Facebook Twitter
కుడి ఎడమైతే

 

కుడి ఎడమైతే



    అనగనగా ఓ నగరం!
    అందులో ఓ మధ్యతరగతి గృహం. ఆ గృహంలో ఓ భర్త, ఓ భార్య. వారికో బా(ం)బు.
    భర్త ఓ బ్యాంకులో క్యాషియర్‌. అంటే డబ్బు లెక్కపెట్టి ఇచ్చిపుచ్చుకునే యంత్రం.
    భార్య హౌస్‌వైఫ్‌. అంటే వంటింట్లో కూరగాయల్ని యధేచ్ఛగా నైఫ్‌తో ముక్కలుముక్కలు చేసి కసిగా ఉడకబెట్టేది.
    బాబుకు  ఏడాది వయస్సు. వాడిని చంటి అని పిలుస్తుంటారు. పుట్టినప్పటినుంచి వారిద్దరికీ రెస్టులేకుండా తన అల్లరితో ఆరెస్ట్‌చేసి నవ్విస్తూ, ఏడ్పిస్తూప్రాణాలు తోడేస్తున్న జీవి.
    ఇక ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఆ ఇంట్లోనూ రోజూ ఆలుమగల కీచులాటలు డైలీ సీరియల్‌లా సాగుతూవుంటాయి.     బ్యాంకులో నోట్లు లెక్కపెట్టి లెక్కపెట్టి అలసిపోయి ఇంటికి వచ్చి  భర్త, ఇంట్లో వంటలతో, చంటిగాడితో అలసి,సొలసి సొమ్మసిల్లిన భార్య తమ అలసటను తీర్చుకోవటానికి తమ ఎనర్జీని రీ జెనరేట్‌ చేసుకోవడానికి తీరిగ్గా పోట్లాడుతూవుంటారు.  ఈ పోట్లాటను వారి బాబు చాలా ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాడు.  వాళ్ళు పోట్లాట ఆపగానే గుక్కపట్టి ఏడుస్తాడు.
    ఇంతకీ ఈ భార్యా భర్తల పేర్లు మీకు చెప్పలేదు కదూ. వింటే నవ్వి పోతారు. భర్త పేరు సన్యాసిరావ్‌, భార్యపేరు సత్యభామ. నమ్మశక్యంగా లేదుకదూ. పేర్లకు, ప్రవర్తనకు బత్తిగా పొంతన కుదరదు. ఇది టూకీగా ఆ సగటు మధ్యతరగతి కుటుంబం. ఇక ప్రస్తుత కథలోకి దిగితే-
    రాత్రి ఎనిమిది గంటల సమయం. సన్యాసిరావ్‌ భోజనానికి  కూర్చున్నాడు. సత్య వడ్డిస్తోంది. సన్యాసి అన్నంముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతుండగా పక్కనున్న సెల్‌ ఒళ్ళు రaల్లుమనేలా మోగింది. సన్యాసి ఎడంచేత్తో సెల్‌ అందుకొని ‘‘హలో’’ అంటూ ముద్దనోట్లో వేసుకున్నాడు.
    అంతే! బాంబు పేలినట్టు సెల్‌ పక్కన పడేసి నోట్లోని ముద్దను ఉమ్మేసి గట్టిగా అరిచాడు.
    ‘‘అబ్బబ్బ! ఇదేంకూర? కూరలో కారం వేశావా? లేక కారంలో కూర వేశావా?’’
    సత్య నవ్వుతూ ‘‘భలేవారే, ఏది దేన్లో వేయాలో నాకుతెలియదా? కూరలో కారం సరిగ్గానే వేశాను. మీ నోరే బాగా చెడిపోయినట్టుంది.         ఆ పాడు సిగిరెట్లు మానెయ్యండి అంది.
    ‘‘ నీ తప్పును సిగరెట్ల మీదికి తోయకు. వంటరానిదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు?’’ సన్యాసి కస్సుమన్నాడు.
    ‘‘ఆ మాటకొస్తే మీరు కరెక్టుగా ఉద్యోగం వెలగబెడుతున్నారా? మొన్న క్యాష్‌లో  పదివేలు తేడా వస్తే చేతినుంచి కట్టలేదా?’’ సత్య వెటకారంగా అంది.
