Facebook Twitter
అనువాద సాహిత్యంలో అగ్రగామి శ్రీమతి ఆర్. శాంతసుందరి

 

 

అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఇంతవరకూ ఇద్దరు మహిళలకే లభించింది. ఆ ఇద్దరిలో ఒకరు 'శ్రీమతి ఆర్. శాంతసుందరి'. అనువాదం ఒక యజ్ఞంలా నలభై సంవత్సరాలుగా విరామం లేకుండా చేస్తున్న ఏకైక రచయిత్రి అని చెప్పవచ్చు. తమిళ రాష్ట్రంలో పెరుగుతూ, హిందీ భాషలో అత్యున్నత పరీక్షలో ఉత్తీర్ణురాలవడమే కాకుండా హిందీ సాహిత్యంలో లభ్యమయ్యే పుస్తకాలని వదలకుండా ఒక అనురక్తితో, ఆసక్తితో చదువుతూ భాష మీద మంచి పట్టు సాధించారు.

తెలుగు సరే సరి మాతృభాష.. పుట్టి పెరిగింది సాహిత్య కుటుంబంలో. తండ్రి కొడవటిగంటి కుటుంబరావుగారి గృహమే ఒక సరస్వతీ నిలయం. సాహిత్యం నలుమూలలా నిలిచి ఉంటుంది. అటు మాతామహులింట కూడా అందరూ సాహితీ ప్రియులే, స్రష్టలే. అమ్మమ్మ కొమ్మూరి పద్మావతిగారు, పిన్ని ఉషారాణి భాటియాగారు, మేనమామ కొమ్మూరి సాంబశివరావుగారు గత శతాబ్దిలో పేరెన్నిక గన్న రచయితలు. కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవలలు చదవని పాఠకులు ఆ తరంలో లేనే లేరంటే అతిశయోక్తి కాదు. అసాధారణ రచయితగా చదువరులను ప్రభావితం చేసిన చలంగారు పెద్దతాతగారు. ఆ మహామహుల పేర్లు వినడమే.. వారి రచనలు చదవడమే మహద్భాగ్యమైతే.. ఇంక వారితో నిరంతరం గడుపుతూ ఉంటే సాహిత్యం మీద అభిలాష కలగడంలో ఆశ్చర్యమేముంది? శాంత సుందరిగారు ఆ మాటే అన్నారు, వారిని కలిసినప్పుడు.. అక్షరాలు నేర్చినప్పటి నుంచీ పఠనాసక్తి సహజంగా కలిగిందని. ఇంటి నిండా ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు.. హిందీ ప్రచార సభ గ్రంధాలయం నుంచి హిందీ పుస్తకాలు.. ఆ సమయంలో వారు చదవని, తిరగెయ్యని గ్రంధమేదైనా ఉందంటే అది అలభ్యం అయుంటుంది.
  
వివిధ భాషలలో గ్రంధ పఠనం, ఆ యా గ్రంధాలలో వైవిధ్యం శాంత సుందరిగారిని అనువాద ప్రక్రియ వైపుకి ప్రభావితం చేశాయని చెప్పచ్చు. మొట్టమొదటి అనువాదమే తమిళ రాష్ట్రంలో పెట్టిన పోటీల్లో ప్రధమ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత వెనుతిరిగి చూడ లేదు శాంత సుందరి గారు.
  
తెలుగు యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్స్‍లర్ డాక్టర్ యన్. గోపీ గారి కవితలని హిందీ లోకి చాలా మంది అనువదించారు. వారిలో పి.హెచ్.డిలు కూడా ఉన్నారు. అయితే వేదిక మీద వార్త ఎడిటర్ డా. రాధేశ్యామ్ శుక్లా గారు “శాంతసుందరిగారి అనువాదం లాగ ఏదీ లేదు..” అంటూ కితాబు ఇచ్చారు. మంజుల్ పబ్లికేషన్స్ వాళ్ళ ఎడిటర్ వీరి అనువాదాలలోని భాష ప్రేమ్‍చంద్ భాషకి దీటుగా ఉందని మెచ్చుకున్నారు.
  
తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకీ, ఆంగ్ల భాష నుంచి తెలుగుకి వీరు చేసిన అనువాదాలు అనేకం. అరవై ఎనిమిది రచనలు పబ్లిష్ అయ్యాయి. అందులో నవలలు, వ్యాసాలు, కథలు.. మొదలైన వివిధ ప్రక్రియలున్నాయి. వీరి అనువాదాలని పబ్లిష్ చెయ్యడానికి ప్రచురణకర్తలు నేనంటే నేనని పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఏ పుస్తకానికీ తనంత తానుగా పబ్లిషర్‍ని అడగడం కానీ, తానే స్వయంగా పబ్లిష్ చేసుకోవడం కానీ చెయ్యవలసిన అవసరం రాలేదంటే.. వీరి అనువాదాలలోని ప్రతిభ మనకి అర్ధం అవుతుంది. అందుకే మరి కేంద్ర సాహిత్య అకాడమీ వీరికి పురస్కారాన్ని అందజేస్తోంది.
  
శాంత సుందరిగారి వ్యక్తిత్వం గురించి రాయాలంటే ఎంతయినా రాయచ్చు. నిరాడంబరత, స్థిరమైన మనస్తత్వం, స్నేహానికి ప్రాణమిచ్చే తత్వం, కళ్ళతోనే ఆప్యాయతని తెలియజెయ్యగల నైపుణ్యం, శాంతం.. అన్నింటి కలయికే మన శాంత సుందరి. వారి సమక్షంలో వసంత ఋతువులో చల్లని చెట్లనీడలో సెలయేటి దగ్గరున్న అనుభూతి కలుగుతుంది. ఎంతో సహజంగా సాగి పోతుంది వారితో సంభాషణ.
  
సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయిన పుస్తకం, “ఇంట్లో ప్రేమ్‍చంద్”. భూమిక పత్రికలో ధారావాహికంగా వచ్చినప్పుడు పాఠకుల ప్రశంసలందుకుంది. అకాడమీ వారు పురస్కారాన్ని ఇచ్చేటప్పుడు ఏదో ఒక పుస్తకం పేరు చెప్పినప్పటికీ ఆ గ్రహీతల సాహిత్య సేవనీ, ప్రతిభనీ పూర్తిగా గణనంలోకి తీసుకుంటారని నా అభిప్రాయం.
  
శ్రీమతి శాంత సుందరి ప్రతీ అనువాదం పురస్కారానికి అర్హమైనవే. అయితే ఆ నాటి సామాజిక పరిస్థితులను వర్ణిస్తూ, సామాజిక స్పృహతో రచనలు చేసిన ఒక మహనీయుని గురించి.. వారి శ్రీమతి శివరాణీదేవి, నిత్యం, నిరంతరం వారి వారి చర్యలని, అనుభవాలనీ, అనుభూతుల్నీ కళ్ళకి కట్టినట్లు వివరించడం ఎంపికైన ఈ పుస్తకంలోని ప్రత్యేకత. అనువాదానికి పురస్కారం ఇచేటప్పుడు మూల కథా వైశిష్ట్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా!
 
శ్రీమతి శివరాణీదేవి ప్రేమ్‍చంద్ కూడా, కొద్దో గొప్పో హిందీ సాహిత్యాభిలాషులందరికీ తెలిసిన రచయిత్రి. ప్రేమ్‍చంద్‍జీనే వారి శ్రీమతి పేరుతో రచించారనే అపప్రధని ఎదుర్కున్నట్లు కూడా రచయిత్రి చెప్తారు. ఒక దశలో రచనలు చెయ్యద్దని కూడా చెప్తారు ప్రేమ్‍చంద్‍జీ. కానీ కోకిల ని పాడద్దనీ, నెమలిని నాట్యం చెయ్యద్దనీ ఎవరైనా శాసించగలరా?
అనువాదం ఏవిధంగా ఉందీ అని చెప్పటానికి మూలకథని చదవాలి. లేకపోతే న్యాయం చెయ్యలేము. నాకు హిందీ అక్షరమాల వచ్చినా అంతవరకే నా పరిజ్ఞానం. అయితే శాంతసుందరి పుస్తకం తీసుకుని చదువుతుంటే మూలకథలో భావం ఈ విధంగానే ఉంటుంది.. ఇంతకంటే ఏమాత్రం భేదించదు అని చదువరికి తెలిసిపోతూ ఉంటుంది. కనీసం ఐదు సంవత్సరాలనుంచీ శాంతసుందరిగారికి ఈ పురస్కారం రావాలని సాహితీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్నారు. ఆలశ్యం అయినా తొంభై సంవత్సరాల వయసుగల వారి తల్లిగారు, శ్రీమతి వరూధినీ కుటుంబరావుగారు ఆవార్త విని ఆనందించగలిగారని తృప్తి చెందాము అందరం.
 
