Facebook Twitter
నాలోని నేను

నాలోని నేను

                                                                                      - శారద అశోకవర్ధన్

శ్రీవారినీ, పిల్లలనీ ఆఫీసుకీ స్కూళ్ళకీ పంపించేసి, గబగబా ఇంటిపనులన్నీ పూర్తి చేసుకుని, క్రితం రోజు సగం రాసి వొదిలిపెట్టిన కథని పూర్తి చెయ్యడానికి కూర్చుంది బృంద. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. ఎప్పుడూ ఏదో ఒక డిస్టర్బ్న్సీయే. కాగితం కలం ముందేసుకుని కూర్చుందో లేదో, టెలిఫోను మోగింది. ఉస్సురంటూ వెళ్ళి తీస్తే రాంగ్ నంబరు. రంగనాథాన్ని  తిట్టుకుంటూ వొచ్చి మళ్ళీ కాగితాల దగ్గర కూర్చుంది.

    "అమ్మగోరూ!" తలుపు కొట్టింది, గావు కేకలు పెడుతూ పనిమనిషి అనసూయ.

    "ఏమిటబ్బా  ఈ వేళప్పుడొచ్చింది? ఇప్పుడేగా పని పూర్తి చేసి వెళ్ళింది" అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది బృంద.

    "అమ్మగోరూ! నేనింటికి పోయేసరికి మా చిన్నమ్మ కూతురు ఊరి నుంచి ఒచ్చింది. రేపే ఎల్లిపోతారంట. మధ్యాహ్నం ఆట సినిమాకి బోదామంటోంది. అందుకే ఏమన్న పనుంటే సేసేసి పోదామని ఒచ్చాను" అంది.

    "అంటే - సాయంత్రం ఇంక రావా?" అడిగింది బృంద.

    "ఎట్టా ఒత్తానమ్మా? సినిమా అయిపోయేకాడికే ఆరు దాటుతది. ఇంటి కెల్లేసరికి ఏడు. అల్లకేమన్నా  సేసి పెట్టాల కదా....ఇయ్యాలటికిరాను" అంది.

    "ఇప్పుడేగా  అన్ని పన్లు చేశాం. ఇంకా నా భోజనం కూడా  కాలేదు. గిన్నెలు కూడా లేవు తోమటానికి. సరే వెళ్ళు. రేప్పొద్దుటే ఒచ్చేయ్" అంది ఏడవలేక నవ్వుతూ బృంద.

    ఆదెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టొచ్చి కూర్చుంది బృంద. కలం పట్టుకుని  ఆలోచిస్తోంది, తన కథలోని హీరోయిన్ శివప్రియని గురించి.  శివప్రియ భర్త పాదాలకింద చరణ దాసిలా పడుండే వ్యక్తి కాదు. ఆత్మ గౌరవం కలది. ఆత్మస్థయిర్యం కలది. అందుకే తాగుబోతూ, తిరుగుబోతూ అయిన భర్తతో కాపురం చెయ్యనని ఖచ్చితంగా  చెప్పి, తన బ్రతుకుతెరువుకోసం బయటపడుతుంది. శివప్రియ ఏవిధంగా సెటిలయిందీ వగైరాలు రాయవలసి వుంది. బృంద తీక్షణంగా ఆలోచిస్తోంది.

    మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. తన ఆలోచనలకి  అంతరాయం  కలిగిస్తున్న దెవరో - తిట్టుకుంటూ  వెళ్లి తలుపు తీసింది.

    "బృందగారు మీరేనా?" అడిగింది ఆమె.

    "అవును. మీరెవరూ?" అడిగేలోగానే, లోపలికొచ్చేసి కుర్చీలో కూర్చుంది 'క్షమించండి కూర్చుంటూన్నందుకు!" అంటూ.

    ఎవరీవిడ? స్నేహితురాలా - కాదు. బంధువా....ఎప్పుడూ చూళ్ళేదు. ఎంతో చొరవగా ఒచ్చేసి అలా కూర్చోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ బుట్ట మాత్రమే వుంది. అందుకని ఊరినుంచొచ్చిన వ్యక్తి కాదు అనుకుంటూ.... "మీరు?....."

    అడిగే లోపలే  ఆమె ఏడుపు లంకించుకుంది.

    కంగారుగా "ఎవరమ్మా నువ్వు? ఎందుకేడుస్తున్నావ్?" అడిగింది బృంద.

    "మీరు స్త్రీల సమస్యల గురించి అనేక కథలూ వ్యాసాలూ రాశారు. మొన్నీమధ్యనే ఒక దినపత్రిలో మీ గురించి  చదివి నా జీవితానికో పరిష్కారం సూచిస్తారనే ఆశతో, మీ అడ్రసు వెతుక్కుంటూ  కొండంత ఆశతో వొచ్చాను." చెప్పటం ఆపి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె.

    బృంద ఆమెకేసి  పరిశీలనగా చూసింది. వయస్సు నలభై దాటివుండదు. మనిషి ఎర్రగా బుర్రగా పెద్ద అందంగా కాకపోయినా  ఆకర్షణీయంగానే వుంది. వెంటనే ఏమడగాలో తెలీక 'ఏడవకండి, ఊరుకోండి. మీ సమస్యేమిటో చెప్పండి' అంది ఆమెని ఊరడించే ప్రయత్నం  చేస్తూ బృంద. ఆమె కళ్ళు తుడుచుకుని బృందకేసి చూసింది.

    "నేను ఇల్లువిడిచి ఒచ్చేశాను. మీరేదైనా  దారిచూపిస్తే  నా బతుకు నేను బతుకుతాను. మిషన్ కుడతాను. బుట్ట లల్లుతాను. ఏ ఊడిగమైనా  చేస్తాను, ఆయనతో సంసారం తప్ప." మళ్ళీ ఏడ్చింది. 

    "మీ ఆయనేం చేస్తారు?"

    "ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ కంపెనీలో ఇంజనీరు."

    ఖంగుతింది బృంద.

    అంత మంచి చదువూ, హోదాగల ఉద్యోగం. ఏవో చిన్న గొడవలు జరిగుంటాయి. ఆవేశంలో ఈవిడ ఆ నిర్ణయం  తీసుకుని ఒచ్చేసుండొచ్చు. మాటల్లో పెట్టి ముందు ఆమె ఆవేశపు పొంగు చల్లార్చాలి అనుకుంది బృంద.

    "మీకు పిల్లలున్నారా?"

    "ఆఁ. ఒకమ్మాయి, ఒకబ్బాయి. అమ్మాయి పదోక్లాసు. అబ్బాయి ఎనిమిదోక్లాసు."

    "అంటే.... పెద్దవాళ్ళే."

    "ఆ..."

    "మరయితే.... ఎందుకు ఇల్లొదిలి ఒచ్చేశారు?"

    "అతను కొట్టే దెబ్బలూ పెట్టే హింసలూ పడలేక." మళ్ళీ ఏడ్చింది ఆవిడ.

    "మీ పెళ్ళయి ఎన్నేళ్ళయింది?"

    "ఇరవై ఏళ్ళు!"

    "అప్పుడంతా బాగానే వుండేవారా?"

    "లేదు. ఈ శరీరం ఇరవై ఏళ్ళనుంచి దెబ్బలతో కమిలిపోయింది. దెబ్బ తగలని చోటులేదు. అతనికి కోపం ఎందుకొస్తుందో, ఎప్పుడొస్తుందో తెలీదు. అసలా కోపానికి అర్ధం లేదు. వంకాయకూర చెయ్యమంటారు. చేస్తే ఎందుకు వంకాయ చేశావని కొడతారు. కూరంతా నా మొహానికి పూసి, నా ఏడుపూ అరుపులూ వినబడకుండా, రేడియో పెద్దది చేసి పెట్టి, చేతిలో ఏదుంటే అది పెట్టి కొడతారు. ఎవరైనా ఆ దెబ్బలేమిటని అడిగితే, పడ్డానని చెప్పాలి. డాక్టరు దగ్గరకెళ్ళి మందు తెచ్చుకోమంటారు. తనూ కూడా వస్తాను. డాక్టరుకి పడ్డాననో, ఏదో తగిలిందనో చెప్పాలి. డాక్టరు ఎన్నోసార్లు 'అలా ఎలా పడతావమ్మా చిన్నపిల్లలాగా?' అని ఎగతాళి చేశారు. నేనేం చెప్పాలి చెప్పండి?" మళ్ళీ వెక్కివెక్కి ఏడ్చింది.

    ఆమెని ఓదారుస్తూ మంచినీళ్ళు  తెచ్చి  అందించింది బృంద. గడగడా నీళ్ళు తాగేసి గ్లాసు పక్కన పెట్టింది.

    ఇద్దరిమధ్యా పది నిముషాలు  నిశ్శబ్దం చోటుచేసుకుంది.

    బృంద ఆమెనే పరికించి చూసింది. ఎక్కడా ఆమె అబద్ధం చెబుతూన్నట్టు  అనిపించలేదు. 

    "మీ ఆయనకి ఈ పెళ్ళి ఇష్టంలేదా?" అడిగింది.

    "అలా ఏమీ ఎప్పుడూ  అనలేదు."

    "కట్న కానుకలు  చాలవని  సాధిస్తాడా?"

    "ఊఁ.....హూ.....!"

    "మిమ్మల్ని  అనుమానిస్తాడా?"

    "తెలీదు. కోపం  వచ్చినప్పుడల్లా, కొట్టికొట్టి సిగ్గుంటే ఎక్కడికైనా  వెళ్ళిపో అని తిడతారు ఇష్టం వచ్చినట్టు." కళ్ళొత్తుకుంది.

    "అమ్మా నాన్నా....అన్నా తమ్ముడూ....అక్క చెల్లెళ్ళూ  ఎవ్వరూ లేరా నీకు?" అడిగింది బృంద ఆమె కళ్ళల్లోకి  సూటిగా చూస్తూ.

    "ఉన్నారు. నాన్నగారు రైల్వేలో ఉద్యోగం  చేసి రిటైర్ అయిపోయారు. ఒక అన్నా, ఒక తమ్ముడూ వున్నారు. అక్క చెల్లెళ్ళు లేరు. వొదినా, మరదలూ నా బాధలు  తెలిసినా సానుభూతి  చూపించరు. అన్నయ్య తమ్ముడూ  'మగవాడేం చేసినా నువ్వే భరించాలి' అని ఖచ్చితంగా చెప్తారు. అమ్మా నాన్నా చాటుగుండా ఓదార్చినా  నా స్థానం మాత్రం వాళ్ళదగ్గరకాదని  అతని పాదాల దగ్గరేనని, కొట్టినా చంపినా అక్కడే పడుండాలనీ అంటారు. పైగా  వారికి నేనొక్కర్తెనే ఆడపిల్లని కావడంవల్ల, బాధనంతా  గుండెల్లోనే  దాచుకుని, పరువు కోసం  నన్ను పతిదేవుడి  దగ్గరే వుండమని మరీ మరీ చెబుతారు." మళ్ళీ ఏడుపు.

    "అది సరే కనీసం, మీ వారితో మాట్లాడి సంగతులు కనుక్కోరా?"

    ఏడుపాపి "చాలాసార్లు  కనుక్కున్నారు. మా ఆయన వాళ్ళముందు చాలా చక్కగా నటిస్తారు. తప్పంతా  నాదేనన్నట్టు చిత్రిస్తారు. అంతే. వాళ్ళటూ, నేనిటూ. ఆ తరవాత  దెబ్బలు  రెట్టింపు." పమిట కొంగుతో ముఖం కప్పుకుని ఏడుస్తూన్న ఆమెని చూస్తూవుంటే  బృంద మనసు కరిగిపోయింది.

    "మరైతే ఇప్పుడేం చేద్దామని?" పిచ్చిగా అంది.

    "మీరే చెప్పాలి. నాకేదైనా  పనిప్పించండి. ఎక్కడైనా  తలదాచుకుంటానికి  కాస్త దారి చూపించండి. మీరు స్త్రీల సమస్యల పట్ల రాసిన అనేక కథలే,   కథల్లో మీరు చూపిన  పరిష్కారాలే నన్ను చావనీయకుండా  చేశాయి. మీ అడ్రసు వెతుక్కుంటూ  మీమీదే ఆశలు పెట్టుకుని ఒచ్చాను. నిజానికి నాకు ఏ బస్సు ఎక్కడెక్కాలో తెలీదు. ఎప్పుడోతప్ప  రోడ్డు చూసే అవకాశమే లేదు నాకు. మా బంధువుల్లోగానీ  స్నేహితుల్లోగానీ  ఏ శుభ కార్యానికి పిలిచినా  ఆయనొక్కరే వెళ్తారు. నేను పనుండి రాలేకపోయాననో, ఒంట్లో బాగులేదనో వాళ్ళకి చెప్తారు. నన్నూ కలిస్తే అలాగే చెప్పమంటారు. అందుకే వాళ్ళందరూ నా గురించి అదోలా మాట్లాడుతారు. గర్వం అనీ, ఒంటి పిల్లి రాకాసిననీ ఏదేదో అంటారు. అందుకే నాకు ఏ చుట్టాలదగ్గరకీ వెళ్ళాలని లేదు. వెళ్ళనుగాక వెళ్ళను!" అంది ధృడ నిశ్చయంతో. గదిలో బంధించి  కొడితే  పిల్లి కూడా పులిలాగే పంజా విప్పుతుందంటారు - ఇదేనేమో! ఇరవై ఏళ్ల చిత్రవధ ఆమె మనసును రాయి చేసింది అనుకుంది బృంద.

    "మరి పిల్లల సంగతేమిటి?" అంది.

    "నేను పోతే వాళ్ళనైనా  జాలితో చేరదీస్తారు లెండి, మా అమ్మా నాన్నా...."

    "మరి ఆయన పిల్లలనైనా  ప్రేమగా  చూస్తాడా?"

    "లేదు. వాళ్ళదీ నా గతే! అతనంటే వొణికిపోతారు." అంది నేలచూపులు చూస్తూ. బృంద మనసు బరువెక్కిపోయింది.

    "చూడమ్మా! తండ్రి దగ్గర చనువులేదు. తల్లి కూడా కనబడకుండా  పోతే.... మరి.... ఎలా? వాళ్ళకోసమైనా  నువ్వు ఇంటికి వెళ్ళాలి" అంది.

    తలెత్తి ఆమె బృంద కళ్ళలోకి చూసింది.

    ఆ చూపులు తూటాల్లా  తాకాయి బృందకి.

    "మీరు కూడా అందరిలాగే  మామూలు మాటలు చెబుతున్నారా? మీరు రాసే కథలూ కథల్లో ఇచ్చే పరిష్కారాలూ  అన్నీ నీటి మూటలేనా? వాస్తవంలో ఒక్క పరిష్కారాన్ని  చూపించలేని మీరు, లేనిపోని ఆశలు కలిపించే కథ లెందుకు రాస్తారు?" అన్నట్టున్నాయి ఆ చూపులు!

    మనసులో జగుతూన్న  సంఘర్షణకి మాటలు  గొంతుదాటి రావడంలేదు బృందకి.

    "పోనీ, ఈమె తనింట్లోనే వుంచుకుంటే? ఏదో ఒక ఉపాధి కల్పించేంత వరకైనా  తనే వుంచుకుంటే? కానీ, ఈమె వ్యక్తిత్వం మంచిది కాక అతడి ప్రవర్తన బాగులేదని చెబుతోందేమో! ఆమె భర్తకి గానీ, తల్లిదండ్రులని గానీ ఆమె ఇక్కడుంటున్నట్టు  తెలిసి, వాళ్ళు తమ ఇంటిమీద పడితే? శ్రీవారూ పిల్లలూ తననేవంటారో?" జవాబు దొరకని ప్రశ్నలతో అలిసిపోయి మూగిగా కూర్చుంది బృంద.

    సాధారణంగా బృంద రాసే ప్రతి కథా చదివి ఉత్తేజితురాలై చక్కటి కామెంటు  చేస్తుంది మహిత. మహిత ఎదురింట్లో  వుంటుంది. ఎమ్.ఏ. చదివింది. భర్త బ్యాంకులో ఆఫీసరు. ఇద్దరు పిల్లలు. చింతల్లేని చిన్న సంసారం వాళ్ళది. మహితతో కబుర్లు  చెప్పడం బృందకి కూడా ఇష్టమే!

    "రా మహితా, సమయాని కొచ్చావు" అంటూ మహితకి పరిచయం చేసింది ఆమెని.

    "ఆమె పేరు చెప్పలేదు" అంది మహిత ఆమెని చూస్తూ - అంతదాకా ఆమె పేరు కూడా అడగనందుకు బృంద సిగ్గుపడింది.

    "నా పేరు మీరా" అంది ఆమె.

    బృంద ఆమె కథంతా చెప్పింది మహితకి.

    మహిత కూడా ఆలోచనల్లో మునిగిపోయింది.

    అన్నింటికీ స్పందించి అనర్గళంగా మాట్లాడే మహిత కూడా మూగగా చూస్తోంది, దిక్కుతోచక!

    మీరా ఆశగా మహితకేసీ బృందకేసీ చూస్తోంది. కాలం ముగ్గురి మధ్యా స్థంభించిపోయింది.

    "మీ పిల్లల కోసమైనా మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి వారి భవిష్యత్తు కోసమైనా  మీరు బాధలన్నీ భరించాలి. పైగా, ఇరవై ఏళ్లు భరించగా లేనిది మరో ఏడాదో రెండేళ్లో భరిస్తే.... ఆ పాప చదువైపోతుంది. ఎక్కడైనా ఉద్యోగం వొస్తుంది. వాళ్ళనీ తీసుకొని వెళ్ళిపోవచ్చు...." చెప్పుకుపోతోంది  మహిత.

    ఆమె మాటలు చెవికి సోకడం లేదు మీరాకి. 'ఇరవై ఏళ్లు భరించగా లేనిది మరో రెండేళ్ళు భరిస్తే పోలా?....' ఈ మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి. బృందకేసి చూసింది. ఆమె ఆ మాటల్నే తన నోటితో చెప్పింది. మీరా వారిద్దరినీ  మార్చి మార్చి చూసింది. ఆ చూపుల్లో ఏహ్యభావం! "మీరేనా చెప్పేవాళ్ళు! చేతికొచ్చినది మీరు రాస్తున్నారు, నోటికొచ్చినది ఆమె చెప్పింది. మీ మాటల్లో మీ రాతల్లో నిజాయితీ లేదు. మీరు ఒడ్డున కూర్చుని కబుర్లు  చెప్పడంతప్ప ఏమీ చెయ్యలేరు" అన్నట్టున్నాయి ఆ చూపులు! శూలాల్లా గుచ్చుకున్నాయి బృంద గుండెల్లో!

    ఆమె "వొస్తా" అంటూ  గిరుక్కున తిరిగిచూడకుండా  వెళ్ళిపోయింది.

    ఆమె వెళ్లిపోయినా ఆమె నీడలు బృంద మస్కిష్కంలో కదులుతూనే వున్నాయి. ఆ మర్నాడు హుస్సేన్ సాగర్ లో తేలిన మహిళ శవం అనే శీర్షికని పేపర్లో చూసి, తనే ఒక హంతకురాలిగా  ఫీలయింది. తన మీద తనకే వొళ్ళు మండిపోయింది. తనచేత పెద్దపెద్ద నీతులు చెబుతూ  రాయించిన  రచయిత్రిని కసితీరా తిట్టుకుంది!

    వారం రోజులు  గడిచిపోయాయి. ఆరోజు  తలంటుకున్న  జుట్టుని ఆరబెట్టుకుంటూ  వసారాలోని  వాలుకుర్చీలో కూర్చునుంది బృంద. అల్లంత దూరాన్నించి అనసూయ కనిపించింది. అనసూయ పక్కనే కబుర్లు చెబుతూ  వొస్తున్న ఆమెని ఆత్రంగా చూసింది. 'అవును. ఆమే - మీరా!' ఆనందంతో లేచినుంచుంది. 

    "పాపం! ఈయమ్మగోరు  బస్సు స్టాండుకాడ దిగాలుబడి  కూకుంది. మేము సినిమాకాడినుంచి వొత్తావుంటే  ఈమెని సూసి ఇవరాలడిగాము. తన గోడంతా సెప్పింది. మా ఇంటాయనకి సెప్పి  ఒప్పించి, మా ఇంటోనే వుంచుకున్నాం. మాతోపాటే, కలో గంజో తాగుతూ  వుంది, ఈ వారం రోజుల్నుంచి. మా ఇంటాయన, మా ఇంటిముందే ఒక  సెడ్డేసి, కూరగాయల దుకునం పెట్టి పించిండు. రోజుకి పదిఏనూ, ఇరవై దాకా ఒత్తున్నాయి. ఆమె అదుట్టం! మా ఇంటి ఎదురింట్లో  ఒక గది కాళీ అయింది. నెలకి అరవై రూపాయలద్దె. ఈ యమ్మని అందులో వుంచేము. మీకీ ఇసయాలు  సెబితే  స్త్రీల కథలు రాసే మీరు ఎంతో సంతోషిస్తారని ఎదురుసూత్తున్నా. పాడు జెరంతో పడి రోజుల్నుంచి పనిలోకే రాలేదుకదా! అంది అనసూయ.

    బృందలోని రచయిత్రిని ఎవరో కొట్టినట్లనిపించింది మళ్ళీ! సిగ్గుతో మాట్లాడలేక మీరానే చూస్తూ వుండిపోయింది. 

    "అవునండీ! మా పిల్లల్ని  నేననుకున్నట్టుగానే, మా అమ్మ వాళ్ళూ తీసుకెళ్ళారట. ఆయన  ఈ వూరి నుంచి మదురైకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారట. అడ్రసిచ్చి పంపితే, అనసూయ భర్త ఈ సమాచారం సేకరించి పెట్టాడు" అంది.

    బృంద చెయ్యలేని పని చదువూ సంధ్యాలేని పనిమనిషి అనసూయా. ఆమె భర్తా చేసి చూపించారు. మళ్ళీ తనలోని రచయిత్రి సిగ్గుతో కుచించుకు పోయింది.

    "రచయిత్రీ! నీకు జోహార్లు!!" అనుకుంది తనలోని రచయిత్రిని కసిగా చూస్తూ బృంద!

    "నేను మీలాగా చదువుకున్నదాన్నికాను. కానీ, మీ రచనలు చదివి' సమస్యలకి మీరిచ్చే పరిష్కారాన్ని  అర్ధం చేసుకుని. ఎట్టి పరిస్థితిలోనూ సమస్యలకి చావు పరిష్కారం కాదు అని తెలుసుకున్నాను. ఆ బోధనలే నాలోని ఆశని చావకుండా చేశాయి. నా కాళ్ళమీద నేను నా స్వశక్తితో నుంచునే ధైర్యాన్నిచ్చాయి. నాలాంటి పరిస్థితులలో  కొట్టుకుపోతూన్న  వారికి మీరిచ్చే సందేశాలు సంజీవినిలా పనిచేస్తాయి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అంది మీరా.

    ఆమెలోని  ప్రతీ మాటకీ బృంద స్పందించిపోయింది! ఆమె కళ్ళంటనీళ్ళు చెంపల మీదుగా  ముత్యాల్లా రాలాయి! ఆమెలోని రచయిత్రి తృప్తిగా తలెత్తి చూసింది!

    కాస్సేపు కూర్చుని కాఫీతాగి మీరా వెళ్ళిపోయింది. పని పూర్తి చేసుకుని, అనసూయా వెళ్ళిపోయింది. కాగితాలు ముందేసుకుని  తనలోని  రచయిత్రికి నమస్కరిస్తూ  కలం పట్టింది. బృంద భావతరంగాలతో  పోటీపడుతూ  అక్షరాలు పరుగెడుతున్నాయి.