    ఆమె ఎత్తిపొడుపుకు సన్యాసికి మండిపోయింది.
    ‘‘అలా కట్టింది నా డబ్బే. నీ బాబు డబ్బేం కాదు. అయినా ఆ టీ.వీ. చూస్తూ కాలక్షేపంచేసే  నీకు  ఉద్యోగంలో ఉండే బాధలు, టెన్షన్లు ఏం తెలుస్తాయి?’’ అన్నాడు వెక్కిరింతగా.
    ‘‘బోడి ఉద్యోగం. నేనూ చేయగలను’’ అంది సత్య.
    ‘‘అయితే చెయ్‌’’ అన్నాడు సన్యాసి.
    ‘‘చేస్తా. మీరు చేయగలరా వంట?’’ అంది ఛాలెంజింగ్‌గా.
    ‘‘ఓస్‌! వంట చేయడం కూడా ఓ పనేనా? చిటికెలో చేసేస్తాను’’ అన్నాడు సన్యాసి చిటికెలు వేస్తూ.
    ‘‘అలాగైతే నేను రేపే ఉద్యోగంలో చేరుతాను. మీరు రేపట్నుంచి వంటచెయ్యండి’’ అంది సత్య విసురుగా.
    ‘‘ఉన్నఫళాన నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? డిగ్రీ ఉంటే చాలదు. అనుభవం లేనివారికి ఉద్యోగాలివ్వరమ్మా’’ అన్నాడు.
    ‘‘నాకాభయంలేదు. ‘భీమాస్‌ రెసిడెన్సీ’ వాళ్ళమ్మాయి నా  క్లాస్‌మేట్‌. మొన్న కనిపించినపుడు ఊరికే ఇంట్లో కూర్చుని ఏం చేస్తావే? ఏదైనా జాబ్‌లో చేరరాదు’’ అంది. మాటల మధ్యలో వాళ్ళ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉందంది. ఇంట్రెస్ట్‌ వుంటే వచ్చి చేరమంది. రేపే వెళ్ళి చేరుతా’’ అంది సత్య.
    ‘‘ఓహో! అంతా ముందే ప్లాన్‌ చేసుకున్నావన్నమాట. ఓకే, నేనూ రెడీ. రేపట్నుంచి నేను ఓ నెల రోజులు సెలవు పెడతాను. ఇంట్లోనే వుండి వంట చేసిపెడతాను, బాబుని చూసుకుంటాను. నీకు చేతనయితే ఉద్యోగం చేసి నాలా ఇల్లునడుపు చూద్దాం. సవాల్‌’’ అంటూ సన్యాసి సవాల్‌ విసిరాడు. సత్య జడతిప్పి సై సవాల్‌ అంది.
    అలా ఆ దంపతులు పోట్లాట ముగియడంతో ఎడమొహం పెడమొహం పెట్టుకొని మౌనం వహించారు. ఇల్లంతా నిశ్శబ్దం కావటంతో అంతవరకు వాళ్ళ పోట్లాటను ఆసక్తిగా గమనిస్తున్న బాబు ‘‘ఆఆఆఆ...’’ అంటూ ఏడుపు లంకించుకున్నాడు.
ుుు
   
    సన్యాసిరావ్‌ మరుసటిరోజు బ్యాంకుకు సెలవుపెట్టి నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్ళాడు.
    అక్కడ బుక్‌స్టాల్‌లో రకరకాల వంటల పుస్తకాలు కొనుక్కొని ఆనందంగా ఇంటికొచ్చాడు. అప్పటికే సత్య ముస్తాబై బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. భర్తను కొరకొరా  చూసింది. సన్యాసి కూడా భార్యను నమిలిమింగేసేలా చూశాడు. గోదాలోకి దిగిన వస్తాదుల్లా ఇద్దరూ ఒకరినొకరు కసిగా చూసుకొని కళ్ళు నొప్పెట్టడంతో చప్పున ముఖాలు పక్కకు తిప్పుకున్నారు.
