Facebook Twitter
ప్రేమకు చిరునామా

ప్రేమకు చిరునామా

- దోనె. నాగేశ్వరరావు

"ప్రసన్నకేదో కవరోచ్చింది శారదా! అసలు మీరెవరూ లెటర్ బాక్సు చూట్టం లేదనుకుంటా'' అంటూ కాళ్ళిడ్చుకుంటూ వచ్చి వరండాలో వున్న సోఫాలో భార్య ప్రక్కన చతికిలబడ్డాఋ ప్రభాకరరావు మాష్టారు.
"ప్రొద్దుట తల తిప్పినట్టుందన్నారు? ఎక్కడికెళ్ళారు? కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగదండీ?'' అంటూ ఆప్యాయంగా మందలించింది శారద.
కుబేరయ్య ఫోన్ చేశాడోయ్! మొన్న వడ్డీ తాలూకు లెక్క పొరపాటుగా చూశాడట. శత్రుశేషంలాగా బకాయి శేషం మిగిలిందని లెక్క చూపించాడు. ఏమంటాం?''
"అదేమిటి? మీరు లెక్క చూసే ఇచ్చారు కదా?''
"పిచ్చిదానా! మన లెక్క వడ్డీ లెక్క. అది చక్రవడ్డీ లెక్కట"
"ఏం లెక్కలో ఆ స్థలం అమ్మినా చిక్కులు తొలగలేదన్న మాట. పోన్లెండి. నిండా మునిగాక చలేమిటి? ఇద్దాం పోయేది పోక తప్పదుగా? ఆపగలమా?''
"ఆపలేము గదాని ఓపగలమా? బాధపడతాం మరి. సరేలే. ఈ కవరు తీసుకెళ్ళి అమ్మాయికివ్వు. ఏదైనా అర్జెంటేమో చూసుకుంటుంది''
"ఎంత అర్జెంటైనా తనిప్పుడు చూడదులెండి. వేలకి మనకింత వండి వార్చాలని వంటగదిలో తంటాలు పడుతోంది''
"ఆ పిల్లతో వంట చేయిస్తున్నాం ... పాపం కాలం కాటేసినా వెరవక కర్తవ్యాన్ని నెత్తికెత్తుటుంది పిచ్చితల్లి. ఏమిటో ... తనకు మనం ఋణపడిపోతున్నాం కదూ?''
"ఏమోలే ... అంతా ఆ పైవాడి లీల ...''
"పైవాడి లీలేనా? ... పైకెళ్ళినవాడి లీలగదూ?'' అంటూనే కళ్ళనుండి త్రుళ్ళివచ్చే గంగమ్మను కొంగుతో ఆపుకుంది.
"సరే ... సరేలే ... ఏడవకు ... ఏడ్చి మరింత నీరసపడటం తప్ప ... ఏం లాభం? అదిసరే ... ఇప్పుడింకో సమస్య వచ్చిందోయ్ ... ఆ ఇళ్ళ బ్రోకర్ని కలిశాను. మనం కక్కుర్తిగా అమ్ముకుంటున్నామనో ఏమో ... సగానికి సగం రేటు అడుగుతున్నాడు'' దిగులు పడుతూ చెప్పారు.
"ఎద్దు పుండు కాకికి ముద్దనీ ... సహజం. మన కష్టాలు మనవీ వాళ్ళ వ్యాపారం వాళ్ళదీనూ. మొన్న ఆ స్థలం కూడా ఇందుకే అంట తక్కువకి పోయింది. పోతుంది మరి అసలిదంతా ఎందుకు? నేనొక మాట చెప్పనా? ఎలాగూ మన ప్రసంనకి మనం సగం వాటా ఇద్దామని అనుకున్నాం గదా? సగానికి సగం జేసి ఎవరో బ్రోకరుకి ఇచ్చేకంటే ... అసలీ ఇల్లు అమ్మాయికే రాసేస్తే మంచిదిగదా? వృధాకా పోలేదని మనక్కూడా తృప్తిగా వుంటుంది గదా?''
"ఏంటి నీ ఔదార్యం శారదా? మనం బతకోద్డా?''
"మనం బతకటానికి మీ పెన్షనుంది? గదండీ? అయినా ఇంకెన్నాళ్ళు బతుకుతామని?''
"చచ్చేదాకా బతకాలిగా? చెట్టుకింద వుందామా?''
"అదేనా మీభయం? మా అమ్మ ఆస్తిగా మా పుట్టింటివాళ్ళు నాకొక ఇల్లు ఇచ్చారుగా?''
"అది వృద్ధాశ్రమానికి ఇచ్చేడ్డామనుకున్నాంగా?''
"మనమూ వృద్దులమేగదండీ? అక్కడే వుందాం. మన తర్వాత అది వృద్దాశ్రమంగానే వుండిపోతుంది. సరేనా?''
"ఏమిటో నీ ధోరణి నీది. నువ్వెప్పుడు నా మాట విన్నావ్? శక్తికి మించి అప్పులు చేయించావ్ ... ఇప్పుడు చూడు''
"దెప్పుతున్నారా? చెట్టంత కొడుకు చేజారి పోతాడని నేనేం కలగన్నానా? వాడే బతుకుంటే మనకీ ఖర్మ పట్టేదా?'' అంటూ కట్టలు తెన్చుకుంటున్న దుఃఖాన్ని కట్టడి చేసుకుంది శారద.
"అమ్మా కాఫీ తీసుకోండి'' అంటూ తెచ్చింది ప్రసన్న.
"తీసుకుందాంలేమ్మా! అక్కడ పెట్టు. ఇదిగో నీకేదో ఉత్తరం వచ్చింది చూడు'' అంటూ కవరు ఇచ్చింది శారద.
ప్రసన్న కవరందుకుని చదివి ఆపాదమస్తకం కంపించి పోవటం చూసి శారద లేచి ప్రసన్నని పొదవి పట్టుకుంటూ "ఏమైందమ్మా పిచ్చితల్లీ!'' అంటూ కూర్చోబెట్టింది. ప్రసన్న భగవంతుడా'' అంటూ శూన్యానికి నమస్కరించింది. ఆనందం, దుఃఖం కృతజ్ఞత అన్నీ కలగాపులగంగా కలిసి ప్రసన్న మనసులో సుడులు తిరుగుతుంటే నయనాలు నయాగారాకు నెలవులయ్యాయి.
"ఎందుకమ్మా పిచ్చితల్లీ! ఇంతకంటే కష్టం ఇంకేం వస్తుందని? ఎదవకమ్మా!'' అంటూ శారద అక్కున చేర్చుకుంది.
"అమ్మా! కష్టం కాదమ్మా దేవుడు కరుణించాడు. మనకో దారి దొరికింది. నాకు ఉద్యోగ మొచ్చిందమ్మా! ఇదంతా తనకు ముందే తెలిసినట్టు ఆయన బలవంతంగా నాతొ అప్లై చేయించారు. వెంటపెట్టుకుని ఇంటర్వ్యూకి కూడా తీసుకెళ్ళారు ... కానీ ... ఏరీ? ... నా ఉద్యోగం ... చూడకుండానే ... భగవంతుడా ...'' అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది ప్రసన్న.
కొన్ని క్షణాలు భయంకర నిశ్శబ్దం ఆవహించింది. అందరి ఆవేదనా తరంగాలు వినీలాకాశంలో విలీనమయ్యాక, "పోన్లే తల్లీ! కీడులో మేలంటే ఇదేనమ్మా! వాడు పోతూ నీకో దారి చూపించి పోయాడు ... సరే ... లేమ్మా ... లే'' అంటూ ఆప్యాయంగా తల నిమిరింది శారద.
ప్రసన్న లేచి కళ్ళుతుడుచుకుంటూ "నాన్నగారూ! స్నానానికి నీళ్ళు తొరుపుతాను రండి'' అంది.
"అమ్మా! నన్నలా పిలవకు తల్లీ! ఆ పిలుపుని దేవుడు పిలుచుకు పోయాడు. అమ్మా నాన్నా అని పిలిపించుకునే అదృష్టం మాకు లేదమ్మా!'' అన్నారు మాష్టారు.
