Facebook Twitter
చాగంటి సోమయాజులు


చాగంటి సోమయాజులు


కథకులకు కథడుడిగా పేరుపొందిన కథకుడు చాసో. రాసిన కథలు తక్కువైనా వాటిలోని వస్తువు, శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అందరికీ సామాన్యంగా అనిపించే దృశ్యంలోంచి అసమాన్యమైన కథను సృష్టించడంలో చాసో అసమాన్యుడు. ఏది రాసినా, ఏది చెప్పినా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక సన్నివేశంలోనే మనిషి జీవితాన్ని వ్యాఖ్యానించేలా కథను రాయగల ప్రతిభ వారిది. ఈయన బాణి మన కథకుల్లో విశిష్ఠమైంది. సామాజిక ప్రయోజనం లేనిది కథ రాయడం వృధా అంటారు వారు. జీవితం చివరి వరకూ అభ్యుదయవాదిగానే నిలబడిన వాస్తవిక వాది చాసో. చాసో అసలు పేరు చాగంటి సోమయాజులు. జనవరి 17, 1915లో జన్మించారు. తల్లి తులసమ్మ, తండ్రి కానుకొలను లక్ష్మీనారాయణ. పుట్టంది శ్రీకాకుళం అయితే వారి పెద్దతల్లి దత్తత తీసుకోవడం వల్ల చిన్నప్పుడే విజయనగరం వచ్చేశారు. ఎక్కువ రోజులు అక్కడే నివశించారు. కాదంబరి అన్నపూర్ణతో 13 ఏటనే వివాహం జరిగింది. బి.ఎ. రెండో సంవత్సరం చదువుతుండగానే చదువు ఆపేసి చిన్నాజీ కథలను ముద్రించారు. అయితే కళాశాలలో చదివే రోజుల్లో కవిత్వం కూడా రాసేవారు. కానీ ఆ తర్వాత కథలవైపే మొగ్గు చూపి ఆణిముత్యాల్లాంటి కథలను మనకు అందించారు. వీరికి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర లాంటి కవులు బాగా సన్నిహితులు. విజయనగంలోని హవేలీ భవనం వీరి సాహిత్యాభిమానానికి నిలయం. వీరి మొదటి కథ చిన్నాజీ 1942లో భారతిలో ముద్రితమైంది.
         వాయులీనం, ఎంపు, పరబ్రహ్మం, దుమ్మలగొండె, కుక్కుటేశ్వరము, లేడీ కరుణాకరం, బండపాటు, కుంకుడాకు, భల్లూకస్వప్నం, పోనీ తిను, బుగ్గిబూడిదమ్మ కథ... ఇలా సుమారు నలభైకి పైగా కథలు రాశారు చాసో. లేడీ కరుణాకరం  కథలో- శారద, భర్త చదువుకోసం వ్యభిచారిణిగా మారినట్లు చెప్తుంది. ఇందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కొంత ఉంటుంది. చివరికి భర్తకూడా ఇదంతా నీ భిక్షమే అంటాడు. చాసో ఆమెను మహాపతివ్రత అంటాడు. ఈ కథంతా వ్యంగ్యంగా సాగుతుంది. ఎంపు కథలో - ఓ బిచ్చగాడి కూతురు మరో బిచ్చగాడిని ప్రేమిస్తుంది. కానీ తండ్రి ఇంకో బిచ్చగాడి సంబంధం తెస్తాడు. వీరిద్దరిలో  పెళ్లికొడుకును ఎంపిక చేసుకోవడమే ఈ కథలోని వస్తువు. వాయులీనం కథలో- భార్యాభర్తల అన్యోన్యత, ఆర్థికబంధాలు కనిపిస్తాయి. కుంకుడాకు కథలో- వంటకోసం ఎండుటాకులు ఏరుకునే అమ్మాయికి ఎదురైన సంఘటనను చెప్పారు. పరబ్రహ్మం కథలో- పిచ్చివాడిగా చెలామణి అవుతున్న విద్యావంతుడి ప్రతిభను వర్ణించారు. బదిలీ కథ- కేవలం ఉత్తరాలతో నడిచే కథాశిల్పానికి మంచి ఉదాహరణ. అందుకే వీరు రాసిన ఏ కథకు మరో కథతో సామ్యం అంటూ ఉండదు. 
        చాసో కథలు హిందీ, రష్యన్, కన్నడం, మరాఠీ, మలయాళం, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. చాసో అవసరాన్ని మించిన వర్ణనలు చేయడు. పాఠకుడ్ని నేరుగా కథలోకి తీసుకెళ్తాడు. ఇతివృత్తం, స్పష్టత, కథనంలో సంక్షిప్తత, సహజత్వం, కళాత్మకత వీరి కథకున్న లక్షణాలని చెప్పాలి.  వీరి మొదటి కథా సంపుటి 1968లో వచ్చింది. తర్వాత వీరి 70వ జన్మదినం సందర్బంగా మరికొన్ని రచనలు ప్రచురించారు. వీరి కథలను విశాలాంధ్రవాళ్లు సంపుటిగా తీసుకొచ్చారు. చాసో గురించి జననీరాజనం, కథాశిల్పి చాసో అనే ప్రసిద్ధ రచనలు వచ్చాయి. అసలు చాసో  రచనలపై టాల్ స్టాయ్, గోర్కీ రచనల ఫ్రభావం ఉందంటారు విమర్శకులు. అలానే మార్క్సిజాన్ని అభిమానించే చాసో పీడిత వర్గపక్షపాతిగానే రచనలు చేశారు. కానీ ఎక్కడా సిద్ధాంతాన్ని రచనల్లో చొప్పించినట్లు కనపడదు.          
         70 ఏళ్ల వయసులో మద్రాసులో ఉండగా గొంతు క్యాన్సర్ వచ్చి మరణించారు చాసో. మరణాంతరం శరీరాన్ని పరీక్షల నిమిత్తం మెడికల్ కాలేజీకి ఇచ్చిన ఆదర్శవాది. వీరి పెద్దకూతురు చాగంటి తులసి. తండ్రి పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి కథను అభ్యుదయ పంథాలో ముందుకు తీసుకెళ్తున్న వారికి చాసో పేరిట ప్రతి ఏడాది అవార్డు ప్రధానం చేస్తున్నారు. ప్రముఖ విమర్శకులు శ్రీకాంతశర్మ అన్నట్లు- ఒక సన్నివేశానికి వుండే వివిధ కోణాలను పోల్చి, ఏ కొసనుంచి ప్రారంభిస్తే అది ఒక జీవన సూత్రానికి వ్యాఖ్యాప్రాయంగా వుంటుందో గ్రహించ గలిగేవాడే గొప్ప రచయిత. అటువంటి అపురూప లక్షణంగల కథా రచయిత చాగంటి సోమయాజులు.
        చాసోకు ప్రకృతిని చూస్తూ ఆనందించడమంటే చాలా ఇష్టం. చీకటి చిరు వెలుగుల మధ్య, కొబ్బరి చెట్ల నీడలనీ, అరటి చెట్ల నీడలనీ, దట్టమైన రంగుల్నీ, గాలికి కదలాడే ఆ నీడల అందాలని చూస్తూ చుట్టకాల్చుకోవడం చాసోకు మహా ఇష్టం.
          చాసోలోని వస్తువు, శిల్పం ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి. అందుకే చాసోను తెలుగువారి చెఖోవ్ అంటారు. కథ రచన చేసే వాళ్లకు వారి కథలు పాఠాలవంటివి.

- డా. ఎ. రవీంద్రబాబు