Facebook Twitter
ట్రాన్స్‌ఫరొచ్చిందోచ్‌



ట్రాన్స్‌ఫరొచ్చిందోచ్‌

 



రాష్ట్రంలో ఓ మారుమూల ప్రాంతంనుంచి బదిలీఅయింది. ఏ ప్రాంతంనుంచో ఎందుకులేండి ఏడవడం.. డిష్‌ టీవీ తప్ప మరో వినోదం కనబడని పరిస్థితులు మారబోతున్నందుకు ఎగిరిగంతేశాం (లక్కీగా కాళ్ళు, నడుములు ఏం కాలేదు) నిజం చెప్పొద్దూ- పెళ్ళయినప్పంట్నుంచీ అంత సంతోషం (నెక్లస్‌ చేయించిన రోజు కూడా) మా ఆవిడ ముఖంలోనేను చూడలేదు. ఇంతకీ బదిలీ ఎక్కడికీ అనేది చాలా ముఖ్యం.
హై...ద...రా...బా...దు కు
బందులతో ఎప్పుడూ బిజీబిజీగా వుండే భాగ్యనగరానికి. ఏరోజు ఏ ప్రాంతానికి నీళ్ళు వస్తాయో, ఏ ప్రాంతంలో ఎన్ని గంటల కరెంట్‌ పీకుతారో తెలియని, ఎవరి నోట్లోంచి ఏ భాష ఊడిపడుతుందో తెలియని రాష్ట్ర రాజధానికి.
పెద్దసిటీ కనుక స్కూళ్ళకు పిల్లల్ని బస్సులో పంపచ్చు. చూడాలంటే బోలెడన్ని సినిమాలు, షికార్లూ అనో, తినడానికి పిజ్జాలు, బర్గర్లు, చాట్లు అనో తెలియదుగానీ అంతా ఆనందోత్సాహాల్లో తేలిపోవడమైతే జరిగింది. ఎప్పుడో పెళ్ళికో, ఆఫీసు మీటింగుకో తప్ప హైదరాబాదులో మాకు పెద్ద పనేం ఏడుస్తుంది. ఉద్యోగం పురుషలక్షణం కనుక, నేను పురుషుడిని కనుక ఆ లక్షణం కాపాడుకోవడం కోసం నేనూ నాతోబాటు ఫామిలీ హైదరాబాదు బయలుదేరాం. బయలుదేరేముందు-
'ఏమిటండీ నేనూ, పిల్లలు హైదరాబాదు వెడుతున్నందుకు పొంగిన పూరీల్లా వున్నాం. మీరేమిటి గాలి తీసేసిన బెలూన్లా అయ్యారు. కొంపదీసి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ఏమైనా కేన్సిలైందా? కేన్సిలవుతున్నట్లు వార్తందిందా''
మూతి అష్టవంకర్లు తిప్పుతూ అంది అర్ధాంగి.
''ప్చ్‌''
''మరి''
''ఏం చెప్పమంటావు'' నిట్టూర్పు.
''అబ్బా సస్పెన్స్‌ పెట్టి చంపకండి.. అవును చేతిలో ఆ పే-స్లిప్‌ ఏమిటి''
''ఖర్చులు లెక్కలేశాను. ఇంటి అద్దెకే చాలా పోయేలాగుంది. ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులూ, కూరగాయలూ... అన్నీ..''
'' ఆ ఫేసు మార్చండి బాబూ... మీకొచ్చే జీతమంత వున్నవాళ్ళు హైదరాబాదులో బ్రతకలేరన్నట్లు మాట్లాడతారేం''
''హైదరాబాదు ఎ-1 సిటీ... బెంగుళూరులో మీ అక్క, చెన్నైలో మీ తంబి, ముంబయిలో మా బహెన్‌.. అస్తమానం ఖర్చులకు తట్టుకోలేక పోతున్నామో అని చలిజ్వరం వచ్చిన వాళ్ళలా పాడిందే పాడుతుంటారు కదా''
''ఇప్పుడు మనం కూడా వాళ్ళతో గొంతు కలిపి పాడతామని బాధా''
''కాదు''
''మరి''
''ఇప్పుడు ఇంతమంచి క్వార్టర్‌లో వున్నాం. చుట్టూ గార్డెను... కాంపౌండ్‌ వాల్‌.. పెద్ద సిటౌట్‌.. ఎంతో విశాలమైన ఇల్లు... నమ్మకమైన పనివాళ్ళు.. ఇంటిముందు తోటలో తాజా కూరగాయలు.. ఇంటివెనుక పండ్ల చెట్లు... నడిచివెళ్ళగలిగే దూరంలో స్కూలు... చల్లటిగాలి, స్వచ్ఛమైన నీరు... ఆహాఁ...''
''ఆపండి''
''ఏం''
''పాట ఏమన్నా పాడతారేమోనని.. ఇంతకన్నా చిన్నగా వుంటుంది. ఇన్ని సౌకర్యాలుండవు.. అదేగా మీరు చెప్పాలనుకుంటున్నది. ఫరవాలేదులేండి అదే అలవాటవుతుంది. అక్కడ మీ కంపెనీ వాళ్లు బోళ్ళుమంది వుంటారు.''
''అదే సమస్య. అక్కడ క్వార్టర్స్‌ ఖాళీగా లేవట''
''అదేమిటి''
''భువనేశ్వర్‌ నుంచి నాబోటి ఆఫీసర్‌గాళ్ళు ఇద్దరొచ్చి జాయిన్‌ అయ్యారట. ప్రస్తుతానికి ఖాళీలు లేవట''
''ఎలాగండీ''
''ఆఫీసు అకామిడేషన్‌ అయితే తట్టుకోగలం. లేకపోతే సిటీకి దూరంగా వెళ్ళాలి. అన్నింటికీ ఇబ్బందే. రోజూ అంతంత ప్రయాణం... పిల్లల స్కూలు... ట్రాఫిక్‌ జాములు...''
''మరో మార్గం లేదా?''
''నాతో పనిచేసి వెళ్ళినతను ఓ ఏర్పాటు చేస్తానన్నాడు''
''ఏమిటో''   
''ఓ కాంపౌండ్‌వాల్‌ లోపల రెండు పాతగెస్ట్‌హౌజ్‌లు వున్నాయట. ప్రస్తుతం వుండేందుకు వీలుగా లేవట. అయితే స్వంత ఖర్చు పెట్టుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చునన్నాడు. క్వార్టర్స్‌ ఎలాట్‌మెంట్‌ వచ్చేవరకూ వుండిపోవచ్చు.. లేదా బయట చూసుకోవాలి''
''వద్దులేండి. ఈ ఐడియా బానే వుంది''
మన జీవితాన్నే మార్చేస్తుందంటావా''
''వెళ్ళకుండా నేనేమంటాను''
''...అతనే మరోమాట అన్నాడు.''
''ఏమిటి''
'జనరల్‌ మేనేజర్‌కు అభ్యంతరం ఏం లేదట. తన స్టాఫ్‌ సంతోషంగా వుండడమే తనకి కావాలిట''
''మంచివాడండీ''
''ఉండు.. ఇప్పుడే ఆకాశానికెత్తేసి సర్టిఫికెట్‌ ఇచ్చేయకు. వాడు నువ్వనుకున్నంత మంచివాడు కాకపోతే అక్కడ్నుంచే పడేస్తావు''
''వెళ్దామండీ... ఎలాగైనా సర్దుకుంటాం'' దగ్గరగా వచ్చి షర్ట్‌గుండీ సవరించింది.
పిల్లలూ గొంతుకలిపారు అమ్మతో.
ఎటువంటి అడ్వాన్స్‌లూ యివ్వాల్సిన పనిలేదు. ఓనర్లు పెట్టే కండీషన్లు లేవు.. మంచి సెంటర్‌ 'దిల్‌సుఖ్‌నగర్‌'.. ఇక 'దిల్‌'సుఖంగా వుంటుందో లేదో చూడాలి.
అయితే -
చాలా పాతగా వుంది గెస్ట్‌హౌజ్‌.
శిథిలావస్థలో వున్న ఆ మూడుగదుల పోర్షనులోకి కుడికాళ్ళు పెట్టింది కుటుంబం. వచ్చిన అవకాశం జారవిడుచుకోకూడదు అన్న భార్యారత్నం ఆలోచనకు ఓటు పడింది.