    సత్య ఆటో ఎక్కింది. అది కదలగానే సన్యాసిరావ్‌  ఈల వేసుకుంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు. అప్పటికే అతని కడుపు ఆకలితో కేకలువేస్తోంది. రోజూ తెల్లవారగానే వేడివేడి కాఫీ కడుపులో వేడిగా పడేది. ఈ రోజు నో కాఫీ, నో టిఫిన్‌. వెంటనే ఏదో ఒకటి వండి కడుపునిండా తినాలనుకున్నాడు. చేతిలోని పుస్తకాన్ని తెరిచి  పేజీలు తిరగేశాడు.
    ‘ఫలహారాలు శీర్షిక కింద రకరకాల టిఫిన్‌ ఐటమ్స్‌ ఎలా చేయాలో రాసివుంది. చకచకా చదివాడు. చదివాక  వాటికి కావలసిన పదార్ధాలు ముందే సిద్ధం చేసుకోవాలని అర్ధం అయింది. ఇడ్లీలు, దోసెలు చేయాలంటే పిండిని ముందే నానబెట్టి వుంచుకోవాలి. ఇక పూరీలు, వడలు చేయాలంటే బాణలిలో నూనెపోసి బాగా మరిగేదాకా వేడిచేయాలి. ఇప్పుడు తనున్న పరిస్థితిలో సాధ్యంకాదనుకున్నాడు. అయితే ఉప్మా చేయడానికి ఇంత తతంగం అక్కర్లేదని ఉప్మాతయారీకి పూనుకున్నాడు.
    వంటింట్లో ఉప్మా రవ్వను వెతకడానికి డబ్బాలన్నీ తెరిచి చూడాల్సివచ్చింది. చివరికి ఉప్మారవ్వ దొరికింది. ‘యురేకా’ అని సంతోషంతో అరవబోయి ఆగాడు. ఇక మిగతా పోపు సామాన్లు ఓ పట్టాన దొరకలేదు. అన్నీ సిద్ధం చేశాక స్టౌ వెలిగించడానికి లైటర్‌కోసం వెతికాడు. వెదికి వెదికీ విసుగొచ్చి చివరికి తన సిగరెట్‌  లైటర్‌తోనే స్టౌ వెలిగించి పుస్తకంలో రాసినట్టుగా పొయ్యిమీద పెట్టిన పాత్రలో ఒక్కో పదార్థాన్ని వేస్తూ , మధ్య మధ్యలో గుటకలు మింగుతూ ఉప్మా తయారుచేశాడు.
    కమ్మటి వాసన గుప్పుమనటంతో మత్తుగా కళ్ళుమూసుకున్నాడు. వరల్డ్‌ కప్‌ గెలిచినంత సంతోషం వేసింది. ‘యూ హావ్‌ డన్‌ ఇట్‌ సన్యాసి’’ అంటూ తనను తాను అభినందించుకున్నాడు. ఉప్మాను తలుచుకోగానే అతని నోట్లో నీళ్ళూరాయి. ‘ఆలస్యం అమృతం విషం’ అనుకుని ప్లేట్లోకి వడ్డించుకొని చెంచాతో ఉప్మాతీసుకొని తన్మయంగా కళ్ళుమూసుకొని  నోట్లో పెట్టుకున్నాడు.
    ఉప్మా నోట్లో పడగానే అతడి ముఖం మాడిపోయింది. కనుగుడ్లు బయటికి వచ్చాయి తను వండిరది ఉప్మానేగా! మరి ఇదేమిటీ ఇది ఇలా వుంది? ఇందులో ఏదో ఎక్కువయ్యింది. లేదా ఏదో తక్కువయ్యుండాలి.  కాదుకాదు ఏదో వేయటం మరిచిపోయుండాలి. ఆ పుస్తకంలో రాసినట్టే తనుచేశాడు. మరి లోపం ఎక్కడ అని తర్జన భర్జన పడుతూ తలగోక్కున్నాడు. ఎంత గోక్కున్నా పొరపాటు ఎక్కడ జరిగిందో అతనికి అర్ధంకాలేదు. గిన్నెలోని ఉప్మాను తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పారవేయబోతూ ఆగాడు. ఒకవేళ ఇది సత్య కంట పడితే తన విఫలయత్నంమీద  విరగబడి నవ్వుతుంది. ఏంచేయాలా అని ఆలోచించి వీధి తలుపు తీసి ‘జూజూజూ’ అని అరిచాడు.
