Facebook Twitter
ఆమె విముక్తి

 ఆమె విముక్తి

 

- డా.సి. భవానీదేవి

కిటికీలోంచి మసక వెలుగు గదిలోకి ప్రసరించింది. కలత నిద్రలో ఉన్న అనసూయకి మళ్ళీ మెలకువ వచ్చింది.

    అలవాటుగా గోడ మీద దేవుడి పటానికి దండం పెట్టుకుంది. మునుపటిలా దేవుడు స్పష్టంగా కనపడటం లేదు. అలవాటుగానే గడియారం చూసింది. టైము కూడా తెలీటం లేదు.

    స్టూలు మీది కళ్ళజోడు తీసి పెట్టుకుని మళ్ళీ టైము చూసింది. ఐదున్నరయింది. గంటలు కొట్టే గడియారం అయితే చూడకుండానే తెలుస్తుందని కొన్నది. కానీ గంటల వల్ల నిద్రాభంగం అని సైలెంట్ చేసేశారు. ఇంకాసేపు పడుకోవచ్చు. అయినా పడుకుంటే.. కందిరీగల గుంపులాంటి ఆలోచనల్ని తప్పించుకోవటం కష్టం. లేచి ఏదో ఒక పని చేయాలి. ఇంతకాలం చేసిందదేగా! మనసు నోరు నొక్కి పెట్టటానికి ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుని బిజీగా జీవితాన్ని నడిపింది. ఇప్పుడింక శరీరం సహకరించలేనని మొరాయిస్తోంది. విశ్రాంతిని కోరుతోంది. కానీ మనసు దాడిని తట్టుకోవటం కష్టంగా ఉంది.

    రాత్రి పొద్దుపోయే దాకా గుండెల్లో సన్నని నెప్పి. కలతనిద్ర. మళ్ళీ తెల్లారింది... మెల్లగా లేచి బాత్ రూంకి పోవాలని ప్రయత్నించింది. కాళ్ళు తడబడుతున్నై. బెడ్ పక్కనున్న చేతి కర్ర ఆధారంగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చి పడుకుంది. మళ్ళీ ఆలోచనల దాడి.

    కడుపులో మంట. మందుల వల్లేమో! ఏదైనా తింటే తగ్గుతుందేమో! ఇంత పొద్దున్నే తనకోసం ఎవరు ఏం చేస్తారు? ఎందుకు చేయకూడదు? మనసు ప్రశ్నస్తోంది.

    తను మాత్రం వాళ్ళకోసం చీకటి పొద్దుల్లో లేచి ఆదరాబాదరాగా టిఫిన్లు వంట, బాక్సులు ,స్కూలు బ్యాగులు, బూట్లు, సాక్స్...మధ్యలో "అనూ! నా టవల్!' అంటూ శ్రీపతి కేకలు.  పిల్లలు అరుపులు, ఏడుపులు... అసలు అన్ని పన్లు ఎలా చేయగలిగిందో! ఇప్పుడు ఆశ్చర్యంగా అన్పిస్తుంది.

    తనలో అంతశక్తి ఉండేదంటే నమ్మలేకపోతోంది. మరి ఆ వయసులో ఉన్న తన తర్వాతి తరం అలా లేదే? వాళ్ళకి అవసరం లేదా? తమ ఆరోగ్యాల పట్ల ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నారా!? తనలాగా శ్రమించి ఆరోగ్యం పాడు చేసుకునేవాళ్ళు ఈ తరంలో కన్పించరు. వాళ్ళది స్వార్ధమా? జాగ్రత్తా? ఒకవేళ స్వార్ధమైతే అది మంచి స్వార్ధమే! మరి తనకెందుకు లేకపోయింది?

