Facebook Twitter
చెదరని కథల సంతకం – అల్లం శేషగిరిరావు


చెదరని కథల సంతకం – అల్లం శేషగిరిరావు

 

 

ఓ పదిహేడంటే పదిహేడు కథలు రాసిన రచయిత, సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలరా! సాహిత్య అకాడెమీ అవార్డుని గెలుచుకోగలరా! అంటే కష్టమే అనిపిస్తుంది. మరి ఆ 17 కథలలో ఎంతటి గాఢత లేకపోతే అంతటి గుర్తింపు వస్తుంది. గుర్తింపు సంగతి పక్కన పెడితే కథ రాశామన్న విషయంకంటే మంచి కథరాశామన్న తప్తి రచయితకు అవసరం అన్న విషయమూ రుజువవుతుంది. అలా మంచి కథలతో తెలుగు సాహితీలోకాన్ని మెప్పించిన రచయిత ‘అల్లం శేషగిరిరావు’అల్లం శేషగిరిరావు 1934, డిసెంబర్ 9 న ఒడిశాలోని గంజాం జిల్లాలోని చిత్రపురంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్.ఏ చేసి రైల్వేలో ఉద్యోగాన్ని సాధించారు. అదే రైల్వేలలో పదవీవిరమణా చేశారు.

శేషగిరిరావు ఆంగ్ల సాహిత్యాన్ని విస్తృతంగా చదివేవారు. హెమింగ్వే వంటి రచయతల ప్రభావం ఆయన మీద ప్రగాఢంగా ఉంది. దానికి తోడు కాళీపట్నం రామారావు వంటి సాహితీకారుల సాన్నిహిత్యమూ ఉండేది. అందుకే వారి కథలు ఆషామాషీగా సాగవు. కాలక్షేపం కోసం అన్నట్లుగా ఉండవు. కథలో బిగువుతో పాటుగా పాఠకుల హృదయాన్ని తాకాలన్న లక్ష్యం స్పష్టంగా ఉంటుంది.

శేషగిరిరావు తొలి కథ " పులి చెరువులో పిట్టల వేట" 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. బహుశా ఆంధ్రజ్యోతి తనను ప్రోత్సహించిందన్న అభిమానంతోనో ఏమో, ఆయన తన కథలలో ఎక్కువ శాతం ఆంధ్రజ్యోతికే పంపేవారు. అల్లం శేషగిరిరావు కథలలో కొట్టొచ్చినట్లుగా కనిపించే ఓ విశేషం- వాటిలోని వేట ఇతివృత్తం. శేషగిరిరావుగారి తొలి కథ వేట ఇతివృత్తంతో వెలువడి, అది ప్రజాదరణ పొందడంతో... ఆయనను అదే ఇతివృత్తంతో రాయమంటూ సంపాదకులు అభ్యర్థించేవారట. వేటకథలన్న పేరు పడటంతో శేషగిరిరావుగారి కథలు ఏవో కాలక్షేపపు సరుకు అనకోవడం దురభిప్రాయమే అవుతుంది. ఒక పక్క జంతువుల స్వభావాన్ని వర్ణిస్తూనే, వాటి ఉనికిని చూపిస్తూనే... మనిషి కృత్రిమంగా ఏర్పరుచుకున్న మృగలక్షణాలని ఎత్తిచూపించడం శేషగిరిరావుగారికే చెల్లుతుంది. అందుకు ‘వఱడు’ అనే కథను గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

రచయిత కథనం ప్రకారం వఱడు అంటే ‘‘బాగా ముదిరిపోయిన ముసలి నక్క.. దీన్ని అడవిలో జంతువులన్నీ దయ్యాన్ని చూసినట్లు చూస్తాయి.. బాగముసలిదై పోవడం వల్ల, దానంతటది వేటాడి తినలేదు.. పులి చంపి తినగా ఒదిలిన మాసంతో తన ముసలి కడుపు నింపుకోవడానికి! గొప్ప దగుల్బాజీ జంతువు.’’ అయితే ప్రసవ వేదనతో బాధపడుతున్న తన కూతురిని కాపాడి, తన కోసం పై ఆఫీసరుతో పోట్లాడిన వ్యక్తి మీద ఒక గుమాస్తా చూపిన అవిశ్వాసాన్ని సమాంతరంగా చెప్పుకొస్తారు రచయిత. దాంతో తన తాత్కాలిక లాభం కోసం సాటి మనిషిని బలిచేసే మనిషి వఱడుకంటే భయంకరమైనవాడంటూ చెప్పకనే చెబుతారు.