    ఎక్కడినుంచో ఓ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. సన్యాసిరావ్‌ సంతోషంతో నవ్వుతూ దానికి ఉప్మావడ్డించాడు. అది వాసన చూసి గబుక్కున వెనక్కి జరిగి సన్యాసివైపు కోపంగా చూస్తూ ‘భౌభౌ’ అని అరవసాగింది. సన్యాసి చప్పున లోపలికి వచ్చి తలుపులు వేసుకున్నాడు. అసహనంతో అతడికి పిచ్చెక్కేలా ఉంది. ఒకవైపు ఆకలి చంపేస్తోంది. తినడానికి ఏమీలేదు. ఏదో ఒకటి తినకపోతే కళ్ళుతిరిగి పడిపోతాననిపించింది.
    అదే సమయంలో చంటిగాడు లేచాడు. లేచి  లేవగానే తల్లి కనిపించకపోవడంతో గుక్కపట్టి ఏడ్వసాగాడు. సన్యాసిరావ్‌ పిల్లవాణ్ని ఎత్తుకుని బుజ్జగించసాగాడు. అయితే వాడు ఏడుపు ఆపటం లేదు.
    ‘‘నా చిట్టి కన్నా.... నా బుజ్జినాన్నా... నాబంగారుకొండా...వెధవా ఊరుకో’’ ఇలా మధ్యలో సహనం కోల్పోతూ అంతలోనే శాంతిస్తూ సన్యాసిరావ్‌ సతమతమయిపోయాడు.
    ఎన్ని రకాలుగా బుజ్జగించినా బాబు ఏడుపు ఆపలేదు. సన్యాసిరావ్‌కు ఇల్లు నరకం అనిపించింది. ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు. అసహనంతో చిటపటలాడాడు. ‘‘వీడొక గాడిదకొడుకు’’... అని తిట్టి వెంటనే నాలిక్కరుచుకున్నాడు.
    వాడిగోల వినలేక వాడి నోటికి వేలు అడ్డం పెట్టాడు. బాబు వెంటనే వేలుతీసి నోట్లో పెట్టుకున్నాడు. సన్యాసికి బాబు ఏడుపుకి కారణం తలలో మెరిసింది. తనకులాగే వాడికీ ఆకలి వేస్తోంది. వెంటనే లోపలికి వెళ్ళి ఫ్లాస్క్‌లో చూశాడు. ఫ్లాస్క్‌నిండా పాలున్నాయి. బాబుకు మాత్రం పాలుకాచిపెట్టి  తనకు ఏమీ పెట్టని భార్యను తలుచుకొని సన్యాసిరావ్‌ పళ్ళుకొరుక్కున్నాడు.
    ఫ్లాస్క్‌లోని పాలు బాటిల్లో పోసి బాబుకు పాలు పట్టించాడు. బాబు బుద్ధిగా  పాలుతాగి కాసేపు ఆడుకొని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. బాబు నిద్రపోగానే సన్యాసికి మళ్ళీ తన ఆకలి గుర్తొచ్చింది. వెంటనే బాబును భుజాన వేసుకొని ఇంటికి తాళం వేసి దగ్గర్లోవున్న హోటల్‌కి వెళ్ళాడు.
    బాబును ఒళ్ళో పడుకోబెట్టుకొని  టిఫిన్‌ చేయసాగాడు. అంతలో బాబు అతని ప్యాంట్‌ తడిపేశాడు. చేసేదిలేక టిఫిన్‌ వదిలేసి లేచాడు. రెండు ఫ్రైడ్‌రైస్‌ పార్శిల్‌ కట్టించుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో జనం తడిసిన అతడి ప్యాంట్‌ను చూస్తుంటే సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు. ఇంటికి చేరగానే పిల్లవాణ్ని ఉయ్యాల్లో వేసి ప్యాంట్‌ మార్చుకున్నాడు.
