Facebook Twitter
కాకి తెలివి


కాకి తెలివి

 

అనగనగా ఒక అడవిలో ఒక కాకి వుండేది . ఒకసారి అది చుట్టాల ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజులు సరదాగా గడిపి, ఇంటికి బయలు దేరింది. కాకులు మామూలుగా ఎక్కువ దూరం పోవు. అయితే ఈ కాకి చాలా దూరం పోయింది గదా, అందుకని దానికి దాహం వేసింది . దగ్గర్లో ఏదైనా చెరువు గాని, కాలువ గాని వున్నదేమోనని వెతికింది. ఎక్కడా నీళ్ళు లేవు! పైపెచ్చు అది ఎండాకాలం- అందుకని చిన్న చిన్న గుంటలన్నీ ఎండిపోయి ఉన్నాయి!

కాకికి ఏం చేయాలో తోచలేదు. గొంతు పిడచ కట్టుకపోతోంది. అలాగే కొంత సేపు పోయింది గానీ, కొంత సేపటికి ఇక అది ఎగరలేకపోయింది. నేల బారునే వెతుక్కుంటూ వెళ్ళసాగింది. చివరికి ఒక పొలంలో దానికి ఒక సన్న మూతి కూజా కనిపించింది. పొలంలో పని చేస్తున్న రైతు తెచ్చుకున్నట్లున్నాడు దాన్ని.

కాకికి ప్రాణాలు లేచి వచ్చినట్లైంది. గబగబా పరుగెత్తుకొని వెళ్ళి కూజా మీద వాలింది. లోపలికి తొంగి చూసింది: కూజాలో సగం వరకూ ఉన్నై, నీళ్ళు. వాటిని అందుకుందామని ఆశగా వంగింది కాకి.

కానీ ఏంలాభం? అవి దాని ముక్కుకు అందలేదు! 'దగ్గర్లోనే నీళ్ళను పెట్టుకొని కూడా దాహానికి చనిపోతానేమో' అనిపించింది కాకికి. అది ఎన్ని సార్లు కూజా మీదికి ఎగిరి ముక్కును లోనికి దూర్చినా ప్రయోజనం కనిపించలేదు!

'ఎలాగబ్బా' అనుకొంటూ చుట్టూతా కలయ చూసిందది. దగ్గర్లోనే దానికి కొన్ని గులక రాళ్ళు కనిపించాయి. వెంటనే దానికి వాళ్ల అవ్వ చెప్పిన కథ కూడా గుర్తుకొచ్చింది. 'అదే సరైన మార్గం' అనుకున్నది అది- సంతోషంగా ఒక్కొక్క గులకరాయినీ తీసుకొచ్చి కుండలో వేయటం మొదలు పెట్టింది .

అట్లా ఎన్ని రాళ్ళు వేసినా నీళ్ళు మాత్రం పైకి రాలేదు! కావాలంటే మీరూ వేసి చూడండి- అంత సులభంగా పైకి రావు, నీళ్ళు!

కాకి అలోచనలో పడింది: "ఎక్కడో‌ లెక్క తప్పినట్లుంది- ఇప్పుడేం చేయాలి?” అనుకుంది. అంతలో దాని దృష్టి కూజా అడుగు మీద పడింది. నేలమీద మూడు రాళ్ళు పెట్టి, వాటి మీద కూజాను పెట్టుకున్నాడు రైతు: కాకికి వెంటనే ఏం చేయాలో తెలిసిపోయింది! తన కాలి గోళ్ళతో‌ మట్టిని గీకి గీకి- చివరికి ఒక రాయిని వదులు చేసింది. ఆపైన నేర్పుగా ఆ రాయిని బయటికి లాగేసింది!

మరుక్షణం కూజా నేల మీదికి ఒరిగింది- దానిలో ఉన్న నీళ్ళు కొన్ని ఒలికిపోయాయి, మిగిలినవి కాకికి అందాయి!

కాకి వాటిని తాగింది. సంతోషంగా ఎగురుకొని వెళ్ళి పోయింది. పాత కథల్లో చెప్పిన ఉపాయాలు అన్ని వేళలా అక్కరకు రాకపోవచ్చని దానికి అర్థం అయ్యింది!

Courtesy..
kottapalli.in