Facebook Twitter
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం

 అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం
                                                                                                                                 
                        

   -కనకదుర్

ఎందుకు? ఎందుకూ? ఓరి భగవంతుడా నాకెందుకింత పెద్ద శిక్ష వేశావు? నేనేం తప్పు చేసాను?  నేనూ నాన్న లాగే నాకు చేతనయినంత వరకు నాన్నంత కాక పోయినా నాకు తోచినంత ఎవరికైనా సాయం కావాలంటే చేయడం, ఏ పని చేసినా కష్టపడి చేయడం, నిజాయితీగా వుండడానికే ప్రయత్నిస్తాను కదా!  అలాంటిది నాన్న అందనంత దూరాలకు వెళ్ళిపోతే నాకు ఆఖరు చూపు కూడా దక్కకుండా ఎందుకు చేసారు అందరు కలిసి?మోకాళ్ళల్లో తల పెట్టుకుని విలపిస్తుంది సుప్రజ.  అప్పుడే 13రోజులయిపోయాయి.  భర్త శ్రీమంత్ వచ్చి పక్కన కూర్చున్నాడు.  "చిన్నా! నీ బాధని నేను అర్ధం చేసుకోగలను, కానీ చూడు నువ్వు నాన్న కోసం ఈ రోజు ఇక్కడ మన ఆత్మీయులందరినీ పిలిచి ముఖ్యంగా నాన్న గురించి అందరితో నీ జ్ఞాపకాలు, ఆయన మంచితనం, ఆయన ధైర్యం, ఆయన ఎంత మందికి సాయం చేసారు చెబితే అందరూ ఎంత సంతోషించారు.  అయినా నాన్న ఎక్కడికి వెళ్ళారు రా? మన మనసులో ముఖ్యంగా నీ హృదయంలో ఎప్పటికీ వుంటారు.  ఇంక ఎక్కువ బాధ పడకూడదు.  నాన్న మనల్ని ఎప్పుడూ చూస్తూనే వుంటారు.  నువ్వు బాధ పడితే ఆయన ఆత్మకు కష్టం కల్గుతుందిరా."  అన్నాడు సుప్రజ కళ్ళు తుడుస్తూ.  మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది సుప్రజ అలిసి పోయినట్టుగా వుంటే బట్టలు కూడా మార్చుకోకుండా కూతురు దృశ్య పక్కనే పడుకుంది. పిల్లలు పుట్తినప్పటినుండి ముఖ్యంగా ఎక్కువగా తను పిల్లలను చూసి మురిసిపోయినపుడు, వారిని ముద్దు చేస్తున్నపుడు,  తనతల్లీ తండ్రి తను పుట్టినపుడు కూడా చేతుల్లో పసిపాపను, తనని చూసుకుని తనలాగే మురిసిపోయుంటారే, తన ముద్దు ముచ్చట్లు చూసి ఎంతగా ఆనందించుంటారో కదా అనిపించేది.  గత పదమూడు రోజుల్లో జరిగిన విషయాలు గుర్తొస్తుంటే, కన్నీరు కారి పోసాగింది.  అంతా కలలా జరిగిపోయింది.
అదీ కాక ఇంకో రెండు నెలల్లో ఇండియాకి వస్తానని ఎంతో ఆత్రంగా, ప్రేమగా, మొత్తం కుటుంబం కలిసి ఉత్తర భారతదేశ ప్రయాణం చేయాలని సంతోషంగా ఎదురు చూస్తున్న నాన్న వృద్దాప్యం వల్ల ఎలాంటి కష్టం లేకుండా 13 రోజుల క్రితం మధ్యాహ్నం కునుకు తీద్దామని పడుకున్నపుడు నిద్రలోనే పోయారు.  ఇండియా నుండి ఫోన్ రాగానే (ముగ్గుర్లోకి చిన్నదయిన) సుప్రజకు నాన్నకు సీరియస్ గా వుందని చెప్పారు.  తను వెంటనే భర్త శ్రీమంత్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని, స్కూల్ నుండి పిల్లలు( స్రవంత్ ఏడేళ్ళు, దృశ్యా ఐదేళ్ళు) వచ్చే సమయం కావడంతో ఫ్రెండ్ స్వాతికి ఫోన్ చేసి వాళ్ళని పికప్ చేసుకొమ్మని చెప్పింది.  ఇండియాకి ఫోన్ చేసి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది.  శ్రీమంత్ ఇంటికి వచ్చేసరికి ట్రావెల్ ఏజెంట్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది సుప్రజ.  శ్రీమంత్ మంచి నీళ్ళు తాగి వచ్చి సుప్రజ పక్కన కూర్చుని తన భుజాల పై చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు.  సుప్రజ అతని గుండెలపై తల ఆన్చి, "నాకు భయంగా వుంది శ్రీ," అని కన్నీరు పెట్టుకుంది బాధతో.