    సరిగ్గా అప్పుడే సెల్‌ మోగింది. నెంబర్‌ చూశాడు. భార్యది. ఫోన్‌ ఆన్‌ చేసి చెవిదగ్గర పెట్టుకున్నాడు.
    అవతల నుంచి చిన్న మూలుగు. దాని అర్ధం ‘ఎలా అఘోరిస్తున్నావు?’ అని. దానికి జవాబుగా సన్యాసి కొంచెం గట్టిగా మూలిగాడు. ‘నీకన్నా బాగానే అఘోరిస్తున్నానని’ దానర్ధం. అవతల సత్య అసహనంగా నిట్టూర్చింది. ‘ఇదంతా నీ కర్మ’ అని అర్ధం. దానికి జవాబుగా సన్యాసి ముక్కుపుటాలు అదిరేలా  నిట్టూర్చాడు. అంటే భార్యకు శాపనార్థాలు పెట్టాడన్నమాట.
    అలా ఆ భార్యాభర్తల మూగపలకరింపులు ముగిశాయి.
    స్నానం ముగించి హోటల్‌ నుంచి తెచ్చిన ఫ్రైడ్‌రైస్‌  పార్శిల్‌విప్పి ఓ పాత్రలో వేశాడు. భార్య తిరిగొచ్చాక అది తను చేసిన వంట అనుకొని కళ్ళుతిరిగిపడిపోవాలి. అప్పుడే తను గెలిచినట్టు అనుకున్నాడు. అదే సమయంలో కాలింగ్‌బెల్‌మోగింది.
    ‘తలుచుకోగానే వచ్చిందే రాక్షసి’ అనుకుంటూ తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరో అపరిచిత స్త్రీ.
    సన్యాసిని చూడగానే ‘‘సత్యభామ ఇల్లుఇదేనాండి? మీరు సత్య భర్త అనుకుంటాను’’ అడిగిందామె.
    ‘‘కాదు, సత్యనే నా భార్య’’ అన్నాడు సన్యాసి.
    ఓ క్షణం తికమకపడి ఫకాల్ననవ్వి, ‘‘మొత్తానికి మగబుద్ధి పోనిచ్చుకున్నారుకాదు. సత్య భర్త అనిపించుకోవటం మీకిష్టంలేదన్నమాట. ఇంతకీ సత్య ఇంట్లో వుందా?’’ అడిగిందామె.
    ‘‘లేదు. మీరెవరు?’’
    ‘‘నేనామెఫ్రెండ్‌ని. మీ పెళ్ళికి నేను రాలేదు కాబట్టి మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మీరు నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ నన్ను ఇంట్లోకి రానిస్తారా? లేక గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తారా?’’ అంటూ ఆమె చొరవగా లోపలికి వచ్చేసింది.
    ఆమె హడావుడికి బాబు నిద్రలేచాడు. లేవగానే ఏడ్పు కార్యక్రమం మొదలుపెట్టాడు. సన్యాసి కంగారుగా పాలబాటిల్‌ తీసుకొని బాబుకు పాలు పట్టించసాగాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
    ‘‘అరెరె. ఆడవాళ్ళు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారే? సత్య ఎక్కడికి వెళ్ళింది?’’ ఆమె అడిగింది.
    ‘‘ఇల్లు వదిలిపోయింది.’’ అసహనంగా అన్నాడు సన్యాసిరావ్‌.
    ‘‘ఇదంతా చూస్తుంటే సత్య గయ్యాళిగా తయారై మిమ్మల్ని బాగా సాధిస్తోందని అర్ధమవుతోంది. ఇంట్లో పసిబిడ్డను వదిలేసి ఏ తల్లైనా బయటికి వెళ్తుందా? ఇంటికి రానీ, ఆ రాక్షసికి బుద్ధిచెబుతా’’ అంది సానుభూతిగా అతని వైపుచూస్తూ.
    ‘‘భర్తమాట వినని స్త్రీ మీ మాట వింటుందా?’’ సన్యాసి నిర్వేదంగా అన్నాడు.
