Facebook Twitter
మాతృభాష దినోత్సవంతో ఉపయోగం లేదా!

 

మాతృభాష దినోత్సవంతో ఉపయోగం లేదా!

 

1952 ఫిబ్రవరి, 21. అది బెంగాలీ భాషను మాట్లాడేవారు ఎక్కువగా ఉండే తూర్పు పాకిస్తాన్ ప్రాంతం. బెంగాలీని కూడా అధికార భాషగా ప్రకటించాలంటూ అక్కడి ప్రజలు ఎంతోకాలం నుంచీ పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం వారి మాటలు వినకపోవడంతో నిదానంగా వారి ఆశ కాస్తా ఉద్యమస్థాయికి చేరుకుంది. అలా ఆ రోజున బెంగాలీ భాషని గుర్తించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కొందరు విద్యార్థులు ఢాకా హైకోర్టు వద్దకు చేరుకున్నారు. కానీ పోలీసులు వారి నిరసనను ఏమాత్రం అంగీకరించలేదు సరికదా... విద్యార్థులని కూడా చూడకుండా వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలలో అధికారికంగా మరణించినవారు నలుగురు. ఇక అనధికారికంగా చనిపోయినవారి సంఖ్యలో స్పష్టత లేదు.

ఢాకాలో ఆనాడు చనిపోయిన నలుగురు విద్యార్థుల త్యాగం వృధా పోలేదు. క్రమేపీ అది పూర్తిస్థాయి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బెంగాలీ మాట్లాడే ప్రజలంతా కలిసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్థాయికి చేరుకుంది. దానికి భారత ప్రభుత్వం కూడా మద్దతు పలకడంతో 1971లో బంగ్లాదేశ్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇదీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వెనక ఉన్న కథ. ‘మన సంస్కృతిని పరిరక్షించుకునేందుకు భాష ఓ అద్భుతమైన సాధనం,’ అంటూ ఈ రోజుని ఐక్యరాజ్యసమితి ప్రపంచ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది.

మాతృభాష దినోత్సవం వెనక ఉన్న గాథ సరే! కానీ అప్పటికీ ఇప్పటికీ మాతృభాషల విషయంలో ఎలాంటి మార్పు వచ్చింది? అని ప్రశ్నించుకుంటే జవాబు నిస్సారంగానే ఉంటుంది. ఇన్ని అస్తిత్వ ఉద్యమాల మధ్య కూడా మాతృభాషలు తమ ఉనికిని నిలబెట్టుకోలేకపోతున్నాయి. తాత్కాలకి ప్రయోజనాల కోసం ఆంగ్లబోధన వైపే మనం మొగ్గు చూపుతున్నాం. తెలుగువాడి సత్తా చాటిన అమరావతిలో రాజధానికి నిర్మిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వమైనా, తెలంగాణ పలుకుబడి కోసం పోరాడి నెగ్గిన తెరాస ప్రభుత్వమైనా చివరికి ఆంగ్లానికే మొగ్గు చూపుతున్నాయి.

పిల్లలకి ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే సాగాలనీ, మాతృభాష మీద పట్టు సాధించిన తరువాతే ఇతర భాషలని సులువుగా నేర్చుకుంటారనీ పరిశోధనలు ఎంతగా మొత్తుకుంటున్నా కూడా తెలుగునాట విద్య తీరు మారడం లేదు. పైగా ఇప్పటికే ఉన్న తెలుగు మాధ్యమాల స్థానంలో నిదానంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రయత్నిస్తున్నాయి. మనం ఎన్నుకొన్న ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజల సంగతి చెప్పేదేముంది. తెలుగు నేర్చుకుంటే నాకేంటి? అనే ప్రశ్న దగ్గరే మనం ఆగిపోతున్నాం. అవసరం అయితే ఏ ఫ్రెంచో, జర్మనో నేర్చుకుంటున్నాం కానీ తెలుగుని ద్వితీయభాషగా నేర్చుకునేందుకు కూడా మన పిల్లలు ఇష్టపడటం లేదు.

ఇలాంటి పరిస్థితులలో తెలుగునాట మేధావులం అని చెప్పుకునేవారి తీరు కూడా అగమ్యంగానే ఉంది. ఉన్న తెలుగుని కాపాడుకోవడం ఎలాగా అన్న ఆలోచనని పక్కనపెట్టి... తెలుగులో ఉన్న సంస్కృత పదాలని నిషేధించాలనీ, ప్రతి ఆంగ్ల పదానికీ సమానార్థకంగా ఎలాగైనా ఓ తెలుగు పదాన్ని కనుక్కోవాలనీ తాపత్రయపడిపోతున్నారు. ఏతావాతా ఇటు ప్రజలకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ, పెద్దలకు కానీ తెలుగుని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్న లక్ష్యమైతే ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఎప్పటిలాగానే ఈసారి మాతృభాష దినోత్సవం సందర్భంగా కూడా తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనీ, కృష్ణదేవరాయలకు ఇష్టమైన భాష అనీ.. ఎప్పటిలాగే కొన్ని రొడ్డుకొట్టుడు వాక్యాలను వల్లెవేయాల్సిందే. ఆపై ఓ టీ తాగి, సమోసా తిని హాయిగా ఇంటికి చేరుకుని... తెలుగుతో సహా ప్రపంచాన్నంతా మర్చిపోయి నిద్రపోవడం తప్ప మరేదన్నా జరుగుతుందని ఆశించడం అసాధ్యం!

- నిర్జర.