"పిల్లలు ఏరిరా? ఇంకా రాలేదా?" "స్వాతి వాళ్ళింట్లో వున్నారు." అంది కన్నీరు తుడుచుకుంటూ.
"నేను ఆఫీసు నుండి బయల్దేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడ్రా చిన్నా,"  "ఏమన్నాడు? నాన్న ఎలా వున్నాడు? మనం వెళ్ళేవరకు వుంటే మనని చూస్తే నాన్నకి తృప్తిగా వుంటుంది అన్నదే...."  "నేనొకటి చెబుతాను, నువ్వు కంగారు పడకు, నాన్నకు ఏజ్ అయ్యింది, చాలా సంతృప్తికరమైన జీవితం జీవించారాయన....ఆయనకి ఏమైనా నువ్వు ....."
"అంటే? నాన్న పోయారా?" అవునన్నట్టు తల వూపాడు శ్రీమంత్, భోరుమన్నది సుప్రజ.  శ్రీమంత్ భార్యని గుండెలకదుముకుని తల నిమురుతూ వుండిపోయాడు.   

"టికెట్స్ త్వరగా దొరికితే వెళ్దాం చిన్నా!" సుప్రజ గబుక్కున లేచింది, కళ్ళు తుడ్చుకుంటున్నా ఉబికి ఉబికి వస్తూనే వున్నాయి.  కన్న తండ్రి ఇక లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. " నేను ఫోన్ చేసి మళ్ళీ చెబుతాను మనం వస్తున్నామని.  లేకపోతే మనం వెళ్ళకముందే అన్నీ చేసేస్తే.... వాళ్ళ కళ్ళకు నేనో చిన్నపిల్లని, నేనేమి తట్టుకోలేనని అనుకుంటారు.  వాళ్ళకి వీలయినట్టుగా నా గురించి అభిప్రాయం మార్చుకుంటుంటారు, ఒకోసారేమో, ’అమ్మో నీకెంత ధైర్యమో, పరాయి దేశంలో ఒక్కదానివి చిన్న పిల్లలను పెట్టుకుని, వుద్యోగం చేసుకుంటూ వుంటున్నావు.’ అంటారు, మరోసారి ఎవరికైనా బాగాలేకపోతే సడన్ గా నేను ఏమీ తట్టుకోలేని దాన్ని, పిరికిదాన్ని అయిపోతాను.  మనకి దగ్గరవారికి వొంట్లో బాగా లేకున్నా, చనిపోయినా కన్నీళ్ళు రావడం, ఏడవడం సహజమైన రియాక్షన్ కదా!  దానికే పెద్దగా అమ్మో అది తట్టుకోలేదు అని అన్నీ దాస్తుంటారు.  ఇప్పుడు ఏం చేస్తారో నాకు భయంగా వుంది."  అని ఫోన్ డయల్ చేసింది భుజాలకి కళ్ళు తుడ్చుకుంటూ. 
"హలో! అన్నయ్య!"  "చిట్టితల్లీ, నాన్న మనకిక లేడమ్మా," అని భోరుమన్నాడు.
 సుప్రజ కూడా వెక్కి వెక్కి ఏడవసాగింది.  సుప్రజ తనని నిలదొక్కుకుంటూ, "అన్నయ్య మేము వీలయినంత త్వరగా వస్తున్నాము.  మేము వచ్చేవరకు వేయిట్ చేయండి....," 

