Facebook Twitter
అన్నపూర్ణ

అన్నపూర్ణ
                              
                

- అక్కిరాజు ఉమాకాన్తమ్.

 


         అక్కిరాజు ఉమాకాన్తమ్ మొదటితరం కథారచయిత. పండితుడు. విమర్శకుడు. చాలావరకు స్వయంకృషితో విద్యను అభ్యసించిన జ్ఞానవంతుడు. సంస్కృతంలో నిష్ణాతుడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా కూడా పనిచేశాడు. ఆరోజుల్లో వెలువడే త్రిలింగ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ఎన్నో సాహిత్య రత్నాలను మనకు అందించాడు. పతంజలి మహాభాష్యానికి అనువాదం కూడా చేశాడు. వీరు రాసిన నేటికాలపు కవిత్వం ఆకాలంలో పెనుతుపాను సృష్టించింది. వీరి మొదటి కథ అన్నపూర్ణ. 1918లో వచ్చింది. వీరి అభ్యుదయ భావాలకు, సంఘసంస్కరణ దృష్టికి నిదర్శనం. ఆనాటి సాంఘిక దురాచారమైన బాల్యవివాహాలను ఖండిస్తూ చేసిన రచన ఇది.
            అన్నపూర్ణ సుబ్బమ్మ, సూర్యనారాయణల కూతురు. చిన్నప్పుడే సుబ్రహ్మణ్యంతో పెళ్లవుతుంది. పుష్పావతి కాలేదని కాపురానికి పంపరు. కానీ సుబ్రహ్మణ్యం వాళ్లమ్మ రాజమ్మ పెద్దదై పోయిందని, కాపురానికి పంపమని సీతాపతి వచ్చి అన్నపూర్ణను కాపరానికి తీసుకెళ్తాడు. మీ అక్క కాపురానికి వెళ్తుంది రమ్మని అన్నపూర్ణ అన్న నరసింహానికి లేఖ రాస్తాడు తండ్రి సూర్యనారాణ... చిన్న వయసులోనే కాపురానికి పంపడం ఇష్టం లేని నరసింహం... అన్నపూర్ణ ప్రకాశమానమైన భవిష్యత్తును కాలమునకు వదలి అథఃప్రదేశమున బడిపోవుచుండగా చూచి సంతోషించుటకు రాను అని లేఖ రాస్తాడు. కానీ చివరకు తండ్రే రావడంతో కార్యానికి వస్తాడు.
          సుబ్రహ్మణ్యం చేయి చూపించి జాతకం చెప్పించుకుంటే అతనికి రెండు పెళ్లిళ్లని, మొదటి భార్యకు సంతానం లేదని చెప్తారు. అది అతని మనసులో గాఢంగా ముద్రించబడుతుంది. అన్నపూర్ణ  చిన్నవయసులోనే గర్భవతి అవుతుంది. అతికష్టం మీద ఆడపిల్లని కంటుంది. కానీ పురిటిలోనే ఆ బిడ్డ చనిపోతుంది. తర్వాత మగపిల్లవాడు పుట్టినా ఫలితం ఉండదు. మూడో కానుపుకు పిల్లాడు పుడతాడు. కానీ పాలు ఇవ్వడానికి అన్నపూర్ణ దగ్గర ఉండవు. వేరే స్త్రీలచే పాలు ఇప్పిస్తారు. ఆ బిడ్డ ఆరోగ్యమూ సరీగా ఉండదు. కొన్ని రోజులుండి చనిపోతాడు. చిన్న వయసులోనే ముగ్గురు పిల్లల్ని కన్న అన్నపూర్ణ ఆరోగ్యమూ చెడిపోతుంది. పైగా ఒక్కబిడ్డ అయినా బతకనందున మనసులో బాధ. సోది చెప్పించడం, మంత్రగాడ్ని పిలిచి రక్షరేకు కట్టించడం లాంటి మూఢనమ్మకాలను నమ్మి వైద్యం చేయిస్తారు. దాంతో కాళ్లు పట్టుకొని పోయి లేవలేక పోతుంది.
          సుబ్రహ్మణ్యానికి ఇంకో సంబంధం చూడ్డానికి రాజమ్మ, సీతాపతి ప్రయత్నాలు చేస్తారు. దాంతో అన్నపూర్ణ మనసు పరిపరి విధాలా పోతుంది. చివరకు కాళ్లకు వైద్యం చేయిస్తుండగా చనిపోతుంది. తండ్రి సూర్యనారాయణ కొడుకు రాసిన ఉత్తరం చూసుకొని బాధపడతాడు. మనో వ్యాధికి లోనవుతాడు. అమ్మాయి అమ్మాయి అని అరుస్తూ అతనూ మరణిస్తాడు. దాంతో సుబ్బమ్మ మనసు చెడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
        ఇలా కథ విషాదాంతంగా ముగుస్తుంది. బాల్యవివాహాల వల్ల ఎలాంటి దైన్య పరిస్థితులు ఏర్పడతున్నాయో కళ్లకు కడుతుంది అన్నపూర్ణ కథ. కథ గ్రాంథిక భాషలో రాసినా పాఠకుల మదికి ఇబ్బందిపెట్టే పదజాలం కనపడదు. అన్నపూర్ణను కాపురానికి తీసుకెళ్లే సన్నివేశంలో చర్చతో ప్రారంభమైన కథ, ఆమె తల్లి చావుతో ముగుస్తుంది. అందుకే కథ కార్య కారణ సంబంధంతో సాగిందని చెప్పాలి. మధ్యమధ్యలో సంభాషణలు నాటకంలో వలే కనిపిస్తాయి. వర్ణనలు గ్రాంథిక సొగసుతో కూడిన అలంకారాలు. ఆనాటి సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాలు, నాటు వైద్యాలు, ఛాందస ఆచారాలు అన్నిటిని విమర్శకు పెడుతుంది ఈ కథ. రచయత ఉమాకాన్తమ్ ఎక్కడా కథలో ప్రవేసించి సందేశాలు లాంటివి ఇవ్వడు. తను చెప్పే విషయాలను సన్నివేశాలు, సంఘటనలు, పాత్రల ద్వారా చెప్పడం ఈ కథలోని మరో విశేషం. ఒకప్పటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కథ తప్పక చదవదగింది.        
        
                              
                  

  డా.ఎ. రవీంద్రబాబు.