Facebook Twitter
నేడు చాగంటి సోమయాజులు శతజయంతి ( వాయులీనం)

నేడు చాగంటి సోమయాజులు శతజయంతి

( వాయులీనం)

 - చాసో

 

నేడు ప్రముఖ కథా రచయిత, చాసోగా చిరపరిచితులైన చాగంటి సోమయాజులు శతజయంతి. ఈ సందర్భంగా ఆయన రచించిన సుప్రసిద్ధ ‘వాయులీనం’ కథను ఓసారి పరిశీలిద్దాం.

నేడు తెగిపోతున్న కుటంబ సంబంధాలకు, నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్న ఒంటరి తనాలకు ఏమి కావాలో తెలిజేస్తుంది 'వాయులీనం' కథ. ఈ కథలోని రాజ్యం, వెంకటప్పయ్యలు భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి నిర్వచనం చెప్తారు. చాగంటి సోమయాజులు రచించిన ఈ కథ మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కథ.
        కథలోని విషయానికి వస్తే- రాజ్యానికి టైఫాయిడ్ జ్వరం వచ్చి పొక్కిపోస్తుంది. వెంకటప్పయ్య రాజ్యాన్ని ధర్మాసుపత్రిలో చేర్పించినా ఆ నెల జీతం మీద రెండొందలు ఎక్కువే ఖర్చవుతుంది. చివరకు మూడువారాలు రాజ్యాన్ని ముప్పతిప్పలు పెట్టి జ్వరం తగ్గుతుంది.
        ఒకరోజు ఆఫీసునుంచి ఇంటికొచ్చి భార్యను చూసిన వెంకటప్పయ్యకు  ప్రాణాలు ఎగిరిపోతాయి. మళ్లీ ఏమైందో నన్న భయం వేస్తుంది. గొడవ చేస్తున్న పిల్లల్ని పెద్దగా కసురుకుంటాడు. దాంతో కలలో 'తోడిరాగంతో అంబర వీధుల్లో విహరిస్తున్న రాజ్యం' ఈ లోకంలోకి తిరిగివస్తుంది. భార్యకు మెలుకువ రావడంతో వెంకటప్పయ్య ప్రాణాలు తిరిగొస్తాయి.  
       వెంకటప్పయ్య రాజ్యం ఆరోగ్యం కోసం కొత్త యిల్లు, ఎక్కువ అద్దెతో తీసుకుంటాడు. పైగా జబ్బుకు బాగానే ఖర్చుపెట్టాడు... అని ఆలోచిస్తూ- 'మొత్తం ఏంతైంది?' అని రాజ్యం అడుగుతుంది.
 భార్యకు ఈ సమయంలో డబ్బలు గురించి చెప్తే ఎక్కువ కంగారు పడిపోతుందని 'ఆ వూసే ఎత్తొద్దు. ముందు నీ ఆరోగ్యం చూసుకో...' అంటాడు వెంకటప్పయ్య. ఇలా భార్యభర్తలు ధనం కన్నా ఒకరిపై ఒకరికున్న ప్రేమాభిమానాలకే ఎక్కువ విలువ ఇవ్వడం మనకు కథలో కనిపిస్తుంది.
       అంతలో ఎదురింటిలో ఉండే పిల్ల సంగీతం పాడుతుంది. ఆ సంగీతం వింటూ రాజ్యం దేదీప్యమానంగా ఆనందంతో వెలిగిపోతుంది. అసలు రాజ్యానికి సంగీతమంటే ప్రాణం. పెళ్లికి ముందే, ఆమె సంగీత విద్వాంసురాలు. పెళ్లి చూపుల్లో ఫిడేలు వాయిస్తూ పాట పాడుతుంది. కానీ ఏ మాత్రం సంగీత జ్ఞానం లేని వెంకటప్పయ్యకు ఆపాట ఏమీ అర్థం కాదు. కానీ ఇప్పడు ఎదురింటి నుంచి వినిపించే పాటకు భార్య, పిల్లలు ఆనందిస్తుంటే, అతనికి  మాత్రం పార్శ్యపు నొప్పి వస్తుంది. అక్కడ ఉండలేక 'పాప పరిహారార్థం మంచిపని చేసుకవస్తా' అని బయటకు వెళ్లిపోతాడు. వస్తూవస్తూ భార్యకోసం 'జరీఅంచు చీర, పట్టు రవికె గుడ్డ' తీసుకొస్తాడు. 'డబ్బు ఎక్కడిది?' అని రాజ్యం అడిగితే, కంగారుగా 'ఇంట్లో ఉన్న నీ ఫిడేలు 250 రూపాయలకు స్నేహితునికి ఇచ్చేశాను' అని చెప్తాడు. తను చేసింది తప్పు అని కూడా ఒప్పుకుంటాడు.
      కానీ రాజ్యం మాత్రం 'మీరు ఏ తప్పు చేయలేదు. పోతూపోతూ... తల్లి తల్లి గుణాన్ని చూపించింది. నాకు ప్రాణం పోసింది. చీర రవికె గుడ్డా పెట్టింది.' అని బాధతో గుడ్లనిండా నీళ్లు నింపుకొంటుంది.
     సంగీతం కంటే సంసారానికే ప్రాధాన్యత ఇచ్చే భార్య రాజ్యం, భార్య ఆరోగ్యం కోసం, ఆమె ఆనందం కోసం తపించే భర్త వెంకటప్పయ్య, ఈ కథకు ప్రాణాలు. కుటంబానికి భార్యాభర్తలు రెండు చక్రాలని నిరూపిస్తారు. గుట్టుగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, వ్యక్తిగత ఇష్టాలకంటే మరొకరి అభిప్రాయాల్నే గౌరవించడం... ఇలా నేడు పతనమవుతున్న కుటుంబ వ్యవస్థకు గుణపాఠాలు నేర్పుతారు. అందుకే భారతీయ సంప్రదాయానికి ఈ కథ ఓ మెట్టు లాంటిదని చెప్పాలి.
                                                   

- డా. ఎ. రవీంద్రబాబు.