"కానీ పెద్దవాళ్ళందరూ మంచి రోజని ఈ రోజే చేసేయమని అంటున్నారు మరి.....,"
"నో నోనో! యూ కాన్ట్ డూ దట్....నేనూ ఆయన కూతురినే, నాకూ వచ్చి ఆఖరి చూపు చూసుకునే హక్కు వుంది కదా! అవునా, కాదా...?"  "అవుననుకో వాళ్ళంతా అలా అంటున్నారు...."
"అంటే నీ బుద్ది ఏమయింది? నేను మాట్లాడతాను వాళ్ళతో సరేనా? నేను రాకముందు నువ్వు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నీకు, నాకు మధ్య ఎలాంటి సంబంధం వుండదు. గుర్తుంచుకో, తెలిసిందా!" అని గర్జించింది.  అటు నుండి కాసేపు ఏమి జవాబు లేదు.  "అన్నయ్య, ఏం మాట్లాడవేమిటి? నేను అన్నది అర్ధం అయ్యిందా లేదా?" అని అడిగింది కోపంతో వూగిపోతూ.  "నువ్వు అనవసరంగా కంగారు పడకమ్మా! వాళ్ళతో మాట్లాడతానన్నావు కదా! మాట్లాడు సరేనా! మళ్ళీ మాట్లాడదాం." అని ఫోన్ పెట్టేసాడు. 
సుప్రజ కింద కూలబడిపోయి ఏడవసాగింది.  శ్రీమంత్ కూడా కింద కూర్చుని,"కన్నా ఎందుకంత ఆవేశపడ్తావు?  మనం వెళ్తున్నాం కదా! ఇంతలోనే ఏం జరిగిపోదు కదా..."
" వాడేమన్నాడో తెలుసా? పెద్దలందరూ ఈ రోజు మంచి రోజు దహనసంస్కారాలు చేసేద్దామంటున్నారట. నాకు ఆఖరి చూపు కూడా లేకుండా చేస్తారు వీళ్ళంతా కలిసి..." అని ఆవేదనగా శ్రీమంత్ గుండెలమీద వాలిపోయి గట్టిగా ఏడ్చేసింది.

"కన్నా మీ మామయ్యకి ఫోన్ చేయ్యి, వాళ్ళని కన్విన్స్ చేద్దాం మనం వచ్చేదాక ఆగమని, సరేనా? నువ్వు కంగారు పడకు ప్లీజ్!" అని నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు శ్రీమంత్.
 సుప్రజ, "సరే"అని నీళ్ళు తాగి గట్టిగా వూపిరి పీల్చుకుని వదిలి మళ్ళీ ఇండియాకి, ఈసారి వాళ్ళ మామయ్యకి, అమ్మ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది.  చిన్నపుడు అతను అమ్మ దగ్గరే వుండి చదువుకున్నాడు.  అమ్మే అందరికంటే పెద్దది కావడంతో అటు అత్తింట్లో, ఇటు పుట్టింట్లో వారికి చేదోడు వాదోడుగా వుండేది.  రామం పెద్ద లాయర్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని తన కుటుంబంతో బెంగళూర్ లో సెటిల్ అయ్యాడు.
"హలో! మామయ్య, నేను సుప్రజని అమెరికానుండి ఫోన్ చేస్తున్నాను."  "అమ్మా! నాన్న మనని వదిలి పెట్టి వెళ్ళిపోయాడమ్మా! ఆయన మీకే నాన్న కాదు మాకు నాన్న లాంటి వాడేనమ్మా!" అని భోరుమన్నాడు.  "మామయ్య, మేము వీలయినంత త్వరగా బయల్డేరుతున్నాము, మేము వచ్చేవరకు నాన్నని వుంచాలి...." "నువ్వు ఎందుకొస్తున్నావమ్మా?" "మా నాన్నని ఆఖరి చూపు చూసుకోవడానికి......"
"అవునూ నాన్న ఇంకా ఎక్కడున్నాడని వచ్చి చూస్తావు తల్లీ...?"
 " నాన్న ప్రాణం పోతే మాత్రం నేను ఆఖరి చూపుకి నోచుకోలేదా? నేను వచ్చేవరకు దహనసంస్కారాలు చేయవద్దని చెప్పడానికి ఫోన్ చేసాను..." 
"ఏంటీ తల్లీ?  నీకు ఎవ్వరు ఈ అబద్దాలు చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో నాకు తెలీదు, నాన్న పోయినరోజే ఆయన దహన సంస్కారాలు చేసేసారు మంచి రోజని...." 
సుప్రజకి తల తిరిగిపోయింది. ఏమంటున్నాడు? నాన్న ఈ రోజు పోలేదా? పోయిన రోజే అన్నీ చేసేసారా?  అంటే నాకు ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసారా వీళ్ళంతా.
 

"నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ చూస్తూ కూర్చున్నావా? నేనొక దాన్ని వున్నానని నాకు చెప్పాలని తెలియదా?  మీరంతా ఒకటే నేను బ్రతికుండగా మీమొహలు చూసేది లేదు ఇంక తెలిసిందా?"  అని కడుపులోనుండి తన్నుకు వస్తున్న ఆక్రోశం ఆపుకోలేక ఫోన్ విసిరికొట్టి,  ’ హయ్యో! నాన్నా,’ అని కుప్పకూలిపోయింది సుప్రజ.
 శ్రీమంత్ ఖిన్నుడయ్యాడు.  సుప్రజ బాధ, ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు, "అమ్మా, చిట్టితల్లీ నా మాట వినమ్మా!  నేనేమీ చేయలేకపోయానమ్మా!  నాన్న కుటుంబం వారే అన్నీ నిర్ణయాలు తీసుకున్నారమ్మా...."  శ్రీమంత్,"హలో నేనండీ, సుప్రజ బాగా అప్ సెట్ అయ్యింది.  అసలేం జరిగింది?  మాకు ఈ రోజే ఫోన్ వచ్చింది సీరియస్ గా వుందని ముందు చెప్పారు, కాసేపయ్యాక పోయారని చెప్పారు.  సీరియస్ అని తెలియగానే మేము బయల్దేరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము...’"
"బాబు దాని బాధ నాకర్ధం అవుతుంది.  ఆయన పోయిన రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని రాత్రికి రాత్రే అంతా చేసేసారయ్యా..... మీరు అంత త్వరగా రాలేరని చేసేసారు. కానీ మీకు ఇవన్నీ చెప్పారనే అనుకున్నాను.  నాకు ఈ విషయం తెలియదు.   అనుకోకుండా పోవడంతో మా అక్కయ్య షాక్ లోకి వెళ్ళిపోయింది.  డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి ఆమెని ఈ లోకంలోకి తీసుకొచ్చారు కానీ అరవై ఏళ్ళ బంధం ఒకటేసారి మాట్లాడుతూ మాట్లాడుతూ పోవడంతో ఆమె ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదు దాంతో అంతా తొందర్లో అలా జరిగిపోయింది.  జరిగింది తప్పే, దాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు." అని ఫోన్ పెట్టేసారు.  శ్రీమంత్ షాక్ అయ్యాడు.  ఎందుకిలా చేసారు? సుప్రజ తల్లి తండ్రులను ఎంతగా ప్రేమిస్తుందో అక్కడ అందరూ మర్చిపోయారా? 
"అంతా అయ్యిపోయిందట.  అయ్యో నేను ఆయన కూతురిననే విషయమే మర్చిపోయారా అందరూ?  ఎందుకిలా చేసారు దుర్మార్గులు-నేను చెప్పాను వాడికి ఈ జన్మలో వాడితో ఇంక సంబంధం లేదని.  నాకెవరు లేరు.  మా అమ్మకయినా నేను గుర్తు రాలేదా? అయ్యో  నాన్న, ఇంకొన్నిరోజులయితే వచ్చేవాళ్ళం కదా, నీకు పిల్లల్ని చూడాలని వుందని అన్నావే, ఎందుకు తొందరపడి వెళ్ళిపోయావు?  ఇదే మగపిల్లవాడయితే వాడికోసం ఆగేవారేమో? నేను రాలేని పరిస్థితిలో లేనే, ఒక్కరోజు ఆగలేకపోయారెందుకు? నన్ను అడగవచ్చుకదా పరిస్థితి చెప్పి." అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది సుప్రజ. 
వాడిని ఎన్నడూ ఏది అడగలేదు తను, ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని తనకి నాన్నని చూడాలని వుంటుందని తెలియదా?  తల్లి తండ్రుల మీద అందరికీ ప్రేమ వేరుగా వుంటుందా?  వేరే ఎవరి ఇంట్లో ఎవరైనా పోతే వారెంత బాధ పడుతున్నారో ప్రతి సారీ చెప్పేవాడు.  అంటే బాధ ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకోలా ఉంటుందా! ఎందుకు అర్ఢం చేసుకోరు వీళ్ళు?  అనుకుని కుమిలిపోతూ వుంది సుప్రజ.