    ‘‘నేనెవరో మీకు తెలియదు. నా పేరు భద్రకాళి. వృత్తిరీత్యా నేనొక లాయర్‌ని. సోషల్‌ వర్కర్‌ని. స్త్రీపై మగవాడు జులుం చేసినా, మగవాడిని స్త్రీ సతాయించినా అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. మీ భార్య నా ఫ్రెండే కావచ్చు. అయినా సరే. అది దారికి రాకపోతే  విడాకులు ఇప్పించి దానికి గుణపాఠం చెబుతాను’’ ఆవేశంగా అందామె.
    ఆమె ఆవేశం చూసి సన్యాసి కంగారుపడ్డాడు. అసలుకే ఎసరు వచ్చేట్టుందనుకుంటూ, ‘‘గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకులేండి. నా భార్య చెడ్డదేమీ కాదు. కాస్త మందలిస్తే అదే దారికొస్తుంది’’ అన్నాడు.
    అయినా భద్రకాళి శాంతించలేదు. చీకటిపడేలోగా తిరిగి రాకపోతే ఆమెకు విడాకుల నోటీసు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమెకు నచ్చజెప్పి పంపేసరికి సన్యాసికి తలప్రాణం కాళ్ళకొచ్చింది.
ుుుుుుు
    ‘‘హాయ్‌! మీరు ఈ రోజు ఫ్రీయేనా?’’ నవ్వుతూ అడిగాడతను.
    కౌంటర్‌ ముందునుంచున్న ఆ వ్యక్తివైపు  చురుగ్గా చూసింది సత్య. అతనలా అడగటం మూడోసారి. ఉదయం రిసెప్షనిస్ట్‌గా జాయిన్‌ అయినప్పటినుంచి గోపాల్‌ అనే కస్టమర్‌ ఆమెను విసిగిస్తున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అవసరంలేకున్నా ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు. అతనిపై మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలనిపించినా మొదటిరోజే న్యూసెన్స్‌ ఎందుకని మిన్నకుంది.
    ‘‘మేడమ్‌! నన్ను అపార్ధం చేసుకోవద్దు. అందమైన వాళ్ళతో స్నేహం చేయటం నా హాబి.  నేను ఊరికి కొత్త. మీకు ఇష్టమైతే సాయంత్రం మీ డ్యూటీ ముగిశాక అలా మీ సిటీ చూపిస్తారా? ఇక్కడ అందమైన ప్రదేశాల్ని నాకు చూపిస్తే మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.’’
    ‘‘చూడు మిస్టర్‌, నాకు పెళ్ళయింది. పెళ్ళయిన ఆడవాళ్ళతో ఇలా మాట్లాడవచ్చా?’’ అంది సత్య కోపంగా.
    ‘‘హమ్మయ్య. ఇప్పటికైనా నోరు తెరిచారు. కాలం మారింది మేడమ్‌. పెళ్ళయినంతమాత్రాన లైఫ్‌ పార్టనర్‌ కోసం మన అభిరుచుల్ని చంపుకోవాలా? నాకు అమ్మాయిలతో స్నేహాలున్నాయి. నా భార్యకు బాయ్‌ ఫ్రెండ్స్‌ వున్నారు’’ అన్నాడతను.
    ‘‘గొప్ప దాంపత్యం! మీరిద్దరూ ఇతరులతో స్నేహం చేయటం మాని మీరు స్నేహంగా ఉండండి’’ ఘాటుగా అంది సత్య.
    ‘‘మీరూ మీ చాదస్తపు మాటలు, బీసీనాటి సీతలా వున్నారు. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటూంటే మీకీ ఉద్యోగం అవసరమా?  కానీ వచ్చారంటే  ఆయనతో మీరు వేగలేకపోతున్నారని అర్ధం. మన ఇద్దరి పరిస్థితి ఒకేలావుంది’’ అన్నాడతను.
    అతని మాటలకి సత్యకు చిర్రెత్తుకొచ్చింది. ఊరుకుంటున్నకొద్దీ ఈ మనిషి శృతిమించుతున్నాడని అనిపిందచింది.
