Facebook Twitter
కథా మహర్షి కారా మాస్టారికి జాతీయ అవార్డు

 

కథా మహర్షి కారా మాస్టారికి జాతీయ అవార్డు



ప్రముఖ తెలుగు కథా రచయిత, కారా మాస్టారుగా అందరూ పిలుచుకునే కాళీపట్నం రామారావు 2015 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న అందజేస్తారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా ప్రదానం చేస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథకు 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

కారా మాస్టారుగా మనందరం ఎంతో ఆత్మీయంగా పిల్చుకునే కాళీపట్నం రామారావు గారికి తొంభై వసంతాలూ కథే ఊపిరిగా, కథే ప్రాణంగా గడిచాయి.

‘యజ్ఞం’ కథ ద్వారా సాహిత్య లోకంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన మాస్టారుకు కథా రచనే ఓ ‘యజ్ఞం’.

రాశికన్నా వాసికెక్కే కథల్నే రాసిన మాస్టారు గారి కథా రచనం, పాత్రల, సన్నివేశాల చిత్రీకరణ, ఆతరం సామాజిక, రాజకీయ స్థితిగతులకు అద్దం పట్టడమే కాక, భావితరాలు కథారచనం వైపు మొగ్గు చూపడానికి కథను కేవలం కథగా కాక ఆత్మతో రచన సాగించడానికే తోడ్పడిందని చెప్పుకోవాలి.

ముఖ్యంగా కారా మాస్టారు వ్రాసిన జీవనధార, చావు, నో రూమ్, ఆర్తి కథల్లో ముక్కసూటితనం చదివేవారిని కట్టిపడేస్తుంది. అంతేనా, ఆ కథల్లో కనిపించే రచనా కౌశలం ఆ కథలు మనం మళ్ళీ మళ్ళీ చదివేలా లంగరేసి లాగుతాయ్.



కథ వ్రాయడం ద్వారా ఓ అంశాన్నో, పాత్రల స్వభావాన్నో మనకు పరిచయం చేయడమే కాక, ఆ కథను చదవడం ద్వారా సమకాలీన సమాజంలోని ప్రజల స్థితిగతులు, జీవన విధానాన్ని వివిధ పార్శ్వాల్లో అర్థం చేసుకోగలిగేలా రచనకు ఓ చారిత్రక స్వభావాన్ని కల్పించడం రచయిత సామర్థ్యాన్ని, సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి.

మాస్టారు గారి ‘యజ్ఞం’ కథలో ఈ స్వభావం పుష్కలంగా కన్పించడమే కాదు. ఆ ‘కథే’ వివిధ రకాల సాహితీ చర్చలకు నాంది పలికింది. ఒక కథారచన రచయిత సృజనాత్మకత మీదే కాకుండా, సమకాలీన అంశాలను విశ్లేషించే విధంగా తయారయిందంటే ఆ కథలు తర్వాతి తరం వారికి ఒక రిఫరెన్సులా పనికొస్తున్నాయంటే ఆ కథలకు ఉన్న ప్రయోజనం ఏంటో విడిగా చెప్పనఖ్కర్లేదు.

ముఖ్యంగా 1960లలో ఉత్తరాంధ్రలోని పరిస్థితులు, పోరాటాలు, తిరుగుబాట్లు లాంటి చారిత్రక అంశాలు కారా మాస్టారి రచనల్లోంచి మనకు ఆనాటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు మాస్టారి ‘ఋతుపవనాలు’ కథా సంకలనం తెలంగాణలో వస్తున్న పోరాట కథలకు ఊతాన్నిచ్చిందని చెప్పటం అతిశయోక్తి కాదు.

తొలుత కథలు రాయడం మొదలుపెట్టి రెండు, మూడు కథలు వ్రాసి ఆ తర్వాత తన శైలి నచ్చక వాటిని ముద్రణకు ఇవ్వకుండా వున్నా, మాస్టారు తర్వాతి కాలంలో వరుస కథలతో సాహితీ ప్రియులను మురిపించారు.

తను సొంతంగా కథలు రాయడమే కాదు.. పదిమందీ సాహితీ సృజన చేసేట్టుగా ప్రోత్సహించడం వల్లే ఇవాళ ‘కథ’కు ‘పట్టం’ కట్టే ఇంతమంది రచయితలు మనచుట్టూ మెరుస్తున్నారు. అలాంటి కొత్త చివుళ్ళని చూసి ఇవాల్టికీ మురిసిపోతున్నారు కాబట్టే ఆయన మనందరికీ మాస్టారు...

తొంభై ఏళ్ళ జీవితంలో ఎంతో సాహిత్యాన్ని, ఎందరో సాహిత్యకారులనీ దగ్గరగా చూసిన మాస్టారు ఇప్పుడు ‘కథానిలయం’ అంటూ స్థాపించి Internet ద్వారా సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పుస్తకాల్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను తన భుజాలపైనే వసుకున్నారు.

ఇలాంటి సాహితీ దిగ్గజం మన కారా మాస్టారు ఈ తొంభై ఏళ్ళలో ఎంతో జీవితాన్ని, ఎన్నో అనుభవాల్ని సొంతం చేసుకుంటే ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందివ్వడం ఎలా అంటే మాస్టారు రచనల్ని మళ్ళీ చదువుకోవడం, మరింతమంది చదివేలా చేయడంతోపాటు... ఆ రచనల మీద మరిన్ని పరిశోధనల్ని, చర్చల్ని, విశ్లేషణలని జరపడమే మనం ‘ఉడుతాభక్తి’ని ప్రదర్శించుకోవడం.


 

కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు చదవండి