Facebook Twitter
తీరిన కోరిక

 

తీరిన కోరిక


రామాపురంలో నివసించే కేసన్న-రత్నమ్మ చాలా పేదవాళ్ళు. వాళ్ళకు ఒక్కడే కొడుకు- బాలు. కేసన్న పూర్వీకులు బాగా బ్రతికారట. అయితే కేసన్న వరకు వచ్చేసరికి వాళ్ళ వంతుకు ఒక కొట్టం తప్ప మరేమీ మిగల్లేదు. కూలటానికి సిద్ధంగా ఉన్న ఆ కొట్టంలో ఉంటూ, భార్యాభర్తలు ఇద్దరూ కూలిపని చేసుకొని పొట్ట పోసుకునేవాళ్ళు. వాళ్ళ సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు- అందువల్ల బాలుని కూడా పనికి రమ్మని పోరేవాళ్ళు వాళ్ళు. అయితే బాలుకి చదువంటే ఇష్టం. తన వయస్సు పిల్లలంతా బడికి పోతుంటే తనొక్కడే పనికి ఎందుకు పోవాలో అర్థమయ్యేది కాదు వాడికి. అదేమాట వాడు కేసన్నతో అంటే అతను "అవునులే, మీ ముత్తాత సంపాదించి పెట్టాడుగా, ఇప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చో! ఇదిగో చెప్తున్నానొరే, నువ్వు నా మాట ప్రకారం మర్యాదగా కూలిపనికి రాలేదనుకో, ఇంక అప్పుడు నేనేం చేస్తానో చూస్తావు!" అని కేకలు వేసేవాడు.

అలాంటప్పుడల్లా రత్నమ్మ కళ్ళలో నీళ్ళు తిరగ్గా "మనకు కొంచెం అమరిందంటే, నిన్నూ బడికి పంపిస్తాంలేరా. అందాకా మా పనిలో సాయం చేస్తా ఉందువు" అనేది. "దేవుడా దేవుడా! ఏదైనా మాయ చెయ్యి దేవుడా! నన్ను బడికి పంపించు" అని రోజూ దేవుడికి మొక్కుకునేవాడు బాలు. ఆ సంవత్సరం వానలు పడలేదు. పొలాలన్నీ బీళ్ళుగా ఉన్నాయి. కేసన్న-రత్నమ్మలకు అంతకు ముందు దొరికిన కొంచెం పని కూడా దొరకకుండా ఉంది. పట్నం వలసపోదామని కేసన్న- వద్దని రత్నమ్మ వాదులాడుకుంటున్నారు. ఊళ్ళో జనాలు గంగమ్మ పూజలు చేస్తున్నారు. రైతులందరూ ఆకాశం కేసే చూస్తూ రోజులు గడుపుతున్నారు తప్ప, మడకలు ముట్టుకున్నవారు లేరు.


"దేవుడా దేవుడా! వానలు బాగా పడేట్లు చెయ్యి దేవుడా" అని దేవుడికి మొక్కుకున్నాడు బాలు. అంతలోనే అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు- "బాలూ! రోజూ మొక్కుకుంటున్నావు కదా, నీ కోరిక తీరుద్దామని వచ్చాను. అయితే మరి ఇవాళ్ళ నీ కోరిక మారింది. నేను ఏదైనా ఒక్క కోరికే తీరుస్తాను. చెప్పు" అన్నాడు. "వానలు పడేట్లు చెయ్యి స్వామీ. రైతులందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు" అన్నాడు బాలు.
"మరైతే నీ చదువు? బడికి పోతానని రోజూ అడిగావే, మరి?" అన్నాడు దేవుడు నవ్వుతూ. బాలు ఏమీ అనలేకపోయాడు. వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "సరేలే! నీ కోరిక ప్రకారమే వాన పడేట్లు చేస్తున్నాను" అని దేవుడు మాయం అయిపోయాడు.


మరుక్షణం ఎక్కడినుండో మేఘాలు వచ్చి కమ్ముకున్నాయి. సన్నగా వాన మొదలైంది. త్వరలోనే వర్షం జోరైంది. పల్లెలోని జనాలంతా ఆనందంగా నాట్యాలు చేశారు. ఎండిన నేలంతా పులకరించింది. చూస్తూ చూస్తూండగానే బాలు వాళ్ళ కొట్టం కూలిపోయింది. వాళ్లకున్న కాసింత ఆసరాకూడా పోయింది. కేసన్న, రత్నమ్మ, బాలు ముగ్గురూ తలమీద చేతులు పెట్టుకొని ఊళ్ళోకి పరుగు పెట్టారు. మరునాడు వాన వెలిశాక, ముగ్గురూ కూలిపోయిన ఇంటిలో కూరుకుపోయిన సామాన్లకోసం వెతుకుతుండగా ఒక దూలం కింద పాతకాలపు కుండ ఒకటి దొరికింది. దాని మూత విప్పి చూస్తే నిండా బంగారం, డబ్బు, నగలు! అవన్నీ వాళ్ళ పూర్వీకులవే, సందేహం లేదు! కేసన్న, రత్నమ్మ సంతోషంతో కొయ్యబారిపోయారు. తేరుకున్నాక, ఆ డబ్బుతో వాళ్ళొక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఊళ్ళో బట్టల వ్యాపారం పెట్టుకున్నారు. బాలుని బడికి పంపించి చక్కగా చదివించారు. బాలు కోరిక నెరవేరింది!

Courtesy..
kottapalli.in