Facebook Twitter
అనురాగ స్మృతి

అనురాగ స్మృతి

డా. సి. భవానీ దేవి

 " త్వరగా  రండి. అన్నం చల్లారి పోతుంది." ప్రభావతి ఆరోసారి కేకేసింది." వస్తున్నా ఉండు ప్రభా! న్యూస్  చూసేటపుడు వడ్డించొద్దని ఎన్నిసార్లు చెప్పను నీకస్సలు బుద్ధిలేదు". విసుకుంటూ టి. వి ముందు నుంచి లేచాడు. నారాయణ. ప్రభావతి మనసు కలుక్కుమంది. " విసుక్కోకుండా   ఏ పని చేయడు కదా! ఎంత సేపింక..అనుకుంది కోపంగా.
ఆ! అదే న్యూస్ .. ఎన్ని ఛానెళ్ళలో అయినా అదే కదా! ఎంతసేపింక... డాక్టర్ లేటుగా భోజనం చేయొద్దని చెప్పలేదూ" గొణిగింది నారాయణ మోహంలోని సీరియస్నెస్ చూసి ఇంకేం మాట్లాడలేదు. కంచం ముందు కూర్చున్న నారాయణకు కంది పచ్చడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. " కంది పచ్చడి చేసావా ! చెప్పవేం " అంటూ నోట్లో నీళ్ళురుతుంటే అన్నం కలుపుకోవడం  

ఆ! నన్నెక్కడ చెప్పనిచ్చారు పిలుస్తుంటే ఒకటే చిరాకాయే " అంటూ వెన్నముద్ద తెచ్చి కంచంలో వేసింది ప్రభావతి.వేడి వేడి అన్నం లో కంది పచ్చడి వెన్న కలిపి తింటుంటే తన  కోసం తనకిష్టమైన విధంగా  వంటచేసి పదిసార్లు పిలిచి భోజనం పెడ్తున్న భార్య  మీద ప్రేమ ముంచుకొచ్చింది నారాయణకి. తలెత్తి ప్రభావతి కేసి చూశాడు. ఆవిడా తనేమంటాడో అని ఎదురు చూస్తుంది.
" కంది పచ్చడిబాగుంది ప్రభా ! " అనాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
అమ్మో! ఇంకేమన్నా ఉందా! ఆడవాళ్ళు ఏ పని ఎంత బాగా చేసినా మెచ్చుకుంటే నెత్తిమీదేక్కి కూర్చోరూ!
తన మోహంలో భావాన్నీ బయటపడనీయకుండానే తల దించుకుని 'చారు' అన్నాడు ప్రభావతికి వళ్ళు మండింది. గుండ్రాయిలా కూర్చుని గుటుక్కు గుటుక్కు మంటూ ఇంతింత ముద్దలు మింగుతాడే  గానీ బాగుంది. చారు. అనడీయన.
వేడి వేడి చారు అన్నంలో పోసింది. బాగుంది చారు మనసులో అనుకుని మజ్జిగన్నం తిని లేచాడు త్రేన్చుతూ...
ప్రభావతి వంట బాగా చేస్తుంది. తన ఆరోగ్యం బాగుండడానికి కారణం ఆవిడ శ్రద్దే ! అన్ని స్వగతాలే ! ప్రభావతి వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ఉయ్యాల బల్ల మీద పడుకుని ఉన్నాడు నారాయణ.
"శాయనించారు! ఉయ్యాల బల్ల ఒకటి నా ప్రాణానికి. దీనిమీద పడుకుంటే ఇంక ఏదీ గుర్తుండదు మీకు " అంటూ ఇన్లాండ్ కవర్  పెన్ను తెచ్చి ఇచ్చింది ప్రభావతి.
"ఏంటే  నీ గోల" మళ్ళీ విసుకున్నాడు నారాయణ.
: బావుంది వరస అన్నీ నా గోలలే. అమ్మాయికి పండక్కి డబుల్ కాట్స్ ఇస్తామని అల్లుడికి ఉత్తరం రాసి పడెయ్యండి" పక్కనే కూర్చుంటూ హుకుం జారి చేసింది.
ఉలిక్కి పడ్డాడు నారాయణ.
"డబుల్స్ కాట్స్! నీకేమైనా మతిపోయిందా ! ఉగాది ముడ్నేల్లుంది. ఎనిమిది వేలన్నా అవుతాయి.ఎలా తేవాలి. రుసరుసలడాడు.
" అవన్నీ మీకెందుకు ముందు అమ్మాయి మీద అల్లుడి గెంతులు తగ్గుతాయి. అసలే పిల్ల లేవలేనిది కూడా"