    ‘‘చూడు మిస్టర్‌. నా భర్తతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఉద్యోగం చేయాలన్నది నా కోరిక. పరాయి మగవాళ్ళతో స్నేహాలు చేయాలన్న కోరిక నాకులేదు. ఇక మీరు దయచేయవచ్చు’’ అంది.
    ‘‘మీరు అబద్ధం చెబుతున్నారు. భర్తతో రాజీపడి నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారు. నాతో స్నేహం చేస్తే...’’
    సత్య సహనాన్ని కోల్పోయి ‘‘యూ షెటప్‌ రాస్కెల్‌’’ అని గట్టిగా అరవటంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. దాంతో ఆ వ్యక్తి తోక ముడిచి గబగబా అక్కడ్నించి మాయమయ్యాడు. సత్య తన ముఖం కనిపించకుండా న్యూస్‌ పేపర్‌ అడ్డుపెట్టుకుంది.
    రాత్రి ఏడుగంటల సమయం. ఫోన్‌ మోగింది. సన్యాసి  చప్పున ఫోన్‌ అందుకున్నాడు.
    ‘‘ఏమండోయ్‌ సన్యాసిగారు, మీ ఆవిడ ఇంటికి వచ్చిందా?’’ భద్రకాళి అవతల నుంచి ఐదోసారి అడిగింది.
    ‘‘సత్యరాలేదు. అయినా ఇది మా వ్యక్తిగత సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. ఇందులో మీ జోక్యం అవసరంలేదు’’ అన్నాడు విసురుగా.
    ‘‘భలేవారే! ఇది వ్యక్తిగతమెలా అవుతుంది. మనం సంఘంలో ఉన్నాం. ఇది సామాజిక సమస్య. సంసారం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఈ రాత్రికి సత్య ఇంటికి రాకపోతే నాకు ఫోన్‌ చేయండి. ఆమెమీద భార్యా బాధితుల సంఘానికి ఫిర్యాదు చేద్దాం. అలాగే విడాకుల నోటీస్‌ పంపుదాం ఏమంటారు?’’ అంటూ ఆమె ఉపన్యాసం మొదలు పెట్టింది.
    ఆ సోది వినలేక సన్యాసి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.
    సత్య గుండె దడాదడా కొట్టుకుంటోంది. ఆ వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు. రెసెప్షన్‌ నుంచి బయటపడి ఆటో ఎక్కుతూంటే ‘‘ఏమండోయ్‌ ఒకమాట’’ అంటూ వెంటపడ్డాడు. సత్య వెంటనే ఆటోను ముందుకుపోనివ్వమంది. కొద్దిదూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతను మరో ఆటోలో ఫాలో కావటం కనిపించింది. సత్య భయంతో వణికి పోయింది. ఇల్లు చేరగానే దిగి చేతికొచ్చిన నోటు డ్రైవర్‌ చేతికిచ్చి ఒక్క పరుగులో ఇంట్లోకొచ్చి పడిరది.
    హాల్లోనే భర్త ఎదురయ్యాడు. సత్య అతన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. విషయం అర్ధంకాకపోయినా సన్యాసి కూడా వెక్కివెక్కి ఏడ్చాడు. వీరిద్దరి ఏడుపువిని  అప్పటిదాక ఏడుస్తున్న చంటిగాడు ఏడుపాపి కేరింతలు కొట్టాడు.     కాసేపు జంటగా ఏడ్చాక, ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకున్నారు. ఆ ఆలుమగలు  తమ తప్పులు ఒప్పుకుంటూ సారీలు చెప్పుకుంటుండగా -
    ‘‘స్టాప్‌!’’ అన్న అరుపు వినిపించి అరించిందెవరా అని అటు చూశారు.
    గుమ్మంలో ఒక స్త్రీ ఒక పురుషుడు.
    వాళ్ళిద్దర్నీ చూడగానే ఆలుమగలిద్దరూ గావుకేకలు పెట్టారు.
    ‘‘ఇతనేనండీ... ఇతనే నావెంట పడిరది’’ సత్య అతనివైపు వేలు చూపిస్తూ అంది. ‘‘అవును మేమే, ఒకసారి మమ్మల్ని బాగా చూడండి’’ అన్నారు అగంతకులిద్దరూ.
