Facebook Twitter
మాజిక్ రియలిజమ్ కథా మాంత్రికుడు

మాజిక్ రియలిజమ్ కథా మాంత్రికుడు

మునిపల్లె రాజు
                                                                                                           
  - డా. ఎ. రవీంద్రబాబు

 


తెలుగు కథకు శిల్పంతో కూడిన కొత్తదనాన్ని అద్దిన రచయిత మునిపల్లెరాజు. సమకాలీన సమాజ సంక్షోభాన్ని మాజిక్ రియలిజం ద్వారా కథల్లో చెప్పిన విశిష్ట కథకుడు. ప్రతి కథలోనూ వాక్యాల్ని లయ బద్దంగా రాసిన ప్రతిభాశాలి. సుమారు 64 పైగా కథలు రాసినా తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వైవిధ్యమైన కథాశిల్పి.
       మునిపల్లె రాజు 1925 మార్చి 16న గుంటూరు జిల్లాలో జిన్మించారు. ఎమ్.ఇ.ఎస్.లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. వీరి పూర్తి పేరు మునిపల్లె బక్కరాజు. మునిపల్లె రాజు, మునీంద్ర పేర్లతో కథలు, కవిత్వం రాశారు. వీరి కథలు 'మునిపల్లె రాజు కథలు' (16), 'పుష్పాలు - ప్రేమికులు - పశువులు' (20), 'దివో స్వప్నాలతో ముఖాముఖి' (14), 'అస్తిత్వనదం ఆవలి తీరాన' (15) పేర్లతో సంపుటాలుగా వచ్చాయి. వీరు రాసిన 'పూజారి' నవల 'పూజాఫలం' చలన చిత్రంగా రూపొందింది. 'జర్నలిజంలో సృజన రాగాలు', 'అలసి పోయిన వారి అరణ్యకాలు', 'వేరొక ఆకాశం - వేరెన్నో నక్షత్రాలు'... లాంటి పుస్తకాలలో వ్యాసాలు, కవిత్వాన్ని ముద్రించారు.
         మునిపల్లె రాజు కథలు, మాజిక్ రియలిజంతో వాస్తవానికి తీసిన నకళ్లుగా కాక నిజాలను పాఠకులకు బోధిస్తాయి. అసలు మాజిక్ రియలిజం అంటే .... పౌరాణిక, చారిత్రక, జానపద గాథలతో శిల్పాన్ని రూపొందించి, కథలో ప్రస్తుత సమాజంలోని సంక్షోభాన్ని చెప్పడం. 1953లో 'వారాల పిల్లవాడు' పేరుతో మొదటి కథను ప్రారంభించిన మునిపల్లె రాజు మొదట బాల్యపు గుర్తులను, జీవితపు ఆలోచనా ధోరణులను కథల్లో అన్వేషించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అస్తిత్వ సరిహద్దుల్ని చెరిపేసి నేటి మానవ నాగరికత స్వభావాన్ని, సంక్షోభాన్ని ఇతివృత్తాలుగా స్వీకరించారు.
    'బిచ్చగాళ్ల జెండా', 'అరణ్యంలో మానవ యంత్రం' కథలు వర్తమాన మానవుల భవిష్యత్ ను అంచనా వేస్తాయి. 'నైశారణ్యంలో సత్రయాగం' కథ భారతీయ తాత్విక సిద్ధాంతాలకు అక్షర రూపంగా కనిపిస్తుంది. 'వీర కుంకమ' మరో అద్భుతమైన కథ. మునిపల్లె రాజు కథలు కథా పరిధులు దాటకుండానే వర్తమాన కాలం నుంచి భూత, భవిష్యత్ కాలల్లోకి ప్రయాణిస్తాయి. అయినా పాఠకుడికి ఎక్కడా కథలోని అంశంపై సంశయం ఏర్పడదు.
  పాశ్చాత్య కథకు భారతీయ ఆత్మ జోడించడం వీరి కథల్లోని ప్రత్యేకత. నిజంగా చెప్పాలంటే ఈ యుగపు అస్తిత్వవాద తాత్విక ధోరణికి చెందిన మాజిక్ రియలిజం కథల వీరివి. మునిపల్లె రాజు యూరోపియన్ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఆధునిక కథా నిర్మాణ జాడల్ని వెతికి పట్టుకున్నారు. తనకు తానుగా వాటి నుంచి సరికొత్తగా, తనదైన కథా నిర్మాణ పద్ధతిని నిర్మించుకున్నారు. అందుకే వీరి కథలు నేడు శరవేగంగా మారుతున్న మానవ జీవన పరిస్థితుల వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోని మనకు తెలియని విషయాల గురించి, మనలో ఉన్న మనకు తెలియని భిన్న పార్శ్వాల గురించి, మనం పట్టించుకోని వైవిధ్యాలు, సంవేదనల గురించి మనకు వివరిస్తాయి.
 మునిపల్లె రాజు కథలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లోని అన్ని ప్రముఖ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, రావిశాస్త్రి జీవిత సాఫల్య సాహితీ పురస్కారం, గోపిచంద్ అవార్డు లభించాయిు. అంతేకాదు 2006లో వీరి కథా సంపుటి 'అస్తిత్వనదం ఆవల తీరాన' కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నాలుగు విశ్వవిద్యాలయాలలో వీరి కథలపై పరిశోధనలూ జరిగాయి.
            నేటి సంక్షుభిత మానవుడి జీవిత రహస్యాలను, మనలో అజ్ఞాతంలో ఉన్న ఛేతనను, ఒంటరి తనపు వేదనను, యంత్రనగరి బీభత్సాన్ని తెలుసుకోవాలంటే మునిపల్లె రాజు కథా పుటలు తెరవాల్సిందే... ....