Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

- వసుంధర

 

           సీతానగరం ఊరు చిన్నదీ కాదు. అలాగని పెద్ద పట్నమూ కాదు. ఊళ్ళో పాతిక వేల జనాభా వుంటుంది. పట్నంలో దిరికే వన్నీ అక్కడ దొరుకుతాయి. రెండు సినిమాహాళ్ళు కూడా వున్నాయి. ఓ చోటినుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి రిక్షాలే కాక ఓ ఆటోరిక్షా కూడా వుంది.

    ఊళ్ళలో సీతానగరం ఎలాంటిదో ఆ ఊళ్ళో రఘు రామయ్యగారు అలాంటి వారు. ఆయన మరీ వున్నవాడూ కాదు, బొత్తిగా లేని వాడూ కాదు. దగ్గర్లోని పల్లెటూళ్ళో నాలుగెకరాల భూమి ఉంది. పొలాన్ని ఆయన అమరకానికిచ్చేశాడు. ఏటా ముప్పై బస్తాలకు తక్కువ కాకుండా ధాన్యం వస్తాయి. అందువల్ల తింది గింజలకు లోటు లేదాయనకు.

    రఘురామయ్యగారు హైస్కూల్లో తెలుగు మాష్టారు. తెలుగు బాగా చెబుతాడని పేరు. చదువు చెప్పడమంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఇంటిదగ్గర కూడా విద్యార్ధులకు పాఠాలు చెబుతాడు. కానీ ఎవరినీ డబ్బడగడు. అందువల్ల ఊళ్ళో ఆయనంటే గౌరవం.

    ఆయన మొదట్నించీ ఆ ఊళ్ళోనే వుంటున్నాడు. అసలు చాలాకాలం నుంచి రఘురామయ్య పూర్వీకులు కూడా ఆ ఊరినే ఆశ్రయించుకుని వుంటున్నారు. వాళ్ళింటికి వందేళ్ళకు పైగా వుంటాయని చెప్పుకుంటారు. రఘురామయ్య ముత్తాత గోపాల్రావు ఆ ఇల్లు కట్టించాడుట.

    ఆ ఊళ్ళో వున్నది కమిటీ స్కూలు. ఊళ్ళో వున్న పలుకుబడివల్లే రఘురామయ్య కందులో ఉద్యోగం వచ్చింది. ఆయనకిప్పుడు నలభై అయిదేళ్ళు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. ఆ తర్వాత ఓ కొడుకు. కొడుక్కు ముత్తాత గోపాల్రావు పేరే పెట్టారు. ఎందుకంటే వాడు పుట్టేముందురోజున రఘురామయ్య తల్లికి గోపాల్రావు కలలో కనిపించి తను ఫలానా అని చెప్పి మర్నాడు రఘురామయ్యకు మగపిల్లాడు పుడతాడనీ వాడికి తన పేరు పెట్టమనీ అడిగాడుట. రఘురామయ్య తల్లి ఈ కల గురించి చెప్పిన మర్నాడే ఆయనకు కొడుకు కలగడంతో వాడికా పేరే పెట్టడం జరిగింది. పేరు గోపాల్రావైనా వాడి నందరూ గోపీ అని పిలుస్తారు.   

    రఘురామయ్య తండ్రికి అరవై అయిదేళ్ళు. తల్లికీ అరవై దాటాయి. ఇద్దరూ ఆరోగ్యంగానూ దృడంగానూ వున్నారు.  రఘురామయ్య భార్య సీతాదేవి. ఆమెనేదో రోగం పీడిస్తోంది. ఎన్నిరకాల వైద్యాలో జరిగాయి. మందులకు డబ్బు ఖర్చవుతోందిగానీ గుణం కనిపించడం లేదు. అటు ఇంటిపనులూ ఇటు కోడల్ని సేవా కూడా రఘురామయ్య తల్లి లక్ష్మీదేవమ్మే చూసుకుంటోంది. అందుకు సీతాదేవి ఎంతో నొచ్చుకునేది. కానీ ఏం చేస్తుంది?

