Facebook Twitter
రాలిపోయిన సాహితీ ధ్రువతార ద్వివేదుల విశాలాక్షి

 

రాలిపోయిన సాహితీ ధ్రువతార ద్వివేదుల విశాలాక్షి

 



తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి 85 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించి కన్నుమూశారు. 1926 ఆగస్టు 15వ తేదీన విజయనగరంలో జన్మించిన ఆమె తన తుదిశ్వాసను 2014 నవంబర్ 07వ తేదీన విశాఖపట్టణంలో మరణించారు. జననానికి - మరణానికి మధ్య వున్న సుదీర్ఘ కాలంలో ఆమె చేసిన సాహితీ వ్యవసాయం ఎంతోమంది పాఠకుల మనసులను నింపింది.  తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి.. అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించారు. ద్వివేదుల విశాలాక్షి సాహితీ ప్రస్థానం 1965లో.. ‘వైకుంఠపాళి’ నవలా రచనతో ప్రారంభమైంది. ఆ పయనం 1995లో రాసిన ‘ఎంత దూరమీ పయనం’ వరకూ కొనసాగింది.  వైకుంపాళి నవల ఆంధ్రప్రభ నవలలపోటీలో ప్రథమబహుమతి పొంది పాఠకులదృష్టినాకట్టుకుని వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ద్వివేదుల విశాలాక్షి ఏదో ఒక ప్రత్యేక శైలికే కట్టుబడిపోకుండా రకరకాల శైలులతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అయితే ఆమె రాసిన అనేక కథలు ఆమె జన్మస్థలమైన విజయనగరం నుడికారంతో రాశారు.

విశాలాక్షి ఆమె కథలకు కథావస్తువులను సామాజిక సమస్యల నుంచి తీసుకున్నారు. అయితే ఆ సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను మాత్రం తన కథల్లో చాలా కొత్తగా చూపించారు. ద్వివేదుల విశాలాక్షిమొత్తం 13 నవలలు రాశారు. విశాలాక్షి రచించిన ‘వారధి’ నవలను.. ‘రెండు కుటుంబాల కథ’ పేరుతో 1969లో ఫీచర్‌ ఫిల్మ్‌గా నిర్మించగా, ‘వస్తాడే మా బావ’ చలన చిత్రానికి ఆమె మాటలు రాశారు. ఆమె రాసినక కథలతో ఎనిమిది సంపుటాలు వెలువడ్డాయి. విశాలాక్షి రచించిన కొన్ని నవలలను కన్నడ, హిందీ భాషలలోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు (1982), రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డీలిట్‌ ప్రదానం చేసింది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌(ఢిల్లీ) వారు.. ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు. అనేక సాహితీ ప్రక్రియలలో తన ప్రతిభను చాటిన ద్వివేదుల విశాలాక్షి కన్నుమూతతో ఒక తెలుగు సాహితీ దిగ్గజం తెలుగువారికి దూరమైంది. ఆమె లేని లోటు ఆమె సాహిత్యం తీరుస్తుంది.