మాసిపోయిన గోడలు.. వంటగదిలో ప్లాట్‌ఫామ్‌గానీ, కుళాయిగానీ ఏంలేవు. రెండు గదులకు పాతబడి పెచ్చులూడిన రూఫు... మూడోగదికి రూఫ్‌... వుంది. అయితే బంగాళాపెంకు, కొన్ని పెంకులు ఎవరరిస్తే ఎగిరిపోయాయో ఏమో గానీ మిస్సింగ్‌. ఎండా, వానా ఎంచక్కా లోపల నుంచే చూసే వీలు.. ఒకోసారి ఒకోలా పన్జేసే కుళాయిలు. నేల జిడ్డు పట్టేసివుంది. జారతామేమోగానీ పడతామన్న భయంలేదు. ఎన్ని యాసిడ్‌ బాటిళ్ళు, సోపు ప్యాకెట్లూ వాడాలో అన్నదే అర్ధాంగి ఆలోచన. ఆ ఆలోచనతో పైకిచూసింది. తిరగాలా? వద్దా... అన్నట్లు ప్రభుత్వ ఆఫీసుల్లో పన్జేసేవారిలా తుప్పుపట్టి, గొప్ప చప్పుడు చేసే ఫ్యాన్లు.
ఉండడానికి వీలుగా మార్చుకునే మార్గాలను అన్వేషిస్తూ, గంటకు ఒకసారైనా ఉండివచ్చిన ఊరిని, ఇంటిని, అక్కడి మనుషులను తలుచుకుంటూ గడుపుతున్నాం రోజులు.
'దిల్‌' సుఖంగా అనిపించటం లేదు.
వచ్చేముందు వున్న ఉత్సాహం లేదు.
''కొన్నాళ్ళు ఓపిక పట్టు పారూ. మనకు సరియైన క్వార్టర్‌ అలాట్‌ అయ్యేవరకే...'' అన్నాను.
ముందుప్రక్క జామచెట్టు, వెనకాల మామిడిచెట్టు.. వాటికి అక్కడక్కడా పిందెలు కనిపించాయి.
జామకాయలు చూసిన పిల్లలకు నోరూరింది... రాళ్ళు తీశారు.
మామిడికాయల్ని చూసిన పారూకి కోరిక కలిగింది. కర్ర తీసింది (ఇంక 'వేరే' విశేషం ఏం లేదులేండి)
చిన్న చిన్న సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టరింగ్‌ ఊడిన చోట కవర్‌ చేయడానికి మావద్ద వున్న వాల్‌ హ్యాంగింగ్స్‌, కిటికీ అద్దాలు పగిలిన చోట బయటప్రక్క పూలకుండీలు.. ఇలా అత్యవసర చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టి, ఇల్లు మనుషులు వుండేందుకు అనుకూలంగా మార్చుకోగలిగాం.
రెండు నెలలు గడిచిపోయాయి.
స్టాక్‌మార్కెట్లు కూలిపోవడంతో బంగారం, వెండి ధరలు పెరగడంతో హైదరాబాదులో సమ్మెలు, బందుల వార్తలతోబాటు దొంగతనాలు దోపిడీ వార్తలకు ప్రచారం వచ్చింది.
''ఇక్కడ ఆఫీసుకు దగ్గరగా వున్నాం. ఆఫీసు సెక్యూరిటీ మనకూ సహాయపడుతోంది'' అని ఆనందిస్తున్న సమయం...
ఓ లావుపాటి వ్యక్తి, సన్నగా వున్న ఆయన స్వంత భార్యతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటి తలుపు తట్టాడు.
.. ఆయన ఆ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌ అని, ఓ ఆర్నెల్లపాటు వుండాల్సి వస్తుందని, ఓ నాలుగురోజుల్లో కొద్ది సామానులతో 'కడప' నుంచి వస్తున్నట్లు 'బాంబు' లాంటి వార్త పేల్చి వెళ్ళిపోయారు. ఆరోజు ఉదయమే హై-టెక్‌ సిటీలో మీటింగుండి రావడం ఆలస్యమవుతుందని చెప్పి వెళ్ళాను ఇంట్లో.
