Facebook Twitter
నవ్వు

 

నవ్వు

- బాలగంగాధర తిలక్

దేవరకొండ బాలగంగాధర తిలక్- మానవతావాద కవిగా ప్రఖ్యాతి గాంచారు. వీరి అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందింది. రచనల్లో జీవితంలోని సౌందర్య దృష్టిని, మానవీయకోణాలను, బాధా తప్త హృదయాలను అద్భుతంగా పట్టి చూపించారు. తిలక్ కవిత్వంతో పాటు మంచి కథలు కూడా రాశారు. వీరి కథలు చదువుతుంటే మనుషుల్లోని విభిన్నమైన కోణాలు తెలుస్తాయి. జీవితరహస్యాల్ని సరికొత్తగా మనముందు నిలుపుతాయి. నిత్యం మనకు ఎదురయ్యే బిచ్చగాళ్లు, అనాథలు, మానసిక ప్రశాంతతలేని మనుషులు... ఇలా ఎంతమంది వీరి కథల్లో మనకు కనిపిస్తారు. వీరి ఊరి చివరి ఇల్లు కథ సినిమాగా వచ్చింది. వీరు రాసిన కథ నవ్వు. మనిషి లోపల హృదయం పగిలే విషాదాన్ని నింపుకొని, పైకి నవ్వుతూ ఎలా ఉండగలడో తెలియజేస్తుంది ఈ కథ.
            రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందర్నీ నవ్వుతూ పలకరిస్తాడు. ముఖంలో ఏ క్షణానా విషాదరేఖలు కనిపించవు. మూర్తికి అతను పక్కనుంటే వొళ్లంతా తేలిక పడినట్లు ఉంటుంది. మూర్తికి చాలా సమస్యలు ఉన్నా రామచంద్రరావు పక్కన ఉంటే అవన్నీ మంచువిడిపోయినట్లు విడిపోతాయి. కానీ మూర్తికి ఎప్పుడూ అనుమానమే- రామచంద్రరావుకు బాధ కలగదా, సమస్యలు లేవా, అతని జీవిత రహస్యం ఏమిటి, న్వవుతూ ఎలా ఉండగలుగుతున్నాడు- అని. రామచంద్రరావుది చిన్న ఉద్యోగం, మూడు గదుల ఇల్లు. ఉదయాన్నే వంట చేసుకొని ఆఫీసుకు క్యారేజీ తీసుకొని వెళ్తాడు. ఇంటి దగ్గర, ఆఫీసులో అందర్నీ నవ్వుతూ పలకరిస్తాడు.
          నా అనేవాళ్లు ఎవ్వరూ లేని రామచంద్రరావుకు ఏలూరు నుంచి బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. అ విషయం తెలిసి మూర్తి ఏలూరు హాస్పెటల్ కు వెళ్తాడు. స్పృహలో లేని రామచంద్రరావును చూసి కన్నీళ్లు వస్తాయి. అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఎలా ఓదార్చాలా అని బాధ పడ్తాడు. కానీ స్పృహ రాగానే రామచంద్రరావు నవ్వుతూ కళ్లు తెరుస్తాడు. మూర్తి మాత్రం ఆశ్చర్యపోతాడు. "పెళ్లి చేసుకో... ఇలా ఎంతకాలం ఒంటరిగా" అని సలహా ఇస్తాడు. రామచంద్రరావు అందుకు కూడా నవ్వుతాడు. ఆ నవ్వుకు మాత్రం ఓ కారణం ఉంది.
      రామమచంద్రరావు చదువుకునేటప్పుడు సరళ అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. సరళ వాళ్లు ఆర్థికంగా ఉన్న వాళ్లు. రామచంద్రరావుకు ఉద్యోగం వచ్చాక సరళకు ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. కానీ- "నీకు డబ్బులేదు, భూమి లేదు, నీ జీతం కేవలం నూట ఇరవై రూపాయలు... నా అవసరాలు, కనీసపు కోర్కెలు కూడా నీవు తీర్చలేవ"ని చెప్పి తిరస్కరిస్తుంది. వేరే పెళ్లి చేసుకుంటుంది. రామచంద్రరావు పెళ్లికి వెళ్లి "నువ్వు సుఖంగా ఉండాలి" అని దీవించి వస్తాడు. కానీ ఏడాది తిరగక ముందే సరళ భర్త చనిపోతాడు. ఆమె బాధతో పుట్టింటికి వస్తే రామచంద్రరావు పోయి ధైర్యం చెప్పి, ఓదార్చి వస్తుంటాడు. సరళ కోలుకున్న తర్వాత సరళ వాళ్ల నాన్న "నువ్వు మాఇంటికి రావడం వల్ల పదిమంది పలురకాలుగా అనుకుంటారు. ఇక రావద్దు" అని చెప్తాడు. రామచంద్రరావు వెళ్లడం మానుకుంటాడు.