“శాంతసుందరిగారు ఈ పుస్తకాన్ని తెనిగించాలని ఎందుకనుకున్నారు?” అదే ప్రశ్న అడిగాను నేను. ప్రేమ్‍చంద్ రాసిన పుస్తకం అంటే అర్ధం చేసుకోగలము. వారి భాష, భావ వ్యక్తీకరణ అనువాదకులని ఆకట్టుకుంటాయని విన్నాము. కానీ ఆట్టే పేరు లేని శివరాణీదేవి రాసిన పుస్తకం ఎంచుకోవడం ఆశ్చర్యమే!
  
ప్రేమ్‍చంద్‍జీ మనుమడు ప్రభోద్ కుమార్ స్వయంగా శాంతసుందరిగారిని, అనువదించమని అడిగారుట. అంటే ఆవిడ ప్రతిభ ప్రముఖ హిందీ రచయితల ఇళ్ళల్లోకి ప్రవేశించిందని మనకి తెలుస్తుంది. వీరు అనువాదాలకు ఇప్పటివరకూ అనేక పురస్కారాలు అందుకున్నారు. భారతీయ భాషా పరిషద్ (న్యూడిల్లీ), జాతీయ మానవ హక్కుల సంస్థ (న్యూడిల్లీ), తెలుగు విశ్వవిద్యాలయం (హైద్రాబాద్) నుంచి అందులో కొన్ని.
 
అనేక వ్యక్తిత్వ వికాస పుస్తకాలని ఆంగ్లం నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీకీ అనువదించిన శ్శాంతసుందరి తెలుగులో “విజయంవైపు అడుగులు” అనే పుస్తకాన్ని స్వయంగా రాశారు. మన గ్రంధాలలోని అనేక కవితలని ఉదహరిస్తూ.. వ్యక్తిత్వ వికాసానికి ఆంగ్ల పుస్తకాల మీదనే ఆధార పడనక్కర్లేదని తెలియజెప్పారు.ఆ రచన స్వప్న మాస పత్రికలో ధారావాహిక గా వచ్చింది.
  
ఆ కవితల సేకరణలోనే కాక, తన ప్రతీ రచననీ విశ్లేషించి, విమర్శించి.. ఒక్కోసారి సరిదిద్దుతూ అనుక్షణం శాంతసుందరిగారి వెంటే ఉండి ప్రోత్సాహ సహకారాలందిస్తున్న జీవిత భాగస్వామి శ్రీ గణేశ్ రావుగారి గురించి చెప్పుకోక పోతే ఈ వ్యాసం పరిపూర్ణం కాదు. శ్రీ రావుగారు న్యూఢిల్లీలో ఆంగ్ల అధ్యాపకునిగా, విమర్శకునిగా ముప్ఫైఐదు సంవత్సరాల పైగా ఉండడం శాంతసుందరిగారి అభిరుచికి దోహదం చేసింది.
  
శ్రీమతి శాంతసుందరి, గణేశ్ రావుగార్ల అమ్మాయిలు ఇద్దరూ విద్యాధికులు. అమెరికాలో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి శ్రీమతి అరుణ యమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి, కంప్యూటర్ కోర్సులెన్నింటిలోనో నైపుణ్యం సాధించి పదహారేళ్ళు సాఫ్ట్ వేర్ రంగంలో పని చేశారు. చిన్నతనం నుంచీ చిత్రకళలో ఉన్న అభిరుచి, ఆసక్తితో అందులో ప్రావీణ్యత సంపాదించాలని నిశ్చయంతో ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. తప్పకుండా చిత్రలేఖనంలో శిఖరాగ్రాలనందుకుంటారు. రెండవ అమ్మాయి శ్రీమతి సత్య, యమ్మెస్సీ బయాలజీ చేసింది. 11 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి  30వ ఏట ధిల్లీ లో అరంగేట్రం చేసింది . అమెరికా లో కూడా  శారదాపూర్ణ శొంఠి గారు నృత్యం చేసే అవకాశం ఇచ్చారు . కొన్నాళ్ళు అమెరికా లో భరతనాట్యం నేర్పింది . ప్రస్తుతం అవసానదశలో ఉన్న  కేన్సర్ రోగులకి సేవలందించే హాస్పిస్ లో పని చేస్తోంది .

శ్రీమతి శాంతసుందరి ఇంకా అనేక అనువాదాలు చెయ్యాలని, తెలుగు రచయితల ప్రతిభని దేశవ్యాప్తం చెయ్యాలని కోరుతున్నాను. మరొక్కసారి వారికి అభినందనలు.
         

మంథా. భానుమతి  

*----------------------*