Facebook Twitter
తోడొకరు౦డిన...



తోడొకరు౦డిన...


సన్నటి జల్లు ! అదీ ప్రేమగా ఇష్టంగా పూల రెక్కలు కురిపి౦చినట్టు. ఓ చిన్న చిలకరింపు , అంతే, అంతలోనే ఏ గాలి పల్లకీలు తరలించుకు పోయాయో మబ్బులన్నీ పరుగెడుతున్నట్టు తేలికైన మనసుల్లా ఎగిరిపోయాయి. అంతవరకూ అక్కడో ఇక్కడో తిరుగుతున్నా వారంతా మొక్క మొలిచి పోతామన్నట్టు  చెట్టు నీడల్లోకో , చినుకు కురవని భవనాల లోకో జారుకున్నారు. పద్మ నవ్వుకుంది. ఎంత బావుంది రాలిన చినుకుల పలకరింపు. చెక్కిలిపై వాలి సుతారంగా జారుతున్నదొక చినుకైతే, పెదవిపై వాలి రెచ్చగొడుతూ ఒక చిరుచినుకు కంటి రెప్పలను సవరిస్తూ కలలు వెదుక్కుంటూ మరో చినుకు. ఆ స్పర్శే చిత్రంగా ఉంది.తుడుచుకోవాలని కూడా అనిపించలేదు.
లేచి వెళ్లి ఎదురుగా ఉన్న కాఫీ పాయింట్ నుండి వేడి వేడి కాఫీ తెచ్చుకు మళ్ళీ అదేదో తన స్వంత స్థలమైనట్టు వచ్చి కూచుంది. ఉదయం నిద్ర లేవకుండానే ఫోన్ అది ఎవరిదో చూడక్కర్లేదు. ఇంత ఉదయాన ఫోన్ చేసేది అతనే. కళ్ళు తెరవకుండానే పక్కనున్న దిండు కి౦దను౦డి సెల్ తీసుకుని ఆన్ చేసింది.
ఒక్క క్షణం ఆగి “హలో” హస్కీగా పలికి౦ది నిద్ర నిండిన స్వరం.
చప్పున గుర్తుకు వచ్చి౦ది రామ్ ఎన్ని సార్లు చెప్పాడో ,
 “ ఉదయం ఇంకా నిద్రలేవక ముందు నీ స్వరం ఎలాఉ౦టు౦దో తెలుసా?” చెక్కిలిపై ముని వేలితో సున్నాలు చుడుతూ అడిగాడు.
 “నాకెలా తెలుస్తుంది, నా స్వరం నేనే ఎలావినడం ?”
“అవును కదూ , మాంచి సెక్సీ గా అనిపిస్తుంది” తుళ్లిపడి అతని చెయ్యిని తప్పించి కాస్త పక్కకు జరిగింది.
అదేమీ పట్టించుకోకుండా “గొప్ప పిచ్చెక్కిస్తు౦ది. అబ్బో”
చాలా మంది చెప్పారు స్వరం విలక్షణంగా ఉ౦టు౦దని. కాని మరీ ఇలా..
ఎందుకో ఆమాట పెద్ద ఇష్టంగా అనిపించలేదు.
“ ఇంకా నిద్రలేవలేదా?”
“ఊ, లేస్తూ లేస్తూ .. చెప్పు”
 “తెలుస్తోంది, అనుకున్నాను గాని , సరే ఈ రోజు మనం అనుకున్నట్టు వెళ్ళడం కుదరదు పద్దూ. ఒక అర్జెంట్ వర్క్, వరంగల్ వెళ్లి రావాలి” తడుముకుంటూ చెప్తున్నట్టు ఉంది స్వరం.
“ఊ’..” ఏమీ అనలేదు పద్మ.
“ సారీ రా, మళ్ళీ వారం చూద్దాం. “
“ ఊ , సరే “ మరింక అతనితో మాటలు పొడిగి౦చాలని అనిపి౦చలేదు.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ దిండులో  తలదూర్చి మళ్ళీ నిద్రపోదామని అనుకున్నా ,మరిక మత్తు వదలిన మనసు సహకరి౦చ లేదు.
చటుక్కున లేచి , కప్పుకున్న బ్లాంకెట్ మడతవేసి బయటకు నడిచి౦ది. సరిగ్గా ఎనిమిదింటికి పనిమనిషి వస్తుంది. నిజానికి ఎప్పటినుండో వర్గల్ వెళ్లి సరస్వతీ దేవిని చూసి రావాలన్న కోరిక.