ఆవిడా చాటుగా కళ్ళు తుడుచుకోవడం నారాయణ కంటపడింది.
సరేలే..' అయిష్టంగా రాయడం మొదలెట్టాడు.ఎలా రాయాలో దాదాపు డిక్టేషన్లా రాయించింది ప్రభావతి.
ఉత్తరం రాయటం పూర్తిచేసి అతికించక అడిగాడు.
"డబుల్ కాట్స్ ఎలా ఇవ్వగలం ప్రభా! నాచేత వాగ్దానం చేయించావ్ ?అబ్బో ! మీరు వాగ్దానాలన్ని తీరుస్తున్నట్లు ...నా పొలం మీద అయివేజు వస్తుందిగా అదిచ్చి కొందాం.అందావిడ ప్రేమగా...

వద్దు ప్రభా ! నీకసలే ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకో.. ఇప్పటివరకు మీ పుట్టింటి వాళ్ళు నీకిచ్చిన బంగారం కానీ, పొలం మీద ఆదాయం కానీ నువ్వు వాడుకుంది లేదు. కొన్నాళ్ళు నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు.. ఇప్పుడు మన పిల్లలు. ఇంక నువ్వు అనుభవించేది ఎప్పుడు..."
నారాయణ వాదనలో నిజం వుందని ప్రభావతికి తెలుసు. అయినా ఆ తల్లి మనసు ఊరుకోలేదు
"నీ. నా.. ఏంటండి! అన్నీ మన భాద్యతలే!" అంది నిట్టూరుస్తూ.

"ఇంత  చేసినా...వదినా! మాకు నీ నగలు తాకట్టు పెట్టి పెళ్లి చేశావు' అని నీ ఆడపడుచు అనలేదు.ఇంక పిల్లల కోరికలు సముద్రాల్లో  అలలే " నారాయణ గొంతునిండా కోపం

"పోన్లెండి ... వాళ్ళ సంగతి ఎందుకు. మీరన్నారా ..నా ఆదాయం కలిపేగా మీరు ఆస్తి పెంచుకున్నారు" అడిగింది ప్రభావతి.

