Facebook Twitter
నిజాన్ని ‘దిగంబరంగా’ నిలబెట్టిన కవులు

నిజాన్ని ‘దిగంబరంగా’ నిలబెట్టిన కవులు

 

కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం ఏమంత సులువు కాదు. మనసులో ఎగసిపడిన భావాలను చరణబద్ధంగా అక్షరాలలోని ఒంపే ప్రక్రియ అనుకోవచ్చునేమో! కాకపోతే రానురానూ మనసులో మెదిలిన ప్రతి ఒక్క భావాన్నీ ఏదో ఒకలా వదిలించుకుని, దానినే కవిత అని పేరు పెట్టుకునే పరిస్థితులు వచ్చేశాయి. తెలుగునాట కవిత్వం చదివేవారి సంగతేమో కానీ, కవుల సంఖ్య మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. సామాజికమాధ్యమాల ద్వారానో, చిన్నాచితకా సభల ద్వారానో ఉబికివస్తున్న స్వయంప్రకటిత కవుల తాకిడి ఎక్కువైపోయింది. కవిత్వంలో నిబద్ధత గురించి ఇలాంటివారికి ఓసారి గుర్తుచేయాలంటే ‘దిగంబర కవుల’ను తల్చుకోవాల్సిందే!


1960వ దశకంలో ఉవ్వెత్తున దూసుకువచ్చి ఇది ‘దిగంబరరశకం, నగ్ననామ సంవత్సరం, ఆశ రుతువు’ అని సగర్వంగా చాటిన దిగంబర కవుల గురించి చెప్పుకొనేందుకు చాలానే ఉంది. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న అనే ఆరుగురు కవులే మనం తల్చుకున్న దిగంబర కవులు. వీరి అసలు పేర్లు ఇవి కావు. ఈ ఆరుగురూ కూడా తమతమ లక్ష్యలకు ప్రతీకగా ఉండేందుకు నియమించుకున్న కలం పేర్లే కానీ కులం పేర్లు కావు. నిజానికి ఈ ఆరుగురూ అప్పటికే కవితాలోకంలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్నవారు. అయితే నిస్తబ్దుగా ఉన్న కవితాలోకంలో ఏదో ఒక ప్రకంపన సృష్టించాలన్న తపనతో ఒక చోటకి చేరారు. అందుకోసం వారు uncensoredగా తమ భావాలను వెలిబుచ్చుతూ మూడు సంకలనాలను తీసుకువచ్చారు.

 


నిజానికి దిగంబర కవిత్వం ఒక చారిత్రక అవసరం. ఎన్నో ఆశలతో ఆశయాలతో సాధించుకున్న స్వాతంత్ర్యం, సంబరాలు చేసుకునే సందర్భంగానే మిగిలిపోయింది. నేతలు, పెట్టుబడిదారులు కుమ్మక్కయిపోయారు. కార్మికసంఘాలు పార్టీల పరమైపోయాయి. రైతులు, కూలీలు, నేతన్నల గురించి పట్టించుకుని పోరాడే దిక్కే లేకుండా పోయింది. పీడిత వర్గం తరపున ఎవరన్నా గొంతెత్తితే, ఆ గొంతుకను నిర్బంధించేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. అలాంటి సందర్భంలో ఇటు రచయితలలోని జడత్వాన్ని విమర్శిస్తూ, అటు ప్రజలలో చైతన్యాన్ని రగిలిస్తూ వచ్చిన కవిత్వమే దిగంబర కవిత్వం. 1965లో విడుదల అయిన దిగంబర కవుల తొలి సంకలనంలోని తొలి కవితే (ఆత్మయోని) ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది...


ఆత్మయోని
నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే
నిద్రపోనియ్యి
లేపకు
పీకనులిమి గోతిలోకి లాగుతాడు.
ప్రబంధాంగనల తొడలు తాడి మొద్దులు
తాకితే కాళ్ళు విరగ్గొట్టు
...
భావకవుల నపుంసక హావభావాలకు సవాలు
అభ్యుదయ కవీ నల్లమందుతిని నిద్రపోయావ్
నయాగారా జలపాతంలో
దూకలేక పోయిన అన్నయ్యా
గుడ్బై! మీకందరికీ సలామ్వాలేకమ్
వచనం లేదు!
కవిత్వం అంతకంటేలేదు... 


... అంటూ సాగే కవిత్వంలో తమ ఉద్దేశం ఏమిటో కుండబద్దలుకొట్టేశారు దిగంబర కవులు.
దిగంబర కవిత్వం ఊహించినట్లుగానే ప్రకంపనలు సృష్టించింది. రా.రా, తిలక్, సోమసుందర్‌ వంటి ప్రఖ్యాతులు ఈ కవిత్వంలోని పదప్రయోగాలను నిరసించారు. ఇందులోని లైంగిక ప్రతీకలని, అశ్లీల పదాలనీ ఎండగట్టారు. కానీ శ్రీశ్రీ, చలం వంటి రచయితలు ఈ రచనలను నెత్తికెత్తుకున్నారు. ఉడుకురక్తపు యువకులు పదేపదే ఈ కవితలను చదువుకున్నారు. అణగారిన వర్గాలు దిగంబర కవిత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు.

 


దిగంబర కవిత్వం మూడు సంపుటాలుగా (1965, 66, 68) ప్రజల్లోకి వచ్చింది. మూడు సంపుటాలూ ప్రజల ఆదరణను పొందాయి. వీటిలోని ప్రతి కవితా అద్భుతం అని చెప్పలేకపోయినా, అసమాన్యమైన కవితలెన్నో వీటిలో చోటు చేసుకున్నాయి. ఇవి నిజాలు/ నిత్యం మండే యదార్థాలు/ ఆడదాని ప్రసూతి వేదనలా/ జీన్‌ వార్జీన్‌ ఆకలిమంటలా/ ఎదిగి చేతికందిన కొడుకు/ యముడి పరమైతే/ తల్లడిల్లే విధవ తల్లి గర్భ శోకంలా/ సూటిగా నగ్నంగా చెప్పబడే సత్యాలు (భైరవయ్య - దిగంబరి) వంటి కవితలు అజరామరంలా నిలిచిపోయాయి. 


దిగంబర కవిత్వంలో ప్రతి కవితా ఒక నిప్పుకణికలాగే సాగుతుంది. ప్రతి వాక్యమూ పాఠకుడిని రెచ్చగొడుతుంది. నీ బొమికల్ని హడలగొడతాను/ నీ కలల్లో కల్లోలం రేపుతాను/ ఊ లే/ ముసుగు తొలగించు/ ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి/ ఆత్మ ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో/ మనిషిలా మంచిగా ఆకాశంలా అవనిలా/ బతుకు/ తెరిచిన కళ్లు ఇంక మూయకు/ చెప్పడానికి నువ్వెవరని గొంతు నొక్కడానికి ప్రయత్నించకు (నగ్నముని – సుఖరోగి) వంటి కవితలు చదివినప్పుడు మనసులో ఏదో ఒక మూల నుంచి ఓ మూలుగు మన ఉనికిని నిదురలేపేందుకు ప్రయత్నించక మానదు. అందుకనే దిగంబర కవితల ముందుమాటలో వారు ‘ఇది సెక్స్‌ గ్రంథం కాదు. రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించింది అంతకంటే కాదు. ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి, పిచ్చెక్కి ప్రవచించిన కవిత’ అంటూ తమ కవితలను నిర్వచించారు. వారి కవిత్వం చదివితే అదెంత నిజమో అర్థమవుతుంది.

 

 

- నిర్జర.