రాగానే నా కళ్ళలోకి చూడలేక చూస్తూ, ఆవార్త చెప్పలేక చెప్పింది పారూ. ఈ మధ్యలో అది తలుచుకుని ఎంత కుమిలిపోయిందో వాచిపోయిన ఆ కళ్ళను చూస్తే తెలిసింది.
''ఎక్కడికి పోతాం. ఆ గాడిదకు బుద్ధుందా'' నా చిరాకు తారాస్థాయికి చేరుకుంది.
''అదే అన్నాను'' పారూ.
''ఏమేడిశాడు.''
''నిజమేనండీ. నాకూ తెలుసు మీ ఇబ్బంది. అందుకే ఆ చిన్నపోర్షనుంది చూడండి అటుపక్క.. దాంట్లోకి మీరు షిఫ్ట్‌ అవ్వండి. నేనూ మాట్లాడాను ఎస్టేట్‌ మేనేజరుతో...'' అన్నాడు.
''ఏమిటి.. దానికి వాడి బోడి రికమండేషను. వాడే తగలడొచ్చుగా అందులోకి... ఓహ్‌ాఁ.. వాడు సీనియర్‌గాడు కదా''
''మన కర్మ... మంచి బంగళావదిలేసి ఇక్కడికి వచ్చాం. ఛండాలంగా వున్నదానిని శ్రమదానం చేసి, డబ్బుపోసి ఈ స్థితికి తెచ్చుకున్నాం. కన్నుకుట్టింది వాళ్ళకి.''
పిల్లలు వదిలివెళ్ళడానికి ఇష్టపడలేదు. నిరాహారదీక్షకు దిగుతామన్నారు. (భయపడకండి కాస్త టీవీ వార్తల ప్రభావం)
అంతా మంచం మీద కూలబడ్డాం.. ఆ తరువాత తీరుబడిగా బాధలో పడ్డాం.
''బాధపడితే ప్రయోజనం వుండదు. కర్తవ్యం ఆలోచించండి'' పారూ ముందుగా కోలుకుంది.
కృంగిపోకుండా గుండెల్లో 'దమ్ము' నింపుకున్నాం. అక్కడే వున్న చిన్న పోర్షనుకు మారాం.
మళ్ళీ శ్రమతో చమటోడ్చాం.
పాత చీరకట్టుకుని పారూ, గళ్ళలుంగీ చుట్టుకుని నేను, అడ్డమీద పోరగాళ్ళలా పిల్లలు...
మళ్లీ 'కొంప'ను 'ఇంపు'గా చేసుకునే కసరత్తు.
ట్యాంకునుండి వాటర్‌ రావడం లేదు. పైపులో బ్లాకు.. బ్లాకు పీకగానే కుళాయిలు పనిచేయడం లేదని తెలిసింది. స్విచ్‌వేస్తే లైట్లు వెలగలేదు. వైరింగ్‌ ప్రాబ్లమ్‌ (ఒక చోట స్విచ్‌ వేస్తే ఊహించని చోట లైటు వెలుగుతుంది)
వర్షాకాలం కొంప కారుతుందనడానికి చారలు పడ్డ గోడలు, నేలను కరచిపెట్టుకునివున్న సున్నం ముద్దలు.. కొంత వదిల్చి, వదల్చలేక వదిలేసిన చోట ఎప్పటిలా వాల్‌ హ్యాంగింగ్స్‌.. దోమలు, పందికొక్కులు, బల్లులు, బొద్దింకలు.. సకల జీవరాశులు స్వైరవిహారం చేస్తున్నాయి. అంతకు పూర్వం ఆ కాంపౌండ్‌వాల్‌ను ఆనుకుని వున్న బిల్డింగులో బిస్కెట్ల ఫ్యాక్టరీ వుండేదన్న నిజం బయటికొచ్చింది. ఏ పురుగులమందు కంపెనీ వున్నా పీడాపోయేది అనుకుంది పారూ. జీవరాశులతో సహజీవనం తప్పించటానికి శ్రీమతి వాటిని తరిమేదిశగా ఆలోచనలు పారించి ఉపాయాలను వెలికితీయడంలో నిమగ్నురాలైంది. రాత్రిపూట కిటికీల బయట కప్పల అరుపులను అణచటానికి తనకిష్టమైన మైఖేల్‌ జాక్సన్‌, రెమోఫెర్నాండేజ్‌ల సి.డీలు ప్లే చేయడం మొదలుపెట్టాడు మాజ్యేష్టుడు నిద్రపోయేవరకు.
ఓ ఆరువేలు వదుల్చుకుని కొంపను వుండేందుకు వీలుగా మార్చుకున్నాం.
ఇంత చిర్రెత్తించే పరిస్థితుల్లోనూ ఎడారిలో ఎండమావిలా కొన్ని ఆశాజనకంగానూ తోచాయి. అవేమనగా
మష్రూమ్స్‌- కుక్క గొడుగులన్నమాట.. వాటంతట అవే బోలెడు టీవీలో 'మా ఊరివంట' 'మా ఫ్లాటు వంట' లాంటి కార్యక్రమాలలో వీటితో రకరకాల (రుచికరమైన అని అనట్లేదు) పదార్థాల తయారీలో 'తల' పెట్టేసిన శ్రీమతి స్టౌమీద బాణలీ పెట్టేసింది.
పేరు తెలియని మొక్కల రంగురంగుల పువ్వులు... పెద్ద నిమ్మచెట్టు, దానికి పచ్చటి నిమ్మపండ్లు. చూడగానే 'పచ్చడి పెట్టుకుందాం.. రా' సినిమా ఫక్కీలో అనేసింది పారూ. పిల్లలు కాయలు కోయడానికి కర్రలుచ్చుకుని రడీ అయిపోయారు. నేను ఉప్పుకారాలకోసం బైకు తీస్తుండుగా -
''మీ 'దూకుడు' ఆపండి. ఈవేళప్పుడు కోయకూడదు. తరువాత చూద్దాం'' అంటూనే మొత్తానికి ఈ పోర్షనూ అలవాటు అవుతోందిలేండి. మరో సీనియర్‌గాడు తగలడకుండా వుండాలని ఆ ఏడుకొండలవాడిని ప్రార్దిద్దాం'' అని కేలండరుకేసి తిరిగింది. గాలికి కేలండరు తిరగబడింది. నన్నెందుకు లాగుతారు మీమేటర్‌లోకి అన్నట్లు. అయినా అలాగే అంటూ కళ్ళుమూసుకుని చేతులు జోడించే పోశ్చర్‌లోకి వచ్చేశాను.
''ఇక్కడ కాదు'' అన్నారు అమ్మ మనసు  గ్రహించిన పిల్లలు.
''మరి''
''గుడిలో'' అర్ధాంగి.
చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాం.
þ þ þ þ þ þ
ఆ రోజున ఎవరో సీనియర్‌ మేనేజర్‌ ఇల్లు చూడడానికి వస్తున్నట్లు వార్త భగ్గుమంది.
''ఇది అన్యాయం'' పిల్లలు అరిచారు. పారూ ముఖంలో ఎక్కడలేని విసుగు.   
''ఏమండీ.. మన జాతకాలు చూపించుకుందామండీ... ఏమైన శాంతి పూజలు అవసరమవుతాయేమో.. పైగా మీరు అష్టమశనిలో వున్నారు. లేకపోతే మనకీ అగ్ని పరీక్షలేమిటండీ..''
''ఆలోచిద్దాం. ఏదైనా పథకం వేద్దాం.. మనం ఎక్కడికీ వెళ్ళకూడదు., వాళ్ళే పారిపోయేలా చేయాలి'' బాల్‌పెన్నుతో నుదుటిమీద కొట్టుకున్నా, ఆలోచనల 'లింకు' దొరికింది.
ఇద్దరు పిల్లలు.. ఇద్దరు పెద్దలు, నాలుగు తలకాయలు ఆల్‌ఖైదాల్లా ఆలోచించాం.