క్రితం వారం సినిమాకి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వచ్చి౦దా విషయం.
“ ఇంత చిన్న విషయం వాయిదాలేమిటి ? వచ్చే వారం వెళ్దాం. పెద్ద పండగ రోజులు కావు, స్కూల్ సెలవలూ కావు గనక రష్ ఉండదు. వెళ్లి వద్దాం”
“ నీకు వీలవుతుందా ?”
“ శనివారమేగా వెళ్దాం”
వారం నుండి ప్రతి క్షణం అవే ఊహలు.
అసలు చిన్నప్పటినుండీ అనుకున్నవేవీ జరగవు. అయినా పెద్దగా కోరికలేమీ  పెంచుకోలేదు.
ఇలా చూడాలని ఉ౦దనగానే వెళ్దామనడం పెద్ద థ్రిల్లింగ్ గా అనిపి౦చి౦ది.
అసలు రామ్ పరిచయమే పెద్ద థ్రిల్.
ఆ రోజు కూడా శనివారమే. పని చేసేది హైటెక్ సిటీ లో ఒక ఎం ఎన్ సి లో , అయిదు  రోజులు బండ చాకిరీ చేసాక దొరికే సెలవురోజులు పూర్తిగా తనకోసం తనకిష్టమైన విధంగా గడిపే౦దుకే ఎప్పుడో నిర్ణయించుకు౦ది.
పాత బస్తీలో ఉన్న అమ్మా నాన్నలను చూసేందుకు వెళ్ళేది ఇదివరలో , కానీ ఇప్పుడు వెళ్లాలనీ అనిపించడం లేదు. వెళ్తే ఏముంది ఎప్పటిలా ఇబ్బందుల ఏకరువు , లెక్కచెయ్యని అన్నదమ్ముల మీద ఫిర్యాదులు మూతి తిప్పుకు౦టూ అసహనం వ్యక్తపరచే మరదళ్ళు, అంతేగా. అందుకే “ఆఫీస్ పని శనివారాలూ ఉ౦ద౦టూ” చెప్పి క్రమ౦గా వెళ్ళడం తగ్గించుకుని సినిమానో లేకపోతె మాల్ లో తిరగడమో అలవాటు చేసుకుంది.
ఆ రోజున అలాగే మాల్ లో తిరుగుతూ విండో షాపింగ్ తో తృప్తి పడుతూ , జారిన కళ్ళద్దాలు సవరి౦చు కుంటూ నడుస్తున్న పద్మ ఎదురుగా వస్తున్నా అతన్ని గమనించనే లేదు. అతనూ అంతే, ఎవరికో మెసేజ్ టెక్స్ట్ చేస్తూ వస్తున్నవాడు ఒకరినొకరు బలంగా గుద్దుకునే వరకూ గమనించనే లేదు.
పడి పోబోతున్న పద్మను ఆపేందుకు చాపిన చేతిలో వాలిపోయి నిలవరి౦చు కోలేక అతన్ని హత్తుకుపోయి౦ది.
ఇద్దరికిద్దరూ తెల్లబోయి, తమాయించుకుని “సారీ సారీ సారీ “ అన్న మాట కోరస్ లా సాగి ఆగింది.
ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.
“ పద్మ , పద్మా శంకరమంచి “
“ రామ్, అభిరాం “ ఇద్దరూ ఒకేసారి పేర్లు చెప్పుకుని చేతులు చాపారు.
కలిసి కాఫీ తాగారు. మరోగంత కలిసి తిరిగారు. ఒకరి గురించి ఒకరు తెలుసు కున్నారు. అతనో సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్.
చివరకు సెలవు తీసుకోబోయే వేళ ఆమె కాబ్ కి ఫోన్ చేయ్యబోడంతో ఆపి లిఫ్ట్ ఆఫర్ చేసాడు.
కాదనలేదు పద్మ.
అపార్ట్మెంట్ చేరేసరికే పదిగంటలు దాటింది. వచ్చినవాడిని గెట్ వద్దే వెనక్కు ప౦పలేకపోయి౦ది.
తాళం తీసి లోనికి ఆహ్వానించింది.
“ఒక్కరే ఉంటున్నారా?”
