Facebook Twitter
పాలగుమ్మి పద్మరాజు

 

పాలగుమ్మి పద్మరాజు

ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా మనిషికి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయని చెప్పిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు. వాస్తవికతకు, మనిషి సహజత్వాన్ని అద్ది రచనులు చేశారు. మనసుకున్న సహజమైన నైజంలో పేద, గొప్ప అనే భేదం ఉండదని తన కథల్లో నిరూపించారు. అంతేకాదు తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు. కట్టుబాట్లు, సమాజం విధించిన నియమాల కొన్ని పరిస్థితుల్లో మనిషిని కట్టిపడేయలేవంటూ తను చిత్రీకరించిన పాత్రల ద్వారా వివరించారు. పద్మరాజు కథా రచయితే కాదు కవి కూడా. నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, వ్యాసాలు, వ్యాసాలు, చలన చిత్రాలకు మాటలు, పాటలు కూడా రాశారు.
           పద్మరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి మండలం, తిరుపతి పురంలో జూన్ 24, 1915లో జన్మించారు. ఎమ్.ఎస్సీ చదివారు. తర్వాత కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వం కళాశాలలో 1939 నుండి 1952 వరకు సైన్స్ అధ్యాపకులుగా పనిచేశారు. సత్యానందాన్ని వివాహం చేసుకున్నారు. ఎమ్.ఎన్, రాయ్ సిద్ధాంతలపై మక్కువతో వాటిని ప్రచారం చేశారు. హేతువాదిగా జీవించారు. 23 ఏళ్ల వయసులో తొలి కథ సుబ్బి నిప్రచురించారు. తర్వాత ఎన్నో విలువైన రచనలను తెలుగు ప్రజలకు అందించారు. మొత్తంగా 60 కథలు, 8 నవలలు, 30 కవితలు రాశారు.   
            పద్మరాజు 1951లో రచించిన గాలివాన కథకు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారి ప్రపంచ కథల పోటీలో రెండో బహుమతి వచ్చింది. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువాదం పొందింది. ఈ కథలో ప్రధాన పాత్ర రావుగారు. నిక్కచ్చిమనిషి. సొంతవైన అభిప్రాయాలు ఉంటాయి. ఆస్తికసమాజం వారు పిలవడంతో ప్రసంగించడానికి వేరే ఊరకి రైళ్లో బయలుదేరుతాడు. రైల్లో ఎక్కిన ముష్టి ఆమెను ఛీదరించుకుంటాడు. తుఫాను రావడంతో చివరకు ఆమె ఆసరానే పొందుతాడు. ఆయనకు ఆమె స్పర్శలో అప్పటివరకు ఆయన విధించుకున్న భావాలు, నియమాలు అన్నీ చెల్లాచెదురై పోతాయి. ఈ కథకు  1948లో వచ్చిన తుఫానులో పద్మరాజు నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనే స్ఫూర్తి... అని చెప్పుకున్నాడు. మూడుగంటలు భార్య కూలిన ఇంట్లో నిస్సహాయరాలిగా పడిపోతే ఆయన అనుభవించిన మానసిక ఆందోళనే ఈ కథకు నేపథ్యం అని చెప్పారు. వీరు రాసిన మరో కథ పడవ ప్రయాణం. ఈ కథలో రంగి తనను కొట్టి, తగలెయ్యబోయిన వాడు వేరే ఆమెను ఉంచుకుంటే, ఆమెకు డబ్బులు అందించడానికి పోలీసుల చేతిలో తిట్లు, దెబ్బులు తింటుంది. అందుకే పద్మరాజుగారు- అణగారిన సమాజంలో జీవించే మనుషుల్లో మంచితనం ఉంటుంది, చెడ్డతనమూ ఉంటుంది. అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్న వారిలో కూడా ఈ రెండు స్వభావాలు ఉంటాయి అంటారు. సహజంగా మనిషి, మనిషే అనేది వీరి కథల్లో కనిపిస్తుంది. వీరి వాసనలేని పువ్వు, హెడ్ మాస్టారు, కొలవరానిదూరం ఇలాంటి తప్పక చదవాల్సిన కథలు.