    లక్ష్మీదేవమ్మ మాయామర్మం ఎరుగని మనిషి. ఆమెకి స్వపర భేదం లేదు. సీతాదేవినామె కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. లక్ష్మీదేవమ్మ భర్త జానకిరామయ్యకు మాత్రం ఏ గొడవలూ పట్టవు. ఇంట్లో ఎవరేమైపోయినా తన పనులు జరిగి పోతూంటే చాలు.

    రఘురామయ్య పెద్ద కూతురు రేణుక. ఆమెకు పెళ్ళి అయింది. ఆ పెళ్లికి బాగా ఖర్చయింది. వచ్చే ఆదాయం చాలక పెళ్లి గురించి ఆయన అప్పు చేశాడు. అల్లుడు గోవిందరావుకి ఆశ ఎక్కువ. చీటికీ మాటికీ డబ్బు కావాలని మామగారికతడు ఉత్తరాలు రాస్తూంటాడు. పెద్దకూతురు పెళ్ళి జరిగినప్పట్నించీ రఘురామయ్యకు డబ్బు ఇబ్బంది మొదలైంది. ఆయన తరచుగా వీరయ్య అనే భాగ్యవంతుడి నుంచి అప్పు తెస్తూండేవాడు. తెచ్చేది ఎక్కువ, చెల్లువేసేది తక్కువ. అందువల్ల వడ్డీ బాగా పెరుగుతోంది.

    ఇప్పుడు రఘురామయ్య రెండో కూతురు వాణి పెళ్ళికి సిద్ధంగా వుంది. మూడో కూతురు కృష్ణవేణికి పధ్నాలుగేళ్ళు. గోపీకేమో ఇప్పుడు పన్నెండేళ్ళు.

    గోపీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. జీవితం మీద వాడికెన్నో ఆశలువున్నాయి. పెరిగి పెద్దవాడై తను చాలా గొప్పవాడైపోతాడని అస్తమానూ కలలు కంటూంటాడు. తండ్రి కూడా వాడిమీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

    గోపీ బడికి ఉతికిన బట్టలు వేసుకుని వెడతాడు. కానీ వాడికి ఖరీదైన పోలీఎస్టర్ బట్టలు వేసుకుని వెళ్లాలని కోరిక. గోపీ తండ్రికి మంచివాడనీ, పాఠాలు బాగా చెబుతాడనీ గౌరవం వుంది. గోపీ కది చాలదనిపిస్తుంది. ఆ ఊరి ప్రెసిడెంటు శేషగిరికి లాగా, వడ్డీవ్యాపారి వీరయ్యలాగా గొప్పగా, దర్జాగా వుండాలని వుంటుంది. వాడు రోజూ స్కూలుకు యింట్లో చేసిచ్చిన టిఫిను తీసుకుని వెడతాడు. కానీ వాడి స్నేహితులు కొందరు స్కూలు దగ్గరే వున్న కాఫీ హోటల్లో టిఫిను తింటారు. ఆ పక్కనే ఉన్న కిళ్ళీకొట్లో కూల్ డ్రింక్స్ తాగుతారు. తనకూ అలాగే వుండాలనుంది వాడికి. అన్ని పుస్తకాలూ వున్నా అని పెట్టుకునేందుకు ఖరీదైన బ్యాగులేదని బాధ!

    గోపీ తన పేదరికానికి బాధపడుతున్నాడని రఘురామయ్య గ్రహించి ఒక రోజున వాడికి హిత బోధ చేశాడు. 

    "చూడమ్మా గోపీ! చాలామందికి ఉన్నది పోగొట్టుకుంటే తప్ప తమకున్న దేమిటో అర్ధంకాదు. కన్నూ, చేయీ, కాలూ అన్నీ సక్రమంగా వుండడం మనిషికి మొదటి అదృష్టం! అటుపైన తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, వుండడానికిల్లు రెండో అదృష్టం! ఆ తర్వాత చదువుకునే అవకాశం రావడం ఇంకా అదృష్టం. ఆ చదువుకోవడంలోనూ ఏ ఇబ్బందీ లేకపోతే ఇంకా అదృష్టం. ఎందుకంటే నీ క్లాసులో పాపం- ఎందరికో చదువుకుందుకు అన్ని పుస్తకాలూ లేక వాళ్ళిళ్ళకూ, వీళ్ళిళ్ళకూ వెళ్ళి చదువుకుంటున్నారు. డబ్బు లేకపోవడంవల్ల ఓ పూట తిని ఓ పూట మాడుతున్నారు. నీ క్లాసులో ఎంతమంది మంచి బట్టలు వేసుకుంటున్నారు? ఎంతోమందికి అన్ని పుస్తకాలూ వున్నాయి? ఎంతమంది మధ్యాహ్నం పూట తిండి తింటున్నారు? వాళ్ళందరితో పోల్చుకుంటే నీ పనెంతో మెరుగు కదా!" అన్నాడాయన.

    గోపీకది నిజమే అనిపించినా " మళ్ళీ ఆ శేషగిరిగారబ్బాయి స్కూలుకు కార్లో వస్తాడు. వీరయ్యగారబ్బాయికి స్కూలుదాకా ఒకడు పుస్తకాలు మోసుకుని వస్తాడు. నేనూ వాళ్ళకులా వుండాలనుకోవడం తప్పా?" అన్నాడు.

    "తప్పే!" అన్నాడు రఘురామయ్య. "ఎందుకంటే శేషగిరిగారబ్బాయి, వీరయ్య కొడుకు వాళ్ళు స్వయంగా గొప్పవాళ్ళేం కాదు. వాళ్ళ తలిదండ్రులు గొప్పవాళ్ళు. పిల్లలు తలిదండ్రులవల్ల తమంతతామే గొప్పవాళ్ళుకావాలి. ఉదాహరణకు నిన్నే తీసుకుందాం. మీ క్లాసులో అసలైన గొప్పవాడివి నువ్వే! మరి అందరికంటే నువ్వే కదా ఫస్టుగా వుంటావు.."

    గోపీ వెంటనే "అంటే పెద్దయ్యాక నేను వాళ్ళందరికంటే గొప్పవాడినైపోతానా?" అన్నాడు సంతోషంగా.

    "అవును అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మాని నువ్వు కష్టపడి చదువుకోవాలి. ఎవ్వురూ నిన్ను గొప్పవాణ్ణి చేయరు. నీ అంతట నువ్వే గొప్పవాడివి కావాలి" అన్నాడు రఘురామయ్య.

    ఆ రోజునుంచీ గోపీ మరింత కష్టపడి చదువుకోసాగాడు. ముందు ముందు తను కార్లలోనూ, విమానాల్లోనూ తిరుగుతున్నట్లూ అందరూ తనకు సలాములు చేస్తున్నట్లూ వాడికి కలలు వస్తూండేవి.


            2


    ఒకరోజున పొద్దున్నే వీరయ్య రఘురామయ్యింటికి వచ్చాడు. ముందు నెమ్మదిగా మాట్లాడాడు.

    "మేష్టారూ! మీ అప్పు పెరిగిపోతోంది! వడ్డీ కూడా పెరిగిపోతోంది. ఆలస్యం చేసినకొద్దీ మీకే నష్టం. నా మాటవిని ఈ యిల్లు అమ్మేయండి. నేనే కొనుక్కుంటాను. అందరూ ఇచ్చేకంటే ఎక్కువ ధర ఇస్తాను. మీ బాకీ అంతా చెల్లు వేయగా నా ఇంటి పక్క నున్న చిన్న యిల్లు కూడా మీకే ఇచ్చేస్తాను" అన్నాడు వీరయ్య.

    విషయమేమిటంటే రఘురామయ్య యిల్లు చాలాపెద్దది. బోలెడు ఆవరణ కూడా వుంది. అటుపైన మంచి సెంటర్లో వుంది. అక్కడ ఓ సినిమాహాలు కట్టాలని వీరయ్య అనుకుంటున్నాడు.

    ఈ సంభాషణ వీధి అరుగు మీద కూర్చుని వున్న జానకిరామయ్య విననే విన్నాడు. ఆయన విసురుగా లోపలకు వచ్చి "ఇదిగో వీరయ్యా! ఇంత పెద్దింటికి అలవాటు పడ్డవాళ్ళం ఇరుకు ఇళ్ళలో వుండలేం. ఈ యిల్లు అమ్మడమన్నది కలలోని మాట. అనవసరంగా ఆశలు పెట్టుకోకు. ఈ వేళ కాకపోతే రేపైనా అణాపైసలతో మా అబ్బాయి నీ బాకీ తీర్చేస్తాడు" అనేసి మళ్ళీ అరుగు మీదకు వెళ్ళిపోయాడు.

    అప్పుడు వీరయ్య స్వరం కాస్త తగ్గించి "మేష్టారూ! మోసేవాడికే కదా బరువు తెలిసేది! మీ యిబ్బందులా ముసలాయనకేం తెలుస్తాయి? నా మాటవిని నేను చెప్పిన ప్రకారం చేస్తే మీకే యిబ్బందీ వుండదు" అన్నాడు.  

    వీరయ్య చెప్పిందంతావిని "వీరయ్యా! ఈ విషయంలో మా నాన్నమాటే నా మాట కూడా! ఈ యిల్లు అమ్మడం జరగదు. నీ బాకీ నేను తప్పకుండా తీర్చగలను!" అన్నాడు.

    అప్పుడు వీరయ్యకు చాలా కోపం వచ్చి ఎప్పుడు తీరుస్తావనీ, ఎలా తీరుస్తావనీ నానా మాటలూ అన్నాడు. అతడు స్వరం హెచ్చించి మాట్లాడ్డంతో ఇంటిల్లపాదీ అక్కడికి చేరుకున్నారు.

    "నా బాకీ తీర్చడానికి నీ దగ్గరేమైనా తాత ముత్తాతలు దాచిన నిధులు వున్నాయా? ఎలా తీరుస్తావు? నెల్లాళ్ళు టైమిస్తున్నాను. తీర్చావా-సరేసరి! లేదా కోర్టుకెళ్ళి అమీనాను తీసుకొచ్చి నీ యిల్లు వేలం పాడిస్తాను" అన్నాడు వీరయ్య.

    వీరయ్య వెళ్ళిపోయాక గోపీ నెమ్మదిగా నాయనమ్మను చేరాడు. వాడికి వీరయ్య మాటలు చాలా బాధను కలిగించాయి.

    ఇంతకాలం తన తండ్రికి చాలా గౌరవం వుందని వాడు అనుకున్నాడు. ఈ రోజున వీరయ్య తండ్రిని గడ్డిపోచలా తీసిపారేశాడు. అందుక్కారణం డబ్బు! డబ్బు లేకపోవడంవల్ల తండ్రి ఈ రోజున వీరయ్యకు చులకనైపోయాడు.

    గోపీ నాయనమ్మతో "నానమ్మా! నాన్న ముత్తాత ఇంత పెద్దిల్లు కట్టాడంటే ఆయనదగ్గర బోలెడు డబ్బుండి వుండాలి. ఆ డబ్బంతా ఏమైపోతుంది?" అనడిగాడు.