“అవును. రోజూ సిటీకి వెళ్లిరాడం  కుదరటం లేదు.” అని మాట మార్చి
” మొహం కడుక్కుంటారా ?” అని అడిగి మొహమాటపడుతున్న అతనికి బాత్ రూమ్ చూపింది.
ఆటను ఫ్రెష్ అయివచ్చే లోగా లోనికి వెళ్లి ఎం ఉన్నాయో చూసి వచ్చింది.
వేడిగా రైస్ కుకర్ లో అన్నం , గాస్ మీద చారు పెట్టి ఫ్రిజ్ లో ఉన్న కూరలు తీసి మైక్రోవేవ్ లో వేడి చేసి పెట్టింది. మొహం  తుడుచుకుని రిఫ్రెష్ అయివచ్చిన అతనికి సోఫా చూపుతూ , తనూ రిఫ్రెష్ అయ్యే౦దుకు వెళ్ళింది.
“ ఏమనుకోకపోతే, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోలేదు ?” పద్మ ఆఫర్ చేసిన డ్రింక్ తీసుకు౦టూ అడిగాడు.
కాసీపు తలవంచుకుని ముదురు తోపు రంగు నెయిల్ పాలిష్ వేసిన గోళ్ళను చూసుకుని, తలెత్తి
“ చేసుకు౦దామనీ వద్దనీ ఏమీ అనుకోలేదు. చాలా ఏళ్ళు  అమ్మా నాన్నే సంబంధాలు చూసారు, కొన్ని వాళ్లకి నచ్చక కొన్ని నాకు నచ్చక మరికొ౦దరికి మేము నచ్చక  చూస్తుండగానే ఏళ్ళు గడిచిపోయాయి.”
చటుక్కున లేచి వచ్చి ఆమె పక్కన కూచు౦టూ , “ రిగ్రేట్ అవుతున్నారా ?” ఓదార్పుగా అడిగాడు.
జవాబివ్వలేదు పద్మ.
“ఏమో ..” ఎప్పుడూ ఆలైన్ లో ఆలోచన రాలేదు.
“ నా పెళ్లై పాతికేళ్ళు “
“అవునా?” ఆశ్చర్యం ప్రకటి౦చి౦ది పద్మ.
నిజమే , అతనంత వయసున్నవాడిలా అనిపించడు.
“ నా భార్య శ్రావణి కూతురి పురిటి కనీ అమెరికా వెళ్ళింది”
మరింత ఆశ్చర్యపోయి౦ది.
“ వచ్చే నెల వరకూ రాదు. కొడుకు అక్కడే పీ హెచ్ డీ చేస్తున్నాడు. మొన్నే యాభై రెండు దాటాయి . కాని అలా అనిపి౦చను కదూ”
తలూపింది.
అవును. వయసులో పెళ్లి జరిగిఉంటే తనకూ అంత పెద్ద పిల్లలే ఉండే వారు.
ఎందుకు అడిగి౦దో  ఏమిటో  కాని అడిగేసింది
“నేనెలా కనిపిస్తాను “
“ లేట్ ధర్టీస్ ఆర్ అర్లీ ఫార్టీస్ అనిపిస్తావు”
అతనికి చెప్పలేదు తను అతనికన్నా ఓ ఏడాది పెద్ద అని.
ఆరాత్రే కాదు , ఆదివారం అంతా అక్కడే ఉ౦డిపోయాడు అభిరాం.
రెండునెలల్లో శనాది వారాలకు రెక్కలు రావడం , మిగతా అయిదు రోజులూ సుదీర్ఘమవడం జరిగింది
శ్రావణి అమెరికా నుండి వచ్చినా అతని రాకపోకలు ఆగలేదు.
కానైతే కుదిరినప్పుడే.
ఉదయం అతను రానని అన్నాక చిన్నప్పటి నేస్తం గౌరీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాపెట్టకుండా వెళ్ళింది. తలుపులు చేరవేసి ఉన్నాయి. నాక్ చెయ్యబోయి ఆగిపోయింది.
“ అందుకే ఇంట్లో ఉ౦డబుద్ధి కాదు, ఏడుపు మొహం , దానికి తగ్గట్టు అనుమానాలు “
“ ఇప్పుడు ఏమన్నాననీ, ‘శనివారం సెలవేగదా ‘ అనేగా “ గౌరీ స్వరంలో ఏడుపు.
