Facebook Twitter
కానుక

 

 

కానుక

- ముళ్ళపూడి వెంకటరమణ

తెలుగు కథా సాహిత్యంలో హాస్యాన్ని అందలం ఎక్కించిన కథా రచయితల్లో ముళ్లపూడి ఒకరు. పత్రికా రచనలో ప్రత్యేకతోపాటు కథా సాహిత్యంలోనూ హాస్యంతో పన్నీటి జల్లులు కురిపించారు. తెలుగుభాషపై ఉన్నపట్టుతో అనేక ప్రయోగాలు చేశారు. బుడుగు, రాధ, కాంతం వంటి వీరి పాత్రలు తెలుగువారికి సొంతమనుషులై పోయారు. మాటలతో గారడీలు చేయగల మళ్లపూడి బాపుతో కలిసి అనేక సినిమాలకు కథ, మాటలు అందించారు. రమణీయం, కోతికొమ్మచ్చి రచనలు వీరి చివరినాళ్లలో మరింత పేరు తెచ్చాయి. అలాంటి ముళ్లపూడి వెంకటరమణ హృద్యమైన శైలితో, పురాణ ఇతివృత్తాన్ని తీసుకొని కళాకారుడి గుండెను ఆవిష్కరించారు కానుక కథలో.

      ఈ కథ చీకటి వర్ణనతో మొదలవుతుంది. మర్రిచెట్టు కింద గోపన్న మురళిని తయారు చేస్తూ ఉంటాడు. అలా మురళిని తయారు చేయడం ప్రారంభించి పాతిక సంవత్సరాలు అయింది. అప్పటి నుండి మురళిని తయారు చేసే పనిలో ఉన్నాడు గోపన్న. ప్రతి మురళిని తయారు చేసి ఊదుతాడు కానీ అందులో గోపన్న అనుకున్న సంగీతం పలకదు. శ్రుతి దొరకదు. వెంటనే దానిని పక్కన పడేసి మరో మురళిని తయారు చేయడానికి ఉపక్రమిస్తాడు. ఇలా అతను తయారు చేసిన మురళులు పక్కన గుట్టలు గుట్టులుగా పడి ఉంటాయి. వాటని ఎవరన్నా తీసుకెళ్తే కృష్ణుడి కంట పడతాయని  అటకమీద పడేస్తాడు. తెల్లారితో కృష్ణుడి పుట్టినరోజు రేపైనా మురళిని కృష్ణుడికి ఇవ్వాలని అనుకుంటాడు. అలా నిమగ్నమై ఉన్నప్పుడు కొడుకు వచ్చి బువ్వతినమని అడుగుతాడు. అతనికి ఆ మాటకూడా వినపడదు. బృందావనం, గోపికల అందెల రవళి, కృష్ణుడి మురళీనాదం మాత్రమే వినిపిస్తుంటాయి.
          అసలు గోపన్న మురళి తయారుచేయడానికి వెనుక ఓ కథ ఉంది. గోపన్నఒకరోజు కృష్ణుడు వాయించే మురళీనాదాన్ని విని ముగ్థుడైపోతాడు. ఆ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. ఆ పరిశుద్ధమైన స్వరాలలో ఒక్కొక్క స్వరాన్ని మనసులో నిలుపుకొని దాని విశ్వరూపం దర్శించడానికి తపస్సు చేశాడు. అదే మనసులో పదిలంగా దాచుకొని పరుగు పరుగున వచ్చికొత్త వెదురు కోసి, స్వర ద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని అందులో పలికించబోయాడు. అలా పలికితే కృష్ణుడికి ఇవ్వాలనుకున్నాడు. కానీ అది పలకలేదు. అలా ఎన్నో వేల వేణువులు చేశాడు. చివరికి ఒకరోజు అంత మోహనమైన సంగీతాన్ని వెదురుముక్కలో కృష్ణుడు ఎలా ఇమిడ్చాడో తెలుసుకోవాలని దాన్ని దొంగతనం చేస్తాడు. కానీ గజదొంగ అయిన కృష్ణుడు సాయంత్రం కనపడి "నా మురళిని తీసుకపోయావు. మరొక మురళిని చేసిపెట్టు" అన్నాడు నవ్వుతూ. అప్పటి నుండి గోపన్నకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వేణువులు తయారుచేసే పనిలో కళాసృజనకు శ్రీకారం మొదలైంది. 
       అలా పాతికేళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు పెద్దవాడై యమునాతీరానికి రావడం మానేశాడు. కానీ గోపన్న మాత్రం మురళిని తయారు చేయడం మాత్రం మానుకోలేదు. బిడ్డను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. పాపం వాడే కాసింత గంజికాసి ఇచ్చేవాడు. ఈ పుట్టినరోజుకు కృష్ణుడికి మురళిని ఇవ్వాలని తయారు చేస్తాడు. ఊది చూసి, ఫర్వాలేదనుకొని దాన్ని కొడుక్కు ఇస్తాడు. తెల్లవారి కొడుకును కృష్ణుడిలా అలంకరణచేసి, ముద్దుపెట్టుకొని- "పిల్లనగ్రోవి తీసుకురా కృష్ణుడికి ఇద్దువు" అని చెప్తాడు. కానీ కొడుకు దాన్ని "అటకమీద పెట్టాన"ని చెప్తాడు. "ఎంత పనిచేశావురా" అని, అటకమీద ఉన్న మురళులు అన్నీతీసి ఒక్కోదాన్ని ఊది, తను ఇద్దామనుకున్న మురళిని వెదుకుతాడు. సాయంత్రం అవుతుంది. కానీ మురళి మాత్రం దొరకదు. చివరకు రెండు మాత్రమే మిగులుతాయి. ఒకదాన్ని చూసి, ఇక రెండోదాన్ని చూడలేక- పరీక్షించే ధైర్యం లేక కొడుక్కు ఇచ్చి పంపిస్తాడు గోపన్న. తన పాతిక సంవత్సరాల కృషి చివరకు అలా జరిగినందుకు నీరసంగా పడుకుని, కృష్ణుడు ఏమనుకుంటాడో అని పరిపరి విధాలా ఊహించుకుంటుంటాడు.
        ఒక్కసారిగా తను పనికిరావు అనుకున్న మురళులు అన్నీ వాటికవే పలకడం మొదలుపెడ్తాయి. అద్భుతమైన స్వరాలు పలుకుతాయి. అది బృందావనంలోని కృష్ణుడి వేణుగానంలా తోస్తుంది గోపన్నకు. కొడుకు చిన్న గోపన్న తిరిగి వస్తాడు. కొడుకు కూడా బాల కృష్ణుడిలా కనిపిస్తాడు. "నీవు తయారు చేసి ఇచ్చిన మురళి కృష్ణుడు వాయిస్తే శబ్దమే రాలేదు" అని చెప్తాడు. వెంటనే ఇంతవరకు తన కుటీరంలో స్వరనాదం చేసిన మురళిని తీసు ముద్దపెట్టుకుంటాడు గోపన్న.
         కళాసృజనలో మేటికోసం తపించే కళాకారుడి హృదయాన్ని వెంకటరమణ అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కథలో. ముళ్లపూడివారి శైలి దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. హృద్యమైన భాష, అలౌకికమైన మురళీనాద వర్ణనలు ఈ కథకు ఎస్సెట్స్. ఈ కథ తెలుగు సాహిత్యంలో హాస్యానికే పరిమితమైన ముళ్లపూడి వారిలోని మరో రసావిష్కరణ కోణాన్ని తెలియజేస్తుంది.

   - డా. ఎ.రవీంద్రబాబు