మర్నాడు 'అతడు' వస్తాడనగా -
''అమ్మా నువ్వు ఇల్లు శుభ్రం చేయొద్దు. ఛండాలం చేద్దాం. వాల్‌ హ్యాంగింగ్స్‌ తీసిపారేశాం. టేపు వేసి చుట్టిన ఎలక్ట్రిక్‌ వైర్లు లాగి, పీకి అసహ్యంగా వేలాడేటట్టు చేశాం. గోడలపైన క్రేయాన్స్‌తో, బొగ్గుముక్కలతో పుర్రెబొమ్మలు పిచ్చిపిచ్చి రాతలపని పిల్లలకు అప్పజెప్పాం. ప్లాస్టిక్‌ కుళాయిని సింపుల్‌గా 'ఫట్‌' మనిపించాం. డ్రైనేజి మూతను చెట్లలోకి విసిరేశాం... ముక్కులు మూసుకుని ఇవతలకొచ్చేశాం. లోపల్నుంచి బొద్దింకలు కొన్ని పాకేవి. మరికొన్ని ఎగిరేవి. ఎంత దరిద్రంగా వుండాలో- చేయగలమో శక్తివంచన  లేకుండా చేసేశాం. ఒక్కముక్కలో చెప్పాలంటే కొంపకొల్లేరైంది.
చూసిన సీనియర్‌ మేనేజర్‌ కళ్ళుతిరిగాయి. అందుకేనేమో ''ఇందులో ఎలా వుంటున్నారు'' అని జాలిగా అడిగాడు. ఆయన భార్యామణి అసహ్యంగా ఫేసు పెట్టింది.
''మేం బయట ఎక్కడన్నా చూసుకుంటాం'' అంటూ వెళ్ళిపోయారు.
''శ్రమయేవ జయతే''- అంతా అందంగా మార్చడంలో మునిగిపోయాం. కొంత చేతి చమురూ వదిలింది.
రోజులు గడుస్తున్నాయి.
ఎప్పుడూ మధ్యాహ్నం ఇంటికిరాని నేను హడావిడిగా రావడం పగిలిన కిటికీ అద్దంలోంచి చూసింది పారూ.
చూసి ఊరుకోలేదు.
టీవీ పైనున్న ఫ్లవర్‌ వాజ్‌ను కోపంగా చేతిలోకి తీసుకుంది. కొరకొరా చూసింది.
అడుగుపెట్టానో.. లేదో...
విసిరికొట్టడానికి సిద్ధమైంది.
''వద్దు... విసరొద్దు... ఈసారి వెరీగుడ్‌న్యూస్‌'' ఎక్కడ బుర్ర పగలకొడుతుందో అని అరిచాను గట్టిగా పెంకులు రాలితేరాలాయి అన్న ధైర్యంతో.
''గుడ్‌న్యూస్‌'' అన్నది సరిగా వినబడలేనట్లుంది.
ఫలితం-
''ఫ్లవర్‌వాజ్‌'' గాల్లో ఎగిరింది. జహీర్‌బౌలింగ్‌ను తలపింపజేస్తూ. యువరాజ్‌లా క్యాచ్‌ పట్టుకున్నాను దగ్గరగా వచ్చి.
ఒక మేనేజర్‌కు ప్రమోషన్‌ మీద ముంబయి ట్రాన్స్‌ఫరైంది. మనకి చాలా పెద్దది, కొత్తది అయిన క్వార్టర్‌ ఎలాట్‌ చేశారోచ్‌.. ప్లేస్‌ - ''శాంతినగర్‌'' నటరాజ భంగిమలో నిలబడ్డాను చేతిలో ఎలాట్‌మెంట్‌ లెటర్‌తో.
నవ్వాలో, ఏడ్వాలో తెలియని అయోమయంలోంచి తేరుకోవడానికి చాలా టైమ్‌ పట్టింది షాకులు మీద షాకులు తిన్న అర్ధాంగికి.
వాజ్‌ విసిరేసినందుకు తన మీద తనకు కలిగిన కోపమో, నామీద్‌ పొంగి పొర్లిన ప్రేమో- ఏదైతేనేం నన్ను గట్టిగా కౌగిలించుకొని ''సారీ అండీ'' అంటూ గట్టిగా ఏడ్చేసింది.
పిల్లలు చప్పట్లు, కేరింతలు.
మ్యాచ్‌ గెలిచిన ఫీలింగ్‌.
'ఠప్‌' మని చప్పుడు... ఏమిటని చూశామంతా... పైన సీలింగ్‌ నుండి ప్రక్కనే రాలిపడిన పెంకు.


మంత్రవాది మహేశ్వర్‌

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో