Facebook Twitter
తూర్పు పడమర డిజైన్స్ కలయికతో అమెరికాలో లంగావోణీలు


                                                                                                    -కనకదుర్గ

అమెరికాలో కాలిఫోర్నియా, సాన్ హోజే(San Jose) స్టేజ్ పై రక్ రకాల అందమైన లంగా ఓణీలు వేసుకుని కేవలం భారతీయ అమ్మాయిలే కాదు కొంతమంది అమెరికన్ అమ్మాయిలు కూడా ఫ్యాషన్ షో చేస్తున్నారు.  ఇదేమిటీ? లంగా ఓణీలతో ఫ్యాషన్ షో ఏమిటి అనుకుంటున్నారా?  అవునండీ అది చేయిస్తున్నది ఎవరో కాదు, అనుషా కూచిబొట్ల.  "వోల వోల " అనే పేరుతో లంగా వోణీలు డిజైన్ చేసి ఫ్యాషన్ షోస్ చేసి, అమెరికాలో వుండే భారతీయులకి సాంప్రదాయమైన ఈ బట్టలను అందజేయాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఈ ప్రయత్నం గత రెండేళ్ళుగా మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నది. 

 అసలు అమెరికాలో లంగా వోణీలను డిజైన్ చేసి అవి ఇక్కడ సెటిల్ అయిన భారతీయుల కుటుంబాలకు అమ్మాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు, అనుషా తడుముకోకుండా చెప్పే సమాధానం, " నాకు చిన్నప్పటినుండి ఫ్యాషన్ అన్నా రకరకాల బట్టలన్నా చాలా ఇష్టం. కేవలం వాటిని చూడడమే కాదు అవి ఎలా డిజైన్ చేసారు, ఎవరు చేసారు, వాటి లేబుల్స్ ఏమిటి, అవి ఎలా అమ్ముడుపోతున్నాయి లాంటి విషయాలు బాగా గమనించేదాన్ని.  ఇండియా కెళ్ళినప్పుడు కొన్నేళ్ళ క్రితం అక్కడ అస్సలు లంగా ఓణీలు కనిపించేవి కాదు. మేము బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అడిగితే అంటే వూర్లల్లో కూడా,'ఇపుడు అవి ఎవరు వేసుకుంటున్నారమ్మా?  చుడీదార్ లయితే మీకు సులభంగా వుంటుంది అవే వేసుకొండి'అనేవారు. 

   

నాకు చాలా బాధేసింది.  నాకు లంగా ఓణీలంటే చాలా ఇష్టం. అవి పూర్తిగా కనుమరుగవుతున్నాయంటే ఏదైనా చేయాలనిపించింది.  అమెరికాలో ఇండియన్ బట్టలు కావాలంటే అన్ని సిటీస్ లో దొరకవు, న్యూజెర్సీ లాంటి ప్రదేశాలకి వెళ్ళినా అక్కడ కూడా చుడీదార్ లు, చీరలు మాత్రమే దొరికేవి, లంగా జాకెట్లు కానీ, లంగా ఓణీలు కానీ దొరికేవి కావు." అని చెప్పింది అనూష. 

మరి ఈ వోల వోల ఎప్పుడు మొదలు పెట్టారు?అనే ప్రశ్నకి, "ఎప్రిల్, 2011 ఉగాది రోజు మొదలు పెట్టాము.  నాకు చిన్నప్పటినుండి మన సాంప్రదాయమైన బట్టలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా లంగా ఓణీలు, వాటి అందం వాటిదే కదా!  నా కాలేజ్ చదువయి పోయాక నా ఐడియా గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు అదీ కాకుండా నన్ను అమ్మ, శాంతి, నాన్న ఆనంద్ కూచిబొట్ల ప్రోత్సహించారు."

ఆనంద్ కూచిబొట్ల గారు గైడెన్స్ ఇవ్వడమే కాకుండా, అనూషాకున్న వోల వోల ఐడియాలో ముఖ్యపాత్ర వహిస్తారు.  ఇది కుటుంబం అంతా కలిసి చేసే పనిగా మారింది. అనుషా అత్తయ్య గిరిజ లల్లా, తను ఇండియా నుండి మంచి నాణ్యమైన బట్ట లంగా వోణీలకు కావాల్సినవి అనూష ఎలాంటి కలర్స్ కావాలన్నా, ఎలాంటి డిజైన్ క్లాత్ కావాలన్నా పంపిస్తుంది.  ఒకోసారి  డిజైన్ చేసి పంపిస్తే ఆ ఫ్యాబ్రిక్ తయారు చేయించి పంపిస్తుంది.   

 

అమ్మ,శాంతిగారు అనూష డిజైన్ చేసినవి చక్కగా కుడుతుంది, అన్నీ సైజులు, రక రకాల లంగాలు, ముఖ్యంగా జాకెట్లు ఏ డిజైన్ వైనా చాలా బాగా కుడుతుంది,  బొటిక్, (Boutique) కస్టమర్ మ్యానేజ్మ్ంట్ కూడా తనే చూసుకుంటుంది.   తమ్ముడు అరుణ్ వెబ్ డిజైనింగ్,గ్రాఫిక్స్, ఫాంప్లెట్స్ తయారు చేయడం, వాటిని అందరికీ పంచడం, మార్కెటింగ్ పనుల్లో సాయం చేయడం చేస్తాడు. అనుషా కొత్త కొత్త ఐడియాలతో డిజైన్ చేయడం, షోస్ అరేంజ్ చేయడం, మార్కెటింగ్ పనులు చూసుకుంటుంది.

" మేమందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మా కందరికీ ఆనందానిచ్చే పని ఇది.  ఇప్పటి వరకు అందరి ఆశీర్వాదంతో, సహకారంతో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.  ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాను. మేము షోస్ చేసినపుడు ఇక్కడ అమ్మాయిలు, అమెరికన్స్ వారికి మన భారతీయ సంస్కృతి గురించి అంతగా తెలియక పోయినా వచ్చి వారికి నచ్చినవి ఒక జతే కాదు కొన్ని జతలు కొనుక్కేవాళ్ళను చూస్తే చాలా సంతోషమేస్తుంది.  ఇండియన్ కుటుంబాల్లో ఒకోసారి పిల్లలకి ఇష్టం లేకున్నా తల్లి తండ్రులు వారికిష్టం కాబట్టి కొంటారు.  కానీ అదే ఇతర దేశాల వారయితే ఎవ్వరి ప్రోద్భలం లేకుండానే వారి ఇష్ట ప్రకారం ఆనందంగా కొనుక్కుంటారు, " అని గల గలా మాట్లాడుతూ చెప్పింది అనూష.

 

ఇంతకీ"వోల వోల" అంటే ఏమిటో తెలుసుకున్నారా?  వోణీ లంగా అని అర్ధం అలాగే ఇటాలియన్ లో "వోల వోల"అంటే "ఫ్లై హై" (Fly High) అని కూడా అర్ధం అన్న మాట! అనూష బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మేజర్ సబ్జెక్ట్ మరియు మైనర్ సబ్జెక్ట్ లా యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్ సైడ్ లో చేసింది.  అనూష కేవలం వోల వోల పనే చేస్తుందనుకుంటే పొరపాటేనండోయ్. 

మొదలు వెరాబ్రాడ్లీ (VERA BRADLEY) వారి బ్రాంచ్ సాన్ హోజేలో కొత్తది ప్రారంభించినపుడు దానికి మ్యానెజర్ గా పని చేసింది.  మొత్తం షాప్ పని మొత్తం తనే చూసుకునేది దాంతో మంచి అనుభవం సంపాదించింది.  ప్రస్తుతం ఒక కంపెనీలో మార్కెటింగ్ ప్రోగ్రామ్ మ్యానెజర్ గా తను పొద్దున ఫుల్ టైమ్ జాబ్ చేస్తుంది.   సాయంత్రం ఈ"వోల వోల" పని చేస్తుంది.   ఇండియాకి ఫోన్లు చేసి మాట్లాడటం, తన డిజైన్స్ తయారు చేసుకోవడం, షోస్ వుంటే వాటి పని చూసుకోవడం చేస్తుంది. 

అమెరికాలో పుట్టి పెరిగినా కూడా చక్కగా తెలుగు మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చు.  తెలుగు భాష అంటే విపరీతమైన మక్కువ.  అంతే కాదండోయ్ అనూష మంచి కూచిపూడి నృత్యకారిణి, సంగీతం నేర్చుకుంటుంది, అన్నమాచార్య జయంత్యుత్సవంలో అన్నమాచార్య అభిమానులంతా పాల్గొన్న కార్యక్రమంలో తనూ పాల్గొన్నది. 

 

ఇవన్నీ చేయడానికి సమయం ఎలా దొరుకుతుంది? అంటే, " మనకి ఇష్టమయిన పనులు చేయడానికి సమయం తప్పకుండా దొరుకుతుంది.  అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి, మా అమ్మా, నాన్న చిన్నప్పటినుండి టైమ్ మ్యానేజ్ మెంట్ గురించి నేర్పించారు.  నాకు ఫ్యాషన్(Fashion is my passion)అంటే విపరీతమైన ఆసక్తి, ఆ పని అంటే ఉత్సుకత, ఉత్సాహం అన్నీ కలగలిసి వున్నాయి.  కాబట్టి నాకు ఆ పని అస్సలు కష్టం అని అనిపించదు.  లంగా వోణీలను అంతర్జాతీయంగా పాపులర్ చేయాలని నా ఆలోచన, ఈ మధ్యనే హాంగ్ కాంగ్ నుండి అక్కడి అమ్మాయే మా వోల వోల డిజైన్స్ చూసి ఆర్డర్ చేసింది.  ఇక్కడ వారు కొనుక్కుంటూనే వుంటారు.   మేము కస్టమర్స్ అడిగిన డిజైన్స్ కూడా చేస్తాము, కస్టమ్ మేడ్ లంగా వోణీలన్న మాట.  మేము ఇంకా ఎంతో సాధించాల్సి వుంది.  సాధిస్తామనే నమ్మకం వుంది.  ఇది ఒక టీమ్ వర్క్."

అనూష డిజైన్ చేసే లంగా వోణీలు ఎక్కడికైనా వేసుకుని వెళ్ళేలా వుంటాయి.  ఇండియాలో వస్తున్న లంగా వోణీలు చాలా చమ్కీవర్క్, పూసలు, లేసులు, పెద్ద పెద్ద బార్డర్స్ తో వస్తున్నాయి. అవి పండగలకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వేసుకెళ్ళడానికి బావుంటాయి.  కానీ అనూష డిజైన్స్ మామూలుగా షాపింగ్ కి వెళ్ళేపుడు, ఫ్రెండ్స్ తో వెళ్ళేపుడు, బర్త్ డే పార్టీలకు, అలాగే పండగలకు, పెళ్ళిళ్ళకు వేసుకున్నా బావుంటాయి.

 

 

 నేను 2007లో ఇండియాకి వెళ్ళినపుడు మా అక్కయ్య కూతురు, అన్నయ్య కూతురిని ఓణీలు వేసుకోమని బ్రతిమాలాల్సి వచ్చింది.  అందులో ఒక్కరే వేసుకుని నన్ను సంతోష పెడితే మరొకరు పరీక్షల పేరుతో తప్పించుకున్నారు. ఇండియాలోనే ఇక సాంప్రదాయమైన లంగా ఓణీలు తగ్గుతున్నాయనుకున్న నాకు "వోల వోల" అదీ అమెరికాలో మన సాంప్రదాయమైన, అందమైన లంగా ఓణీలను తీసుకురావడమే కాదు వాటిని బాగా పాపులర్ చేస్తున్నారు. 

వోల వోల మున్ముందుకు సాగుతూ మరెన్నో విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ, మీరిప్పుడు వోల వోల ఓణీల డిజైన్లని చూసి ఆనందించండి!  ఓణీలు పెళ్ళి కాని అమ్మాయిలే వేసుకోవాలనుకునేవారు కానీ ఇప్పుడు ఓణీలు సినిమాల ద్వారానయితేనేమి, పెద్ద పెద్ద డిజైనర్లు కూడా మంచి లంగా వోణీలను చేస్తుండడంతో ఇపుడు పెళ్ళయినవారు కూడా వేసుకుంటున్నారు.  కాబట్టి మీ అమ్మాయిలకు కొని వేయించండి అలాగే మీ సరదా కూడా తీర్చుకొండి.