Facebook Twitter
తెలుగు కథకు పెద్ద ... పెద్దిభొట్ల సుబ్బరామయ్య

 

 

తెలుగు కథకు పెద్ద ... పెద్దిభొట్ల సుబ్బరామయ్య

 


కథ ఎలా పుడుతుంది అనేది ఓ చిత్రమైన ప్రశ్న. కథ రాయాలి అన్న తపనలోనుంచా! ఆ తపనకు తోడుగా ఉండే ఆలోచనల్లోనుంచా! ఆ ఆలోచనలను అక్షరబద్ధం చేయగల సత్తాలోనుంచా! బహుశా కథ, మంచి కథ కావాలంటే ఈ మూడు ప్రమాణాలూ ఉండాలేమో! అలాంటి పరిపూర్ణమైన కథలు రాసినవారు పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు. అందుకే సమకాలీన రచయితలలో అగ్రస్థానంలో నిలిచారు. తన జీవితకాలంలోనే గొప్ప రచయితగా కీర్తినొందారు. కారామాస్టారు వంటి అతికొద్ది మందికే తెలుగు సాహిత్యంలో అంతటి గౌరవం దక్కింది.


సుబ్బరామయ్యగారు ఏమీ అట్టడుగు వర్గం నుంచి రాలేదు. అలాగని ఆయన జీవితం సాఫీగా సాగిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మలుపులు తిరిగే కథలాగే ఆయన జీవితం కూడా రకరకాల మజిలీలగుండా ప్రవహించింది. 1938లో గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన అన్నయ్య కూడా అంతలోనే దూరమైపోయాడు. అటు పాఠ్యపుస్తకాలు, ఇటు సాహిత్యమూ ఆయనకు జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి. వీటికి తోడు విశ్వనాథ సత్యనారాయణవంటి పెద్దల సాన్నిహిత్యం ఆయనను చదివేందుకే కాదు రాసేందుకు కూడా ప్రేరణనిచ్చింది. విజయవాడలోని లయోల కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేసే అవకాశమూ వచ్చింది. ఒక పక్క విద్యార్థులకు తెలుగుని బోధిస్తూనే మరోపక్క అదే తెలుగు సాహిత్యంలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరుచుకున్నారు.

 


1959లో సుబ్బరామయ్యగారి తొలి కథ ‘చక్రనేమి’ అచ్చయ్యింది. అప్పటి నుంచి సుమారు 200కు పైగా కథలు రాశారని ఓ అంచనా! ఇన్ని కథలు రాసినా కూడా ఆయన ప్రతి ఒక్క రచనా విభిన్నంగానే సాగడం ఆశ్చర్యం. చాలా కథల ముగింపు ఒకే తీరున సాగుతూ అధిక శాతం విషాదాంతాలుగా ముగిసినా కూడా, ఒకదానితో మరొకటి పొంతన లేనట్లు కనిపిస్తాయి. అలాగని సుబ్బరామయ్యగారు ఎక్కడెక్కడి ఇతివృత్తాలో తీసుకుని కథలు రాయలేదు. నిజానికి అలా రాసేందుకు ఆయనకు ఉన్న పరిధి చాలా తక్కువ. సుదీర్ఘకాలం పట్నవాసం చేయడం, గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండటం చేత ఆయన మీదకు దూసుకువచ్చే అనుభవాలు తక్కువ. కానీ స్పందించే హృదయం ఉండాలే కానీ రోజువారీ కనిపించే జీవితాలలోంచి కూడా అద్భుతమైన ఘట్టాలను సృజించవచ్చని నిరూపించారు.


ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సుబ్బరామయ్యగారి ప్రతి కథా విభిన్నంగానే తోస్తుంది. ఈ వస్తువుతో ఇంత అద్భుతమైన కథని అల్లవచ్చా అనిపిస్తుంది. ‘కొళందవేలు బొమ్మ’ కథనే తీసుకోండి. మనకి నిత్యం రోడ్డు పక్కనే బొమ్మలమ్ముకుంటూ కనిపించేవారి జీవితాల వెనక ఎలాంటి విషాదం దాగి ఉంటుందో ఊహించి రాసిన కథ ఇది. ఇంతా చేసి ఎలాగొలా ఓ బొమ్మని చెక్కి, దాన్ని నష్టానికి అమ్ముకుంటే... చివరికి ఆ డబ్బుని కూడా పోలీసువాడు లాక్కొనిపోతే అతని గతి ఏమవ్వాలి! ‘కొళందవేలు బొమ్మ’ చేతివృత్తులకు సంబంధించన కథ అయితే ‘సతీసావిత్రి’ ఓ వ్యభిచారిణి వ్యథ. తన వృత్తిని సాగించుకునేందుకు ఓ పిల్లవాడిని అడ్డుపెట్టుకోవాలని ప్రయత్నించి భంగపడిన మహిళగాథ.

 


ఇక మధ్యతరగతి జీవితాలే ఇతివృత్తంగా సాగే ఏస్రన్నర్, ఇంగువ వంటి కథలు చదవకపోతే, చిన్న కథలలో ఉన్న మజాను మిస్ అయినట్లే! మాజీ క్రీడాకారుడైన రామచంద్రమూర్తి జీవితం అనే ఆటలో ఓడిపోయిన తీరు కళ్లని చెమరుస్తుంది (ఏస్రన్నర్). మనసులో మిగిలే చిన్నపాటి అనుమానాలు కూడా వ్యక్తిత్వాన్ని ఎంతగా తొలచివేస్తాయో ‘ఇంగువ’ కథతో తేలిపోతుంది. ఇవే కాదు- కళ్లజోడు అనే ‘విలాసవస్తువు’ కోసం ఒక ముసలావిడ పడే ఆరాటం (కళ్లజోడు), గాంధీ సాధించిన స్వాతంత్ర్యం చివరికి అదే పేరుతో ఉన్న నిరుద్యోగికి ఎలా ఉపయోగపడలేదో (అలజడి), కళాప్రపంచంలో పంచన చేరి వంచన చేసే మోసగాళ్ల తీరు (దగ్థ గీతం)... ఇలా సుబ్బరామయ్య రాసిన ప్రతి కథా ఎన్నదగినదే! ఒక చిన్నపాటి సమస్యను తీసుకుని, దానిని అనుభవించేవారి జీవితాలలో ఎంతటి విషాదం ఉంటుందో ప్రతిబింబించే ఆయన కథలను చూస్తే చెహోవ్ గుర్తుకురాక మానడు. అలాంటి మహారచయితకు దీటుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి మనమధ్యే ఉండటం అదృష్టం.

- నిర్జర.