Facebook Twitter
అన్యోన్యం

 

అన్యోన్యం

 - వాకాటి పాండురంగారావు

మద్రాసులో జన్మించి, మద్రాసులోనే విద్యాభ్యాసం సాగించిన వాకాటి పాండురంగారావు ఎన్నో అద్భుతమైన కథలు రాశారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు.  ప్రజాపత్రిక, ఆనందవాణి పత్రికలలో ఉప సంపాదకులు,  సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అపరాజిత, ద్వాదశి, సృష్టిలో తీయనిది, శివాన్విత వంటి కథా సంపుటాలు ప్రకటించారు. వీరి రచనలు ఇతర భాషల్లోకి అనువాదాలయ్యాయి. ఆకాశవాణికై నాటికలు, ప్రసంగాలు రాశారు. వీరి కథలు మానవ సంబంధాల్లోని సున్నితమైన పొరలను తార్కికంగా వివరిస్తాయి. ఘాటుగా మనసులోతుల్ని విమర్శకు పెడతాయి. అలాంటిదే వీరి అన్యోన్యం కథ.
           ఈ కథను రచయిత ఉత్తమ పురుష దృష్టికోణంలో రాశారు. వారిది మద్రాసుకు దూరంలో ఉన్న ఓ పల్లెటూరు. వాళ్ల బాబాయి మద్రాసులోని జార్జిటౌనులో ఉంటారు. పని మీద నగరానికి వచ్చిన రచయిత రెండు వారాలు వాళ్ల బాబాయి ఇంట్లో ఉంటాడు. అక్కడ అతనికి ఎదురైన మనుషులు, వారి జీవన పరిస్థితులు, ప్రవర్తన, వారు నివాసముండే ఇళ్లు... అన్నిటిని కథలో చెప్పారు వాకాటి పాండురంగారావ్.
            వాళ్ల బాబాయి స్కూలు మేస్టారు. వారికి నలుగురు పిల్లలు. వారుండేది ఒక హాలు, చిన్న వంటగది కలిసున్న ఇల్లు. వారితో పాటు ఆ లోగిలిలో ఇంకా ఆరు వాటాలు ఉంటాయి. అందరికీ కలిపి బాత్ రూములు, పాయిఖానాలు రెండే. మిగిలిన వాటాల్లో టాక్సీడ్రైవరు, ఘటం వాయించే అయ్యర్, ఇడ్లీలు అమ్ముకునే ఆవిడ, పత్రికాఫీసులో పనిచేసే కుర్రాడు. గుడి పూజారి, వంటలు చేసే నటరాజన్ కుటుంబం ఉంటుంది. ఆ వాటాల మధ్య సన్నగా పొడుగ్గా పది, పదిహేను గజాల నడవా ఉంటుంది. నడవా పొడుగునా అరుగు ఉంటుంది. ఆ అరుగే  ఆ ఏడు వాటాల వారికి ఆటస్థలం, రంగస్థలం, పడకగది, కబుర్లు చెప్పుకునే స్థలం, కూరలవాళ్లు, పాలవాళ్లు బరువులు దించే స్థలం, ఆడవాళ్లు బయటచేేరితే ఉండేది కూడా ఆ అరుగుమీదే.
          నటరాజన్ భార్య పేరు లక్ష్మి, వారికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు.  పెద్దబ్బాయి జులాయిగా తిరుగుతూ ఇంటికి తగాదాలు తెస్తూ ఉంటాడు. చిన్నకుర్రోడు ఒకటో తరగతి. పదహారేళ్ల కూతరు ఎనిమిదో తరగతి చదువుతుంటుంది. నటరాజన్ మాత్రం పెళ్లిళ్లకు, పార్టీలకు వంటలు చేయడానికి వెళ్తుంటాడు. నెలకు ఒకటి రెండు రోజులు మాత్రమే అతనికి పని ఉంటుంది. ఆ సంపాదన అతని ఇంటి అద్దెకు, అతను వేసుకునే తాంబూలానికే చాలదు. భార్య అతనిలా నల్లగా ఉండదు. తెల్లగా ఉంటుంది. లక్ష్మిఅమ్మాళ్ అనే సేఠ్ ఇంట్లో రెండు పూటలా భోజనం వండే పని ఆమెది. మధ్యాహ్నం కూడా అమె అక్కడే బోజనం తింటుంది. రాత్రిళ్లు ఇంటికి వచ్చేటప్పుడు గారో, కూరముక్కో, అరటి పండో తెస్తుంది. పిల్లలతో పాటు నటరాజన్ కూడా అవి తినేందుకు ముందుంటాడు. 