    లక్ష్మీదేవమ్మ భారంగా నిట్టూర్చి "ఆయన వున్న డబ్బంతా పెట్టి ఈ యిల్లు కట్టాడట. గొప్ప జమీందార్లకులా బ్రతకాలని ఆయనకు సరదా! ఆయనకు డబ్బు పిచ్చి ఎక్కువగా వుండేదట. అదే ఆయన ప్రాణాలు తీసింది" అంది.

    "అసలేం జరిగింది నాయనమ్మా?" అన్నాడు గోపీ కుతూహలంగా.

    లక్ష్మీదేవమ్మ గోపీకి గోపాల్రావు కథ క్లుప్తంగా  చెప్పింది.

    ధవళేశ్వరంలో కాటన్ దొర ఆనకట్ట కట్టించే రోజుల్లో గోపాల్రావు కూలీల మీద సూపర్వయిజరుగా వుండేవాడు. ఆయనకు రోజుకు అణా జీతం. అణా అంటే ఇప్పట్లో ఆరుపైసలకు సమానం. ఆ జీతంలోనే యింటి ఖర్చులన్నీ సుఖంగా జరిగిపోయేవి. అయితే గోపాల్రావు అంతటితో తృప్తిపడకుండా ఆనకట్ట పనులలో కొంత సిమెంటూ, కలపా లాంటివి మిగిల్చి ఓ చోటకు చేరవేస్తూండేవాడు. మొత్తంమీద సీతానగరంలో స్థలం కొని ఓ పెద్ద యిల్లు కట్టాడు. ఇల్లు కట్టడంతో ఆయనకు తృప్తి కలగలేదు. దాన్ని రాజభవనాల్లా అలంకరించాలని ఆయన ఆశ! అంత డబ్బెలా సంపాదించడం?

    సీతానగరంలో శ్రీమన్నారాయణుడి ఆలయం వుంది. ఆ ఆలయం ఓ కొండమీద వుంది. ఆ ఆలయ ప్రాంగణంలోనే మరో చిన్న ఆలయం కూడా వుంది. దాన్ని కుబేరుడి ఆలయమంటారు. ఆ ఆలయంలో కుబేరుడి విగ్రహానికి కాస్త పైన ఓ సొరంగమార్గం వుంది. ఆ సొరంగ మార్గాన వెడితే కుబేరుడి కొలను వస్తుందని ఆ కలను పక్కన ఓ యోగి వుంటాడని ఆయనకు బంగారం చేసే విద్య తెలుసుననీ చెప్పుకుంటారు. ఆ యోగి ద్వాపరయుగం నుంచీ వున్నాడట. మృత్యువును జయించేడట. ఇలాగని అంతా చెప్పుకుంటూంటారు.

    గోపాల్రావు ఆ పుస్తకాలూ యీ పుస్తకాలూ చదివి బంగారం చేయడానికి ప్రయత్నిస్తూండేవాడు. చాలా పుస్తకాల్లో రాగినీ, మట్టినీ, ఆవు పేడనూ బంగారంగా  మార్చడానికి పద్ధతులు రాసి వున్నాయి. గోపాల్రావు బోలెడు డబ్బు వృధాచేసి ఆ పద్ధతులన్నీ అమలు చేసేవాడు. ఒక్కటీ ఫలించలేదు.

    ఆఖరికాయన భార్య విసిగిపోయి "మీ బంగారం పిచ్చితో ఇంట్లో వున్న బంగారం కూడా కరిగిపోతోంది. అంతగా కావాలంటే కుబేరుడి కొలనుకు వెళ్ళరాదూ!" అంది.

    "అలాగా!" అని గోపాల్రావు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు.

    ఆయన శ్రీమన్నారాయణుడి గుడి వున్న కొండఎక్కడం కొందరు చూశారు. ఆలయంలోకీ ప్రవేశించడం చూశామని కొందరన్నారు. ఆయన కుబేరుడి ఆలయంలోకి వెళ్ళడం చూశామని మరికొందరన్నారు.

                   

(సశేషం)