Facebook Twitter
దాశరధీ కవితా పయోనిధి

 దాశరధీ కవితా పయోనిధి

   - కనకదుర్గ

  "కవిత వ్రాసినపుడే అది కలమవుతుంది.

     పాట పాడినపుడే అది గళమవుతుంది

       బలాఢ్యులను చిత్తు చిత్తుగా ఓడించి

       దుర్బలులను ఆదుకుంటే, బలమవుతుంది."

                (దాశరధి గారు రాసిన తెలుగు రుబాయి)

 

" డా. దాశరధి ఒక శక పురుషుడు, మహాకవి - ఆయన కవితాశరధి.  నన్ను అన్నగారూ, అని అత్యంత ఆప్యాయతతో పలకరించి, మా కుటుంబ సభ్యులలో నొకరుగా కలసి మెలసి వున్న రోజులు మరవరానివి.  ఎంత గొప్ప మహాకవియో అంత ఉన్నతమైన మహామనిషి, స్నేహపాత్రుడు, నిగర్వి, ప్రేమకు చిహ్నం. 

నా తమ్ముడు దాశరధి నేను మద్రాసు ఆకాశవాణిలో కలసి పనిచేసిన రోజులు చిరస్మరణీయం.  కొన్నాళ్ళు మేమిద్దరం ఒక ఇంటిలో ఫ్లాట్సులో వుండెడివారము.  వారి కుటుంబమూ, నా కుటుంబమూ ఒక కుటుంబముగా మెలగినాము.  వారులేని లోటు నాకు తీరని వ్యధ.  వారి అకాలమరణం కవితా ప్రపంచానికి ముఖ్యంగా నాకు చెరగని మచ్చ.  వారి కవితా గేయములు నేను పాడినాను. సినిమాలో కూడా పాడినాను.  ఆ పాటలు నేటికీ చెరగని ముద్రగా శ్రోతల హృదయంలో నిలిచియున్నవి." అన్నారు ప్రముఖ సంగీతకారులు, దాశరధి గారికి మంచి మిత్రుల్లో ముఖ్యులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. 

దాశరధి గారు చాలా మందికి ఒక కవిగా, సినీ కవిగానే బాగా తెలుసు కానీ ఆయన స్వాతంత్ర్యయోధుడు, నిజాం రాజుని తన కవిత్వంతో అతని గుండెలో భయాన్ని కలిగించిన సాహసవంతుడు.  నిజాం రాజు గురించి మాట్లాడటానికే భయపడుతున్న సమయంలో "నిజాం రాజు తర తరాల బూజు," "ముసలి నక్కకు రాచరికంబు దక్కునే," అని జైలు గోడలపై రాసి జైలులో వుండి కూడా తన కవిత్వ ప్రభావంతో ప్రజల్లో చైతన్యాన్ని, నిజాంని గడ గడలాడించిన ధీరుడు దాశరధి.  ఆయన మొట్ట మొదటి కవితాఖండం, "అగ్నిధార."  ఇందులోని చాలా వరకు కవితలు ఆయన జైలులో వున్నపుడు ఆశువుగా చెబుతుంటే ఆయనతో పాటు వున్న తోటి కవి మిత్రులు, విని అవి మరచిపోకుండా మెదడులో భద్రపరచుకుని జైలునుండి బయటకు వచ్చాక

దాశరధి గారికి కవితాఖండం పూర్తి చేయడానికి సాయం చేసారు. 

" పటు బాహాబలురైన ఆంధ్రుల గత

  ప్రాశస్త్యముల్ వల్లె వే

  యుటలో కొన్ని తరాలు దాటినవి: పూ

  ర్వోదంతముల్ నేటి సం

  కటముల్ తీర్పవు గాక, నాటి జ్వలితాం

  గారమ్ము లీనాటి కుం

  పటిలో బూడిద కప్పుకొన్నవి, రగు

  ల్పన్ లెమ్ము వీరాంధ్రుడా!"

( వీరాంధ్రుడా! -1 : అగ్నిధార )