         ఇక నవలల విషయానికి వస్తే, పద్మరాజు బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన వంటి ఎనిమిది నవలలు రాశారు. వీరి రచనలు ప్రకృతి, సమాజంపై పూర్తి అవగహన కలిగిస్తాయి. జీవితాల మధ్య ఉన్న సంఘర్షణ తాలూకూ వాస్తవాలను విశధీకరిస్తాయి. మనిషి మనసులో ఉండే హృద్యమైన చప్పుడు అందరికీ ఒక్కటే అంటారు పద్మరాజు. ఏ స్థాయిలోలో ఉన్నా మనిషి బతుకులో, ఆలోచనల్లో వెలుగు నీడలు సహజమే అంటారు. ఇంకా అన్ని కళలు నశించిపోయినా, జీవితం మిగలాలని చెప్తారు. ఆదర్శాలకన్నా, జీవితపు విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు. అందుకే పద్మరాజు రచనలు ఆర్థిక సూత్రాల్లో, సామాజిక సిద్ధాంతాల త్రాసులో తూచడం కష్టం. మొత్తంగా చూసినప్పుడు వీరి కథలు వాస్తవికతతో, అలౌకికమైన అద్వైతంలోని మానవీయకోణాన్ని ఆవిష్కరించే విధంగా కనిపిస్తాయి. పద్మరాజు కవితలు పురిపాట్లు, చీకటి, ఓ భావి సంపుటాలుగా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు లలితమైన పదాలతో, సౌందర్యవంతంగా సాగుతాయి.
            పైరు గాలికి నాట్యమాడే
            పైట రాపిడి తగిలి చిటుకున
            పండిపోయిన దానిమ్మొకటి
            పగిలి విచ్చింది
            పండుదొండకు సాటివచ్చే
            పడతి పెదవులలోన దాగిన
            పండ్లముత్తెపు తళుకులన్నీ
            పక్కుమన్నాయి...
            అప్పుడు నేననుకున్నాను
            అందానికి అర్థం ఇదేనని
                             ఇలా హృద్యంగా, సొగసుగా, ప్రకృతిని వర్ణించేలా ఉంటాయి.
        పాలగుమ్మి పద్మరాజు 1954లో వాహిని ప్రొడక్షన్ వారి బంగారుపాప సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాకు మాటలు రాశారు. సమారు 3 దశాబ్దాల పాటు చలనచిత్రరంగంలో కథ, మాటలు, పాటలు రాస్తూ పేరు తెచ్చుకున్నారు. నల్లరేగటి నవల మనవూరి కథ పేరుతో  సినిమాగా వచ్చింది. పడవ ప్రయాణం కథ స్త్రీ పేరుతో చిత్రీకరణ జరిగినా విడుదల కాలేదు. వీరు ముఖ్యంగా బంగారుపాప, భక్తశబరి, బంగారు పంజరం, రంగులరాట్నం, శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలకు పనిచేశారు. కృష్ణశాస్త్రికి మంచి మిత్రుడు, అలానే దాసరి నారాయణ దగ్గర ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు. పేరు లేకపోయినా పద్మరాజు  చాలా చిత్రాలకు రచనా సహకారం అందించారని వినికిడి. బికారి రాముడు చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 
          కథకుడిగా, నవలాకారుడిగా, నాటక రచయితగా పేరు తెచ్చుకున్న పాలగుమ్మి పద్మరాజు ఫిబ్రవరి17, 1983న మరణించారు. ఆయన రచనల్లోని గొప్పతనాన్ని నేటితరానికి, తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి సాహితీ ప్రముఖుల మీద ఉంది. 

- డా. ఎ.రవీంద్రబాబు