Facebook Twitter
కె. రామలక్ష్మి

 

కె. రామలక్ష్మి

 

ఆమె తొలితరం కథారచయిత్రుల్లో అగ్రగామి. ఆ రోజుల్లో ఓ ప్రముఖ పత్రికలో ఉపసంపాదకురాలిగా పనిచేశారు. కవి, పరిశోధకులు, పాటల రచయిత అయిన ఆరుద్రను వివాహం చేసుకున్నారు. తెలుగు వారు గర్వించదగ్గ పార్వతి, కృష్ణమూర్తుల పాత్రలను సృష్టించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్నే కాదు, ప్రాచీన సాహిత్యాన్ని, ఆంగ్లసాహిత్యాన్ని క్షణ్ణంగా చదువుకున్నారు. ఎన్నో అనువాదాలు చేశారు. ఆమె కె. రామలక్ష్మి. ఆరుద్ర రామలక్ష్మి పేరుతో కూడా రచనలు చేశారు.
        కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930లో కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా అందుకున్నారు. స్త్రీ సంక్షేమ సంస్థలో పనిచేశారు. అలానే స్వతంత్ర పత్రికలో చాలా కాలం ఉపసంపాదకులుగా పనిచేశారు. 1951 నుంచి రచనలు చేయడం ప్రారంభించారు. 1954లో మొదటి సారిగా విడదీసే రైలుబళ్లు అనే పేరుతో తొలి కథాసంపుటిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో కథలు, నవలలు తెలుగు వారికి అందించారు.
      స్వాతంత్ర్యానంతరం వచ్చిన రచయిత్రుల్లో ముఖ్యపాత్ర పోషించిన రామలక్ష్మి రచనల్లో హాస్యం, అభిప్రాయాల్లో సూటితనం, నిర్మొహమాటం... కనిపిస్తాయి. ఆంధ్రపత్రికలో  ప్రశ్నలు - జవాబులు, ఉదయం వార పత్రికలో నారీ దృక్పథం శీర్షికలను నిర్వహించారు. 1950వ దశకంలో వీరి పార్వతి కృష్ణమూర్తి కథలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కథల గురించి రామలక్ష్మీగారే చెప్తూ- మల్లాదివారి ప్రోత్సాహంతో పార్వతి కృష్ణమూర్తుల పాత్రలను సృష్టించాను. అందుకోసం ఈతరం చదువుకున్న పిల్లల మనస్తత్వాలు, సరదాలు, కోపతాపాలు, ప్రేమలు, ప్రణయకలహాలు, పెళ్లి, అసూయలు, పిల్లల పెంపకం... ఇవి ఇద్దరి బాధ్యతలు... ఆ విషయాన్నే చిన్న కథలుగా, స్కెచ్ స్ గా రాశాను అన్నారు. కుర్ర పఠితుల మనసును తాకుతారని మల్లాదివారు కూడా ఆశీర్వదించారు. పార్వతి పాత్రలో ఆవేశం, ఆవేదన, అనురాగం, ఆనందం... అన్నీ ఎక్కువ. వీరి కథల్లో కరుణ కథ, కొత్తపొద్దు, ప్రేమించు ప్రేమకై, నన్ను వెళ్లిపోనీరా, రావుడు, ఆశకు సంకెళ్లు, కోరిక తీరిన వేళ... లాంటివి గొప్ప కథలని విమర్శకులు చెప్తారు. 1961లో తొణికిన స్వప్నం అనే మరో కథాసంపుటని రచించారు. 2007లో రామలక్ష్మి గారి  70 కథలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. పెళ్లి అనే నవల కూడా రాశారు.
        చీలిన దారులు కథలో- ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లి చేసుకోకుండా జీవించడం వల్లే ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయాని, పెళ్లి చేసుకుంటే సాన్నిహిత్యం పెరిగి, ప్రేమ తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదెక్కడ కథలో- ఓ స్త్రీ భర్త, కొడుకు, కోడలు, మనవల మధ్య జీతం లేని సేవకురాలిగా, ప్రేమ పొందలేని  నిస్సహాయరాలుగా జీవితాన్ని నడపలేక, సొంతగా బతకడానికి తనలాంటి వాళ్లున్న స్థలానికి వెళ్లిపోతుంది.అక్కడ స్వతంత్రంగా బతికే వాళ్లతో కలిసి జీవిస్తుంది. అద్దం కధలో- లక్ష్మికి ఎప్పుడూ అద్దంలో తన ముఖం కనిపించదు. అంటే ఆమెకు ఉనికి లేదని రచయిత్రి భావన. ఒకరోజు అద్దం పగిలిపోవడంతో ఆ ముక్కల్లో ఆమె ముఖం కనిపిస్తుంది. అంటే ఆమె చనిపోయిందని అర్థం. కొడుకు ఆమెకు వచ్చే పెన్షన్ కోసం చూస్తాడు తప్ప, ఆమెను పట్టించుకోడు.
              పార్వతి కృష్ణమూర్తి కథలు కూడా వైవిధ్యంతో కూడుకున్నవే. భార్యను ప్రేమించే భర్తల గురించి కాకుండా, భార్య పంచే ప్రేమాభిమానాలు, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపటం, పిల్లలతో స్నేహంగా ఉండటం.. ఇలా సంసారంలో స్త్రీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి మారు పేరుగా పార్వతి పాత్రను తీర్చిదిద్దారు. అలానే వీరి కథల్లో ఎక్కువగా నేటి యువతులు, యువకులు, వారి మధ్య ప్రేమలు, స్నేహాలు, తల్లిదండ్రులతో సంబంధాలు... కనిపిస్తాయి. ఇంకా స్త్రీలు అనుభవిస్తున్న పరాధీనత, స్వతంత్ర వ్యక్తిత్వంతో ఇంటినుంచి, కట్టుబాట్ల నుంచి వెళ్లిపోయే స్త్రీలు జీవితాలు... వీరి రచనల్లో కనిపిస్తారు.
           రామలక్ష్మి గారికి ఆరుద్రతో పరిచయం, వివాహం చాలా విచిత్రంగా జరిగింది. ఆమె స్వతంత్ర పత్రికలో పనిచేసేటప్పుడు కృష్ణశాస్తి, శ్రీశ్రీ లాంటి ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆరుద్ర రాసిన కవితలు ఆ పత్రికలో వచ్చేవి. వాటిని చూసిన రామలక్ష్మి, తన మొదటి కథా సంపుటికి ముందుమాట రాయమని అడిగింది. కానీ ఆరుద్ర ఆర్నెళ్ల పాటు అడిగించుకొని రాశారు. అలా విడదీసిన రైలుబళ్లు కథా సంపుటి ముందుమాట వారిద్దర్ని కలిపింది. రామలక్ష్మి గారు ఆరుద్ర సినీగీతాలను సంకలనం చేశారు. వీరికి గృహలక్ష్మి స్వర్ణకంకణం అవార్డు వచ్చింది.
            ముఖ్యంగా వీరి రచనలు నేటి యువతీ యువకులు చదవాల్సిన అవసరం ఉంది. మరుగున పడుతున్న మానవ సంబంధాల్లోని విలువలను ఇవి పట్టి చూపిస్తాయి. స్త్రీలు సొంత వ్యక్తిత్వాలతో ఎలా పెరగాలో, కట్టు బాట్లను ఎలా అధిగమించి ముందుకు సాగాలో నేర్పిస్తాయి. 

   - డా. ఎ.రవీంద్రబాబు