    పెద్దాడు, కోడలు ఎనిమిదింటికి కానీ గదిలోంచి బయటికి రారు. ఉద్యోగం చేసే కోడలు కదా! మరి తను కూడా ఉద్యోగం చేసిందిగా! ఏం ఉద్యోగంలే! టీచర్ గా అత్తెసరు జీతం. సాఫ్ట్ వేర్ కోడల్ని పొద్దున్నే లేవమని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. ఇప్పటికీ బాగా గుర్తు. పెద్దాడ్ని కడుపుతో ఉన్నప్పుడు ఓరోజు నలతగా ఉండి ఎండెక్కి నిద్రలేచిన తనని శ్రీపతి ఎన్ని మాటలన్నాడు? జన్మంతా గుర్తుండేలా! ఎంతయినా ఇప్పటి ఉద్యోగినులకు భర్తల అండ ఓ పెద్ద రిలీఫ్.

    నిద్ర పట్టక పక్కకు తిరిగి పడుకుంది అనసూయ. మళ్ళీ ఏవేవో ఆలోచనలు.

    చిన్నాడు ఐ.ఎ.ఎస్. పరీక్షకు ప్రిపేరు అవుతున్నాడు, వాడేప్పుడు పడుకుంటాడో... ఎప్పుడు లేస్తాడో....? వాడికి పెళ్ళయితే వాడికీ ఆఫీసరైన భార్యే వస్తుంది. ఇంక ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతేముంటుంది. ఇలా అయితే ఈ ఇంటి బాధ్యత ఎవరిది...? తనెంత కాలం ఉంటుంది.

    ట్రింగ్..ట్రింగ్... కాలింగ్ బెల్ మోగుతుంటే శ్రీపతి లేస్తాడేమోనని కాసేపు చూసింది. శ్రీపతి కదల్లేదు. అతనూ తనకన్నా పెద్దవాడేగదా! ఏం ఓపిక ఉంటుంది. మొదట్నుంచీ ప్రతి పనీ తనే చేయటం అలవాటు చేసింది. అయినా విసుక్కుంటూనే ఉంటాడు.

    ఓసారి శ్రీపతికి పెద్ద జబ్బు చేసి సంవత్సరంపాటు మంచంలో ఉంటే అన్నీ తనే చేసింది. కానీ ఇప్పుడు కొంత అనారోగ్యంతో బాధపడే తనకి శ్రీపతి ఏమీ చేయలేకపోతున్నాడు. ఆడవాళ్ళు సేవ చేసినట్లు మగవాళ్ళెందుకు చేయరు. మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతోంది... త్పనిసరిగా లేచి చేతి కర్ర సాయంతో వెళ్ళి తలుపు తీసింది.

    ఎదురుగా పాలవాడు.. పాల ప్యాకెట్లు అందిస్తూ చేతికర్రకేసి సానుభూతిగా చూశాడు. మళ్ళీ అదే చూపు.... తను భరించలేని జాలి చూపు... ప్యాకెట్లు తీసుకుని తలుపేసింది.. మరీ అంత విసురుగా వేయకుండా ఉండాల్సింది.

    ఎంతైనా ఈ మధ్య తనకు చిరాకు, కోపం ఎక్కువయ్యాయని ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. శరీరం అనారోగ్యం పాలయితే మనసు ఆరోగ్యంగా ఎలా ఉంటుంది. ఎంత బాగాలేకపోయినా చిరునవ్వులు చిందిస్తూ శాంతంగా ఆడవాళ్ళు నటించాల్సిందేనా? పెళ్ళయింది మొదలు ఎన్నో బాధ్యతల్ని ఇటూ అటూ నెత్తిన వేసుకుంది. ఉద్యోగం, పిల్లలు, భర్త, ఇల్లు సంతోషంగా నిర్వర్తించింది. ఈ పక్షవాతం వచ్చి కాలు చచ్చుబడ్డప్పటి నుంచి మనసు నరకంగా మారిపోయింది. యాంత్రికంగా చేతులు పనిచేస్తున్నాయి!

    మిల్క్ బాయిలర్ వికృతంగా అరుస్తోంది. ఉలిక్కిపడి ఆపే లోపే శ్రీపతి ధుమధుమలాడుతూ లేచాడు.

    "నిన్నెవరు లేవమన్నారు" విసుక్కున్నాడు అలవాటుగా.

    మనసులో మరో ముల్లు బలంగా దిగింది.

    "నిద్రపట్టక లేచాను లెండి" తప్పు చేసినట్లు సంజాయిషీ స్వరంతో అంది.

