Facebook Twitter
కత్తికంటే పదునైన కలం - కేతు విశ్వనాథరెడ్డి

 

కత్తికంటే పదునైన కలం - కేతు విశ్వనాథరెడ్డి

 

 

కథకుడిగా పేరుతెచ్చుకోవడం కష్టం కాకపోవచ్చు! కానీ నాలుగుకాలాల పాటు నిలిచిపోయే మంచికథకుడిగా సాహితీ చరిత్రలోకి చేరడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన వ్యక్తుల రచనలనీ, కథనశైలినీ పరిశీలించడం ఓ గొప్ప అనుభూతి. రచయిత దృక్పథం ఎలా ఉండాలి? ఆ దృక్పథం అతని రచనల్లో ఏ తీరున ప్రతిబింబించాలి? అనే విషయాలన్నీ అలాంటి పరిశీలనలో ప్రస్ఫుటం అవుతాయి. వర్తమానకాలంలో అలాంటి రచయితల గురించి చెప్పుకోవాలంటే కేతువిశ్వనాథరెడ్డి వెంటనే స్ఫురణకు వస్తారు.

సాధారణంగా రచయితల వ్యాపకానికీ వారి వృత్తిగత జీవితానికీ సంబంధం ఉండదు. కానీ విశ్వనాథరెడ్డి జీవితం తొలి నుంచి అక్షరానికి దగ్గరగానే సాగింది. ఒక పక్క బీయే, ఎమ్మె చదువు మరో పక్క చలం, గోపీచంద్ వంటి రచయితల ప్రభావం ఆయనను సాహితీరంగం వైపుగా అడుగులు వేయించాయి. వీటికి తోడు రాయలసీమలోని కరువులు, కక్షలు, కులవ్యవస్థ ఆయనలో ఆలోచనలను రేకెత్తించాయి. ఆ ఆలోచనలకు అక్షరాలు తోడైతే ఇక చెప్పేదేముంది... అద్భుతమైన సాహిత్యం తెలుగువాడికి దక్కింది.

కేతు విశ్వనాథరెడ్డి అనగానే చాలామందికి రాయలసీమే గుర్తుకువస్తుంది. కొందరైతే సీమ కథలకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. నిజమే! విశ్వనాథరెడ్డి తన ప్రతి కథలోనూ సీమ నేపథ్యాన్ని ఎన్నుకొని ఉండవచ్చుగాక. కానీ ఆ కథలని చదివేవారికి అందులోని నేపథ్యం వెనుక దాగిన నిజాలు కనిపిస్తాయి. కరువు, కక్ష రెండూ వేర్వేరు కాదని నిరూపిస్తాయి. పరిస్థితులని బట్టి మనిషిలోని స్వార్థం బయటపడుతుంటుందని చాటుతాయి. ‘‘నీ నల్లరేగడి మీద తుంగభద్ర నీళ్లు పారనీ, నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు రానీ – అన్నీ అబద్ధాల బ్రతుకులే, అన్నీ డబ్బు చుట్టూ జీవితాలే అని తెలిసి వస్తుంది – వెనకా ముందూ అంటే!’’ అంటూ ఓ పాత్ర ‘వెనుకా ముందూ’ అనే కథలో. దీనిబట్టే అర్థం అవుతుంది... పరిస్థితులకు అనుగుణంగా మారడమే మనిషి స్వభావమని.

 

 

కేతు విశ్వనాథరెడ్డి కథలలో పద విరుపులు ఉండవు. సుదీర్ఘమైన సంభాషణలు కానీ వర్ణనలు కానీ కనిపించవు. కానీ అలా రాయడమే ఆయన బలం అనిపిస్తుంది. ఎందుకటే ఆయన కథలను చదువుతున్నప్పుడు నేరుగా ఒక సంఘటనకి మనం కూడా ప్రేక్షకులుగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ‘సతి’ అనే కథలో భార్య, మొగుడి మీద తిరగబడి తిడుతున్నా.... ‘ఎవరు వీరు?’ అనే కథలో ఓ రచయిత ప్రేమలో దిగబడుతున్నా... వాటకి మనకే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా తోస్తుంది.

కేతువిశ్వనాథరెడ్డి కథలలోని మరో సుగుణం వాటిలోని సార్వజనికత. కథ ఏదో ఒక సందర్భంలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.... దాని వెనుక సమాజపు పోకడ కనిపిస్తుంది. దానికి ‘అమ్మవారి నవ్వు’ ఓ గొప్ప ఉదాహరణ. ఇందులో రచయిత ఓ హిందూ, ముస్లిం స్నేహితుల మధ్యన ఉన్న బంధం గురించి చెబుతున్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ లోలోతున మతం తాలూకు ఛాయలు మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో, అవి రోజురోజుకీ ఎంత ప్రబలంగా మారుతున్నాయో చెప్పే సూచనలు కనిపిస్తుంటాయి.

ముందుగానే చెప్పుకొన్నట్లు కేతు విశ్వనాథరెడ్డి వృత్తి జీవితం కూడా అక్షరానికి దగ్గరగానే సాగింది. పాత్రికేయునిగా, అధ్యాపకునిగా, పాత్రికేయులకు శిక్షకునిగా ఆయనలోని రచయితకు తోడుగా ఉండే ఉద్యోగాలే సాగించారు. కొడవటిగంటి కుటుంబరావు, అంబేద్కర్ సాహితీ సర్వస్వాలకు సంపాదకునిగా వ్యవహరించారు. విశ్వనాథరెడ్డి తన 19 ఏళ్ల వయసులో ‘ఆమె’ అనే తొలి కథను రాశారు. ఇప్పుడ ఆయన వయసు 77 ఏళ్లు! వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన కలలో పదును పెరుగుతోందే కానీ వణుకు తెలియడం లేదు. ఆయన కథలకు ఎప్పుడోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది. అవార్డు వచ్చినా రాకపోయినా ‘నేను రచయితను’ అని గర్వంగా చెప్పుకోగల కథలు చాలానే రాశారు. రాస్తూ ఉంటారు కూడా!!!

- నిర్జర.