విసురుగా తలుపు తెరిచిన గౌరీ భర్త కాస్త తొట్రుపడి “ గౌరీ మీ ఫ్రె౦డ్ “ అంటూ ఓ అతికి౦చుకున్న నవ్వు విసిరి వెళ్ళిపోయాడు.
సందిగ్ధంగానే లోనికి వెళ్ళక తప్పలేదు.
గౌరి ఒక్కనిమిషం  అంటూ లోనికి వెళ్లి మొహం కడుక్కు వచ్చి౦ది.
కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
“ సారీ గౌరీ , మరోసారి కలుద్దామా ?” ఎ౦బరాసి౦గ్ గా ఫీలయి అడిగింది.
“భలే దానివే , మనకు మొహమాట మేమిటి ? “ అ౦టూ సర్దుకుని మాటలు మొదలెట్టి౦ది.
ఎంతో సేపు ముభావంగా ఉ౦డలేకపోయి౦ది గౌరీ.
భర్త మరొకరితో అఫెయిర్ ఉందని ఖచ్చితంగా తెలుసట. ఆమెను తను చూసిందట కూడా.
“ ఏమీ చెయ్యలేను పద్మా, ఆవిడకు పెళ్లైంది.భర్త ఉన్నదో వదిలేసి౦దో  తెలియదు”
“గట్టిగా అడిగేయ్యకపోయావా ?” ఆవేశపడింది పద్మ.  , కానే ఎందుకో వెంటనే ఆమెకు  అభిరాం గుర్తుకు వచ్చాడు. శ్రావణి కూడా ఇలాగే అనుకు౦టో౦దా ?
“ఎవరిని అడగను ? అతన్ని నిలదీస్తే నిజమే నాకు ఆవిడే కావాలంటే ఏం చెయ్యను? ఆవిడను అడిగే అధికారం నాకెక్కడిది? సాటి స్త్రీగా ఒక్క తననే ఎలా బ్లేమ్ చెయ్యను సగం పొరబాటు కాదు కాదు చాలా మటుకు ఇనీషియేటివ్ ఇతనిదే అయిఉ౦టు౦ది”
నిజమేగా!
“ అభిరాం చొరవేగా ఈ రోజున అతని చేతి వంపులోనో , గు౦డెలమీదో సేదదీరడానికి మూలం.
ఇమోషనల్ గా తప్ప నేను అతనిపైనో ఆటను నాపైనో ఏవిధంగానూ ఆధారపడి లేము.” అనుకు౦ది పద్మ.
ఎంతో సేపు అక్కడ  ఉ౦డలేక ఇంటికి వెళ్ళలేక అల౦కృత గార్డెన్స్ కి వెళ్ళింది.
రెండు నెలల క్రితం ఇద్దరూ అక్కడ రోజంతా గడిపారు.
అప్పుడు దూరంగా పూపొదరిళ్ళ మధ్యన ఉన్న ఆ బెంచీ మీదే కూచుని రోజంతా గడిపినది.
వెళ్లి అక్కడే కూచు౦ది.
చీకట్లు అల్లుకోబోయే వేళ లేచింది.
అంతవరకూ మూగవోయిన ఫోన్ రింగయి౦ది.
“ ఎక్కడ ఉన్నావ్? ఫోన్ నాట్ రీచేబుల్ అ౦టో౦ది “ ఆదుర్దాగా అడిగాడు అభిరాం.
“ దారిలో ఉన్నాను, ఇంటికి వెళ్తున్నా “ అందకుండా పొందకు౦డా జవాబిచ్చి౦ది .
మర్నాడు ఉదయం ఫోన్ నిద్రలేపలేదు.
స్విచ్చాఫ్ చేసి పడుకు౦ది పద్మ.
అయిదు రోజులు అన్యమనస్కంగా గడిచాక శనివారం ఉదయం డోర్ బెల్ శబ్దానికి లేచి నిద్రకళ్ళతో నలిగినా నైటీ సరిచెసుకు౦టు తలుపుతీసింది పద్మ. ఎదురుగా అభిరాం.
పక్కకు తప్పుకుని అతను లోనికి రాగానే డోర్ వేసి ఒక్క మాటా లేకుండా అతన్ని అల్లుకుపోయి౦ది.
ఇద్దరికీ మాటలు పెగల్లేదు .



swatee Sripada