Facebook Twitter
మళ్లీ జన్మించాలా...!!

 

మళ్లీ జన్మించాలా...!!

 

 

  
                           
ఎప్పుడూ ఏదో ఆలోచన
తెగదు.... తెల్లారదు
ఎందుకో ఏమిటో అర్థంకాదు, అంతం లేదు
ఈ జీవన యవనికపై నటించడం కష్టంగానే ఉంది.
ఎందుకంటే.... నాకు నేను గుర్తు చిక్కడం లేదు
పుట్టిన నాటికి నేటికీ ఎన్నో మార్పులు
కొన్ని వచ్చినవి, కొన్ని కల్పించుకున్నవి...
మరికొన్ని వాటికవే నాలో ప్రవేేశించినవి.
ఈ ఎడతెగని బంధాలలో నేను బంధీనై పోతున్నాను.
వద్దనుకుంటూనే, వదల్లేకున్నాను.
మొన్న సినిమా, నిన్న షాపింగ్, నేడు ఇంటర్నెట్ లో ఛాటింగ్
అంతా మయాజాలంగా ఉంది,
విడిపోతున్న సంబంధాలు, చంపేస్తున్న ప్రేమలు.
ఒకరితో లవ్, మరొకరితో డేటింగ్, ఇంకొకరితో పెళ్లి.
మానవ సంబంధాలన్నీ అవసరాలు, ఆర్థిక శక్తుల్లో నలిగిపోతున్నాయి.
అందుకే నా బాల్యపు చిగురు మోడుబారి పోతుంది.
కొబ్బరి చెట్లమధ్య చందమామ కనుమరుగవుతున్నాడు.
ఆనాటి బోసినవ్వుల్లో ఏదో వెలితి
నాదో చిన్నకోరిక... చిన్న మనవి...
నా బాల్యంలోకి నన్ను తీసుకెళ్లి
నాకు మళ్లీ జీవించడాన్ని నేర్పించరూ.. ప్లీజ్..
నా ఆనవాళ్లను నాలో నింపరూ... ప్లీజ్...
నాక్కొద్దిగా స్వచ్ఛమైన మనిషి ఇచ్చే ఆప్యాయతని రుచి చూపించరూ...
ప్లీజ్... ప్లీజ్... ప్లీజ్...
మనిషిని వెతకడం కష్టంగా ఉంది.
అందులో మర్మంలోని ప్రేమను వెతకడం మరీ కష్టంగా ఉంది.
అందుకే నన్ను మళ్లీ బాల్యానికి తీసుకెళ్లండి.
లేదంటే... మళ్లీ జన్మించేలా వరం ఇవ్వండి..
చంపేసి అయినా ఫర్వాలేదు.
ఒక్కసారి జీవించడానికి ఎన్ని జన్మలైనా ఎత్తాలి కదా.

- డా. ఎ.రవీంద్రబాబు