Facebook Twitter
సాహితీమేరునగధీరుడు

 

సాహితీమేరునగధీరుడు

డా|| జి.వి.కృష్ణరావు

 

 


సాహితీమేరునగధీరుడు, సాహిత్యమానకలశుడు డా||గవిని వెంకటకృష్ణరావుగారు అతిసామాన్య రైతుకుటుంబంలో అప్పటి తెనాలి తాలూక కూచిపూడి గ్రామంలో 1914లో జన్మించారు. వారి అమ్మగారికి చదువురాదు. తండ్రిగారు అతికష్టంమీద సంతకం చేసేవారట. నేటి నవయువతరం రచయితలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చును. ఒకవేళ తెలిసినా వారి ప్రఖ్యాత నవల ''కీలుబొమ్మలు'' నవలా రచయితగా మాత్రమే తెలిసియుండవచ్చును. వివిధ సాహిత్య ప్రక్రియలలో వారు చేసిన కృషి రచయితగా యస్‌.యస్‌.యల్‌.సి నాటికే ఒక చిన్న నవల శతకం వ్రాసారని, కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ''వరూధిని'' అన్న  ఖండకావ్యం వ్రాసారని, నవలిక, నాటిక, నాటకాలు వ్రాసారని, అలంకార శాస్త్రాలు, పాక్‌, పశ్చిమదేశాల సాహిత్యతత్త్వ శాస్త్రాలను ఔపోసనపట్టారని, తత్త్వవేత్త జిజ్ఞాసువు, మీదుమిక్కిలి మానవతావాది అని బహుకొద్ది మందికి తెలుసు. ఇంతటి బహుముఖప్రజ్ఞ వెనుక బి.ఎ.డిగ్రీతో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ''స్టడీస్‌ ఇన్‌ కళాపూర్ణోదయం'' అన్న పరిశోధనాపత్రం సమర్పించి డాక్టరేట్‌ పట్ట పొందిన గవిని వెంకటకృష్ణయ్య డా||గవిని వెంకటకృష్ణరావుగా గణుతికెక్కుటలో ఆయన సాహిత్యకృషి, పట్టుదల ఆత్మవిశ్వాసం ఎంతగా ఉన్నవోమనం తేలికగా ఊహించుకొనవచ్చును.
మార్క్సిస్టు దృక్పధంతో వ్రాసిన ఆయన ''కావ్యజగత్తు'' సాహిత్యవిమర్శ నాగ్రంథం విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంధంగా నిర్ణయించపబడింది. కాశీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ డిగ్రీ కొరకు చేరినా, పరిస్థితుల  ప్రాబల్యం వలన పూర్తిచేయలేదు. 1941లో జర్నలిజం రంగంలో ప్రవేశించి నార్ల, శ్రీశ్రీలతోపాటు ''ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు.  తెనాలి, వి.యస్‌.ఆర్‌. కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాలుగా, విజయవాడ ఆకాశవాణిలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రొడ్యూసర్‌గా 1963 నుండి 1979 వరకు పనిచేశారు. ఆంద్రవిశ్వవిద్యాలయం సెనేట మెంబరుగా కూడ వ్యవహరించారు.  రేడియో ఉద్యోగంతో కుంటుపడిన ''పాపికొండలు'' నవలారచన ఆయన అనారోగ్య కారణాల వలన అసంపూర్తి నవలగా మిగిలిపోయినది. ఇది తెలుగువారి దురదృష్టం అని చెప్పక తప్పదు. ఆకాశవాణివిజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నపుడు ఆయన అనేక నూతన సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు.
వ్యక్తిస్వతంత్ర విచారధార కల్గి ఉండాలని, ఆత్మసాక్షిగా మనోధర్మం ప్రకారం వ్యక్తులు నడుచుకొనని ఎడల అతడు పరిస్థితుల  చేతిలో కీలుబొమ్మ అయి బొమ్మలాగ ఆడవలసి వస్తుందని 1951లో వారు ప్రబోధిస్తూ వ్రాసిన ''కీలుబొమ్మలు'' నవలా ఆంధ్రనవలా సాహిత్యంలో సాహిత్య విమర్శకులు పేర్కొను ఆరు ప్రసిద్ధ నవలలో ఒకటి గుర్తించబడినది. ఈ నవల ఆంగ్లంలో ''(పప్పెట్స్‌)''గా అనువదింపబడి మాక్మిలన్‌ కంపెనీవారిచే ప్రచురింపబడినది. కాలం చెల్లని నవల కీలుబొమ్మలు విహారిగారి అభిప్రాయం. పాపికొండలు నవల ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చింది. అధికారం మనుష్యుల్ని ఎలా మదోన్మత్తుల్ని చేస్తుందో ఈ నవలలో వ్యంగ్య వైభవంతో రచించారు. డా|| జి.