Facebook Twitter
విహారంలో వినోదం

 

విహారంలో వినోదం

 



    ''మేడమ్‌, మీరు రాకపోతే మేం వెళ్లం మేడమ్‌. మీరు మమ్మల్ని తీసుకెడుతున్నారని చెప్తేనే మా వాళ్ళు పంపిస్తానన్నారు'' అంది ఉష సీతా మేడమ్‌ ఇంట్లో సోఫాలో కూర్చొని.
    అది కాలేజీ నుంచి వెళ్ళే టూర్‌. ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్చరర్లు టూరు ప్రోగ్రామ్‌ వేయటం అంతా అయింది. స్టూడెంట్‌ అడ్వైజర్‌గా ఉండే సీతామేడమ్‌ తప్పకుండా రావాలని కోరారు స్టూడెంట్స్‌. ఇంకో లెక్చరర్‌, స్టూడెంట్‌ అడ్వైజర్‌ వెళుతోంది. తనెందుకూ? సీత ఉష మాటల్ని వింటోంది.
    ''చూడు ఉషా నీ ఫ్రెండ్స్‌, నా మేడమ్స్‌ ఉన్నారు కదా! నాకు రావాలనిలేదు. మీరంతా సరదాగా వెళ్ళిరండి'' అంది స్వెటర్‌ అల్లుతూ సీత.
    ''సరే మేడమ్‌, అసలు ఈ టూర్‌ కాన్సిల్‌ చేయించేస్తాములెండి మీరు లేకుండా  నేను వెళ్ళను'' అంది చిన్నపిల్ల్లలా ఏడుపు మొహం పెట్టి.
    సీతకు ఒకటే భయం. ఒకసారి ఒక లెక్చరర్‌ చెప్పింది. ''బాబోయ్‌! ఇంకెప్పుడూ పిల్ల్లల్ని తీసుకెళ్ళను. ఇప్పుడిలా మంచిపిల్లల్లా ఉంటారా, ఒక్కసారి బస్సు దిగగానే ఇక మనమాట వినరు'' అని. ఆ మాట గుర్తొచ్చింది సీతకి.
    మళ్ళీ అనుకుంది. తన కాలేజీ పిల్లల్ని తను కంట్రోల్‌ చేయలేకపోవటమేమిటీ?  అంతగా అడుగుతుంటే రానని మొండికేసి ఉష మనసు బాధపెట్టడమేగా.
-----------
    బస్సు బయలుదేరింది. అమ్మాయిలంతా ఎంతో హుషారుగా పాటలు పాడటం, అంత్యాక్షరి ఆడుకోవటం, జోక్స్‌ చెప్పుకోవటం. ఆ ఆనందం చూస్తూ సీత అనుకుంది. రాకపోతే  ఈ ఆనంద ఘడియలు పోగొట్టుకునేదాన్నేగా! సీత కూడా స్టూడెంట్స్‌తో కలిసిపోయింది.
    ''వాళ్ళతో అంతగా కలిసిపోకు. మనల్ని లెక్కచేయరు తరువాత'' రహస్యంగా చెప్పింది లెక్చరర్‌ విజయ. సీత నవ్వి ఊరుకుంది.
----------
    బస్సు దిగారంతా. అమ్మాయిలు రకరకాల రంగుల డ్రస్సులతో, ఎర్రటి లిప్‌స్టిక్‌ పెదాలతో, జుట్టు విరబోసుకుని, రబ్బరు బ్యాండ్లు పెట్టుకొని, జీన్స్‌, చూడిదార్‌ పైజమాలతో ఎంత అందగానో కనిపించారు సీతకి. పైగా యవ్వనమే ఒక  అందం కదా!
    సీత అలా చూస్తుండగానే మరో బస్సు పక్కనే ఆగింది. దాంట్లోంచి బిలాబిలా దిగారు కుర్రాళ్ళు. ఏ కాలేజీ వాళ్ళో ఏమో! క్షణంలో అబ్బాయిలు, అమ్మాయిలూ 'హాయ్‌' అంటూ పలకరించుకున్నారు.  ''మీరు మీ మేడమ్‌ని వెంటబెట్టుకొస్తే, మా దోవని మేమే పిక్నిక్‌ వేసుకున్నాం'' అంటూ సీత, విజయ మేడమ్స్‌ని చూసి, నమస్తే మేడమ్‌ అన్నారు కొందరు. అబ్బాయిలు ఎందుకు రావాలి ఇప్పుడు? సీతకనుబొమ్మలు ముడిపడ్డాయి.
    ఇది సీత ఊహించనిది. మేడమ్స్‌ అమ్మాయిల్ని ఎక్కడికి తీసుకెడితే అబ్బాయిలూ అక్కడికొచ్చారు. మేడమ్‌ కొన్ని ప్రత్యేకంగా వివరంగా చెప్తుంటే అబ్బాయిలూ పక్కనే నిలబడి తలలూపుతున్నారు.
    సీతకి మాత్రం లోపల ఏదో భయంభయంగానే వుంది. అసలు ఆ కుర్రాళ్ళకి, ఈ కాలేజీ అమ్మాయిలు ఇక్కడికొస్తున్నారని ఎలా తెలుసో అనుకుంది మనసులో. అంతలో ''కొందరమ్మాయిలు వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్‌కి ముందే చెబుతారు మేం వెడుతున్నామని. అదంతా వాళ్ళ వాళ్ళ స్నేహాల్లే. నీవు కంగారుపడకు.  కాకపోతే, ఓ కన్నేసివుంచు'' అంది విజయ.
    సీత అలా చూస్తుండగానే అబ్బాయిలూ, అమ్మాయిలు గ్రూపులుగ్రూపులుగా అయి తలో వైపుకి వెళ్ళడం, ఫోటోలు తీయించుకోవడం. క్రికెట్‌ ఆట|| అబ్బాయిలతో పాటు స్టంప్స్‌, బ్యాట్‌, బాల్స్‌, చేతి గ్లౌజులు ఇలా ఇకటొకటే బస్సులోంచిదించారు.
     ''మేడమ్‌ సరదాగానే ఇది అంతే, ఇలా చూస్తుండగానే అలా అయిపోతుంది మేడమ్‌'' అంటూ అక్కడున్న ఖాళీ స్థలంవైపు అబ్బాయిలూ అమ్మాయిలూ వెళ్ళిపోతుంటే విజయ నవ్వింది. సీత బెదిరింది.
    ''అసలు టూర్‌లో నేర్చుకోవటం, తెలుసుకోవటం తక్కువ, ఈ వినోదం ఎక్కువ'' అని ఇప్పటికి పిల్లలతో టూర్లకొచ్చి బాగా అనుభవం వచ్చేసిందిలే'' అంది విజయ. విజయ, సీత అక్కడున్న చెట్టునీడన కూర్చొని ఆట చూస్తున్నారు.
    ''ఇక రండి'' అంది సీత. అప్పటికి అమ్మాయిలంతా గబగబా వచ్చేశారు. చీకటి పడుతోంది.
    అందరిలో ప్రవీణ గడియారం చూసుకుంటూనే వుంది. సీతకి అర్ధంకాలేదు. భోజనం పైనకన్నా గడియారం పైనే దృష్టి ప్రవీణకి.
    ''మేడమ్‌! సరిగ్గా ఎనిమిదన్నరకి టివీలో సీరియల్‌ వస్తుందండీ. అది మేమిద్దరం చూసితీరాలి. ఎక్కడున్నా సీరియల్‌ మిస్‌కాము మేడమ్‌'' అలా ప్రవీణ చెప్తుంటే, సీత నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ''ఎక్కడికెళ్ళి చూస్తారీ సీరియల్‌'' అన్నారు సీతామేడమ్‌.
    ''మా మామయ్య అత్తయ్య వచ్చి తీసుకెళతారు మేడమ్‌, మళ్ళీ తీసుకొచ్చి దించేస్తారు. మీరేం కంగారు పడకండి''
    ''ఏమిటిది? టూరుకొచ్చి సీరియల్‌ చూడాలని, సినిమా చూడాలని అంటే ఎలా? ఐ యామ్‌ సారీ. వెళ్ళడానికి వీల్లేదంతే'' అంది సీత.
    '' మరిచిపోయా మేడమ్‌, రేపు మార్నింగ్‌ షోకి వెళదామని ప్లాన్‌ చేసుకున్నాం'' అంది ప్రవీణ. ప్రవీణ తండ్రి పెద్ద కాంట్రాక్టర్‌. చాలామందితో గొప్ప స్నేహాలు. ప్రవీణ గర్వమంతా అదే.
    ''ప్రవీణా! రేపుకూడా మనం చూడాల్సినవివున్నాయి. ప్లాన్‌ చేసింది మేము. స్టూడెంట్స్‌ కాదు. మన ఊరి నిండా సినిమాలేగా ఉంది'' అంది సీతా మేడమ్‌. ''ప్రవీణా నువ్వు సీిరియల్‌ చూడ్డానికి, సినిమా చూడ్డానికి వీల్లేదు. అందరిపిల్ల్లలతోపాటే నువ్వూ'' అంది గట్టిగా విజయ.