"అదృష్టమైతే అది నాకూ లేదుగా నాన్నగారూ! అసలు అదృష్టమే మన బంధుత్వమేమో!' 'అంది ప్రసన్న.
"అంతేనేమోలే తల్లీ! ఆయనేదో అనేశార్లే ... బాధపడకు. ఏమండీ! పాపం తనేది ఆప్యాయంగా పిలుస్తుంది. అలాగే ... పిలవనిద్దాం. అయిన ఇంకెన్నాళ్ళు\లెండి. వాళ్ళ అమ్మానాన్నా వచ్చి తీసుకెళ్ళే వరుకునేగా అంటూ నిట్టూర్చింది శారద.
ఇంతలో మాష్టాలు జేబులో సెల్ ఫోన్ రింగయింది. "హలో? ఎవరండీ? ఆ ... ఆ ... నేనే ... నమస్కారం, మీరూ? ఓహో ... ఆఆ ... అలాగే ... సరే ... రండి. ఆ .... నమస్కారం'' ఫోన్ ఆపేశారు మాష్టారు.
"అమ్మా! ప్రసన్నా! మీ అమ్మా, నాన్నా, ఎవరో పట్టయ్యగారట వారూ బయల్దేరుతున్నారట. మధ్యాహ్నానికి వచ్చేస్తారు. చూశావా శారదా! నువ్విప్పుడే అంటున్నావా? తథాస్తు దేవతలు పలికినట్టు వారు ఫోన్ చేశారు. లేవండి. ఆ వచ్చేవారికి మర్యాదలు, ఆ ఏర్పాట్లేవో చూడండి''"నాన్నగారూ! మీరు నన్ను పంపించేయ్యాలనే అనుకుంటున్నారా?'' అంది దీనంగా ప్రసన్న. మాష్టారు గంభీరంగా "మేము అనుకోక పోయినా తప్పదుగదమ్మా? మనం కోరినట్టు జరుగుతుందా చెప్పు? ఇదంతా మనం కోరుకున్నామా?'' అన్నారు.
"నువ్వంటే మాకు ప్రేమేగాని ద్వేషం లేదమ్మా! నిన్ను ఎప్పుడైనా కోడలిగా చూశామా?'' నిట్టూర్చింది శారద.
"కోడిలిలా కాదు. కూతురులా చూసుకున్నారు, అది నాకూ తెలుసమ్మా! మరి ఇప్పుడెందుకు నన్ను పరాయిని చేసి పంపించేయ్యాలనుకుంటున్నారు?'' అడిగింది ప్రసన్న.
"పిచ్చితల్లీ! భర్తపోయిన పిల్ల తల్లిదండ్రుల దగ్గరనే వుండాలమ్మా! పుట్టి పెరిగిన వాతావరణంలో వుంటేనే నీకూ కాస్త మనశ్శాంతిగా వుంటుంది'' చెప్పింది శారద.
"నాకు సరేనమ్మా! మరి మీకు మనశ్శాంతి ఎలా?''
"మాదేముందమ్మా! పండుటాకులం. ఆ దేవుడి మీదే భారం వేసి అలాగే నేట్టేస్తాం'' అన్నారు మాష్టారు.
"అయితే నాన్నగారూ! మీరు దేవుడిమీద భారంవేసి వున్నట్టే నీనూ మీమీద భారం వేసి ఇక్కడే వుంటాను''
"తప్పమ్మా! నీకు తెలీదు. ఆ మాయదారి యాక్సిడెంట్ లో వాడు పోకపోతే నిన్ను మేము వదులుకుంటామా చెప్పు? విధికి ఎదురు పోగాలమా> పెద్దవాళ్ళం నువ్వు మా మాట వినాలి'' నచ్చజెప్ప చూసింది శారద.
"క్షమించండమ్మా! మీరు నామాటే వినేవరకూ నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను'' అంటూ ఏడుస్తూ లోనికెళ్ళింది ప్రసన్న. దిగ్భ్రాంతి చెందటం పెద్దవాళ్ళ వంతు అయింది.
"ఏమిటీ పిచ్చిపిల్ల శారదా? అసలు తనేమంటుందో తనకి తెలుస్తుందా?వెళ్ళు ... నెమ్మదిగా నచ్చజెప్పు''
"చెబుదాం లెండి. ఇప్పుడైతే మరీ ఏడుస్తుంది. వాళ్ళ అమ్మనీ నాన్ననీ చూశాక తనే దారికొస్తుందిలెండి''
మధ్యాహ్నమయింది ....
ప్రసన్న తండ్రి రాజారావు, తల్లి పద్మజ, ప్రసిడెంటు పట్టయ్యగారూ ఆటో దిగి వాకిట్లోకి వచ్చేశారు.
"నమస్కారం బావగారూ! రండి'' అంటూ ఇంట్లోకి ఆహ్వానించారు మాష్టారు.
"నన్ను అలా పిలవకండి. మాకిక్కడ ఏం బంధుత్వాలూ అక్కర్లేదు'' రుసరుసలాడాడు రాజారావు.
"పంచాయితీ ప్రసిడెంటుగా నాకు పక్షవాతం తగదు. దయచేసి అందరూ సంయమనం పాటించండి. సమస్యలుంటే సామరస్య పూర్వకంగా చర్చింది పరిష్కరించుకుందాం'' అంటూ పట్టయ్యగారు అందర్నీ వరండాలోనే కూర్చోబెట్టారు.
"నమస్కారం వదినగారూ!'' అంటూ శారద వచ్చింది.
"నమస్కారం వదినమ్మా!'' అంటూ పద్మజ లేచి నిలబడింది.
"మగవాళ్ళు కూర్చుంటార్లెండి మీరు ఇంట్లోకి రండి'' అంది శారద.
"పద్మజా! నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మాయిని రమ్మను. బయల్దేరదాం'' హుకుం జారీ చేశాడు రాజారావు నిరంకుశం ప్రదర్శిస్తూ. పద్మజ చతికిల బడింది.
"పంచాయితీ ప్రసిడెంటుగా నాకు పక్షపాతం తగదు. మీరు కాస్త శాంతించాలి. ఎంతైనా మీరు పిల్లనిచ్చినవారు. వారు పుచ్చుకున్న వారున్నూ'' అన్నాఋ పట్టయ్యగారు.
"మేం పిల్లనివ్వలేదండీ! వాళ్ళు లాక్కున్నారు. దాని బతుకు బండలు చేశారు. అప్పుడు కొడుకేమో నా ఆస్తిమీద కన్నేశాడు. ఇప్పుడు తండ్రేమో ఆధారాలన్నీ కమ్మేసి ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు. ఎవరికి తెలీదని?''
"అయ్యా! గొర్రె పోయిందీ జాతర జరిగిపోయిందీ అన్నట్టుగా ఇప్పుడదంతా వద్దు'' అన్నారు పట్టయ్యగారు.
"అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం గావటం లేదు'' అంటూ ఆశ్చర్యంగా అన్నారు మాష్టారు.
"మాష్టారూ! ఆయనేదో బాధకొద్దీ అన్నార్లెండి. మీరు ఈ మధ్య స్థలాలేవో అమ్మేశారటగదా? ఏది ఏమైనా వారికి మీ ఆస్తిమీద ఆశలేదులెండి''
"స్థలాలు ఎన్నో కాదండీ! ఒక్కటే అమ్మాను. అది నా స్వార్జితం. పిత్రార్జితం కాదు. వాడి చదువుల కోసం చేసిన అప్పులు తీర్చటం నా బాధ్యతా గదండీ? తీర్చేశాను.ఆ దేవుడు మాకు అన్యాయం చేసినా మేము న్యాయమే చేస్తాం. మాకు వున్నదాంట్లో సగం వాటా ప్రసన్నకిచ్చి పంపుదామని అనుకుంటున్నాం. మీరు అడక్కపోయినా సరే''
"చూశారా ప్రెసిడెంటుగారూ? తెలివితేటలండీ! ఎక్కడిదక్కడ చక్కబెట్టేసి తక్కిన గోచిపాతలో సగం చించి ఇస్తారట. మీ ముష్టికోసం మేము రాలేదు'' అవహేళనగా అన్నాడు రాజారావు.
"అది కాదండీ ...'' ఏదో చెప్పబోయారు మాష్టారు.
"మీరు ఆగండి నాన్నగారూ! నేను మాట్లాడతాను'' అంటూ బయటికి వచ్చింది ప్రసన్న. పట్టయ్యగారు గతుక్కుమన్నారు.
"కొంపదీసి మతిపోలేదుగదా? మామగార్ని నాన్నగారంటుందేం?'' అనుకుంటూ వింతగా చూశారు పట్టయ్యగారు.
బిడ్డను చూడగానే పద్మజ బావురుమంటూ లేచి కౌగిలించుకుంది. వాతావరణం రంగుమారింది. దుఃఖాలూ, ఓదార్పులూ కొంతసేపు రాజ్యమేలాయి. గృహరాజకీయ సభ సంతరించుకున్న గాంభీర్యాన్ని ఛేదిస్తూ ప్రసన్న గొంతు విప్పింది.
"అమ్మా! మీకు నామీద ప్రేమ వుంటుంది. అది సహజం. నన్ను చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేగాని మేము పుట్టెడు దుఃఖంలో వున్నప్పుడు మీరేదో దండయాత్రలా వచ్చి వాటాలనీ, పంపకాలనీ ఇక్కడ గొడవ చేయటం మంచిపని కాదు. నన్నిలా బతకనివ్వండి ప్లీజ్'' అంటూ చేతులు జోడించింది.
"అంటే ఏంటమ్మా నీ వుద్దేశ్యం? నువ్వు మా బిడ్డవి కావా? ఏదో పరాయిదానిలా మాట్లాడ్తున్నావ్? అప్పుడు మేము నీ ప్రేమని కాదన్నామని ఇప్పుడు కక్ష సాధిస్తున్నావా?'' అంది గద్గద స్వరంతో పద్మజ.
"అమ్మా! నేను తల్లిదండ్రుల్ని ద్వేషించేటంత సంస్కార హీనురాలిని కాను. మీ మాటల ధోరణి మారాలంటున్నాను''
"ఎందుకమ్మా ఈ మాటలన్నీ? మరి బయల్దేరాదామా?'' అంటూ పట్టయ్యగారు కల్పించుకున్నారు..
"పెళ్ళికి రాలేకపోయినా చావుకొచ్చారు. భోజనాలు చేసి బయల్దేరండి'' అంది ప్రసన్న.
"ఏమిటమ్మా నీ మాటలు? బట్టలు సర్దుకో బయల్దేరదాం''
"నేనెక్కడికీ రాను.దయచేసి నన్ను బాధ పెట్టకండి''
"అలా అనకూడదమ్మా! భర్తపోయిన తర్వాత పుట్టింటికి రానంటే ఎలా? పోనీ ఓ బిడ్డో పాపో వుంటే ...'' అన్నారు పట్టయ్యగారు.
"ఉన్నారు తాతయ్యా! నాకు బిడ్డా పాపా వున్నారు. ఇదిగో వీళ్ళే ఈ అమ్మ మా అత్తయ్య, కాని ఈమెలో నాకెప్పుడూ అత్త కన్పించలేదు. అమ్మే కన్పించింది. ఈయన మా మామగారు. మామయ్యలో అయ్యానే చూపిస్తూ మామను మరుగున పరిచిన మహా మనిషి. వీళ్ళెంత సంస్కారులంటే, పెళ్ళై నెల తిరగకుండానే కొడుకు చనిపోతే ... ఈ పాపిష్టిది పాదంపెట్టి నా కొడుకును మింగేసింది అనకుండా నువ్వు దురదృష్టవంతురాలివే నా తల్లీ అని అక్కున చేర్చుకున్న ఆడర్శనీయులు. అటువంటి దేవతల్ని, నా బిడ్డల్ని అవమానిస్తారా?'' నిలదీసింది ప్రసన్న.
"చూశారా ప్రసిడెంటుగారూ! మా అమ్మాయితో ఎలాంటి చిలకపలుకులు పలికిస్తున్నారో చూశారా?'' అన్నాడు రాజారావు.
"నాన్న! నేనింత చెబుతున్నా అర్థం కాలేదా? ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి''అంది ప్రసన్న నిరసనగా.
"ఇంకెలా మాట్లాడుతారే పాపిష్టిదానా! ఇన్నాళ్ళూ నువ్వు పుట్టింటి దిక్కులేని దానివనీ, మాకు తప్పదనీ బాధను దిగమింగి నిన్ను ఒక్కమాట కూడా అనలేకపోయాం. ఇప్పుడంటున్నా. నీ పాపిష్టి పాదం పెట్టి మా కొంపని పాడుబెట్టావ్. చాలు మా మీద నువ్వేమీ ప్రేమ ఒలకబోయనక్కర్లేదు. ఉద్యోగాలుచేసి మమ్మల్నేమీ ఉద్ధరించనక్కర్లేదు. వెళ్ళిపో. నీకు దణ్ణం పెడతాం. మమ్మల్నిలా వదిలేయ్యవే తల్లీ'' అంటూ శారద కర్కశంగా మాట్లాడింది. "మాట్లాడేది మా శారదేనా?'' అన్నట్టు ఆశ్చర్యపోయారు మాష్టారు.
"మీరెవరమ్మా నన్ను పొమ్మనటానికి? మీరు రమ్మంటే వచ్చానా? పొమ్మంటే పోతానా? మీరెవరూ మా పెళ్ళికి ఒప్పుకోకపోతే, నా బలవంతం మీద మేము పోలీసుల్ని ఆశ్రయించి పెళ్ళాడాం. అసలు మా ప్రేమగురించి మీకేం తెలుసు? నన్ను ప్రేమించూ, నన్ను ప్రేమించో అని యాసిడ్ బాటిల్ పట్టుకుని వెంటపడే అబ్బాయిలున్న ఈ రోజుల్లో, నేను ప్రేమిస్తున్నాను మహాప్రభో అంటూ నేను ఆయన వెంటపడితే 'ప్రసన్నా! నేను నీకు తగను, నాకీ చదువు తప్ప వేరే ఆస్తేమీ లేదు, నాకష్టాలను నీకు రుద్డలేను, దయచేసి అర్థం చేసుకో' అంటూ దూరంగా జరగటానికి ప్రయత్నించారు తప్ప, నా అందానికో, ఆస్తికో ఆయన విలువీయలేదు. అదీ ప్రేమంటే. అందుకే నాకు నచ్చారు. నేనే వెంటపడి మరీ ఆయన్ని పెళ్లిచేసుకున్నాను. తన చివరి క్షణం వరకూ నా క్షేమాన్నే కోరిన దేవుడు నా భర్త, ఇది నా భర్త ఇల్లు. మీరాయన తల్లిదండ్రులు. నాది నిజంగా ప్రేమే అయితే ఆయన సుఖాలే కాదు, ఆయన కష్టాలూ, బాధ్యతలూ కూడా నావే, ఆయనకు బడులుగానేను మీకు కూతుర్నై మిమ్మల్ని చూసుకోవాలి. ఆయన లేని లోటు తీర్చాలి. మీకిష్టం లేదంటే నన్ను చంపెయ్యండి.... చంపెయ్యండి ... '' అంటూ స్పృహతప్పి పడిపోయింది ప్రసన్న. అందరూ ఉపచారాలు చేశారు. లేచింది ... "అమ్మా!'' అంటూ శారదను కౌగిలించుకుంది. "పిచ్చితల్లి! అలా మాట్లాడితే వెళ్ళిపోతావనీ, నువ్వైనా సుఖపడ్తావనీ అన్నానమ్మా పాపిష్టిదాన్ని. చనిపోయిన వాడు నీ భర్త. నువ్వుమాత్రం మా బిడ్డవే తల్లీ'' అంది శారద.
ఇదిగదా "ప్రేమకు చిరునామా?'' అన్నారందరూ.
   

    ..... శుభం .....