          లక్ష్మికి రెండు రోజులు సేఠ్ ఇంట్లో పండగ పని ఉండడం వల్ల ఇంటికి రాదు. సాయంకాలం ఇంటికి వచ్చిన రచయితకు నటరాజన్ భార్యను- బజారుముండ, దీనికి ఇల్లెందుకు, సెఠ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది... ... అని బూతులు తిడుతూ కనిపిస్తాడు. రాత్రి భోజనం తింటున్నా, బయటకు వచ్చి పడుకున్నా రచయితకు అవే ఆలోచనలు. అయితే నిద్రలో ఉన్న రచయితకు అస్పష్టంగా కొన్ని మాటలు వినిపిస్తాయి. మనసు పెట్టి వింటే అది నటరాజన్, లక్ష్మిల గొంతులు. సేఠ్ పెళ్లానికి పక్షవాతం రావడంతో, నిన్ను మరిగాడు అని నటరాజన్ అంటుంటే... లక్ష్మి మాత్రం ఎవరన్నా వింటారు, నోటికి వచ్చినట్లు కారు కూతలు కూయకు అని అనుబంధం, ఆవేదన, ఆగ్రహంతో కూడుకున్న గొంతుతో సమాధానం చెప్తుంది.  మళ్లీ కొంత సేపటికి నటరాజన్ లక్ష్మిని ఇంట్లోకి పిలుస్తున్న మాటలు వినిపిస్తాయి. ఆమెను బలవంత పెడుతూ- ఆ సేఠ్ తోనే సరిపోయిందా... అని అంటుంటాడు. నోరు మూసుకోండి అంటూ చివరకు లక్ష్మి, నటరాజన్ తో కలిసి ఇంట్లోకి వెళ్తుంది.
        ఇదంతా జరిగిన ఇరవై ఏళ్లకు రచయిత ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆదివారం వాళ్ల ఇంటిముందు వీధిలో అందరూ మంచాల మీద కూర్చొని సేదతీరుతూ ఉంటారు. అక్కడకు ఓ నల్లకుక్క చపాతీ పట్టుకొని వస్తుంది. దాని వెనుక ఓ చారల కుక్క వస్తుంది. కలియబడి ఆ చపాతీని చారలకుక్క లాక్కుని తింటుంది. తినడం పూర్తవగానే, నల్లకుక్క దగ్గరకొచ్చి చారలకుక్క దాని మూతిని, ఒళ్లును నాకుతుంది. నల్లకుక్క సిగ్గుతో, సంతోషంతో దాన్ని ఏడిపిస్తుంది. తర్వాత రెండూ కలిసి ఒకదాని వెంట మరొకటి వెళ్లిపోతాయి.
         ఈ సన్నివేశాన్ని చూసిన రచయితకు, ఇరకవై ఏళ్ల కింద జరిగిన నటరాజన్, అతని భార్య లక్ష్మి గుర్తుకొస్తారు.
     ఈ "అన్యోన్యం" కథ మనిషిలో బయటపడని అవ్యక్త ఆలోచనా పరంపరలను రచయిత ఘాటుగా చెప్పాడు. మనిషి చిత్తప్రవృత్తిని కథలో ఆవిష్కరించాడు. అలానే పై ముసుగులు తొలిగిస్తే మనిషులు, జంతువులు ఒకటే అన్న భావాన్ని స్పష్టం చేశాడు. పైగా కథలో చేసిన కొన్ని వర్ణనలు అద్భుతం. లక్ష్మి భర్తకు సమాధానం చెప్తున్నప్పుడు- లక్ష్మి గొంతులో పలికిన రసాలు ఎన్నో చెప్పడానికి లక్షణగ్రంథాలు లేవు. అందులో అనుబంధం వుంది. ఆగ్రహం వుంది. ఆవేదన వుంది. అడియాస వుంది. ఆప్యాయత వుంది. అంటాడు రచయిత. అలానే ఆ ఏడువాటాలలో నివాసముంటున్న మనుషుల మధ్య ఉన్న సందడిని వర్ణిస్తూ- జేమ్స్ జాయ్స్ రాసిన యులిసెస్ నవలలోలా వుంది వాతావరణం అంటాడు. అక్కడి వారు పడుకునే వాతావరణాన్ని చెప్తూ- చిన్నా - పెద్దా, ఆడా - మగా అంతా కలిపి పాతిక మందిదాకా... వారివారి ఆశలు, నిరాశలు, దురాశలు మరిచి నిద్రపోయేవారు. నూనె మరకలు అట్టలు కట్టిన తలదిండ్లు, చిరుగులకు అతుకులు వేసిన దుప్పట్లు, దిండ్లకు బదులు చెక్కపీటలు, మూటలు, దుప్పట్లకు బదులు పాత చీరలు... ఆ పడక గదుల మధ్య గురకలు, కలవరింతలు, నిద్రరాక నిటారుగా పిశాచాల్లాలేచి చీకట్లో కూర్చుని వున్న ఒకరిద్దరు మూసలి వాళ్లు - ఇది ఆ బహిరంగ నిద్రాస్థలం యొక్క సమవాకారం అంటారు రచయిత. వంటచేసి పిండి మరకలతో వస్తున్న లక్ష్మిని పాండురంగారావు యుద్ధం నుంచి రక్తం మరకలతో వస్తున్న ఝాన్సీలక్ష్మితో పోలుస్తాడు.
      ఇలా వాకాటి పాండురంగారావు రాసిన ఈ కథ మనో జగత్తుకు, వాస్తవ పరిస్థితులకు మధ్య వంతెన లాంటిది అని చెప్పవచ్చు. 

- డా. ఎ.రవీంద్రబాబు