          రామచంద్రాన్ని దురదృష్టం వెంటాడుతుంది. పైవాళ్లు అతని ఉద్యోగం తీసేస్తారు. మూర్తి చాలా బాధపడ్తాడు. కానీ రామచంద్రరావు మాత్రం నవ్వుతూనే- ఇంటికి వెళ్లి తన కున్న మూడు గదుల పెంకుటిల్లు అమ్మి మూడువేలు తీసుకొని వస్తాడు. తను ఉన్న మూడు గదుల ఇంటిని ఖాళీ చేసి, ఒక్క గది ఉన్న ఇల్లు తీసుకుంటాడు. టైపు మిషన్ కొని, ఇక్కడ టైపు చేయబడును అని బోర్డు పెడ్తాడు. కానీ అతని చిరునవ్వు మాత్రం చెరిగిపోదు. అతను స్వగ్రామం వెళ్లినప్పుడు సరళ తండ్రి చనిపోతే, తిరిగి వచ్చాక సరళకు ధైర్యం చెప్పి వస్తాడు. అలా ఆరునెలల గడిచాక రామచంద్రానికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది. మూర్తి సరళ దగ్గరకు వెళ్లి "మీరు అతని బాధ్యతలు తీసుకోవాలి" అని గట్టిగా చెప్తాడు. సరళ, మూర్తి పట్నం నుంచి డాక్టరును తెచ్చి చూపిస్తారు. అతడ్ని సరళ తన ఇంటికి తీసుకెళ్తుంది. దగ్గరుండి సపర్యలు చేస్తుంది. రామచంద్రరావు కోలుకున్నాక "నేను వెళ్తాను" అంటే- "మరి బార్య, భర్తను వదిలి ఉంటుందా..." అని అంటుంది సరళ. మూర్తి సిగ్గుపడతాడు. ఇద్దరి వివాహం నిరాడంబరంగా జరుగుతుంది.
              మొదటిరాత్రి సరళ అడుగుతుంది- "మీ నవ్వు రహస్యం ఏమని". రామచంద్రరావు చెప్తాడు - "నేను చిన్నప్పడు నలతగా ఉండేవాడిని, ఎప్పుడు పోతానో అని అమ్మా, నాన్న భయపడుతూ ఉండేవాళ్లు. నా పదహారో ఏట నా అనారోగ్యం పోవాలని  తమ్ముడూ, చెల్లెలు, అమ్మానాన్న అందరం భద్రాచలం వెళ్తున్నాం. పడవ బోల్తా పడింది. నేను ఒక్కడ్నే బతికాను. చనిపోతాననుకున్న నేను బతికాను. ఆరోగ్యంతో ఉండే మిగిలిన అందరూ చనిపోయారు. నేను చనిపోవాలనుకున్నాను. ఈ సృష్టి, ఈ జీవితం అంతా ఒక హాస్యం. ఇదో పెద్ద నవ్వులాట... అని పద్ధతి అంటూ లేదు. ఎవరో తెరవెనుక ఉండి ఆడిస్తున్నారు. కష్టాలకి, భయాలకి, బాధలకి ఆందోళన చెందడం తెలివితక్కువతనం" అని ముగిస్తాడు. గుండెలో అంత విషాదాన్ని, నవ్వులో వెతుక్కుంటున్న రామచంద్రమూర్తి మాటలకు సరళ చలించిపోయి దగ్గరకు తీసుకొని "నేను నిన్ను వదలను" అని చెప్తుంది. కానీ మూర్తికి మాత్రం ఈ నవ్వు వెనక రహస్యం ఎప్పటికీ తెలియదు.
            ఇలా ఓ పాత్ర మనసులో దాగిన విషాదాన్ని అద్భుతంగా చిత్రంచాడు తిలక్. నవ్వు వెనక ఉన్న బాధను చివరి వరకు చెప్పకుండా ఆసక్తి కలిగిస్తూ చివరి ముగింపులో చెప్పడం గొప్ప కథా టెక్నిక్. ఇక సరళమైన భాష. ఆకట్టుకునే శైలి తిలక్ కథల సొత్తు. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగినప్పుడే ఆనందం సొంతం అవుతుందని ఈ కథ రుజువు చేస్తుంది. ఒక్క కష్టానికే కుంగిపోయి, ఆత్మహత్యలు చేసుకునే నేటి తరానికి, మానసిక వ్యాధులతో సంతమతమవుతున్న ప్రస్తుత తరానికి ఈ కథ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

- డా. ఎ. రవీంద్రబాబు