    సన్యాసి, సత్య ఇద్దరూ వారిని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయారు.
    ‘‘అరే గోపాల్‌, నువ్వా?’’ అన్నాడు సన్యాసి.    ‘‘ఒసేయ్‌! నువ్వు మా దుర్గవుకదూ’’ అంది సత్య. వారి పరిస్థితి చూసి అగంతకులిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు. వారెందుకు నవ్వుతున్నారో సన్యాసి సత్యలకు అర్ధంకాక ఒకరిముఖాలకరు చూసుకున్నారు.
    గోపాల్‌ కుర్చీలో కూర్చుంటూ ‘‘ఒరేయ్‌ సన్యాసీ నీ పెళ్ళికి  మేం రాలేకపోయాం. అలాగే మా పెళ్ళికి మీరు రాలేదు. మనం ఎలా క్లాస్‌మేట్లమో వీళ్ళిద్దరూ కూడా క్లాస్‌మేట్లే. మాకిప్పుడు తీరిక దొరకడంతో ఇక్కడికొచ్చి మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్నాం. కానీ నిన్న రాత్రి  మీరిద్దరూ తగవులాడుకొని ఛాలెంజ్‌ చేసుకుంటున్నారు. అది విన్న మాకు మీ ఇంటికి రావడం సబబు అనిపించలేదు.హోటల్‌లో ఉండి ఓ చిన్న డ్రామా ఆడాం. నా భార్య దుర్గ భద్రకాళిగా నిన్ను, నేను సత్యను విసిగించాం. అయితే మేము ఆశించినట్టే మీలో మార్పొచ్చింది అన్నాడు.
    ‘‘సంసారంలో భార్యాభర్తలిద్దరూ సమానులే ఎవరి పనులూ తక్కువకాదు. పంతాలకు పోయి ఒకరి పనులకరు మార్చుకునే పద్ధతిని మేము సమర్ధించటంలేదు. మీరు చేస్తున్న ఈ పని ఎలాంటి అనర్ధాలకు దారితీయొచ్చో మీకు తెలిసేలా చేయాలనే ఈ నాటకం ఆడాం. అవసరాన్ని బట్టి మగవాడు వంటచేయొచ్చు, స్త్రీ ఉద్యోగమూ చేయొచ్చు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటుంటే జీవితం నిత్యనూతనంగా వుంటుంది’’ అంది దుర్గ.
    ‘‘మా ఇద్దర్నీ కలిపినందుకు థ్యాంక్స్‌రా గోపీ. మేము పోట్లాడుకున్న సంగతి మీకెలా తెలిసింది’’ అడిగాడు సన్యాసిరావ్‌.
గోపాల్‌ చేబులోంచి సెల్‌ తీసిచూపుతూ  ఇదిగో  ఈ మాటల భూతం చెప్పింది. మేము స్టేషన్‌లో దిగగానే నీకు ఫోన్‌ చేశాను. నువ్వు ఫోన్‌ ఆన్‌ చేశావ్‌ నువ్వు ఫోన్‌ ఆన్‌ చేసిన సంగతి కూడా మర్చిపోయి నీ భార్యతో గొడవ పడుతూనే వున్నావు. మొత్తం రన్నింగ్‌ కామెంటరీలా విన్నాం. తరువాత కథ నీకుతెలిసిందే’’ అన్నాడు గోపాల్‌. మీరిద్దరూ కూడబలుక్కొని భలే నాటకం ఆడార్రా అన్నాడు సన్యాసి.
‘కుడిఎడమైతే  పొరపాటులేదోయ్‌’ అన్నాడోయ్‌ సినీకవి. మిమ్మల్ని చూశాక కుడిఎడమైతే పొరపాటేనోయ్‌ అన్నాడు గోపాల్‌ నవ్వుతూ.  అతని మాటలకి అందరూ గొల్లున నవ్వారు. ఒకేసారి అందరూ నవ్వటంతో నిద్రలోంచి లేచిన చంటిగాడు కెవ్వుమని ఏడ్వసాగాడు.

 

రంగనాథ రామచంద్రరావు

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో