Facebook Twitter
మాలతీ చందూర్‌గారికి అక్షరనివాళి

మాలతీ చందూర్‌గారికి 

అక్షరనివాళి

         

         తెలుగు సాహిత్యంలో ఓ శంకం ముగిసింది.. ఓ అక్షర ప్రయాణం ఆగిపోయింది. వేల శీర్షికల దూరం తను నడిచి మనల్ని నడిపించిన ఓ కలం శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఐదు దశాబ్దాలకు పైగా నవలలు శీర్షికలు, విమర్షనాస్త్రాలను రాసిన మాలతీ చందూర్‌గారు అస్తమించారు. భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిన్న తరతరాలకు సరిపడా సాహితీ సంపదను మనకందించి వెళ్లారు.

 నాలుగైదు దశాబ్లాత క్రితమే సాహిత్యం మీద అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కరలేని పేరు మాలతీ చందూర్‌. ఆంద్రప్రభలో వచ్చిన ప్రమదావనం, స్వాతిలో పాతకెరటాలు శీర్షికలతో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు సాహితీ ప్రియులను అలరించారు ఆమె.

 అంతే కాదు సాంప్రదాయ తెలుగు సాహిత్యానికి భిన్నంగా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన అతి కొద్ది మందిలో మాలతి గారు ఒకరు. ముఖ్యంగా పాతకెరటాలు పేరుతో ఆమె రాసిన శీర్షికలో ఎన్నో ప్రపంచ ప్రసిద్ద నవలను తెలుగు జాతికి పరిచయం చేశారు.

 ఆమె రచనల్లోని సాహిత్య విలువలు చూసిన వారు ఈవిడ ఎంతటి విద్యావంతురాలో అనుకుంటారు. కాని నిజానికి ఆమె ఉన్నత విద్యలేవి అభ్యసించలేదు. అయిన ఐదు దశాబ్దాల పాటు ఓ పత్రికలో ఏకదాటిగా శీర్షికను నిర్వహించిన ఏకైక రచయితగా ఆమె అరుదైన ఘనత సాధించారు.

 మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం, జ్ఞానాంబ దంపతులకు 1928 డిసెంబర్ 26న జన్మించారు. 8వ తరగతి వరకూ నూజివీడులోనే చదువుకున్న ఆమె.. ఏలూరులో హైస్కూలు, ఉన్నత విద్య పూర్తిచేశారు. అనంతరం ఏలూరులోనే కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రముఖ రచయిత ఎన్‌ఆర్ చందూర్‌తో 1948లో ఆమె వివాహం జరిగింది. అనంతరం వారు చెన్నైలో స్థిరపడ్డారు.

కేవలం ఆమె రాసిన నవలా పరిచయాలే "పాత కెరటాలు", "నవలా మంజరి" పేర్లతో పుస్తకాలుగా విడుదలయ్యాయి. తెలుగు సాహిత్యం పాటు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా ఆమె తెలుగు వారికి పరిచయం చేశారు. కేవలం ఆమె రచనల కారణంగానే ఆంగ్లసాహిత్యం చదవటానికి అలవాటు పడిన మహిళలు ఎందరో ఉన్నారు. తను రాసే నవల పరిచయాలలో కేవలం నా పరిచయం మాత్రమే కాదు అసలు నవలను కూడా చదివి ఆనందించండి అని విన్నవించిన సంస్కారం ఆమెది.

 ఆమె రచనల్లో ముఖ్యంగా ప్రస్థావించ వలసిన మరో రచన ప్రమదావనం. ఈ శీర్షికలో పాఠకుల అడిగిన ప్రశ్నలకు లోతైన విశ్లేషణలతో సమాదానాలు చెప్పేవారు. అంతర్జాతీయ వార్తలనుండి అంతరిక్షం దాకా ఎలాంటి ప్రశ్నలకైన ఆమె సమాధానాలు ఇచ్చేవారు. కుటుంభ సమస్యలనుండి రాజకీయ విషయాల వరకు అన్ని విషయాలను ప్రస్థావించేవారు. ప్రమదావనం శీర్షిక చూసిన వారికి ఈమెకి ఇన్ని రంగాల మీద అవగాహన ఎలా ఉంది అన్న అనుమానం రాక మానదు.. అంతగా ఆమె రచనలు ఆకట్టుకునేవి.

 అప్పట్లో సినిమా హీరోలకు ఉన్నంత పాపులారిటీ ఫాలోయింగ్‌ మాలతీ చందూర్‌గారికి ఉండేది. మద్రాసు వెళ్లిన తెలుగు వారు సినిమా నటులతో పాటు మాలతీ చందూర్‌ గారిని చూడటానికి కూడా క్యూ కట్టే వారు. తెలుగు సాహితీ లోకంలో అంతటి కీర్తినార్జించారావిడ.

 కేవలం శీర్షికలు నవలలే కాదు, స్త్రీలకు ఉపయోగపడే వంటలు, పిండివంటలు అనే పుస్తకాన్ని కూడా రచించారు. అప్పట్లో అమ్మాయి పుట్టింటి నుంచి ఇచ్చే సారేలో వంటలు పిండివంటలు పుస్తకం కూడా ఓ ముఖ్య వస్తువుగా ఉండేది. అంతేకాదు 1974లో తొలి ముద్రణ జరిగిన ఈ పుస్తకం ఇప్పటికి 30 సార్లకు పైగా ముద్రితం అయింది. ఓ రచన ఇన్ని సార్లు ముద్రించబడటం కూడా ఓ రికార్డే.

 తన సాహితీ ప్రయాణంలో 25 కి పైగా నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారు.  ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు విశేష ఆదరణ పొందాయి. గుజరాతీ, తమిళం, హిందీ లాంటి ఇతర భారతీయ భాషలలోకి అనువాదం అయి అక్కడ కూడా పాఠకాదరణ పొందాయి.

ఇలా తెలుగు అక్షరానికి ఎనలేని సేవలందించిన మాలతీచందూర్‌ గారికి  తెలుగువన్‌ అక్షరనివాళులర్పిస్తుంది.