    "నీకు ఎటూ నిద్ర పట్టదు. మమ్మల్ని నిద్రపోనీయవు. మరోసారి విసుక్కుంటూ బాత్ రూం కేసి నడిచాడు. ఈ విసుక్కోవటం అతనికి కొత్తకాదు. పెళ్ళయింది మొదలు అతని నోట ప్రేమ పూర్వకమైన మాట విని ఎదుగదు. ఎంత రుచిగా వంట చేసినా ఎంత మంచిపని చేసినా భార్యని మెచ్చుకోవటం అతనికి తెలీదు. కారణం తనకీ తెలీదు. పిల్లల్ని కూడా ఓసారైనా మెచ్చుకోవటం చూసి ఎరుగదు. వాళ్ళెంత ర్యాంక్ సాధించినా... బాగా సంతోషంగా ఉన్నట్లు కన్పించినా ఏదో ఒక మాట అని బాధ పెట్టందే ఉండలేడు శ్రీపతి. అతనికి సరదాలు లేవు, హాయిగా నవ్వలేడు. అలాగని విరాగి కాదు. డబ్బు వ్యామోహం ఎక్కువే!

    పెద్దాడు పుట్టినప్పుడు... ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళముందు కదుల్తుంది. ముటముటలాడుతూ హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళాడు. తొలిసారి తండ్రి అయిన సంతోషం ఏ కోశానా లేదు. ఆమె ఆరోగ్యం గురించి గానీ పిల్లాడి గురించిగానీ అడక్కపోగా పిల్లాడు పుట్టిన ఘడియ, నక్షత్రం బాగాలేదని శాంతి, హోమం, జపాల గురించి ఏకరువు పెట్టి నూనెలో మొహం చూడాలనీ, చాలా ఖర్చవుతుందనీ అనసూయ తల్లిదండ్రులు తమ వాళ్ళకి బారసాల్లో చేయాల్సిన మర్యాదల గురించి చెప్పి వెళ్ళిపోయాడు.

    అనసూయ చిన్నబుచ్చుకుంటే తల్లే ఓదార్చింది "కొందరంతేలేమ్మా! ప్రేమని ప్రకటించరు" అని.

    "ప్రకటించలేని ప్రేమెందుకు" అనుకుంది మొదటిసారిగా.

    ఆ తర్వాత క్రమంగా అతని పద్ధతి అలవాటవటానికి సెన్సిటివ్ నెస్ నోరు నొక్కేయక తప్పలేదు.

    "కాఫీ..." గ్లాసు స్టూలు మీద పెట్టి వెళ్ళాడు శ్రీపతి. పరధ్యానంగా ముట్టుకుంది. చురుక్కుమన్న చేతిని వెనక్కి తీసుకుంది.

    ఆ రోజు ఇంతే! పొరపాటున వేలు తెగింది. రక్తం కారుతుంటే ఆడపడుచు కంగారుపడిపోతోంది. శ్రీపతి చూశాడు "బాగా అయింది. అంత నిర్లక్ష్యం దేనికి" అంటూ నిరాసక్తంగా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి.

    వేలు తెగిన బాధ కన్నా అతని మాట, ప్రవర్తన తాలూకు గాయం, మచ్చ అలాగే ఉండిపోయాయి. తర్వాతి కాలంలో అంతకన్నా పెద్ద పెద్ద గాయాలు మచ్చలతో తన మనసు తనే గుర్తు పట్టలేనట్లు మారిపోయింది.

    "లోతైన బావిలో నీరు ఉంటుంది. కానీ ఎవరి దాహాన్ని తీర్చలేనప్పుడు దానికి సార్ధకత ఏముంది. అతని ప్రేమా అంతే" అనుకుంది తను.

    పిల్లల సరదాలు అవసరాలు అన్నీ తనే తీర్చింది, పెద్దాడికి పెళ్ళయ్యాక అమ్మతో అవసరం తీరినట్లే! వాడికి మీజిల్స్ వస్తే పదిహేను రోజులు మంచం పక్కనే పడుకుంది. వాడికి మాత్రం 'ఎలా ఉందని' అమ్మని పలకరించే తీరిక లేదు.