మనిషిలోని స్వార్థపరత్వాన్ని ఎత్తిచూపుతూ సాగే మరోకథ ‘ది డెత్‌ ఆఫ్‌ ఎ మేనీటర్‌’ కూడా శేషగిరిరావు రచనా ప్రతిభను కళ్లకు కడుతుంది. మనిషి రక్తాన్ని రుచిమరిగిన పులిని మట్టుపెట్టేందుకు, తనకు విశ్వాసంగా పనిచేస్తున్న నౌకరునే బలిపెట్టేలనుకుంటాడు ఓ వేటగాడు. కానీ చివరికి అతని పిల్లవాడే ఆ పులికి బలైపోతాడు. పులితో పోరాడే క్రమంలో వేటగాడూ బలైపోతాడు. మేనీటర్‌ అన్న పదం పులులకే కాదు, మనుషులకు కూడా వర్తిస్తుందనేలా సాగుతుంది ఈ కథ.

శేషగిరిరావు కథలు సుదీర్ఘంగా సాగుతాయి. రచయిత విశ్లేషణలు ప్రత్యేకించి కనిపించవు. కానీ పాఠకులకు చాలా విషయాలు చెబుతున్నట్లు తోస్తుంది. సంభాషణల్లోనూ, కథ నడిచే తీరులోనూ బిగువు సడలదు. వేట గురించి ప్రస్తావన ఉన్నంతమాత్రాన ఏదో తనది కాని వాతావరణంలో ఉన్నానన్న చిరాకు కలగదు. చితికిపోయిన రాజవంశంలోని చివరి మనిషిగా నిలిచిన ఓ జంట గురించి చెప్పినా (ప్రిన్స్‌ హెమింగ్వే), కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఓ తుపాకి గురించి చెప్పినా (శిథిల శిల్పాలు)... ఎలాంటి కథా వస్తువులోకైనా పాఠకుడిని లాక్కువెళ్లడం శేషగిరిరావు ప్రత్యేకత.

శేషగిరిరావుగారి కథలు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్యఘోష’ అనే సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిలో ఉన్న చీకటి, నరమేథం, మృగతృష్ణ వంటి కథలన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘నక్కలోళ్లు’ అనేర సంచారజాతికి చెందిన డిబిరిగాడు అనే పాత్ర ఆధారంగా రాసిన ‘చీకటి’ కథ విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రసిద్ధ దర్శకుడు దానిని తెరకెక్కించాలనే ప్రయత్నం కూడా చేశారు. తెరకెక్కించకపోతేనేం ‘చీకటి కథ చదివి, క్లాసిక్ మూవీని చూసినంతగా థ్రిల్‌ అయిపోయాను,’ అంటారు నవ్యవవీక్లీ ఎడిటర్‌ జగన్నాథశర్మగారు.

ఒక్కమాటలో చెప్పాలంటే అల్లం శేషగిరిరావు కథకులకే నచ్చే కథకుడు. కథ ఎలా రాయాలి అన్న సందేహం వస్తే ‘శేషగిరిరావుగారి కథలు చదవండి!’ అని జవాబుగా మిగిలిపోయేంతటి అక్షరసంపదని అందించినవాడు. అందుకే ఆయన మరణించి 16 సంవత్సరాలు గడుస్తున్నా, ఆయనని అభిమానించేవారి సంఖ్య పెరుగుతోందే కానీ తరగడం లేదు.

- నిర్జర.