తండ్రి ఈ ప్రపంచంలోనే లేరు అని తెలిసినా వృద్దాప్యంతో పోయారు అని మనసుకి సరి చెప్పుకుని ఆఖరి చూపుకోసం వెళ్ళాలని అనుకుంటే తోబుట్టువులు, అందులో సుప్రజ వాళ్ళ అన్నయ్య బాగా క్లోజ్ గా వుంటారు, ఇద్దరి అభిరుచులు కలుస్తాయి, అన్నయ్య అంటే బాగా నమ్మకం వుంది, అలాంటి వాడు ఇంత భయంకరంగా అబద్దం ఆడాడంటే సుప్రజ మనసు ఎందుకు, ఎంతగా విరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు అనుకున్నాడు శ్రీమంత్.  
స్వాతి ఎంత సేపయినా సుప్రజ నుండి మళ్ళీ ఏ విషయం తెలియకపోవడంతో, ఫోన్ బిజీగా వుండడంతో తన ఇద్దరు ఐదేళ్ళ కవలలు, రమ్య, సౌమ్యలను, సుప్రజ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చేసింది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. సుప్రజ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏడ్చింది.  అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక బెంబేలు పడే పిల్లలకు శ్రీమంత్ మెల్లిగా దగ్గరకు తీసుకుని వారికి అర్ధం అయ్యేలా చెప్పి వారిని ఊరడించాడు. 
 స్వాతి సుప్రజని అలా చూసి షాక్ అయ్యింది.  మెల్లిగా వెళ్ళి పక్కకు వెళ్ళి కూర్చుంది.  "స్వాతి! అంతా అయిపోయిందే!  నాకు ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసారు.  నాన్న వెళ్ళిపోయారే, నా కోసం ఎదురు చూసి, అన్ని రోజులు వుండలేనమ్మా అని వెళ్ళిపోయారు.  ఒక్కసారి చూడాలని వుందే, మాట్లాడాలని వుందే, నా వల్ల కావటం లేదే తట్టుకోవటం!"అని స్వాతిని పట్టుకుని భోరుమంది. 
స్వాతి స్నేహితురాలిని పొదివి పట్టుకుంది, కళ్ళనుండి కన్నీరు కారిపోతుంది.  రెండేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినపుడు కలిసారు సుప్రజ తల్లితండ్రులను.  ఆది దంపతుల్లా వుండేవారు.  వాళ్ళు వున్నన్ని రోజులు రెండు కుటుంబాల వాళ్ళు ఎంతో సరదాగా గడిపారు రోజులు. 

స్వాతి భర్త  రమేష్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెబితే అతను నేరుగా అక్కడికే వచ్చేసి ఆ రాత్రంతా అక్కడే వున్నారు వారి కుటుంబం.  శ్రీమంత్, రమేష్ కలిసి పిల్లలందరికీ తిండి పెట్టి, పడుకోబెట్టారు. 
"స్వాతి నాకే ఎందుకే ఇలా జరుగుతుంది?  మళ్ళీ ఫోన్లు చేస్తే బోలెడంత ప్రేమలొలకబోస్తారు. ఇప్పుడు కన్న తండ్రినే చూడకుండా చేసారు.  ఇదే నేను మగపిల్లవాడినయితే ఇలా చేసేవారు కాదేమోనే.  మా అత్తగారు పోయినపుడు మేము వెళ్ళేవరకు ఎదురు చూసారు కదా!  నన్నేపుడు వాళ్ళల్లో ఒకదాన్నిలా చూసుకోలేదు నన్ను.  పెళ్ళిళ్లయ్యాక ఎవరి దారి వారిదయ్యింది.  హైద్రాబాద్లో వున్నపుడు కూడా నేనే పట్టు బట్టి అందరి ఇళ్ళకు వెళ్ళడం, పిల్లల్ని సెలవులకు పంపించండి అని అడగడం చేసేదాన్ని.  ఇంకెపుడూ వాళ్ళతో సంబంధం పెట్టుకోనే.  నన్ను ప్రతి సారి బాధే పెట్టారు .....ఎందుకే నాకే ఇలా జరుగుతుంది?"అంటూ భోరుమంది సుప్రజ ఆవేదనని దిగమింగుకోలేక, ఎందుకిలా జరిగిందో తెలుసుకోలేక అవస్థ పడుతుంది. 
"అలా అనుకోకే, మనకి అందరి సంగతి తెలీదు కదా, కనీసం నీకు తెలియజేసారు మీ నాన్న పోయారని.  మా మామయ్య ఎపుడో వాళ్ళకిష్టం లేకుండా పెళ్ళి చేసుకుని ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యాడని మా అత్తయ్య తండ్రి, మాకు చిన తాతగారవుతారు, ఆయన పోయినపుడు చెప్పనేలేదు.  అప్పుడు మా అత్తయ్యని పట్టుకోవడానికి ఎంత కష్టం అయ్యిందో నీకు తెలుసు కదా!   తను అప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని, ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకుని వెళ్ళీ వాళ్ళ అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని ట్రీట్మెంట్ ఇప్పించడానికి తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకుంది.  బాగయ్యాక కొన్నాళ్ళు ఇక్కడికి కూడా తీసుకొచ్చుకుంది.  ఇండియాకెళ్ళాక కొన్నాళ్ళకే పోయింది కానీ ప్రెండ్స్ కి చెప్పింది కాబట్టి వాళ్ళు వెళ్ళి చుస్తూ వుండేవారు, తనకి బాగాలేదని తెలియగానే మాఅత్తయ్య వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ అప్పటికే ఆవిడ పోయింది కానీ ఆఖరి సారి చూసుకుంది, తనకి బాగాలేనపుడు తనకి చేతనయినంత చేయగలిగానని తృప్తి పడింది కానీ తల్లి, తండ్రి లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా!  నువ్వు మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు స్వాతి.  నువ్వు ఇదంతా సద్దుమణిగాక వెళ్ళి అమ్మను తీసుకొచ్చుకొని కొన్నాళ్ళు వుంచుకో తనకి చేంజ్ గా వుంటుంది, నీకు అమ్మ దగ్గర వుంటే నీ బాధని తనతో పంచుకుంటే కాస్త వూరటగా వుంటుంది." అని సుప్రజ చేతుల పై నెమ్మదిగా రాస్తూ  ఓదారుస్తూ చెప్పింది స్వాతి.
 

