Facebook Twitter
ఆచార్య కొలకలూరి ఇనాక్

  ఆచార్య కొలకలూరి ఇనాక్

- డా. ఎ. రవీంద్రబాబు.

అన్నీ మనం చూస్తున్న జీవితాలే... ఎప్పుడో ఒకప్పుడు మన మనసుల్లో కలిగిన భావాలే... కానీ వాటిని అందరూ పట్టించుకోరు. సమాజంలోని అసమానతలే... అణచివేతలే... కానీ మనం దూరంగా ఉంటాం. కానీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అలాకాదు. వాటి లోతుపాతుల్ని వాస్తవరీతిలో వ్యక్తీకరిస్తూ కథలు రాస్తాడు. ఆ రచనల్లో ఆయన వ్యక్తిగత జీవితపు వాసనలు ఉంటాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసినా ఆయన కథలు మాత్రం కింది కులాల ప్రజల అష్టకష్టాలను అక్షరాలుగా అందిస్తాయి.
       గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939లో ఇనాక్ జన్మించాడు. క్రైస్తవమత బోధకులు "హానోకు" అని పేరుపెట్టారు. కానీ ఆపేరు అందరి నోళ్లల్లో నాని "ఇనాక్" గా మారింది. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ట్రైన్ వెళ్లిపోతే... ఆ పట్టాలపై పరుగెత్తుకుంటూ వెళ్లి ఆరోతరగతికి ప్రవేశ పరీక్షరాసి వచ్చాడు. అదీ ఆ పసి వయసులో ఆయనకు విద్యపై ఉన్న మమకారం. జీవితంలో ఎదగాలన్న ఆకాంక్ష. ఆ పట్టుదలే ఇనాక్ కు డాక్టరేట్ ఇప్పించింది. అధ్యాపకుడిని చేసింది. ఉపకులపతి పదవి పొందేలా చేసింది.
      వృత్తిరీత్యా ఎంత ఎదిగినా, వారి జీవితం తాలూకు అనుభవాలు, అతనిలోని సృజనశక్తి ఇనాక్ ను రచయితను చేశాయి. 1955 నుండి  నేటికీ తన రచనా యాత్రను సాగిస్తూనే ఉన్నారు. జాషువా, బోయిభీమన్న తర్వాత సమున్నతస్థానం ఇవ్వగలిగిన దళిత రచయిత ఇనాక్. కులం పనాదుల్ని ప్రశ్నిస్తూ, దళితుల, దళితస్త్రీల చైతన్యాన్ని చిత్రిస్తూ 1980లో వీరు రాసిన "ఊరబావి" కథలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. "సూర్యుడు తలెత్తాడు", "అస్పృశ్యగంగ", "కాకి" లాంటి కథాసంపుటాలు నేటికీ కొనసాగుతున్న అస్పృశ్యతలను భిన్నకోణాలలో తెలియజేస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనల్ని నిలదీస్తాయి. సమాజాన్ని ప్రశ్నిస్తాయి. కథలే కాదు "సర్కారుగడ్డి" లాంటి నవలలు రాయలసీమలోని కరువును, అక్కడి రైతులు దుస్థితిని కళ్లకుకడతాయి. ఇనాక్ రాసిన "సమత" లాంటి అనేక నవలలు కులసమస్యకు కులాంతర వివాహరూపంలో పరిష్కారాన్ని చూపాయి. వీరి "మునివాహనుడు", "కీ", "అభ్యుదయం", "దృష్టి" వంటి నాటకాలు, నాటికలు కూడా ఇదే సమస్యను, వాస్తవ సంఘటనల రూపంలో వ్యక్తపరుస్తాయి.
     ఇనాక్ పరిశోధకుడిగా "ఆధునిక విమర్శసూత్రం" లాంటి ఎన్నో విలువైన విమర్శాగ్రంథాలు రాశారు. వీరి రచనలు ఆంగ్లం, హిందీ, కన్నడం--- అనేక భాషల్లోకీ అనువాదాలయ్యాయి. ఇనాక్ రచనాశైలి చాలా సున్నితంగా ఉంటూనే కటువుగా సాగుతుంది. చిన్నచిన్న వాక్యాలు సూటిగా అనితర సాధ్యమైన భావార్థాన్ని ఇస్తాయి. శిల్పపరంగా ఇనాక్ కథల్లో ఎన్నో అద్భుతైన ప్రయోగాలు చేశారు. ఊరబావి కథలో ప్రధాన పాత్రైన స్త్రీకి పేరు ఉండదు. కథలో ఎద్దుదట్టాన్ని తాడుతో బావిలోంచి తీయడానికి వేసిన ముడులు ఎవరు వేశారోే చెప్పడు. కానీ ఆ ముడులను మాత్రం అద్భుతంగా వర్ణిస్తాడు.  కానీ కథ చదివిన పాఠకులకు మాత్రం నర్మగర్భితంగా బోధపడేలా చేస్తాడు. ఇలాంటి శిల్పరహస్యాలు వారి కథలు చదువుతుంటే ఎన్నో కనిపిస్తాయి.
       వీరి "అనాథ" నవల 1961లో ఆంధ్రప్రభ పోటీలో బహుమతి పొందింది. "మునివాహనుడు" నాటకానికి 1988లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నాటక బహుమతి లభించాయి. "తలలేనోడు", "మునివాహనుడు" రచనలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా కొంతకాలం ఉన్నాయి.
     మారుతున్న సమాజంతోపాటు తన ఆలోచనాసరళినీ మార్చుకుంటూ ముందు తరానికి ఆదర్శంగా నిలుస్తున్న రచయిత ఇనాక్. అందుకే ఆయన రచనలు సజీవ శిల్పాలు. అందుకే వీరి రచనలపై సదస్సులు, సమావేశాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 
   వీరికీ ఎన్నో అరుదైన పురస్కారాలూ దక్కాయి. వాటిలో కొన్ని- 1994లో జాతీయవ్యక్తిగా, 1998లో ఉత్తమ విద్యావేత్త హోదా, 1999లో జాతీయకవిగా గుర్తింపూ పొందారు. ఈనెల 18న గుమ్మిమడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ "స్ఫూర్తి" అవార్డును ఇనాక్ అందుకున్నారు. అయినా నేటికీ తన రచనా వ్యాసంగాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొన్ని కథలకు నేపథ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.