    "అమ్మా! రేపు ఫీజు కట్టాలి" చిన్నాడు పక్కలో కూర్చున్నాడు.

    'వీడికి అవసరం ఇంకా ఉంది' అనుకుంది.

    "ఎంత నాన్నా!" అడిగింది.

    "పదిహేను వందలు. పుస్తకాలకి ఇంకో వెయ్యి" గారంగా అడిగాడు. మూడు వేలు దిండు కింద నుంచి తీసివ్వగానే మాయం అయ్యాడు.

    స్కానింగ్ కోసం దాచినవి... వాడికన్నా ఎక్కువా!

    ఆ రోజుల్లో తల్లిదండ్రుల శక్తిని బట్టి చదువుకుంది. ఇప్పటి పిల్లలు తల్లిదండ్రుల శక్తి గురించి అనవసరం. ఎక్కడ్నుంచయినా సరే తెచ్చి వాళ్ళక్కావలసింది చదివించాలి అంతే..! ఈ మార్పు ఎందుకొచ్చిందో తనకి అర్ధం కావటంలేదు.



            * * *


    నగరంలోని నక్షత్రాల హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో స్పృహ ఉండీ లేని స్థితిలో అనసూయ.

    రోజులు... గంటలు... నిమిషాలు... మరో క్షణంలో ఏమో... అనే పరిస్థితి.  
   
    అనసూయ వళ్ళంతా నరకం.. ఇదే నరకం... పురాణాల్లో ఏమేమో చెప్తారు. ఇదే నిజం.. చచ్చిపోతే ఏమౌతుంది.. అంతా వస్తారు.. చూస్తారు.. అంత మంచిది ఇంత మంచిది... ఆనాడిట్లా... ఈనాడిట్లా... అంటారు. కొందరు నిజంగా.. కొందరు నంగి నంగిగా ఏడుస్తారు.. పిల్లలు ఏడుస్తారా? ఏడవక పోవచ్చు... మంచాన ఉన్న అమ్మకు చేయడం కష్టమే కదా! పోవటమే మంచిదని సర్దుకుంటారు, పాలవాడి జాలి చూపులు భరించక్కర్లేదు. 

    ఇంటికి ఎవరొచ్చినా తన నడక మీద వాళ్ళ జీవితాలు ఆధారపడినట్లు 'కాస్త నడుస్తున్నారా' అనే అవకాశం ఉండదు. రోజూ పూలు పూసే చెట్లు... కోడలు ఒళ్లొంచి నీళ్ళు పోస్తే అలాగే పూస్తాయి. తన అక్క చెల్లెళ్ళ రాకపోకలు తగ్గిపోవచ్చు. శ్రీపతి తద్దినాలంటూ విసుక్కుంటూ విసిగిస్తాడేమో! వద్దని చెప్పాలి. బతికుండగా తనపై లేని శ్రద్ధ శ్రద్ధలపై ఎందుకు? అదేదో జంధ్యాల సినిమాలాగా శ్రీపతికి విసుక్కోవటానికైనా తను కావాలేమో! కానీ తనకి మాత్రం అలా గోడమీద ఫోటోలోంచి కూడా ఇంకా శ్రీపతితో మాట్లాడాలని లేదు. అసలు మనిషికి బంధాలన్నీ ప్రాణాలు పోగానే పోతాయట. ఇంకెందుకు మరి. హాయిగా వెళ్ళిపోవచ్చు. నడవలేకపోయినా... అంత బాధలోనూ అనసూయకి నవ్వొచ్చింది.

    "అమ్మ నవ్వుతోంది" చిన్నాడి గొంతు అది. మళ్ళీ తనకి దిగులేస్తోంది. వీడి పెళ్ళి అయితే బాగుండేది. పోన్లే! లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. తన మీద ఆధారపడడు. తన మీద ఆధారపడే వాళ్ళుంటేనేనా ఆడవాళ్ళు బతకాలనుకునేది? తమకోసం తాము ఎందుకు బతకరు? ఆడవాళ్ళు అంతా ఇతరుల కోసమే ఎందుకు బతుకుతారు. చరమదశలో స్త్రీవాదం ఆలోచనలు... శ్రీపతికి తెలిస్తే అమ్మో!

    "ఇంక లాభం లేదండీ! రేస్పిరేషన్ కష్టంగా ఉంది... వెంటిలేటర్ మీదికి షిఫ్ట్ చేయాలి" డాక్టర్ విసుక్కుంటున్నాడు.

    ఇతనికీ విసుగ్గానే ఉంది. తనకంటే అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న ఆడవాళ్ళని భర్తలు ప్రేమగా గౌరవంగా చూస్తున్నారు. ఈ కుటుంబంకోసం ఇంత చేసినా ఎందుకింత నిరాదరణ. అనసూయకి దుఃఖం వచ్చింది. "ఆవిడ బాధపడ్తున్నారు" సిస్టర్ తన కన్నీళ్ళు తుడుస్తోంది.

    "ఈ అమ్మాయే నయం... తన కన్నీళ్ళని చివరి క్షణాల్లో తుడుస్తోంది" జీవితమంతా ఇటువంటి ఆప్తస్పర్శ కోసమే ఎదురుచూసింది.

    మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఎవరెవరో వస్తున్నారు. చూసి వెళ్తున్నారు. అనసూయకి మగతగా ఉంది. ఎవరో గుర్తు పట్టలేకపోతోంది.

    "సిస్టర్... క్విక్" డాక్టర్ స్వరంలో హడావుడి... అనసూయకి వెంటిలేటర్ పెట్టారు. ఇప్పుడు హాయిగా గాలి పీల్చుకోగల్గుతోంది. హమ్మయ్య! తను ఇంకా బతుకుతుందా? దేనికి.... ఇటువంటి జీవితానికి పొడిగింపు అవసరమా?! స్పృహ తెలిస్తే ఇవే ఆలోచనలు... దిగులు.

    "మా ట్రీట్ మెంట్ వల్ల యూజ్ లేదు. ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. కావలసిన వాళ్ళందరికీ కబురు చేయండి".

    డాక్టర్ గొంతువిని అనసూయ రిలీఫ్ గా ఫీలయ్యింది.

    బీప్... మంటూ శబ్దం. గోల చేసింది వెంటిలేటర్... డ్యూటి డాక్టర్ గాభరాగా వచ్చి చూశాడు.

    ఈలోగా అనసూయకి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

    భార్య పక్కనే ఉన్న శ్రీపతి కంగారుగా చూశాడు.  

    "వెంటిలేటర్ కి ఆక్సిజన్ పైప్ డిస్కనెక్ట్ అయింది" అంటూ రీసెట్ చేశారు డాక్టర్, సిస్టర్.

    అనసూయ మళ్ళీ కొంచెం కుదుటపడింది.

    "ఎన్నాళ్ళిలా డాక్టర్?" శ్రీపతి గొంతులో కొండంత దిగులు.

    "పేషెంట్ రెసిస్టన్స్... రెస్పాన్స్ ని బట్టి... ఎన్నాళ్ళనేది ఇప్పుడే చెప్పలేం..." అంటూ ముందుకి నడిచాడు డాక్టర్.

    ఆ రాత్రి చీకటి నిర్దయలా వ్యాపించింది.

    ఒళ్ళంతా పైపులు, ట్యూబులతో ఉన్న భార్య కేసి పరిశీలనగా చూశాడు శ్రీపతి. సెడేషన్ లో ఉన్న అనసూయ మత్తులో ఉంది.

    "సారీ అనూ! నీ బాధ చూళ్ళేకపోతున్నాను. నేను నీకేమీ చేయలేకపోయాను. కనీసం త్వరంగా విముక్తి కల్గిస్తాను" గొణుక్కున్నాడు శ్రీపతి.

    వెంటిలేటర్ కి ఉన్న కొన్ని కనెక్షన్లు తీసేసి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న భర్తకేసి చూడలేని అనసూయ మొహంలో చెక్కు చెదరని ప్రశాంతత.. నిశ్చల దీపంలా వెలుగుతోంది...!