Facebook Twitter
ప్రథమ తాంబూలం

ప్రథమ తాంబూలం

 

- వసుంధర

 

 

ఇళ్ళ స్థలాలకోసం రీజనల్ డెవలప్ మెంట్ బోర్డుకి అప్లై చేశాను. ఇల్లు కట్టుకునేందుకు మా ఆఫీసు నాకు రెండు లక్షలు అప్పిస్తుంది. దాంతో చక్కటి యిల్లొకటి కట్టేసుకుని అందులోనే ఉండాలని నా ఆశ.
నగరానికి మధ్యలో పెంటకుప్పలుండే పెద్ద స్థాలమొకటుంది. ఆ మైదానం ఊరి అందాన్ని హరిస్తోంది. నగరవాసులక్కడి వాసనను భరిస్తున్నారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ కమీషనర్ ఏ కారణంవల్లనో ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకున్నాడు.
మామూలుగా అయితే అక్కడి స్థలం ధర నా బోటి వాడి కందుబాటులో ఉండదు. ఈ స్థలాన్ని సరసమైన ధరకు అప్లికేశాన్సు ప్రకారం ఎవరికైనా యివ్వాలని మునిసిపాలిటీ నిర్ణయించింది. ఇళ్ళస్థలాల కేటాయింపు న్యాయప్రకాం జరుగుతుందని స్థానిక దినపత్రికలలో ప్రకటించడం కూడా జరిగింది.
అక్కడ వందిళ్ళ కవకాశముంది. అప్లికేషన్సు యాభైవేల దాకా వచ్చాయి. కొందరు ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు జరిగింది. వందమందికి ఉత్తరాలు వెళ్ళాయి. వందమంది పేర్లూ స్థానిక దినపత్రికలో వేయడం కూడా జరిగింది.
అందులో నా పేరూ ఉంది.
స్థలాల కేటాయింపు న్యాయంగా జరిగిందనడానికిదే నిదర్శనం. నేను మంచి ఉద్యోగంలో ఉండి నా మటుక్కు నేనో రిఫ్రిజరేటరు కొనుక్కొగలనేమో! నా పిల్లలు కాస్త మంచిబట్టలు వేసుకుంటారేమో! కానీ నేను నగరానికి సంబంధించి అనామకుణ్ణి.
ఇళ్ళ స్థలాలు కేటాయింపుపైన వారిలో ఇంచుమించు నా బోటివారే!
నేనెంతో సంతోషించాను. వెంటనే ఆమోదాన్ని తెలియబరుస్తూ ఉత్తరం కూడా రాశాను.
నెల్లాళ్ళయింది.
ఒకరోజు మా ఇంటికో మనిషి వచ్చాడు. తన పేరు ధర్మరాజని చెప్పాడు. అతడెవరో నాకు తెలియలేదు.
"నగరం మధ్య మైదానంలో మీకు స్థలం కేటాయింపు జరిగింది. మీకు పదివేలిచ్చి స్థలం కొంటున్నారు. నేనా స్థలానికి పాతికవేలిస్తాను. నాకమ్మేయండి'' అన్నాడతడు.
ఆ ప్రాంతాల స్థలాలే దొరకవు. ఏ సెంటర్లో కొనాలన్నా స్థలం ఆ మాత్రంది కావాలంటే యాభైవేల దాకా అవుతుంది/
నే నతడికి సారీ చెప్పాను.
అతడు ధర పెంచాడు.
నే నొప్పుకోలేదు.
అతడు నలభై వేల దాకా వెళ్ళాడు.
"స్థలం అమ్మే ఉద్దేశ్యం నాకు లేదన్నాను. మీరు బేరాలు చెప్పవద్దు'' అన్నాను కాస్త తీవ్రంగా.
"నేను నేనుగా మాట్లాడ్డం లేదు. కొందరు ప్రముఖుల తరపున వచ్చాను. వారు తలచుకుంటే ఆ స్థలం మీక్కాకుండా పోగలదు'' అన్నాడు ధర్మరాజు.
"ఎలా?''
స్థలం కేటాయింపు జరిగిన నెలరోజుల్లోగా మీరు వాళ్ళకి ఉత్తరం రాయాలి. ఆమోదాన్ని తెలియబరుస్తూ! ఆ ఉత్తరం నెలరోజుల్లోగా వారికి చేరకపోతే మీకా స్థలం అవసరంలేదని వాళ్ళనుకుంటారు. మరొకరికి కేటాయిస్తారు'' అన్నాడతను తాపీగా.
"నేను వెంటనే ఉత్తరం రాశాను. నెల్లాళ్ళవసరం లేదు. వారం రోజుల్లోనే అంది ఉంటుంది''
ధర్మరాజు నవ్వి "ఉత్తరం ఫైల్లోంచి గల్లంతైతే ...?'' అన్నాడు.
నా గుండె గుభేలుమంది.
రీజనల్ డెవలప్ మెంట్ బోర్డు ఆఫీసులో ఇలాంటివి చాలా జరుగుతాయని విన్నాను.
"గల్లంతెందుకవుతుంది?'' అన్నాను మేకపోతు గాంభీర్యంతో.
"రిజిస్టర్డు ఉత్తరాలే గల్లంతవుతాయి. మీరు మామూలుత్తరం రాశారు. గల్లంతు చేయడం మాకు కష్టం కాదు. రెండ్రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. ఈలోగా ఆలోచించుకోండి'' అని ధర్మరాజు వెళ్ళిపోయాడు.
నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. రిజిస్టర్డు లెటరు రాయాల్సింది.
ఇప్పుడిక టైము లేదు. గడువైపోయింది.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా శ్రీమతి పిలిచి ఏదో పని చెప్పింది. బజారుకు వెళ్లాను. అనుకోకుండా బజార్లో భూషణరావు కనబడ్డాడు.
భూషణరావు నా క్లాస్ మెటు. ఇద్దరం విడిపోయి  ఆరేళ్ళయింది. వాడు హైదరాబాదులో ఉండాలని గుర్తు.
"అరే! భూషణ్! నువ్విక్కడున్నావేమిటి?'' అన్నాను.
వాడూ నా గురించి అదే ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.
ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం.
భూషణరావు రీజనల్ డెవలప్ మెంట్ బోర్డ్ ఆఫీసులో ఆఫీసరుగా వచ్చి రెండు నెలలయింది.
వెంటనే నేను వాడికి నా సమస్య చెప్పుకున్నాను.
"ఇదేం పెద్ద సమస్య కాదు. రేపోసారి ఆఫీసుకురా'' అన్నాడు భూషణరావు.
"నా వివరాలిస్తాను. నేను మళ్ళీ ఆఫీసుకి రావదమెందుకు?'' అన్నాను.
"అలా కాదు ఎవరి కేసునైనా వ్యక్తుల సమక్షంలోనే చూడాలని మాకు నియమముంది. లేకుంటే ఇంటికి వచ్చి చాలామంది మమ్మల్న్ ఇయిన్ ఫ్లుయన్సు చేసే అవకాశాలుంటాయని యాజమాన్యం అభిప్రాయం. నువ్వు స్వయంగా ఆఫీసుకు రాకపోతే నీ కేసు చూడలేను ...'' అన్నాడు భూషణరావు.
"మరి పెద్దవాళ్ళ విషయంలోనూ ఇంతేనా?''
"ఊ'' అన్నాడు భూషణరావు.
"వాళ్ళిలా రావడానికి జంకుతారు. ఇలాంటి వ్యవహారాల్లో స్వయంగా జోక్యం చేసుకోవడం వాళ్ళకిష్టముండదు. అసలు వాళ్ళ ఇన్ ఫ్లుయన్సు తగ్గించాలనే యాజమాన్యం ఈ నియమం పెట్టింది. అప్లికేషను ఎవరిదో ఆ మనిషే స్వయంగా రావాలి. తన మనుషుల్ని పంపినా మేము పని చూడం'' అన్నాడు భూషణరావు కచ్చితంగా.
భూషణరావబద్ధం చెప్పాడని నాకు తెలుసు.
మాది చాల దగ్గర స్నేహం.
ఒకళ్ళ నాకాలు బూతులు కూడా తిట్టుకునే వాళ్ళం. అయితే మా మధ్య ఎప్పుడూ విరోధభావం లేదు.
భూషణరావుని ఇంటికి రమ్మన్నాను.
వాడు రానన్నాడు.
"నీ పని పూర్తయ్యాక స్థలం నీ పేరున రిజిస్టరయ్యాక నీ ఇంటికి పిలిచి సన్మానించు. అంతవరకూ రాను'' అన్నాడు భూషణరావు.
మర్నాడు భూషణరావు ఆఫీసుకు వెళ్లాను. సైంధవుడిలా నాకు ప్యూన్ అడ్డం తగిలాడు.
అతడి పేరు అప్పల నరసయ్య.
చాలా అర్జెంటన్నాను. భూషణరావు నా స్నేహితుడన్నాను.
దేనికీ వాడు చలించలేదు.
"సాబ్ బిజీగా ఉన్నారు. ఈ రోజు కెవర్నీ చూడరు ...'' అదే వాడి సమాధానం.
నేను దిగులుగా బయటకు వచ్చాను. అక్కడెవరో నాకు సలహా యిచ్చారు. అప్పలనరసయ్య చేతిలో పదిరూపాయలు పెట్టమని.
నా స్నేహితుణ్ణి కలుసుకునేందుకు నేను ప్యూన్ చేతిలో డబ్బు పెట్టాలా? నా దగ్గర భూషణరావు టెలిఫోన్ నంబరుంది.
నా ఆఫీసుకి వెళ్ళి భూషణరావుకి ఫోన్ చేశాను.
భూషణరావు ఫోనెత్తి నా గురించి తెలుసుకుని "సాయంత్రం బజార్లో కలుసుకుందాం'' అన్నాడు.
ఫోన్లో వాడికెక్కువ మాట్లాడ్డం ఇష్టంలేదని అర్థమయింది.
భూషణరావుని బజార్లోనే కలుసుకున్నాను.
"వాడి చేతిలో పదిరూపాయలు పెట్టు'' అన్నాడు భూషణరావు.
"నువ్వు యిదే సలహా ఇస్తావా?! నీ ఆఫీసులో నీ స్నేహితుడు నిన్ను కలుగుకుందుకు లంచమివ్వాలా?'' అన్నాను రోషంగా.
"నువ్వేమైనా అనుకో ... ఇది తప్పని సరి. అప్పల నరసయ్యకి రూలంటే రూలే! కొందరి విషయంలో నేను కలగాజేసుకున్నానంటే రెండు రకాల వాడు నను వాళ్ళనూ నా గదిలోకి వదలడం. రెండు వాడి యూనియన్?'' అన్నాడు భూషణం.
"అడ్డమైన వాళ్ళు నీ దగ్గరకెందుకోస్తారు?'' అన్నాను.
"ప్రతి చిన్నపనికీ ఆఫీసర్ని మీటవడం ఒక అలవాటైపోయింది జనానికి. అందువల్ల మా పనులకు అవరోధం కలుగుతూంటుంది. మా ఆఫీసులో ప్యూన్సు కొందరికి రేట్సున్నాయి. వాళ్ళ కొచ్చే డబ్బులో పై అధికారులకీ వాటాలున్నాయి. ఎవరి విషయంలోనూ ఈ నియమం సడలించలేము. అందువల్ల నాకే ఇబ్బంది ...'' అన్నాడు బూషణరావు.
ఈ విషయమై ఆఫీసుకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను'' అన్నాను. అపరిమితమైన ఆవేశంతో.
"చేయి. అందువల్ల అప్పల నరసయ్యకు తాత్కాలికంగా ప్రమాదముంటుంది. ఆ ప్రమాదం తప్పించుకొనటంఅతడికి తెలుసు. కానీ నీ స్థలం నువ్వు దక్కించుకోలేవేమో చూసుకో!'' అన్నాడు భూషణరావు.
వాడి హెచ్చరిక నా కర్థమయింది.
"నువ్వు అవనీతిపరులను సమర్థిస్తున్నావు.'' అన్నాను.
"ఒక వ్యవస్థలోని భాగాన్ని నేను'' అన్నాడు భూషణరావు.
మర్నాడు నేను అప్పలనరసయ్యకు పదిరూపాయలూ ఇచ్చాను. అతడింకో పది అడిగాడు,.
"ఎందుకు?'' అన్నాను.
"మీరు నిన్న వచ్చారు. ఇది రెండోసారి రావడం. మొదటిసారికి పది, ఇప్పుడింకో పది ...''
చాలా తాపీగా అన్నాడతను.
నాలో మళ్ళీ ఆవేశం చోటుచేసుకుంది.
అప్పలనరసయ్య స్వరం తగ్గించి "ఆఫీసరు బాబు మీకు స్నేహితుడో కాదో తెలియదు. కానీ స్నేహితుడైనా సరే. నేను తల్చుకోనిదే పని కాదు. నాకు మీ పనేమిటో చెప్పండి. జరిగేదో జరగందో చెబుతాను'' అన్నాడు.
నేనావేశాన్ని తగ్గించుకున్నాను. ఎందుకైనా మంచిదని విషయం అతడికి చెప్పాను.
"ఫైల్లో కాగితాలు గల్లంతు చేయడానికి వాడికి వెయ్యిరూపాయలు దాకా ముడుతుంది సార్. కాగితం గల్లంతైతే ప్రధానమంత్రి కూడా మీకు సాయపడలేడు. పనైతే నన్ను సంతోష పెడతానని మాటివ్వండి. చిటికెలో మీపనవుతుంది. వెయ్యిరూపాలుచ్చుకుని పెద్దవాళ్ళకు సాయపడ్డంలో కంటే తక్కువైనా పుచ్చుకుని మీబోటి వాళ్ళకు సాయపడడంలోనే మాకానందముంది సార్!'' అన్నాడు అప్పలనరసయ్య.
అతడికింకో పది ఇచ్చాను. సంతోషపెడతానని మాటిచ్చాను.
ఆఫీసులో భూషణరావు దర్శనమయింది నాకు,
భూషణరావు గుమస్తాను పిల్చుకుని రమ్మని అప్పలనరసయ్యకు చెప్పదు. గుమస్తా వచ్చాడు.
"ఉత్తరం రిజిస్టర్డు పోస్టులో పంపార?'' అన్నాడు క్లర్కు.
"లేదు'
"పోనీ ఉత్తరం కాపీ ఉందా?''
"లేదు ... ఏ తేదీన రాశానో చెప్పగలను''
"ఆ సమాచారం చాలు. ఇతడు నా క్లాసుమేటు. ఉత్తరం ఎప్పుడందిందో చూసి చెప్పు'' అన్నాడు భూషణరావు క్లార్కుతోఅతడు రిజిస్టర్ వెతుకున్నాడు.
మేమిద్దరం చిన్ననాటి కబుర్లలో పడ్డాం.
నేనూ, భూషణరావు స్నేహితులమని క్లర్కుకు తెలియడానికే ఆ కబుర్లు.
నాకేసు న్యాయమైనది.
భూషణరావుకు కావలసిన మనిషిని నేను.
క్లర్క్ కు ఉత్తరం దొరికింది.
"వెంటనే ఉత్తరం అందినట్లు లేటరు టైపు చేయి. రిజిస్ట్రేషన్ కి తేదీ నిర్ణయించు'' అన్నాడు భూషణరావు.
క్లర్కు తలూపి వెళ్ళిపోయాడు.
తర్వాత రెండు నెలల్లో స్థలం నా పేరున రిజిస్ట్రేషన్ అయిపొయింది.
"నువ్వు నాకు సన్మానం చేయాలి'' అన్నాడు భూషణరావు.
"తప్పకుండా ... రేపు హోటల్ శారదకు రా. సాయంత్రం ఆరింటికి ...'' అన్నాను.
భూషణరావు ఒప్పుకున్నాడు.
అయితే ఆ సాయంత్రం అనుకోకుండా ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరం హోటల్ శారదలో కలుసుకున్నాము.
ఎందుకో భూషణరావక్కడికి వచ్చాడు. నన్ను నా ఎదుట కూర్చున్న అప్పలనరసయ్యను చూసి ఆశ్చర్యపడ్డాడు.
"ఇలారా'' అని పక్కకు పిలిచి "ఏమిటిది?'' అన్నాడు నెమ్మదిగా.
"నేను నవ్వి "ప్రథమ తాంబూలం'' అన్నాను.