సుప్రజకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులంతా కలిసి మోసం చేసినట్టుగా ఫీలయ్యింది.  "ఆ దుర్మార్గుడికి చెప్పాలి ఇక వాడికి, నాకు సంబంధం లేదని," అని ఫోన్ తీసుకుంది.  స్వాతి,"జాగ్రత్తగా మాట్లడవే, అక్కడ వారి పరిస్థితి మనకి తెలీదు కదా....’
"ఏం జరిగినా నేనూ ఆయన కూతురినే, నాకు చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా? కనీసం ఇలా వుంది, ఏం చేద్దామమ్మా అనయినా అడగాలి కదా? నన్ను పరాయిదాన్ని చేసేసినట్టే కదా! అంతా అయిపోయాక అబద్దాలు మొదలుపెట్టి అంతా ఈ రోజే అయినట్టు చెబుతారా? నన్ను మరీ అంత పిచ్చిదాన్ని అనుకున్నారా?  చెబితే నేను అర్ధం చేసుకునే దాన్నేమో అపుడు నేను ఏం చేసేదాన్నో అది నా నిర్ణయం అయ్యేది కదా!  అన్నీ నిర్ణయాలు వాళ్ళే తీసుకుని నేనొక మనిషినే కాదు అన్నట్టు తీసి పడేసారు కుటుంబం నుండి.   మనసు మండిపోతుందే..."
స్వాతి భర్త రమేష్ వచ్చి, "సుప్రజ ఇపుడు నువ్వు కామ్ డౌన్ కావాలి.  శ్రీ, పిల్లలు చూడు ఎలా బెంబేలు పడుతున్నారో!" అన్నాడు రమేష్.  "జరిగిపోయిందేదో జరిగిపోయింది.  వాళ్ళతో మాట్లాడాలనుకున్నా నీ కోపం కొంచెం తగ్గాక ట్రై చేయాలి, కోపంలో నువ్వేం అన్నా, వారి మనసు బాధ పెట్టినా మళ్ళీ వెనక్కి తీసుకోలేవు, తర్వాత నువ్వే ఎక్కువగా బాధ పడే అవకాశం వుంది." అని కామ్ గా చెప్పాడు రమేష్.
"కాదు రమేష్ వాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా బాధ పెడుతూనే వున్నారు.  అందరికీ తోబుట్టువులుంటే కష్టం, సుఖం అన్నీ పంచుకుంటారు కానీ నా విషయంలో అలా జరగలేదు.  ఒక్కసారి మాట్లాడి పెట్టేస్తాను, లేకపోతే వాళ్ళు నన్ను మరీ పనికిరాని దాన్నని అనుకుంటారు...ఒక్కసారి ఫోన్ చేస్తే కానీ నా గుండెను కత్తిలా కోస్తున్నఈ బాధ కొద్దిగానయినా తగ్గదు." అని ఫోన్ తీసుకుని డయల్ చేసి రింగ్ అవ్వగానే, అటునుండి అన్నయ్య శ్రవణ్, "హలో !" అనగానే ఇటు నుండి సుప్రజ కాళికాదేవే అయ్యింది, "ఒరేయ్ నేను చెప్పానా నీకు నేను రాకుండా ఏమైనా చేసావో నీకు నాకు సంబంధం ఉండదని.  హౌ డేర్ యూ టు లై టు మి?  ఎన్ని రోజులయ్యింది నాన్న పోయి....?"  "నిన్ననే... చెప్పానుగా అందరూ మంచి రోజని....."
"షటప్ ఇడియట్! నీకసలు నేనంటూ వున్నానని గుర్తున్నానా?  లేకపోతే మీరిద్దరే సంతానం అనుకున్నారా, నువ్వు, నీ అక్కయ్య!  నువ్వు నిన్ననే ఫోన్ చేసి ఇలా వుంది పరిస్థితి ఏం చేద్దామంటావు అని నన్ను అడిగితే నీ అహం దెబ్బ తింటుందా?  స్త్రీలు, అన్యాయాలు అంటావే, మరి ఇది నీకు అన్యాయంగా అనిపించలేదా?  నేనొక్కదాన్ని ఇక్కడ ఈ బాధ ఎలా భరించాలిరా? నాన్నతో పాటే నీ చెల్లి కూడా చచ్చింది అనుకుని తద్దినం పెట్టుకోరా." దు:ఖం తెర తన్నుకు రాగా ఫోన్ పెట్టేసింది.