వి.కె. కేంద్ర సాహిత్య అకాడమీ వారి తరపున  ప్లేటో ''రిపబ్లిక్‌'' గ్రంధాన్ని ''ఆదర్శరాజ్యం'' పేరుతో తెలుగులో అనువదించారు. మార్క్సిస్టు దృక్పథంతో వ్రాసిన ''భిక్షపాత్ర'' నాటికి పదహారు భారతీయ భాషలలోకి అనువదింపబడి ఆకాశవాణి నుండి ప్రసారమయినది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భముగా ఆనాటికే ఓపెన్‌ ఎయిర్‌ థియేటరులో ప్రదర్శింపబడి ప్రేక్షకుల విశేష ప్రశంసలు అందుకున్నది. కాశీవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఇంగ్లీషు లిటరేచరు కోర్సులో చేరి, ట్యూషన్లతో పొట్టపోసుకుంటూ ఆంగ్లసాహిత్య అధ్యయనం చేసిన విషయం, ఒకప్పుడు జి.వి.కె. గారు యం.బి.బి.యస్‌. చదువుదామని విశాఖపట్నం వెళ్లి ఆసక్తిలేక తిరిగివచ్చిన విషయం బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఆంధ్రప్రభ సంపాదకవర్గంలో పనిచేస్తున్న కాలంలో ప్రాయిడ్‌ సిద్ధింతాల ప్రాతిపదికగా ''జఘన సుందరి'' నవలిక వ్రాశారు. 1952లో తెనాలి కళాశాలలో పనిచేస్తున్న కాలంలో ఆర్యనాగార్జునుని గ్రంథాలను కొన్నిటిని పద్యాలుగా అనువదించగా అవిపోయాయి. ''విగ్రహవ్యావర్తిని'' మాత్రం తిరిగి అనువదించి విపుల భూమికతో ప్రచురించారు.
రాగరేఖలు నవలలో తీయ తీయని సామెతలు కండగల తెలుగు పలుకుబడులు నిండుగా మెండుగా కనిపిస్తాయి. 1979లో వ్రాసిన ''బొమ్మ ఏడ్చింది'' నాటకంలో ఆర్య నాగార్జునల ఉపదేశం, సలహాలను పెడచెవినిపెట్టి గౌతమీపుత్ర శాతకర్ణి హిందూమత అనుమాయిగా బౌద్దుల్ని బాధిస్తూ దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు. అందుకు బౌద్ధుల ఆరాధ్య దేవత షట్పారమితాదేవి కంట కన్నీరు పెడుతుంది. వారి సందేశము ప్రస్తుత నాయకులు స్వీకరిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.
1948లో ''రష్యాలో రైతు'' అన్న వ్యాసం జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. అందులో రష్యన్‌ రచయితలు గొగోల్‌, టర్గనీవ్‌, టాల్‌స్టాయి, డస్టో విస్కీ, గోర్కి, సివెంస్కీ మున్నగవారు రైతుల జీవితాలు, సమస్యలను ఎంత వాస్తవికతతో చిత్రించినది వివరించారు.
డా||జి.వి.కె.గారి ''నవతోరణం'' సాహిత్యవిమర్శ, వ్యాసాల సంపుటి, తెలుగు సాహిత్యంలో చక్కటి పచ్చని మామిడి ఆకుల తోరణం. ''ఆదర్శశిఖరాలు'' నాటికల సంపుటి విలువలకు కాణాచి ''ఉదబిందువులు'' కథల సంపుటిలో మానవ మనస్తత్వ పరిశీలనతో మానవతా విలువలను పట్టం కట్టిన కథలు ఉన్నవి.
ఇక కవిగా, గేయ రచయితగా డా||జి.వి.కె.గారి ప్రతిభ పాఠవముల పరిశీలన. కవిగా కావ్యఖండికలు ఆయన 1953-1963 మధ్యకాలంలో వ్రాశారు. వారి కావ్యాలలో ద్రాక్షాపాకం కంటే, నారికేళ పాకం పాలు హెచ్చు అని చెప్పక తప్పదు. ''వరూధిని'' 1935లో విద్యార్థిథలోనే వ్రాశారు. హిమాలయాల్లో దారితప్పిన ప్రవరాఖ్యుడు దారి చెప్పమని అడిగినప్పుడు వరూధిని యిచ్చే సుదీర్ఘసమాధానం ఈ ఖండకావ్యం. దీనిలో అల్లసాని పెద్దన గారి అల్లిక జిగిబిగి ప్రతిఫలించింది. ఈ ఖండకావ్యంలో డా||జి.వి.కె.గారిని అంతగా ప్రసిద్దిపొందని కవి కుమారుణ్ణి చూడదగును. ఉదాహరణగా
ప్రాయపుటాడుదంట; యటు
పైన సువర్ణవ పుర్విలాసికా
మ్మాయమటంట మీద్రసుమ
నఃప్రమదామణియంట; దానిపై
నాయతచతురీగతవే
చోత్యభినందితశీలయంట; తా
నేయనురక్తివచ్చెనట
యింకవిపర్యయమేలతెల్పుమా!
అనే వరూధిని జి.వి.కె.గారి వరూధిని
గౌతముడు అర్ధరాత్రివేళ ఇల్లువిడిచి వెళ్లిన వృత్తాంతం మూడు యామాలుగా ''శివరాత్రి'' ఖండికలో విభజింపబడినది. ఈ ఖండిక గోపిచంద్‌ గారికి అంకితం. కృష్ణదేవరాయల ఆస్థాన వైభవచిత్రణ, కవిరాజు ప్రశంస, ఆచార్య నాగార్జునుడు రాజుకు చెప్పిన హితోక్తులు చెప్పిన విథం చక్కటి ప్రసాద గుణం కల్గిన  ''నివేదన'' (పండిత గోపదేవ్‌ గారికి అంకితం) హృదయోల్లాసం కల్గించే ''బాల మేఘము'' ''ప్రాఢమేఘము'' మేఘవర్ణనలు ''శివరాత్రి''లో ఉన్నవి. ఎక్కువ కావ్యాలు వ్రాయక పోయినప్పటికి డా||జి.వి.కె.గారు ఉత్తమ తెలుగుకవులలో ఒకరని  డా|| పోరంకి. దక్షిణామూర్తిగారి అభిప్రాయం.
ఇక గేయ రచయితగా డా||జి.వి.కె.గారిని చూద్దాం. 20వ శతాబ్ధపు పూర్వభాగంలో ఆయన వ్రాసిన ఈక్రింది గేయంవారి అభ్యుదయ భావాలకు దర్పణం. ఈగేయం ఆరోజుల్లో ఆంధ్రదేశంలోని అతిచిన్న పల్లెపట్టుకు కూడా ప్రాకిన విషయం బహుకొద్ది మంది సాహితీవేత్తలకు తెలుసు.
''ఎగరేయ్‌ ఎగరేయ్‌ ఎఱ్ఱ జెండా
ధగధగ జ్యోతి థదిశనిండా
కర్మాగారముగనికుహరమ్ములు
జనమేసోత్తనిజయజయపెట్టగ  || ఎగరేయ్‌ ||
జాతివిభేదము విర్ణవిభాగము
మతగతరోగము మాసిపోవగా
జనమేకావలె జనమే వీరుడని
ప్రభుత్వలక్ష్మి వరించరాగా || ఎగరేయ్‌ ||
పైగేయాన్ని పరిశీలిస్తే డా||జి.వి.కె. ఏనాడో జాతి, మత విద్వేషాలను, వర్ణపోరాటాలను తెగనాడిన గొప్ప మానవతావాదిగా గోచరించకమానరు. 
ఆచార్య శ్రీమతి కె.మలయవాసినిగారు కొద్ది కాలము క్రితము నాగార్జున విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన ధార్మిక ఉపన్యాస ప్రసంగంలో ఆయన ''కౌముది'' అనే పత్రిక నడిపారని అది చేతితో తయారుచేసిన ముతక కాగితంపై ముచ్చటగా ముద్రించారని తెల్పినారు. ఆ సందర్భములో ఆమె ''కౌముది'' పత్రిక ప్రతి ఒకటి తనవద్ద కలదని ఆచార్య అబ్బూరి గోపాలకృష్ణగారు తనకు తెల్పినట్లు తమ ప్రసంగ వ్యాసంలో తెల్పినారు.
1979లో తెనాలిలో జరిగిన తన సన్మానమునకు ఆయన వ్రాసిన జవాబు ''కృష్ణార్పణం'' తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా పేర్కొనవచ్చును. ఆ కృతజ్ఞతాపూర్వక జవాబుపత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన విశాల హృదయమునకు, సహృదయతకు నిరంహంకార స్వభావమునకు, సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే  మనస్తత్వమునకు అద్దంపడుతుంది.
తమ తండ్రిగారి రచనలన్నింటిని పలు సంపుటాలుగా ఆయన కుమార్తెలు డా||జి.ఉమాదేవి, డా||జి.శోభాదేవి వెలువరించి, కుమారులే కాదు కుమార్తెలు కూడ తండ్రి ఋణం తీర్చుకోగలరని నిరూపించారు.
తాను నమ్మిన సిద్దాంతాలు తప్పని తోచినప్పుడు వదిలి వేయటానికి వెనుకాడని ధీరోదాత్తుడు, మానవతావాది, ఆత్మగౌరవంకు భంగం కల్గినప్పుడు జీవనోపాధికి ఆధారభూతమైన ఉద్యోగాలను సైతం  తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి డా||జి.వి.కె. వివిధ సాహిత్య ప్రక్రియలను సత్యాన్వేషణ దృష్టిలో ఔపోసనపట్టిన సాహిత్య అగస్త్యుడు, నిరంతర సాహిత్య కృషీవలుడు, సత్యాన్వేషి, తత్త్వవేత్త, మీదు మిక్కిలి మానవతావాది, జీనియస్‌ డా||జి.వి.కృష్ణరావు గారు. ఆయన 23.8.1979లో కాలధర్మం చేశారు.
 

 
పరుచూరి శ్రీనివాసరావు

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో