Facebook Twitter
పోలికలు

పోలికలు

- వసుంధర

నాన్నగారి దగ్గర్నుంచి నేను పుణికిపుచ్చుకున్న పోలిక ఒకటుంది. అది భార్యను సాధించి, వేధించడం.
నాన్నగారు అమ్మను దేనికీ మెచ్చుకునేవారు కారు. ఎంత మంచి పని చేసినా ఏదో వంక పెట్టేవారు ముఖ్యంగా అమ్మను మగాళ్ళ మధ్యకు రానిచ్చేవారు కారు. అమ్మ ఎక్కువగా వంటింట్లోనే మసలుతూండేది. ఆయన అమ్మతో కలిసి సినిమాలు చూసేవారుకాదు.
అందుకు అమ్మ ఏ మాత్రమూ సంతోషించాకుండా నన్నే తిట్టేది. మగవాళ్ళలాగే ఉంటారుట. కస్టపడి మగవాడు డబ్బు సంపాదిస్తూంటే, ఆడది కూర్చుని తింటుందిట. అందువల్ల వాళ్ళేమన్నా పడాలిట. మాట కరుకుగా ఉన్నా నాన్నగారి మనసు మంచిదిట.
ఈ విధంగా అమ్మ చెబుతూంటే అది అమ్మ గొప్పతనమని గ్రహించకుండా మగవాడు మసల వలసిన పధ్ధతి అదేనన్న భావం క్రమంగా నాలో పాతుకుపోయిది.
నాన్నగారు అప్పుడప్పుడు రఘునాథరావు అన్నపేరు తీసుకొచ్చి అమ్మను ఏవేవో అంటూండేవారు. అప్పుడు అమ్మ గుడ్లనీరు కుక్కుకుని "అంతంత మాటలనకండీ'' అనేది. ఆయన అనే అన్ని మాటలకూ పడి వూరుకునే అమ్మ ఈ ఒక్క మాటకు ఎందుకంత బాధపడేదో నాకు అర్థమయ్యేది కాదు.
"రఘునాథరావు ఎవరే?'' అనడిగాను అమ్మనొకసారి.
రఘునాథరావు అమ్మకు బావౌతాడు. మనిషి మంచివాడు. చాలా బాగుంటాడు. అమ్మంటే చాలా ఇష్టపడతాడు. కానీ నాన్నగారిలా డబ్బునవాడు కాడు. అందుకని అమ్మ అమ్మానాన్నల అమ్మను రఘునాథరావుకు బదులు నన్నకిచ్చి పెళ్ళి చేశారు.
"మరి నాన్న ఆయన పేరు చెప్పి ఏదో అంటే నువ్వేడుస్తావెందుకు?'' అని నేనంటే అమ్మ ఖంగారు పడిపోయి "ఇవి పెద్దాళ్ళ విషయాలు, నువ్వు వినకూడదు, వీటి గురించి ఆలోచించకూడదు'' అని చెప్పింది.
ఆ తర్వాత నాన్నగారితో "మీరు బావ గురించి అబ్బాయి యెదురుగుండా మాట్లాడొద్దు అడగకూడని ప్రశాన్లు అడుగుతున్నాడు వాడు'' అంది.
నాన్న ఆ విషయాన్నీ పట్టించుకోలేదు. నేను మాత్రం అమ్మను మళ్ళీ ఆ విషయమై అడగలేదు. కాస్త పెద్దయ్యాక మాత్రం విషయం అర్థమైంది. అమ్మ మనసులో ఆ రఘునాథరావు ఉన్నాడేమోనని అనుమానం.
నాకు పెళ్ళి కుదిరాక ఒకరోజు నాన్నగారు నాకు భార్యతో ఎలా మసలు కోవాలో [ప్రత్యేకంగాచెప్పారు "వయసు చిత్రమైనది. ఆడవాళ్ళకు లోబడేలా చేస్తుంది. భార్యకు లోబడి ఉండడం చాలా అవమానకరమైన విషయం. భార్యను సాటి మనిషిలా, జీవిత భాగస్వామిలా చూడ కూడదు. ఆఫీసరు గుమస్తాను చూసినట్లు చూడాలి. అప్పుడే ఆడది మగవాడికి లొంగి ఉంటుంది. తనను లొంగదీసుకున్న మగవాడినే ఆడది ఆరాదిస్తుంది. అలా ఆడది మగవాణ్ణి ఆరాధించినప్పుడే వారికి కలిగే సంతానానికి ప్యూరిటీ ఉంటుంది. అదే పెళ్ళి పరమావధి.''
నాలో నాన్నగారి పోలికలు చాలా ఉన్నాయి. నా ముక్కూ, కళ్ళూ, ముఖం తీరు అన్నీ నన్నగారివే! అద్నుకాయన ఎంతగానో గర్వపడుతూంటారు. తన భార్య తనను మనసారా ఆరాధించడంవల్లనే నాకా పోలికలొచ్చాయని ఆయన అభిప్రాయం. నేనూ నా భార్యపట్ల తనకు లాగానే ప్రవర్తించి తన లక్షణాలు తరతరాలుగా నిలిచి పోయేలా చేయాలని ఆయన ఆశ.
చిన్నతనంనుంచీ నేను నాన్నగారు అమ్మనెలా చూస్తారో చూస్తూనే వున్నాను. అమ్మకవన్నీ ఇష్టమేనని గ్రహించాను. సహజంగా నా ప్రవర్తన ఈ అనుభవాన్ని పురస్కరించుకునే ఉంటుంది. అందుకని నా భార్య పట్ల నా ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని అభిప్రాయాలేర్పడి పోయాయి.
నా భార్య రమ చాలా అందంగా ఉంటుంది. అందుకని ఆమెకు చాలా అహంకార ముండవచ్చు. ముందా అహాన్ని పోగొట్టాలి. కాబట్టి ఆమెకు నాకు వచ్చిన ఇతర సంబంధాల గురించి చెప్పాను. అందరూ అప్సరసలే. కానీ కొన్ని కారణాలవల్ల వాళ్ళను నిరాకరించాల్సి వచ్చింది. ఆఖరికి సుమారుగా ఉండే రమను చేసుకున్నాను అసలు రమను కురూపి అందామనుకున్నాను. కానీ మనసొప్పలేదు. సుమారైన అందమంటే అదే పెద్ద అబద్ధం.
రమ బాగా చదువుకుంది. అయినా నా మాటలకు చిన్నబుచ్చుకుంది. ఆమె ఉండే ఇంటికెదురుగా ఓ నవ దంపతులుండే వారుట. భార్య అంత బాగుండదట. భర్త సినిమా హీరోలా ఉంటాడట. కానీ వారిది అన్యోన్య దాంపత్యం. అతని పేరు వెంకటేష్. వెంకటేష్ భార్య అందాన్ని రోజూ పొగుడుతూ ఉంటాట్ట. ఆ విషయం ఆమె రమకు చెప్పి సంబర పాడేదిట. "నాకు పెద్ద అందం లేదు. కానీ నా భర్త నా అందాన్ని పొగిడితే నాకదో తృప్తి. అది అబద్ధమని తెలిసినదే. వివాహమైనాక భార్యాభర్తలు ఒకరినొకరిలా మోసం చేసుకోవడంలో విచిత్రమైన ప్రేమాభిమానాలుంటాయి''
రమ చెప్పిన ఈ విషయం విని నేను తడబడలేదు "ఆ వెంకటేష్ భార్యకు అబద్ధం చెప్పి ఉండడు. వాడి పెళ్ళాం వాడి కళ్ళకు నిజంగానే అందంగా కన్పించి ఉంటుంది. అందరూ మగవాల్లకూ నాకులా అందాన్ని గుర్తించే శక్తి ఉండదు. లేదా వాడి భార్య నిజంగానే అందంగా ఉండి ఉంటుంది. ఇంకా పెళ్ళికాని మూలాన నీకు అప్పట్లో ప్రతి మగవాడూ సినిమా హీరోలా కనబడి ఉంటాడు'' అన్నాను.
ఈ మాటలకు నా భార్య చాలా నొచ్చుకుంది.
ఆ విధంగా ఆమెను ప్రతి విషయంలోనూ దెబ్బ తీస్తూండేవాణ్ణి. నన్ను నేను పొగుడుకుంటూ ఎదుటి వాళ్ళను హీనపరుస్తూ నా భార్య నన్నారాధించేలా చేయడానికి ప్రయత్నించే వాణ్ణి.
ఆమెను మగవాళ్ళ మధ్యకు రానిచ్చే వాణ్ణి కాను. తను సరదాపడినా "అలాంటి సరదాలుండడం సంసార స్త్రీల లక్షణం కాదు'' అనేవాణ్ణి. దానికి జవాబు ఆమె దగ్గరుండేది కాదు.
ఆమెలో సంసార స్త్రీల లక్షణాలు చాలా తక్కువని చెప్పాను. నా దగ్గరకు వచ్చిన రెండేళ్ళలొ నా కారణంగా అవన్నీ ఏర్పడ్డాయని ఆమెకు నచ్చచెప్పగలిగాను. ఇది వరకు ఆమెను చూసి బుగ్గలు నొక్కుకున్న ఆడవాళ్ళు ఇప్పుడామెను మెచ్చుకుంటున్నారని నమ్మించాను. ఇలా ఎన్నో చేశాను.
అప్పుడప్పుడు నా భార్య వెంకటేష్ ప్రసక్తి తీసుకొచ్చేది. నేను వాణ్ణి నిరసించడమేకాక ఆమెనూ వెంకటేష్ కు కలిపి సూచనప్రాయంగా అనుమానించాను. దాంతో ఆమె బెదిరిపోయింది. నా అనుమానాలు చెదరగొట్టడానికి  రమ ఆ వెంకటేష్ ని తిట్టిపోసేది.
రమ నా కౌగిలిలో ఉన్నప్పుడు, "ఇప్పుడు నా స్థానంలో వెంకటేష్ ఉంటే బాగుండునని ఉందికదూ నీకు?'' అన్నాను ఒకసారి.
ఆమె ఉలిక్కిపడి "అలాంటి మాటలనకండీ! వాడంటే నాకు అసహ్యం'' అంది.
అమ్మ రఘునాథరావు గురించి నాన్న దగ్గర కూడా ఇలాంగే విసుక్కునేది. నేను పూర్తిగా నాన్న పోలికలతో పుట్టాను. ఇప్పుడు వెంకటేష్ గురించి రమ కూడా అదే స్థాయికి వచ్చింది. నాకు పుట్టబోయే బిడ్డ నా వంశ లక్షణాలను పూర్తిగా సంతరించుకుంటుంది.
నాకు రమమీద ఏ మాత్రమూ అనుమానం లేదు. అయినప్పటికీ అలా అనుమానించడం నాకు సరదా. ఆడదానికి అఫెన్సుకు ఛాన్సివ్వకూడదు. ఎప్పుడూ డిఫెన్సులోనే ఉంచాలి. ఇది నాన్నగారి దగ్గర నేర్చుకుని నేను అమలు చేస్తున్న ముఖ్య విశేషం.
రమ గర్భవతి అయింది.
ఒక్కగానొక్క కోడలు. అన్ని ముచ్చట్లూ వైభవంగా జరిగాయి.
రమ పండంటి కొడుకును కన్నది. వాడివి అన్నీ తల్లి పోలికలు. నా పోలికలు రానందుకు బాధపడ్డాను. తల్లి పోలికవస్తే కోడుకి అదృష్టమంటారు. తండ్రి పోలిక వచ్చిన నాకు మాత్రం అదృష్టానికి తక్కువేముంది?
అబ్బాయికి నాన్నగారి పేరే పెట్టాం. వాడికి మాటలు వచ్చేసరికి నాకెంతో ఆనందం కలిగించే విశేషం జరిగింది.
నన్నెవరైనా పేరడిగితే ఒకసారి ముక్కు తమాషాగా నలుపుకుని అప్పుడు పేరు చెబుతాను. ఇది చాలా విచిత్రమైన అలవాటు. చూసేవాళ్ళను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. మా అబ్బాయి కూడా పేరడిగితే సరిగ్గా అలాగే చేస్తున్నాడు.  ఇది వాడు నన్ను చూసి నేర్చుకున్న అలవాటు కాదు. తనకు తానే వచ్చిన అలవాటు, అంటే వాడికి నా ప్రతత్యేకమైన పోలిక వచ్చిందన్న మాట!
వాణ్ణి రోజుకు పదిసారైనా పేరడిగి వాడి ఈ చేష్ట చూసి సంతోషించే వాణ్ణి. నేనే కాదు అమ్మ, రమ, నాన్నగారు అంతా అలాగే చేసేవారు.
నాన్నగారి పోలికలు పుణికి పుచ్చుకున్న నాకు కైలిగిన కొడుకు నా పోలికలు పుణికి పుచ్చుకుంటున్నాడు. కనీసం ఇంకోతరంపాటు మా వంశ లక్షణాలు నిలబడతాయి.
అబ్బాయికి నాలుగో ఏడు వచ్చేసరికి రమ మళ్ళీ గర్భవతయింది. ఆమెను అత్తవారింట దిగవిడిచి రావడానికి కూడా వెడుతున్నాను. ఈ పర్యాయం పుట్టే బిడ్డ కూడా నా పోలికలే రావాలని నా ఆశ.
రైలు మాకు ఎదురు సీట్లలో వృద్ధ దంపతులు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా సినిమా జంటలా మసల్తున్నారు. భర్త భార్యకోసం చాలా ఖంగారు పడుతున్నాడు. ఆమె కేవేం కావాలో అడుగుతున్నాడు. తనక్కావాల్సిన వస్తువులు తెచ్చిపెట్టడానికి ఆయన ట్రెయిన్ దిగడం ఆవిడకిష్టం లేదు. చాలా నెమ్మదిగా "మీరు నాపక్కన కూర్చుంటే చాలు! నాకింకేమీ అక్కర్లేదు కిటికీ దగ్గరజే వస్తే అవే కొనుక్కుందాం'' అంది. ఆయన వినలేదు. "మనక్కావలసినవన్నీ కిటికీ దగ్గరకు రావు'' అంటూ ఆయన ఫ్లాట్ ఫారమ్ మీదకు దిగి ఏవో పళ్ళు కొనుక్కువచ్చి "ఇవి చాలా మంచివి. కిటికీ దగ్గరకు చేత్తసరుకు వస్తోంది'' అన్నాడు.
మధ్యలో వాళ్ళు మమ్మల్ని కూడా పలకరించారు. ఆయన తన భార్య గురిచి చాలా జోకులు వేశాడు. ఆవిడ సిగ్గుపడుతూనే ఆయన గురించి తనూ కొన్ని చెప్పింది.
నేనెప్పుడూ అటువంటి జంటని చూడలేడు. నా భార్య నెమ్మదిగా నా చెవిలో "వాళ్ళు వృద్ధ దంపతుల్లా లేరు. కొత్తగా పెళ్ళయిన వాళ్ళలా వున్నారు'' అంది.
ఆ మాట ఆ ముసలాయనకు వినబడ్డట్లుంది "కొత్తగా పెళ్ళి కావడమేంటమ్మా! మా కింకా పెళ్ళి కాలేదు. ఇంకా ఏడాది ఆగాలిట'' అన్నాడు.
నేనా మాటలు విని ఆశ్చర్యపోతూంటే "వచ్చే ఏడాది ఆయనకు షష్టిపూర్తి లెండి'' అందావిడ.
నేను, రమ నవ్వకుండా ఉండలేకపోయాం. అప్రయత్నంగా నా మనసులో 'అమ్మ, నాన్న అలా ఉంటే?' అనిపించింది. 'అమ్మ ఈ ముసలాయాన్ని చూస్తే తన భర్త అలా ఉండనందుకు విచారించదా?' అన్న అనుమానం కలిగింది. 'అమ్మ సంగతి సరే ... పడుచుతనంలో ఉన్న రమ సంగతేమిటి?'
దాని గురించి అట్టే ఆలోచించదల్చుకోలేదు. ఒకో మగవాడికి ఒకో ప్రత్యేకత ఉంటుంది. వృద్ధాప్యంలో ఇటువంటి పబ్లిక్ శృంగారం జుగాప్పాకరంగా కూడా ఉంటుంది. నేను, నాన్నగారు అనుసరిస్తున్న విధానమే సరైనది. పెద్దమనిషి తరహాగా ఉంటుంది.
ఆడవాళ్ళకు సిగ్గెక్కువంటారు. ఆ ముసలావిడ సిగ్గుపడుతోంది కానీ, ఆవిడ కళ్ళలో భర్తపట్ల ఆరాధనాభావం కనబడుతోంది. అటువంటి భావాన్ని నేనెప్పుడూ నా భార్య కళ్ళలో చూడలేడు. రమ కళ్ళలో ఎక్కువ బెదురు, సంకోచం కనబడుతూంటాయి.
కాసేపు సంభాషణలు నడిచాక, ఆయన పరిచయం చేసుకుందామని పేరడిగాను.
ఆయన తమాషాగా ముక్కు నలుపుకుని "నా పేరు రఘునాథరావు'' అన్నాడు.