Facebook Twitter
మనసున్న కథకుడు

మనసున్న కథకుడు

రావిశాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

                                                                                             రమ

 

ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వ విషయంలో శ్రీశ్రీ కి ముందూ శ్రీ శ్రీ కి తరువాత  అని చెప్పుకున్నట్టు గానే, కథానికల విషయంలో రావిశాస్త్రికి ముందూ, రావి శాస్త్రి కి తరువాత అని చెప్పుకోవాలసి ఉంటుందంటారు విమర్శకులు.
 వస్తు స్వీకారంలోనే కాదు, రచనా ప్రక్రియలో నిర్వహణ లో, నిర్మాణంలో,సంభాషణల లో,పాత్ర చిత్రణలో కథాకథనంలో వైవిధ్యాన్ని ప్రదర్శించిన వాడు, తనదంటూ కొత్త విధానాలను నిర్మించుకున్న రచయిత రావిశాస్త్రి. కథా కథనంలో  ఎన్ని రకాల వైవిధ్యం ఉండడానికి వీలుంటుందో అన్ని రకాల పద్దతులూ రావిశాస్త్రి గారి రచనల్లో కనిపిస్తాయి. రావి శాస్త్రి గారి నవలల్లో కనిపించే పాత్ర వైవిధ్యం తెలుగులో చాలా తక్కువ మంది రచనలలో కనిపిస్తుంది.పై తరగతి, మద్యతరగతి మనుష్యులతో పాటు ఎన్ని రకాల బతుకులు బతకటానికి వీలుందో అన్ని రకాల బతుకులు బతికే కింది తరగతివాళ్ళు రావిశాస్త్రి రచనల్లో కనిపిస్తారు. రావిశాస్త్రి గారి కథలు ఒక్కొక్కటి జీవితంలో ఒక్కొక్క కోణానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. నవలలు అంతకంటే లోతుగా వెళ్లి మానవ స్వభావాలను, జీవన సంక్లిష్టతను, సమాజంలోని వివిధ వర్గ స్వరూపాలను సూక్ష్మాతి సుక్ష్మా వివరాలతో చిత్రిస్తాయి. రావిశాస్త్రి గారి నవలలో కథా కథనం మాత్రమే ప్రధానంగా కనిపించదు.జీవిత వాస్తవాలను ముందుచటం, వాటి ఆధారంగా వ్యవస్థపైన సునిశిత విమర్శ ఈ నవల్లో ప్రధానంగా కనిపిస్తాయి మనకి.

  రావిశాస్త్రి గారి నవలల్లో  కనిపించే మరో విశేషం సినిమా శిల్పం, చదువుతుంటే చూస్తున్న అనుభావాన్ని కలిగిస్తాయి. ఆయన నవలలో ప్రతి నవలా ఒక సినిమాకు స్క్రీన్ ప్లే  రాసినట్టుగా ఉంటుంది.ఇక రావిశాస్త్రి గారి కథల విషయానికొస్తే సంభాషణలు, పాత్రలు, మొదలైన విషయాలలో కథ ఎన్ని రకాల పోకడలు పోగలదో   అన్ని రకాల పోకడలు ఆయన కథలలో  కనిపిస్తాయి. ఆయన కథలు ఆయనతో పాటు ఎదుగుతూ, మారుతూ, మెరుగవుతూ వచ్చాయని చెప్పొచ్చు. తొలిదశ మద్య తరగతి జీవితాలు, తాతాత్విక ధృక్పదం  చుట్టూ తిరిగేతే, రెండవ దశలో  కథలు న్యాయన్యాయలు, సామాజిక స్పృహ తో కనిపిస్తాయి. ఆ తరువాత దశలోమరీ ముఖ్యంగా ఆరుసారా కథలతో జీవితపు లోతుల్లోకి, సమాజపు చీకటి కోణాల్లోకి ఆయన కథ ప్రవేశించిందని చెప్పొచ్చు. బూర్జువా రాజ్యం,పరిపాలనా యంత్రాంగం,న్యాయవ్యవస్థ సామాన్యుల జీవితాన్నిఎంతగా సంక్లిష్టంగా చేసిందో దయనీయంగా మార్చిందో అరుసారా కథలు, పిపీలికం, సృష్టిలో, తలుపుగొళ్ళెం, రొట్టెముక్క,లక్ష్మీ, 'మంచి'చెడ్డల్లో ',ఏ కథ, షోకు పిల్లి- విశ్వ సాహిత్యం లోనే గొప్ప కథలుగా చెప్పుకోతగ్గవి .జీవితమే సాహిత్యం కావాలని నిష్కర్షగా చెప్పినవాడు గురజాడ . ఆ అభిప్రాయం తోనే రచనలు చేసినవారు రావిశాస్త్రి." కథలు ఆకాశంలో పుట్టవు మనిషి జీవితం లోంచే పుడతాయి. అందుకనే రచయితలు జీవితానికి దగ్గరగా ఉండాలి. జీవితానికి దగ్గరగా ఉండగలిగినవాడే మంచి రచయితగా మిగులుతాడు" అనేది రావిశాస్త్రి గారి సిద్ధాంతం.