Facebook Twitter
నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ

ఎపిసోడ్ - 2

- వసుంధర

    బాబాయి అంటే నాన్నగారి తమ్ముడు. అమెరికాలో వున్నాడు. బాబాయికి నేనంటే చాలా ఇష్టం. వచ్చే నెలలో ఇండియా వస్తున్నాడు. వచ్చేటప్పుడు నా కోసం ఓ మంచి బొమ్మ తెస్తున్నానని వ్రాశాడు. ఆ బొమ్మ కోసం నేను కలలు కంటున్నాను.

    "ఎందుకని?"

    "ఎందుకా? బొమ్మలు చిన్న పిల్లలకేగానీ పెద్ద వాళ్ళకి కాదు. అసలు కిష్టిగాడే పెద్ద. వాడి కంటే చిన్నవాళ్ళకే గానీ పెద్ద వాళ్ళకి బొమ్మలు తేకూడదు" అన్నారు నాన్నగారు.

    "అయితే నేను కిష్టిగాడి కంటే చిన్నే" అనేశాను.

    "చాల్లెండి మీ వేళాకోళం అంది అమ్మ. కానీ మర్నాడు నాన్న ఇంట్లోనే వున్నా సరే మధ్యాహ్నం భోజనాలు కాగానే కిష్టిగాడి అమ్మను కబుర్లకు పిలిచింది.

    వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా నేను వెళ్ళి కిష్టిగాడిని బ్రతిమలాడాను.

    "ఏమిటే గొడవ?" అన్నాడు వాడు.

    "మనమిద్దరం బంతాట ఆడుకుందాం. బంతి మా అమ్మ దాచేసింది. నువ్వెళ్ళి అడిగితే ఇస్తుంది" అన్నాను.

    "సరే అడుగుతాను" అని వాడు బయలుదేరాడు.

    "ఏమని అడుగుతావు?" అన్నాను.

    "అవునూ మీ అమ్మను నేనేమని పిలవాలి?" అన్నాడు వాడు.

    "పిన్నీ అని పిలు" అని చెప్పాను.
    ఏ కళన వున్నాడో వాడు ఇంకేమీ అనకుండా మా అమ్మ దగ్గరకు వెళ్ళి నేను చెప్పినట్లే అడిగాడు.

    ఏం జరుగుతుందోనని నేను గుమ్మం పక్కనుండి తొంగిచూస్తున్నాను.

    వాడు పిన్నీ అనగానే కిష్టిగాడి అమ్మ వాడివంక కోపంగా చూసి "ఏమిట్రా మధ్యలో వచ్చి అలా పిలుస్తావు?" అని గసిరింది.

    అమ్మ మాత్రం కిష్టిగాడిని దగ్గరకు తీసుకుని "చిన్నపిల్లల్నలా కసరకూడదు అక్కయ్యగారూ! బాబు చూడండి ఎంత ముద్దొస్తున్నాడో- నీకు ఒక బంతి ఏమిటి? రెండిస్తాను పద" అని లోపలకు తీసుకువెళ్ళి నిజంగానే వాడి చేతిలో రెండు బంతులు పెట్టింది.

    నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రెండో బంతి సరికొత్తది. ఎన్నిసార్లడిగినా అమ్మ నాకివ్వడం లేదు.

    ఆరోజు సరదాతీరేలా ఇద్దరం ఆడుకున్నాం.

    మర్నాడు కిష్టిగాడు బడిలో ఏడుపు ముఖంతో నా దగ్గరకు వచ్చి "మీ అమ్మను పిన్నీ అంటే తప్పా? నిన్న ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను బాగా తిట్టింది" అన్నాడు.

    "ఈ పెద్దాళ్ళంతేరా కిష్టీ. ఉత్తిగా అలా తిడుతూంటారు" అని వాడిని ఓదార్చాను కానీ అసలు సంగతి నాకు తెలుసు.

    ఆ తర్వాత మా అమ్మ, కిష్టిగాడి అమ్మ ఓ వారం పది రోజులపాటు మాట్లాడుకోలేదు మాలో ఎవరు వచ్చి ఎవర్ని పిన్నీ అని పిలుస్తామని భయపడ్డారో ఏమో మరి !


            2


    ఆ వేళ మా బాబాయి తేబోయే చక్కని బొమ్మ గురించి కిష్టిగాడికి చెప్పాను.

    కిష్టిగాడు వెంటనే "బాబాయిల మాట ఎప్పుడూ నమ్మకు. వాళ్లు మనకు ఏమీ కొనరు, తేరు! అనుభవం మీద చెబుతున్నాను!" అన్నాడు.

    "మా బాబాయి అందరి లాంటి వాడు కాదు" అన్నాను.

    మీ బాబాయికి పెళ్ళయిందా ?" అడిగాడు కిష్టిగాడు.

    "లేదు" అన్నాను.

    "అయితే నీకు బొమ్మతెచ్చినట్లే?" అని తీసిపారేశాడు వాడు.

    "ఏం?" అన్నాను కంగారుగా.

    "పెళ్ళికాని బాబాయిలు ఎప్పుడూ ఆడపిల్లల గురించే ఆలోచిస్తారు. మన గురించి పట్టించుకోరు !" అన్నాడు కిష్టిగాడు.

    "నేను ఆడపిల్లనేగా?" అన్నాను.

    "ఛీ! నువ్వేమిటీ ? ఆడపిల్లలంటే కాబోయే పెళ్ళాలన్న మాట" అన్నాడు కిష్టిగాడు. పెళ్ళాలు అన్నమాట అనేటప్పుడు వాడికి చాలా సిగ్గువేసింది. విన్నప్పుడు నాకూ సిగ్గేసింది.

    ఇద్దరం కాసేపు సిగ్గుతో ఏమీ మాట్లాడుకోలేదు.

    "నిజంగా అంతే నంటావా ?" అన్నాను దిగులుగా.

    "అనుభవం మీద చెబుతున్నాను. నా మాట నమ్ము. మా బాబాయి వున్నాడా! ఎగ్జిబిషనుకు తీసుకెడతాడు. నేను బెలూన్లు చూస్తుంటే తను అమ్మాయిల జడల్లో పువ్వులు చూస్తుంటాడు. ఎవరయినా ఆడపిల్ల సాయమడిగితే నా సంగతి కూడా మరిచిపోతాడు" అన్నాడు కిష్టిగాడు.

    ఈ కిష్టిగాడెప్పుడూ ఇంతే! అన్నీ అపశకునం మాటలు. అందుకని వాడి దగ్గర్నుంచి శంకరం దగ్గరకు వెళ్లాను.

    శంకరం చాలా మంచివాడు. క్లాసులో ఫస్టుమార్కులు రావుగానీ శ్రద్ధగా చదువుకుంటాడు. బుద్దిగా వుంటాడు. పాపం! వాళ్ళు పేదవాళ్ళుట ! అందుకని మంచి బట్టలు వేసుకోడు. క్లాసులో వాడితో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. ఎవరో ఎందుకూ? నేనూ మాట్లాడను!

    ఏమీ తోచనప్పుడూ, ఎవ్వరూ దొరకనప్పుడూ నేను శంకరంతో మాట్లాడుతుంటాను. నేను పలకరిస్తే శంకరం సిగ్గుపడుతుంటాడు.

    నేను బాబాయి తెచ్చే బొమ్మ గురించి చెబితే విని ఆనందించేవాడూ, ఆశ్చర్యపడేవాడూ శంకరం ఒక్కడే అనిపించింది. మిగతా వాళ్ళందరూ నిర్లక్ష్యంగా "వచ్చినప్పుడు చూద్దాంలే" అనేసే రకాలు.

    శంకరానికి బొమ్మ గురించి చెప్పాను.

    "అలాగా ! ఎంచక్కా ఎంత అదృష్టమో!" అన్నాడు శంకరం.

    "అదృష్టమేమరి. నా దగ్గరయితే చాలా బొమ్మలు వున్నాయి. కానీ ఆమెరికా బొమ్మ అన్ని బొమ్మల లాంటివి కాదుట" అన్నాను.

    "ఏమో అసలు బొమ్మ లెలాగుంటాయో నాకేం తెలుసు? షాపుల్లో చూస్తుంటే అన్నీ బాగానే వున్నాయనిపిస్తుంది" అన్నాడు శంకరం.

    "అయ్యో ! నీదగ్గర ఒక్క బొమ్మ కూడా లేదా ?" అన్నాను జాలిగా. నాకు శంకరం మీద చాలా జాలి కలిగింది.

    "లేదు. నువ్వు అమెరికా బొమ్మ గురించి చెప్పవూ?" అనడిగాడు శంకరం. వాడికి చాలా కుతూహలంగా వున్నట్లుంది.

    "నిలబడినప్పుడు కళ్ళు తెరచుని వుంటుందిట. పడుకోబెడితే కళ్ళు మూస్తుందిట. పడుకుని వుండగా నోట్లోంచి పాలసీసా తీస్తే ఏడుస్తుందిట. దానికి మంచి జుట్టు వున్నదట. ఎలా కావాలంటే అలా దువ్వుకోవచ్చునట. బొమ్మకు వీపుమీద బటను నొక్కితే పెదాలు కదలక పోయిన మాటలు వస్తాయట...." అన్నాను.

    "అంటే అచ్చం మనుషులకు లాగే అన్నమాట!" అన్నాడు శంకరం. నిజంగా అప్పుడే ఆ బొమ్మను చూసినంత ఆనందపడుతూ.

    "అవుననుకో - కానీ మనుషులైతే ముద్దురారు. బొమ్మ ఎంచక్కా ముద్దు వస్తుంది...." అన్నాను.

    "ఏమో- మరి నాకు నా తమ్ముడు ముద్దొస్తాడు. వాడు బొమ్మలాగా వుంటాడు" అన్నాడు శంకరం.

    "అలాగా?" అన్నాను ఆశ్చర్యంగా నాకూ తమ్ముడు కావాలని సరదాగా వుంది. కానీ తమ్ముడు లేడు. మా పక్క వీధిలోని జానకి వుంది. అది అస్తమానం వాళ్ళ తమ్ముడి గురించి ఒకటే గొప్పలు చెబుతుంది.

    "అమ్మా- మనకు ఓ తమ్ముడుంటే బాగుంటుందేం?" అని అమ్మతో చాలాసార్లు అన్నాను.

    అమ్మ నవ్వేసి ఊరుకుంది.

    శంకరం కూడా తన తమ్ముడి గురించి గొప్పగా చెబుతున్నాడు. ఓసారి వెళ్ళి వాడి తమ్ముడిని చూడాలని అనిపించింది.

    "నీ తమ్ముడిని ఒకసారి చూడనిస్తావా?" అన్నాను.

    "నువ్వు చూస్తానంటే సాయంత్రమే చూపిస్తాను. బడి వదిలేక నాతో వస్తావా?" అన్నాడు శంకరం.

    'సరే' అన్నాను.

    సాయంత్రం బడి వదలగానే ఇద్దరం కలిసి వెళ్ళాం.

    శంకరం ఇల్లు ఓ పూరి గుడిసె. లోపలకు వెడితే నా వంటికి బూజు అంటుకుంది. లోపల గుడ్డిదీపం వెలుగుతోంది. అక్కడంతా ఏదో తెలియని వాసన వేస్తోంది.

    "అమ్మ నిద్రపోతోంది.." అన్నాడు శంకరం.

    "నేను బయట నించుంటాను" అన్నాను.

    "వద్దు అలా కూర్చో" అన్నాడు శంకరం.

    నేను అక్కడ కూర్చోలేననిపించి బయటకు వచ్చేశాను. ఈ లోగా శంకరం తన తమ్ముడిని ఎత్తుకుని తీసుకుని వచ్చాడు.

    శంకరం తమ్ముడు నల్లగా వున్నాడు. జుట్టు అట్టకట్టి వుంది. చీమిడిముక్కు. శంకరం నా దగ్గరకు రాగానే అదోరకం వాసన వేసింది. ఇందాక గుడిసెలో వేసిన వాసన లాంటిదే అది.

    వాడు కళ్ళు నులుముకుంటున్నాడు. నిద్రమత్తు ఇంకా వదిలినట్లు లేదు. ఆవులిస్తున్నాడు. వాడి వంకే చూస్తున్నాను, నాకు చాలా అసహ్యంగా వుంది.

    "ఎత్తు కుంటావా?" అన్నాడు శంకరం.

    "వద్దు. నాకు పిల్లలు అంటే భయం" అన్నాను. అయితే అది నిజం కాదు. శంకరం తమ్ముడిని ముట్టుకోవాలంటేనే నాకు భయం వేసింది.

    "బాగున్నాడు కదూ?" అన్నాడు శంకరం.

    "వీడేనా నువ్వు బొమ్మలా వున్నాడు అన్నావు" అన్నాను.

    "ఊఁ"

    "అయితే ఇప్పుడే మా ఇంటికి రా నా బొమ్మలు ఎలాగుంటాయో చూస్తాను" అన్నాను.

    "బొమ్మలు ఎలా వుంటాయో నాకు తెలుసు. అమెరికా బొమ్మ వచ్చేక నేను మీ ఇంటికి వస్తాను. ఆ బొమ్మ చూడాలని వుంది నాకు" అన్నాడు శంకరం. అలా అంటున్నప్పుడు వాడి కళ్ళు చిత్రంగా మెరిశాయి.

    నేను ఆశ్చర్యంగా "ఎం ఆ బొమ్మే చూడాలని ఎందుకు అనుకుంటున్నావు" అని అడిగాను.

    "ఎందుకంటే ఇంతవరకూ బజార్లో నేను ఎన్నో బొమ్మలు చూశాను. అన్నింటి కంటే నా తమ్ముడే నాకు నచ్చాడు. ఈ అమెరికా బొమ్మ నా తమ్ముడి కంటే బాగుంటుందేమో చూడాలని వుంది" అన్నాడు శంకరం.

    నేను ఇంక ఏం మాట్లాడలేదు. తొందరగా వాడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మకు జరిగింది చెప్పాను.

    "అలాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు!" అని అమ్మ నన్ను దెబ్బలాడింది.

    "వెడితే తప్పేమిటమ్మా?" అన్నాను.

    "వాళ్ళింట్లో ఏమైనా తిన్నావా?" అంది అమ్మ.

    "లేదమ్మా. అక్కడ నేను ఎంతోసేపు వుండలేదు" అన్నాను.

    "మంచినీళ్ళు తాగావా?" అంది అమ్మ.

    "తాగితే తప్పా అమ్మా" అన్నాను.

    "తప్పుకాదు ప్రమాదం. అపరిశుభ్రంగా వుండే ఇంట్లో సూక్ష్మక్రిములు ఎక్కువగా వుంటాయి. అలాంటి చోట ఏమీ తినకూడదు, తాగకూడదు. ఇంక ఎప్పుడూ అలా వెళ్ళకు" అంది అమ్మ.

    సూక్ష్మక్రిములు అంటే నాకు తెలుసు. బడిలో మేష్టారు చెప్పారు. అవి కంటికి కనిపించవు. కానీ మనకు వచ్చే జబ్బులు అన్నింటికీ ఈ సూక్ష్మక్రిములే కారణం! అన్నీ సూక్ష్మక్రిములే శంకరం ఇంట్లో వుంటే మరి వాళ్ళకు జబ్బులు రావా? వెంటనే ఈ విషయం అమ్మను అడిగాను.

    "పాము విషం పామునేమైనా చేస్తుందా ? అలాగే వాళ్ళింట్లోని సూక్ష్మక్రిములూనూ!" అంది అమ్మ.

    నాకు కాస్త అర్ధమయింది. మర్నాడు బడికి వెళ్ళినపుడు శంకరం దగ్గరకు వెళ్ళడానికి భయం వేసింది. ఎంతసేపూ సూక్ష్మక్రిములే గుర్తుకు వస్తున్నాయి వాడిని చూస్తూంటే !

    ఇంటర్వెల్లో వాడే నా దగ్గరకు వచ్చి "నాతో మాట్లాడకూడదనుకున్నావా?" అన్నాడు.

    'లేదే!' అన్నాను తడబడుతూ. కానీ ఇంక వాడితో మాట్లాడకూడదనే అనుకున్నాను.

    "నాకు తెలిసిపోయిందిలే ! నిన్న నువ్వు ఎంతో అభిమానంగా పలకరించావు. ఈరోజు ముఖం చాటేస్తున్నావు. నేనుండే గుడిసె చూశావుగా! అందుకే నాజట్టు పచ్చి అయిపోవాలనుకుంటున్నావు. అవునా ?" అన్నాడు వాడు దీనంగా.

    నేనేమీ మాట్లాడలేదు. కానీ వాడి మీద కాస్త జాలి వేసింది.

    శంకరం మళ్ళీ మొదలు పెట్టాడు. "నేనేం చేసేది? మా నాన్న ఏదో దుకాణంలో వడ్రంగి పని చేస్తాడు. సంపాదించిన దాంట్లో సగం తాగుడుకే అయిపోతుంది. అమ్మ చాలా ఇళ్ళలో పనిమనిషిగా చేస్తుంది. పని చేసి వచ్చి అలసిపోయి సాయంత్రం కాసేపు పడుకుంటుంది. రాత్రి ఆరింటికయితే మాఇల్లు శుభ్రంగా వుంటుంది. నువ్వు అప్పుడు వచ్చి చూడాల్సింది. అనవసరంగా నిన్ను సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఈరోజు ఆరింటికి మా ఇంటికి వస్తావా?"

                 

   (సశేషం)