"అదా! అది వేరు. అయినా పిచ్చిదానా ! నువ్వు వేరు నేను వేరు కాదు." నారాయణ సమర్ధించుకున్నాడు.
"అదీ మగవాళ్ళ మాట అదే నేను మీ ఆదాయం కోరితే నా స్వంతానికి వాడుకుంటే ఇంత సహృదయత ఉండదు. ఫోన్లే! వదిలేయండి పిల్లలకి మాత్రం డబుల్ కాట్స్ నేనే కొనిస్తాను." ప్రభావతి నిర్ణయం చెప్పేసింది.
ప్రభావతి ఆ బాధ్యత తన మీద పెట్టినందుకు అతనికి లోపల ఆనందంగానే ఉంది.ఎంతైన ప్రభావతి లాంటి భార్య దొరకడం తన అదృష్టం. డబ్బు, సేవ,వినయం అన్నీ కలగలిపి దొరికింది.
"ఏంటి ఆలోచిస్తున్నారు లైటు తీసేస్తున్నా అడిగిందామె.
"ఏం లేదు" చీకటిలో ఆమెకేసి ప్రేమగా చూశాడు.
కానీ ఆ చీకటిలో అతని చూపులోని ప్రేమ తరంగాలు ఆమెదాకా పయనించనే లేదు.
ప్రభావతి పడుకుంది. కాస్సేపటికి హాయిగా నిద్రపోయింది.నారాయణ ఆమెకేసి చూస్తున్నాడు. కాస్తంత చామనచాయ అయిన కళ గల మొహం. మనిషి అందగత్తె అయితే కాదు కానీ మససు మాత్రం వెన్న: తనది అంటూ లేకుండా జాయింటు ఫ్యామిలీకి త్యాగం చేసింది. ప్రభావతి వెంట వెంట తెచ్చుకున్న ఆస్తి వాల్లె తనింతగా ఎదిగాడు. తన అక్కచెల్లెళ్ళు కూడా ' మా వదిన చాలా మంచిది' అంటుంటారు. బందువులంతా ఆమెని పొగుడుతారు కానీ తనే.. ఎందుకో ఒకసారి కూడా ఈ పని బాగా చేశావ్అని గానీ ' నువ్వు నాకు ఇష్టం ' అనీ గానీ ప్రేమ పూర్వకంగా అనలేదు. మొగుడిగా మొగడిగా అధికారం చూపిస్తాడు. అనురాగాన్ని కూడా అధికారంగానే.

ఒకటి రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడు కూడా అతనికి కాస్త ' ఆడపిచ్చి' వున్నా ప్రభావతి నోరు మెదపలేదు. తల్లీ తండ్రి లేని ప్రభావతి తనవల్ల ఏం పొందింది? చాకిరి తప్ప...

ఏంటి ఇవ్వాళ  ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయ్ ఏదో పేపర్లో కవితలో చదివాడు.బతికి ఉండగానే ఇష్టమైన వాళ్ళందరికి చెప్పేయాలట... నిజమేనేమో! ఆలోచిస్తుండగానే ఎప్పుడో నిద్రపట్టేసింది.
తెల్లవారినా వంటింటి చప్పుళ్ళు లేవు. మెలకువ వచ్చి చూసేసరికి ప్రభావతి అలాగే నిద్రపోయి ఉంది.
"ప్రభా  !" లేపాడు పలకలేదు.
చేతితో తట్టాడు. చల్లని మృత్యుస్పర్శా.
ఉలిక్కిపడ్డాడు.
అంతే! ఆ తర్వాత రావలసిన వాళ్ళు వచ్చారు. జరిగేవి జరుగుతున్నాయి. ప్రభావతి పెట్టిన, ఆమె  దాచుకున్న స్వంత డబ్బే అన్నింటికీ.. ఆమె చివరికి ప్రయాణానికి కూడా సరిపోతున్నది. చావులో కూడా తనని శ్రమ పెట్టలేదు. తను మాత్రం ప్రభావతిని జీవితం అంత శ్రమ పెట్టాడు. ఆమె  బతికుండగా ఒక్కనాడయినా కృతజ్ఞతలు చెప్పడా! బయటి వాళ్లయితే చెప్పేవాడు. భార్య గదా! చెప్పలేకపోయాడు.
ఇప్పుడు నారాయణ ఎంత ఏడ్చినా ప్రభావతి కి  వినిపించదు. అతని మనసులోని  భావాలన్నీ కుప్పపోసినా ఆమె ఇంక వినలేదు. ఆ అదృష్టాన్నీ అతను కోల్పోయాడు.
మర్నాడు ప్రభావతి ఫోటో కి రెండు వైపులారెండు దీపాలతో ' అనురాగ స్మృతి' అంటూ ప్రచురించిన సంతాప
 ప్రకటనలోని హృదయాలను చదవడానికి ఫోటోలోని ప్రభావతి చిరునవ్వుతో ప్రయత్నిస్తుంది,కానీ ఆమెకదిసాద్యం కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక స్మృతి మాత్రమే.