Facebook Twitter
అలకకో లేఖ...

 

 

అలకకో లేఖ

 

 

 ఓయ్..

ఎందుకో ఆ అలకలు?

కులుకులొలికే ఆ మోముకి అలకలు కూడా అందమేనని అబద్దానికి అందెలు తొడిగి పరుగులిడించలేను.
ఉన్నదే చెప్తానని నీకు తెలుసు.
రోజుకో మారు మారేలా చంద్రునితో నిన్ను పోల్చలేను.
ఋతువుకోలా రూపం తొడిగే ప్రకృతితోనూ,
అలానే
క్షణానికో అలనిచ్చే సంద్రంతోనూ,
రాగానికో అందానిచ్చే సరిగమలతోనూ,
పొద్దున్నే పూసే పూలతోను,
రాత్రికి మాయమయ్యే మేఘంతోను కూడా..!
పోల్చడానికి వీలుకాని బంధాన్ని అక్షరాల విల్లుతో భావుకత లక్ష్యాన్ని ఛేదించే విలుకాడునీ కాదు.
నువ్వున్నావని, నీలోనూ నేనున్నానని అదే అర్ధంతో అద్భుతాలను సృష్టించగలననీ చెప్పను.
నాలా నేనున్నాననే కదా నాలోకొచ్చి నన్ను నీలోకి తీసుకోని, నీ నవ్వులనలా అంటించిపోయావు!
మరిప్పుడు కొత్తగా నీ అలకనెలా మాన్పగలను?
రాయడం రాని నాకు, నీ మదిననే కలాన్నిచ్చి కాలమనే తెల్లకాగితాన్ని నాకు నన్ను వెదుక్కునేలా చేసావ్! ఇదిగో ఒకటే చెప్తున్నా విను..,
చిన్న ముల్లుని నేనయ్యా.., మనమనే గడియారపు దర్పణ బంధనంలో!
నీవన్నదేంటో దానిలో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా.. నేను!
నీ గమనంతోనే నా ఉనికి.
కాలమాగినా.. అలా నిశ్చలంగా నీతోనే ఉండిపోతా! ఏదేమైనా రోజుకి రెండుకి సార్లు నిజాన్ని చూపించగలంగా స'మాయ'న్ని అనే నిజంలో బ్రతికే చిరు ఆశ ని!
ప్రకృతిని మారనివ్వు
పృధ్వినవుతా!
సంద్రానవ్వు
నిశ్శబ్దపు మధ్యలో నుంటా!
చందురునివవ్వు
చిక్కటి మచ్చనవుతా!
మురిపించే మేఘానివవ్వు
మెరిసారే ఆ క్షణాన్ని అవుతా!!

నువ్వు నీలా ఉండు
నేను నీలా అవుతా..!
కాలానికో దిక్సూచిలా అవుదాం..
కాలమే మనదనపించే శాసనాన్నవుదాం..
కలంనేనైతే సిరా నువ్వై కమ్మటి కవితమౌదాం..
మనం మనలా ఉందాం!
కొంతమంది కనే కలలా ఉందాం!
అలకతోనే ఉనికనుకుంటే
పలుకు రాని పదార్దాలెన్నో అలకలో ఉన్నట్లే కదా...!!
రాయడం రాదు,
రాయేయడమూ రాదు!
మూగ కలం పలికిన తడబాటు జవాబనుకో నీకు ఇది!
నీలోకి వస్తున్నా.. స్వాగతించు మరి!!

- Raghu Alla