    అంతలోనే లోపలికొచ్చాడు ప్రవీణ మామయ్య. ''ఆ సీరియల్‌ అవగానే తీసుకొచ్చి దించేస్తా కంగారు పడకండి'' అని తన విజిటింగ్‌ కార్డు సీతకిచ్చాడు. అతను పెద్ద ప్రభుత్వ ఉద్యోగి.
    నిజంగా మామయ్యేనా? అలా పంపటం పొరపాటా? ఈ పిల్లలతో టూర్లంటేనే సీతకిష్టంవుండదు. ''విజయా, నిజంగా మామయ్యే అంటావా'' అంది చాలా ఆవేదనతో సీత.     ''మామయ్యే, మామయ్య కాకపోతే మామయ్యలాంటివాడు. పిల్లల్ని ఇలా రకరకాల టూర్లకి తెచ్చి తెచ్చి అనుభవంతో పండిపోయా'' అంది విజయ చాలా నిర్లిప్తంగా సెల్‌ చెవి దగ్గర పెట్టుకొని.
------------
    ''ఎన్ని చూస్తాం మేడమ్‌, మేమింక ఏమీ చూడం'' అంది ప్రవీణ. ''మేమిద్దరమే కాదు, ఇంకా కొందరు మాతో సినిమాకొస్తున్నారు. అయినా విహారమైనా వినోదం  కావాలిగా'' అన్నాడు ప్రవీణ పక్కన నిలబడ్డ నల్ల మీసాలు, ఎర్ర షర్టు, నొక్కుల జుట్టు అందంగా కనిపిస్తున్న ఇంజనీరింగ్‌ చదివే కుర్రాడు. సీత నోట మాటరాలేదు. అంతా సినిమాకని వెళ్ళిపోతుంటే, సినిమాకో మరెక్కడికో? అంత అమాయకంగా వుండే అమ్మాయిలు ఒక్కసారి ఇంత ధైర్యం-బాబోయ్‌! ఇంకెప్పుడూ ఇలా రాను'' సీత చాలా బాధపడిపోయింది. విద్యార్ధినుల క్రమశిక్షణారాహిత్యాన్ని తల్చుకుంటే విద్యార్ధి థ ఇంతేనేమో? నాకర్థకాదు నిట్టూర్చింది సీత.
    టూర్‌నించి అందరూ క్షేమంగా కాలేజీముందు బస్సుదిగాక సీత ఊపిరితీసుకుంది హాయిగా.
---------------
    సీత, రవీంద్ర కాఫీ తాగుతుంటే ''సీతా! ప్రవీణ అనే అమ్మాయి మీతో వచ్చిందికదూ'' అన్నాడు రవీంద్ర. ఉలిక్కిపడింది సీత. ప్రవీణ బాయ్‌ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్ళడం గుర్తొచ్చి ప్రవీణ చాలా బుద్ధిమంతురాలని, మేడమ్స్‌ అంటే చాలా భయం, గౌరవం అని, సీతామేడమ్‌ వస్తున్నారు కనుకే ప్రవీణ తల్లిదండ్రులు పంపారని ప్రవీణ బాబాయ్‌ మా కొలీగ్‌ ఆ విషయం చెప్పాడు'' అని రవీంద్ర అంటుంటే ఆఁ చాలా మంచి పిల్ల, మేడమ్స్‌ అంటే చాలా భయం అంది సీత వచ్చే నవ్వు ఆపుకుంటూ.
    -------------
    నెలరోజులయ్యేసరికి ఓ సాయంత్రం ఇంటిముందు పెద్ద కారు, కారులోంచి ప్రవీణ, ఆ రోజు టూరులో కనిపించిన అబ్బాయి దిగారు. ''మేడమ్‌ మీరు అంకుల్‌ తప్పకుండా రావాలి'' అంటూ శుభలేఖ చేతికందించాడాఅబ్బాయి.
    విహారంలో వినోదం, ప్రేమ - ఇప్పుడీ పెళ్ళి శుభలేఖ! సీత చేతిలో శుభలేఖ కదులుదోంది. అమ్మాయిలు ఫాస్ట్‌ అని, అబ్బాయిలు ఫాస్ట్‌ అని వింటున్న సీత అనుకుంది కాలమే ఫాస్ట్‌ అని.

డా||ముక్తేవి భారతి
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో