Facebook Twitter
పులికంటి కృష్ణారెడ్డి

   పులికంటి కృష్ణారెడ్డి

 

                     

     పులికంటి కృష్ణారెడ్డి కథకడు, రంగస్థల నటులు, బుర్రకథ కళాకారుడు, కవి, పత్రికా సంపాదకుడు... ఇలా విభిన్నమైన రీతుల్లో సాహితీసేవ చేసిన ప్రజ్ఞావంతుడు. రాయలసీమ భాషను, అక్కడి ప్రజల దైనందిన జీవితాలను తొలినాళ్లలో గ్రంథస్తం చేసిన వారిలో కృష్ణారెడ్డి ఒకరు. రాయలసీమ భాషకు కావ్యగౌరవం కల్పించిన మహానుభావుడు అని అక్కడి కవులు, విమర్శకులు ప్రశంసిస్తారు. వచనాన్ని, పద్యాన్ని, జానపద కథారీతుల్ని అలవోకగా రాయగల సాహితీవేత్త పులికంటి కృష్ణారెడ్డి.

 

            పులికంటి కృష్ణారెడ్డి జులై 30, 1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని జిక్కిదోన గ్రామంలో పుట్టారు. వీరిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ కూడా పూర్తికాక ముందే భారతీయ రైల్వేలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. సుమారు 13 ఏళ్లపాటు రైల్వేలోనే ఉద్యోగాన్ని చేశాడు. కానీ నాటకాలపై మోజు, సాహిత్యం పై మక్కువతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తిరుపతిలో కాఫీపొడి వ్యాపారం చేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. నిత్యం రచనా వ్యాసంగంలో జీవించాడు. కామధేను పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం చేశాడు.
            వీరు సుమారు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు రాశారు. అంతేకాదు 100కు పైగా బుర్రకథలు, జానపద బాణీలో అమ్మి పదాలు, లలితగీతాలు, పద్య కావ్యాలు కూడా రాశారు. వీరి మొదటి కథ గూడుకోసం గువ్వలు కథను 1961లో వెలువడింది. అరచేతిలో గీత, తీయలేని కలుపు, మరుపురాని మా ఊరు లాంటి ఎన్నో గొప్ప కథలు అందించారు. కృష్ణారెడ్డి కథలు-
          గూడుకోసం గువ్వలు
          పులికంటి కథలు
          పులికంటి దళితకథలు
          పులికంటి కథావాహిని
          కోటిగాడు స్వతంత్రుడు అనే సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
          వీటిలో 14 ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి.
          ఇవే కాకుండా మొక్కితే దేవుడు అనే ఛందోబద్ద పద్య కావ్యం, 1958లో రచించిన ఆదర్శం నాటకం వీరికి మంచి పేరుతెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం 100కుపైగా బుర్రకథలు రాశారు. వీటిలో వయోజన విద్య, సారాం, వనమహోత్సవాలు, కుటుంబనియంత్రన వంటి ఎన్నో సామాజికాంశలే మనకు కనిపిస్తాయి.
         కృష్ణారెడ్డి బాశాలి పాత్ర ద్వారా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో భార్య పాత్ర ఎంతో ఉదాత్తంగా ఉంటుందో వివరించారు. దళితులు సామాన్య జీవన స్రవంతికి దూరంగా ఉన్నారని బాధపడేవారు. వారిని అక్కున చేర్చుకునే విధంగా, వారిమనోభావాలతో కథలు రశారు. కోటిగాడు స్వతంత్రుడు, పులికంటి కథలు ఇలాంటివే... రాయలసీమ భాషలో గోయిందా గోయిందా అనే పుస్తకాన్ని కూడా రచించారు.
           కృష్ణారెడ్డి కథ రాసినా, గేయం రాసినా, బుర్రకథ రాసినా పులికంటి ముద్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈయన రచనల్లో ప్రధానంగా రాయలసీమ ప్రజల వ్యధా జీవితం ఉంటుంది. వారి జీవిద్భాష ఉంటుంది. వీరి అమ్మిపదాలు నండూరి ఎంకి పాటల వలె ప్రచారం పొందాయి. ఆంధ్రప్రభలో సంవత్సరం పాటు నాలుక్కాళ్ల మండపం కాలం నిర్వహించారు. ఇది తిరుపతి పరిసర ప్రాంతాల జీవితాలను కళ్లకుకడుతుంది. ముఖ్యంగా రైతుసమస్యలు, నీటి ఎద్దడి, ఓట్లు, రాజకీయాలు... ఇలా అన్ని సమస్యలు వీరి రచనల్లో కనిపిస్తాయి.  కృష్ణారెడ్డి తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి, వాటినే రచనల్లో చెప్పేవారు. అందుకే ఇవి తాత్విక చింతన, సామాజిక స్పృహ జమిలిగా కలిసిన చారిత్రక పురోగతులు. కృష్ణారెడ్డి రచనలు ఎక్కువభాగం ఆకాశవాణి, టీవీలలో ప్రసారం అయ్యాయి.
          వీరు రచనలు చేయడమే కాకుండా కొన్ని ఉన్నత పదవులు కూడా నిర్వహించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్ కమిటీ సభ్యులుగా, సలహాదారుగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫెర్ ఫామింగ్ గా కూడా పనిచేశారు. వీరికి ఎన్నో పురస్కారాలు, బహుమతులు వచ్చాయి. అగ్గిపుల్ల నవలకు చక్రపాణి అవార్డు వచ్చింది. నటులుగా ఎన్నో సత్కారాలు పొందారు. ఈయన గొంతెత్తి పాడితే వినసొంపుగా ఉండేది. యువకళావాహిని వారి గోపీచంద్ అవార్డు, ఎస్వీయు గౌరవ డాక్టరేటు ఇచ్చాయి. ఇంకా జానపదకోకిల, ధర్మనిధి పురస్కారాలు వంటివి ఎన్నో వచ్చాయి. వీరి పేరుమీద పులికంటి సాహితీ సత్కృతిని స్థాపించి ఆయన పేరుమీద ప్రతి ఏడాది సాహిత్య, కళారంగాలలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తున్నారు.
          రాయలసీమ చిన్నోణ్ణి
          రాళ్లమద్దె బతికే వాణ్ణి

          రాగాలే ఎరగక పోయినా

          అనురాగానికి అందేవాణ్ణి
 
                                       అని చాటిన సీమ సాహితీ రత్నం పులికంటి కృష్ణారెడ్డి.
          ఇలా విశేషమైన సాహితీ కృషి చేసిన పులికంటి కృష్ణారెడ్డి నవంబర్ 19, 2007లో మరమణించారు. కానీ ఆయన జీవితం, రచనలు ఎందరికో మార్గదర్శకాలు.
           చిత్తూరు నుంచి చికాగోదాకా సాహిత్య రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టారు, ఐదు దశాబ్దాలు మాండలిక పరిభాషలో జనజీవనాన్ని కళ్లకు కట్టారు. సీమ జీవితాల శిథిల ఘోషను తన సాహిత్యంలో ఏర్చి కూర్చారు. అందుకే పులికంటి కృష్ణారెడ్డి తెలుగువారి కథా రచయితల్లో మేటి.
 
- డా. ఎ.రవీంద్రబాబు