సుప్రజ రొటీన్ గా పిల్లల్ని స్కూల్ కి పంపించడం, వర్క్ కెళ్ళి కూర్చుని ఏడుస్తూ పని చేయలేకపోతే ఆఫీసుకెళ్ళి లాభం లేదని సెలవు పెట్టింది.   కళ్ళు తెరిచినా, మూసినా తండ్రే కనిపించేవాడు.  చిన్నప్పటి ఫోటోలు అన్ని తీసి చూసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాల్లో కొట్టుకుపోయేది.  అక్క సుకన్య తర్వాత శ్రవణ్, సుప్రజ పది ఏళ్ళ వరకు పుట్టలేదు. రెండేళ్ళల్లో ఇద్దరు పుట్టారు తల్లీ తండ్రి ఆనందానికి అంతే లేదు. సుకన్య కూడా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది.  శ్రవణ్ కి, సుప్రజకి ఎక్కువ తేడా లేక పోవడంతో తల్లీతండ్రి, చెరోకరిని చూసుకునేవారు రాత్రిపూట. తల్లి వీక్ గా వుండడంతో తల్లి పాలు లేవు అందుకని ఎంత రాత్రి అయినా పాలు ఫ్రెష్ గా కలిపి చల్లార్చి తాగించి, బట్టలు తడిస్తే మార్చి పడుకోబెట్టేవారు. చంటి పిల్లలై జలుబు చేస్తే తెల్లవార్లు ఎత్తుకుని తిప్పేవాడు, వారికి వూపిరి ఆడి కాసేపయినా నిద్రపోవాలని.  నాన్నరాత్రి నిద్ర లేదని అస్సలు అనుకునేవారు కారట.  పొద్దునే లేచి ఇంట్లో వీలయినంత సాయం చేసి ఆఫీసుకెళ్ళేవాడట.  కొన్నాళ్ళయ్యాక పిల్లలు పెద్దవుతుంటే ఫ్రెష్ పాలు ఇవ్వాలని రెండు గేదెలను తీసుకొచ్చి వాటి సంరక్షణ తనే చూసుకోవడం, పిల్లలు అన్ని రకాల పళ్ళు, ఫ్రెష్ కూరలు తినాలని పెరట్లో, ఇంటి ముందర  చెట్లు పెట్టి వాటి పని కూడా తనే చూసుకునేవాడు.  అంజూర్ పళ్ళు, కూడా ఎంతో జాగ్రత్తగా పెంచేవాడు, ఒకోసారి ఒకో పండు పండితే అవి పిల్లలకు పెట్టి తనే తిన్నంతగా సంతోషించేవాడు.  మేడపైన ద్రాక్ష తీగలు పాకించి గుత్తులు గుత్తులు ద్రాక్షలు పండిచారు.  తన పిల్లలే కాక ఆయన అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల పిల్లలు కూడా తన పిల్లల్లాగే తినాలని ఆఫీసవ్వగానే వెళ్ళి ఇచ్చి వచ్చేవారు. 
 