  ఆ తర్వాత ఎన్నో కవితా ఖండాలను రాసారు, 'రుద్రవీణ,' 'తిమిరంతో సమరం,' 'అమృతాభిషేకం,' 'పునర్నవం,' 'మహాంధ్రోదయం,' 'కవితాపుష్పకం,' ' జ్వాలాలేఖిని,' 'గాలిబ్ గీతాలు,' నేత్రపర్వం,' లాంటివి ఎన్నో వున్నాయి.  దాశరధి గారికి చిన్నప్పటి నుండి ఉర్దూ భాష, అరబ్భిక్, ఫారసీ భాషలంటే చాలా మక్కువ, ఉర్దూ మాష్టర్ మిర్జా గాలిబ్ కవిత్వం గురించి చెప్పే పద్దతి ఎంతగా నచ్చిందంటే ఆయనకు గాలిబ్ జీవిత చరిత్ర తెలుసుకోవడం ఆయన గజల్స్ చదవడమంటే చాలా ఇష్ట పడేవారు.  అదే ఇష్టం పెద్దయ్యాక గాలిబ్ గారి గజల్స్ ని తేటతెనుగులో కవితలుగా అనువదించారు.  దీని కోసం ఆయన చాలా కష్టపడ్డారు.  ఒకోసారి ఒక కవిత అనువాదం అయిపోయింది అనుకుని సంతోషించే లోపల అది మళ్ళీ చదివితే పూర్తి అర్ధం సరిగ్గా రాలేదనిపించి మళ్ళీ దాన్నిఎంత రాత్రయినా, ఎన్ని రోజులయినా సరే ఆయనకు సంతృప్తినిచ్చేదాక పని చేస్తూనే వుండేవారు.  అనువాదం పూర్తయ్యాక దాశరధి గారి అభిమాన సినీ నటులయిన నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వడం వారిద్దరి మధ్య మంచి స్నేహం పెనవేసుకోవడం జరిగింది. 

"రమ్మంటే చాలు గానీ

  రాజ్యాలు విడిచిరానా

  నీ చిన్ని నవ్వుకోసం

  లోకాలు గడచిరానా."

గాలిబ్ కవితల నుండి ఈ ఒక్క కవిత చదివితే చాలు తెలిసిపోతుంది ఎంత సులభంగా అర్ధమయ్యే రీతిలో తేట తెలుగులో రాసారో దాశరధి గారు. 

దాశరధి గారు తెలుగులో గజల్స్ రాయడమే కాదు రుబాయీలను కూడా చాలా రాసారు.  రుబాయి అంటే నాలుగు లైన్ల కవిత అని అర్ధం.

దాశరధి గారి కవితల్లో పేదవాడి కష్టాలు, అవి తీరే రోజులు త్వరలో వున్నాయని ఆశాభావాన్ని చూపించేవారు.  ఆయన ప్రజల మనిషి, ప్రజల కవి.

'జ్వాలా లేఖిని,' అనే కవితా సంపుటి నుండి"ప్రజల పంచాంగం,' అనే కవితలో ఇలా రాసారు.  ఏ పండగకి కవిత రాసినా బీద గొప్ప తేడాలు పోవాలనే ఆశని వ్యక్తం చేసేవారు.

    "..ప్రజల మాటకు తిరుగులేదండి

      ప్రజల కోరిక తీరవలెనండి.

      ధనపిశాచం ఆట కట్టాలి

      జన పతాకం కోటకెక్కాలి

       శ్రమికజాతికి విజయమగునండి....

       దుష్ట శక్తులు తొలగిపోవాలి

       కష్ట జీవుల బ్రతుకు మారాలి

        ప్రజాస్వామ్యం సామ్యవాదంతో

        చేయి చేయీ కలిపి నడవాలి

        తెలుగు జాతికి కీర్తి పెరగాలి."  దాశరధి గారు తన కవితల్లో పేదవాడికి పెద్ద పీఠం వేసేవారు.

దాశరధి గారు సినీ కవిగా "వాగ్ధనం," సినిమాలో 'నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా' అనే గీతంతో సినీ రంగ ప్రవేశం జరిగింది.  ఆ సినిమాలో ఆయన రాసిన పాట బాగా హిట్ అయ్యి ఆయన సినీ కవిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని కొన్ని వేల పాటలు రాసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల, శ్రోతల మదిని దోచుకున్నారు.  అమ్మ పాట అనగానే దాశరధి గారు రాసిన, ' అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నేన్నో తెలియని మమతల మూట,' పాటే గుర్తొస్తుంది.  వీణ పాటలంటే దాశరధి గారే రాయలనుకునేవారు సినీ పరిశ్రమలో, అలాగే అన్నా చెల్లెళ్ళ పాటలు కూడా బాగానే రాసారు.  ఇటు అందమైన ప్రేమ గీతాలను, శృంగార గీతాలను ఎంతో సున్నితంగా రాసేవారు ఎటువంటి అశ్లీలతకు అవకాశముండేది కాదు ఆయన పాటల్లో.  అలాగే దేశభక్తి గీతాలు, లలిత గీతాలెన్నో రాసారు ఆయన ఆకాశవాణిలో పని చేసినపుడు.  ఘంటసాల గారు ఒకసారి దాశరధి గారిని సినిమా కోసం కాకుండా మామూలుగా రాసిన పాటలేవైనా వుంటే ఇమ్మని అడిగి మరీ తీసుకుని పాడారు, 'తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే..', 'వెలిగించవే చిన్నవలపు దీపం, ఎందుకే రాణి నా మీద ఇంత కోపం,'  లాంటి పాటలు పాడారు.  పి.బి. శ్రీనివాస్ గారు కూడా దాశరధి గారి గజల్స్ ని ఎన్నో పాడారు.  ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు కూడా ఆయన రాసిన తెలుగు గజల్స్ ని పాడారు, పాడుతున్నారు. 

దాశరధి గారిని ఎన్నో బిరుదులు వరించాయి, ఎన్నో సన్మానాలు అందుకున్నారు.

1967 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ , తామర పత్ర అవార్డ్ ని 1972 లో, జాతీయ సాహిత్య అకాడెమీ అవార్డ్ 1974లో అందుకున్నారు.

కళాప్రపూర్ణ డాక్టరేట్ డిగ్రీని ఆంధ్రా యునివర్సిటీ వారు 1975లో ఇచ్చి సత్కరించారు,  అలాగే ఆగ్రా యునివర్సిటీవారు 1976లో, శ్రీ వెంకటేశ్వర యునివర్సిటీ వారు 1981 లో సాహిత్యంలో డాక్టరేట్ అంటే డి.లిట్ ని ఇచ్చి సత్కరించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనని ఆస్థాన కవిగా కూడా నియమించారు.

దాశరధి గారు మానవతావాది, ఆయనకు ఎలాంటి తేడాలు లేవు.  కులమత బేధాలు కానీ, ఎటువంటి బేషజాలు లేవు.  ఆయన అందరినీ ఒకటే రకంగా చూసేవారు, పిల్లల్లంటే ఇష్టపడేవారు.  మంచి స్నేహశీలి.  ఆయన స్నేహితుల్లో, వానమామలై వరదాచార్యులు, వట్టికోట ఆళ్వార్ స్వామి, కాళోజి, డి.రామలింగం, వి.హెచ్. దేశాయ్ గారిలాంటివారు ఆయనతో పాటు జైళ్ళల్లో వున్నారు, కష్టసుఖాలను పంచుకున్నారు.

సి. నారాయణ రెడ్డి గారు, దాశరధి గారు, కాళోజి గారు కలిసి తెలంగాణా రచయితల సంఘం ప్రారంభించి అన్ని జిల్లాలకు వెళ్ళి కవిత్వంతో ప్రజలను  చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించేవారు.  సినీ కవులందరూ ఆయనకు మిత్రులే, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీగారు, తర్వాత వచ్చిన వారు కూడా ఆయన సినీ గీతాలు రాసే పద్దతిని ఇష్ట పడేవారు.   ఆయన తమ్ముడు దాశరధి రంగాచార్యులు గారు, రచయిత. "చిల్లరదేవుళ్ళు,' నవలకి సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చింది, ఆ నవలని సినిమాగా కూడా తీసారు, నాలుగు వేదాలను తెనుగీకరించారు. దాశరధి గారికి ముగ్గురు చెల్లెళ్ళు.  ఆయన భార్య లక్ష్మి గత సంవత్సరం తన భర్తని చేరుకున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. 

దాశరధి గారు ఇంకా ఎంతో సాహిత్య సేవ చేయవలసింది మిగిలి వుండగానే చిన్న వయసులోనే 1987లో కార్తీక పున్నమి నాడు పై లోకాల్లో తన కవితా గానం వినిపించడానికి వెళ్ళిపోయారు.

ఆయన తెలుగు ప్రజానీకం అంతా కలిసి మెలసి వుండాలని కోరుకునేవారు. 

"ముక్కలైన మాతృమూర్తి గేహమ్మును

 కూర్చి కట్టినట్టి కొమరులార!

 ఐకమత్య బంధమన్ని కాలాలలో

 నిలిచియుండుగాక తెలుగునేల." 

 "దాశరధిలో మంచితనం, మంచి కవి, మంచి మిత్రుడు, నిష్కపటి, కుట్రలు, కుతంత్రాలు తెలియని వ్యక్తి.  ఈ గుణాలన్నీ కలిసి వున్న వ్యక్తులు చాలా అరుదుగా మనకి తారసపడతారు.  ఆయన చిన్న వయసులోనే పోవడం కవితా ప్రపంచం, సినీ పరిశ్రమ, ఆయన అభిమానులకి తీరని లోటు." అన్నారు  దాశరధి గారికి మంచి ఆప్త మిత్రులయిన శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు.  అలాంటి సరస్వతీ పుత్రులు, మహానుభావులు, మానవతావాది, స్నేహశీలి, మళ్ళీ మళ్ళీ పుట్టడం కష్టం.  అలాంటివారిని 'నభూతో నభవిష్యతి.' అంటారు. 

దాశరధి గారు బౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన మనకందించిన కవితాఖండాలు, సంపుటాలు, రుబాయిల్లో, గజల్స్ లో, లలిత గీతాల్లో, దేశభక్తిగీతాల్లో, సినీగీతాల్లో ఎప్పటికీ మనమధ్యనే వుంటారు. 

                                                                  ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.