డాక్టర్  రిసెప్షన్ వాళ్ళతో ఏదో మాట్లాడాడు.  వెంటనే వాళ్ళు నీరజ,సునీత ల తో అన్నారు. “అబ్బాయిని అడ్మిట్ చేసుకుంటాము,కొంత నామినల్ అమౌంట్ కట్టండి అలాగే  మీ ఐడెంటిటీ కార్డ్స్  కూడా  చూపించండి” అన్నారు.” 

అతనికి సహయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో హాస్పిటల్ వాళ్ళకి  ఓ రెండు వేలు కట్టింది. రశీదు తీసుకుంటూ “మనచేతిలో ఉన్నది ,చేయగలిగినది ఇదే సునీ” అంది  “అవును.,పాపం చిన్నపిల్లాడు”సునీత  జాలిగా అంది  “కష్టపడకపొతే పొట్ట నిండేదెట్లా మరి వాళ్ళకి,చిన్న పెద్ద భేదం లేదు.అబ్బ!నిజంగా  తలచుకుంటునే,ఎంత  బాధగాఉందో”అందినీరజ.   పక్కనుంచి “వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం తిండి తినకుండా, వట్టి చాయి నీళ్ళు  తాగుతూ పైసలు కూడపెడుతున్నాడు .పాపం అదే వాడి కొంపముంచింది” అన్నాడు. కరీం.  ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది,”అమ్మనాకు ఒక సవారీ ఉంది వాళ్ళను దింపి నేను వాడింటికి వెళ్లి,వాళ్ళ అమ్మను తీసుకోని వస్తాను” అని చెప్పి కరీం వెళ్ళిపోయాడు. “Even the smallest act of caring for another person is like a drop of water -it will make ripples throughout the entire pond” అన్న వాక్యాలు ఎదురు గోడ మీద మెరుస్తూ కనిపించాయి.  అది చూసిన ఇద్దరి కళ్ళలో ఒక మంచి పని చేసాము అన్న తృప్తి కనిపించింది.    అంతలో నీరజ భర్త రావడంతో, ముగ్గురూ కొంచెం సేపు ఉండి, తరువాత  నిశ్శబ్దం గా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు.  సమయం రాత్రి 12 గంటలు  కరీం ద్వారా  విషయం తెలుసుకున్న ఆటో అబ్బాయి తల్లి, చెల్లెళ్లు హాస్పిటల్ కి పరిగెత్తుకొని వచ్చారు.

అక్కడ నర్స్ చెప్పింది ఏడుస్తున్న ఆటో అబ్బాయి తల్లితో  “మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.మీరు బయటే కూర్చోండి. ఇప్పుడే లోపలకి వెళ్ళడానికి లేదు” అంది . అప్పుడు గురుకొచ్చింది తన కొడుకును ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు హాస్పిటల్ కు తెచ్చారని, “మానవత్వం తో స్పందించి,నీ కొడుకు  ప్రాణాన్ని నిలబెట్టారు వాళ్ళిద్దరూ బెహన్” అన్న కరీం మాటలు, ఆ తల్లి  గుండెలో ప్రాణదీపాన్ని వెలిగించాయి.  వెంటనే కరీం ని అడిగింది “వాళ్ళేరని”.   “అదే వాళ్ళకోసం అంతా వెతికాను, కాని ఎక్కడా లేరు రజియా బెహన్” అని కరీం చెప్పాడు.    “దేముడు లాగే వీళ్ళు కూడా కనిపించకుండా,నిశబ్దంగా చేసిన సాయం, విలువ కట్ట లేనిది నా బిడ్డని బతికించిన ఆ అల్లా కి వేల వేల కృతజ్ఞతలు జన్మజన్మలకి వాళ్ళకి ఋణపడిఉంటాను” అంటూ ఆ కన్నతల్లి అక్కడ లేని నీరజ, సునీత లకు మనసారా రెండు చేతులు జోడించి,వాళ్ళకు ఎప్పుడూ మంచి జరగాలని ప్రార్థించింది

...... Mani Murthy Vadlamani