కొన్నాళ్ళకు హైద్రాబాద్ నుండి వెరే వూరికి ట్రాన్స్ ఫర్ అయ్యింది.  చిన్న వూరు, నాన్న బ్యాంక్ లో పని చేసే వారు కాబట్టి అందరూ బాగా గౌరవంగా చూసేవారు.  నాన్న బ్యాంక్ నుండి నేరుగా ఇంటికి రావడం రోజు చందమామ, బొమ్మరిల్లు కథలు, రామాయణం, భారతంలో చిన్ని కృష్ణుడి కథలు చెప్పేవారు. నాన్న ఎపుడైనా బ్యాంక్ లో పని ఎక్కువుండి కొంచెం లేట్ గా వస్తే శ్రవణ్, సుప్రజ ఇద్దరూ నాన్నకోసం ఎదురు చూస్తూ కూర్చూనే వారు.  నాన్న అన్నం తింటూ అమ్మతో కబుర్లు చెబుతుంటే ఇద్దరు పిల్లలు చెరో తొడపై పడుకుని,  అలాగే న్నిద్రపోతే మెల్లిగా తీసుకెళ్ళి పడుకోబెట్టేవాడు.  పిల్లలందరికీ దొమతెరలు కట్టి ఒక్క దోమ కూడా లేకుండా చూసేవారు ప్రతిరోజు.   చిన్నపుడు చాలా ముద్దు చేసేవారు.  ఆఫీసు నుండి రాగానే పిల్లలు కనిపిస్తే చాలు ఆయన కళ్ళల్లోకి సంతోషం ప్రాకి వచ్చేది.  పిల్లలతో వుంటే చిన్న పిల్లాడిలా అయిపోయి, వారితో కల్సి  చిన్నపిల్లల్లా ఆడుకునేవాడు.  ఎండాకాలం పెరట్లో వెన్నెట్లో మామిడి పళ్ళ రసంతోఅమ్మ స్వీట్  చపాతీలు చేస్తే కుటుంబంతో పిక్నిక్ చేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం.
ఎన్నెన్ని జ్ఞాపకాలో... అవి గుర్తొస్తున్నా కొద్ది నాన్నని చూడాలని, మాట్లాడాలని అనిపిస్తుంది.  ఇంత చేసిన నాన్నపోతే తను అక్కడ లేదు కానీ ఆయన ఎప్పటికీ తన గుండెల్లో వుంటారు.

 ఈ రోజు పదమూడో రోజని గుర్తొచ్చి శ్రీమంత్ కి ఫోన్ చేసి తను ఏం చేయబోతుందో చెప్పింది.   తనకున్న ఇండియన్, అమెరికన్ ఫ్రెండ్స్ ని సాయంత్రం చిన్న గెట్ టుగెదర్ కి రమ్మని చెప్పి స్వాతి, సుప్రజ ఇద్దరు కలిసి నాన్నకిష్టమైనవి చేసి పెట్టారు.  గార్డెన్ లో కుర్చీలు, టేబుల్ వేసి బఫేకి అంతా రెడీ చేసేసారు శ్రీమంత్, రమేష్.  సుప్రజ నాన్నవి, నాన్నతో తమ చిన్నప్పటి ఫోటో కాపీలు తీసి లాప్ టాప్ లోకదులుతున్నట్టుగా రవిశంకర్ మ్యూజిక్ తో పాటు పెట్టింది.  ఇలాగా ఎవ్వరూ, ఎప్పుడూ అందులో ఆడపిల్లలు చేయని పని- సుప్రజ తన తండ్రి కోసం చేసి తన ప్రేమని, అందరితో కలిసి పంచుకున్నది.  నాన్నని కలిసిన ఫ్రెండ్స్ అందరూ సుప్రజ నాన్నస్వయం కృషితో జీవితంలో ఎలా పైకి వచ్చారో చెబుతుంటే, " హి లుక్డ్ సో సింపుల్! వియ్ నెవ్వర్ ఇమాజిన్డ్ హి వాజ్ సచ్ ఏ హీరో అండ్ యువ్ ఆర్ సో లక్కీ టు హావ్ సచ్ ఏ వండర్ ఫుల్ అండ్ హ్యాండ్ సమ్ ఫాదర్, హీ రియల్లి లుక్డ్ లైక్ గ్రెగరీపెక్," అని అందరూ వచ్చి సుప్రజని ఊరడిస్తుంటే కన్నీరు ఆగలేదు, స్వాతి వచ్చి స్నేహితురాలిని ఆప్యాయంగా కౌగిలించుకుని, "ఈ బాధ జీవితాంతం వుంటుందే కాని ముందుకి సాగాల్సిందే అదే జీవితం," అని కన్నీరు తుడిచింది.  అందరూ వెళ్ళి పోయాక ఇండియాలోని వారు గుర్తుకు రాగానే, ఎందుకో సుప్రజకి అప్రయత్నంగా ఇది గుర్తొచ్చింది, "అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం....."

(విదేశాల్లో వుండేవారికి ఇండియాలో వుండే కుటుంబ సభ్యులు అనుకోకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోతే కొంత మంది వుద్యోగాల వల్ల, లేదా, వీసా, సమస్యల వల్ల ఇలా వివిధ కారణాల వల్ల వెళ్ళలేకపోతే, అటు వెళ్ళలేక, ఇటు వుండలేక విపరీతమైన మానసిక క్షోభకి గురవుతారు. ఈ కథ ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు!)