Facebook Twitter
తృప్తి

 

తృప్తి

 

అనగనగా శివలింగాపురం అనే ఊళ్ళో రంగయ్య-సోమయ్య అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళకున్న ఆస్తల్లా పూర్వీకులు ఇచ్చిన ఐదెకరాల భూమీ- ఓ పాత ఇల్లూనూ. వాటితోటే రెండు కుటుంబాలూ బ్రతుకు లాగేవి. అన్నదమ్ములిద్దరూ కలిసి తమ భూమిలో పంటలు పండించేవాళ్ళు; వచ్చిన లాభాన్ని ఇద్దరు పంచుకొని తృప్తి పడేవాళ్ళు.

వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఓ షావుకారు ఉండేవాడు. అతని దగ్గర అంతులేని డబ్బు ఉండేది; కానీ ఎప్పుడూ ఏవేవో‌ బాధలు. రంగయ్య సోమయ్యలను చూస్తే అతనికి చాలా అసూయగా ఉండేది: "ఇదేంటి, నాకు ఇంత డబ్బు ఉన్నా సంతోషం లేదెందుకు? నాతో పోలిస్తే వాళ్ళకు అసలు ఏమీ లేదే, అయినా వాళ్ళు అంత సంతోషంగా ఎలా ఉండగల్గుతున్నారు?" అని.

అయితే అతని ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశం లేదు- రంగయ్య-సోమయ్యలను అడిగితే కూడా ప్రయోజనం ఏమీ లేదు- వాళ్ళ సంతోషానికి కారణం వాళ్ళకే తెలీదు మరి!

ఇలా ఉండగా షావుకారుకు చిన్నతనంలో పాఠాలు చెప్పిన గురువుగారు ఒకరోజున అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. షావుకారు ఆయన్ని ఆదరించి, భోజనం పెట్టి, తినేటప్పుడు దగ్గర కూర్చొని విసనకర్రతో విసరుతూ, ఎదురింట్లోని రంగయ్య-సోమయ్యలను చూపించి, "గురువుగారూ! నాకు ఇంత డబ్బు ఉన్నా సంతోషం లేకుండా ఉన్నదెందుకు? ఆ ఎదురింట్లో వాళ్ళకు ఏమీ లేదు కదా, అయినా అంత సంతోషంగా ఉన్నారు ఎందుకని? లోకాచారం ప్రకారం డబ్బుంటే అన్నీ ఉండాలి కదా స్వామీ?" అన్నాడు.

గురువుగారు అప్పుడు "నాయనా! ఉన్న దాంతో తృప్తి పడేవాడే ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు తప్ప, డబ్బు ఉన్నవాడు కాదు. అందులో కూడా సంతోషం అనేది అందరికీ ఉండదు- తృప్తిగా ఎందుకుండాలో అర్థం చేసుకొని, దాన్ని జీవితంలో నిలుపుకోవాలనుకునేవాడికి తప్ప, వేరొకరికి ఆ భాగ్యం ఉండదు. కావాలంటే ప్రయత్నించి చూడు" అంటూ ఒక ఉపాయం చెప్పాడు.

ఆ రోజునే దాన్ని అమలు చేశాడు షావుకారి. ఎదురింటి రంగయ్య-సోమయ్యలను పిలిచి "మీరు ఇంత సంతోషంగా ఉండటం చూసి నా మనసు నిండిపోతున్నది. 'నేనూ మీలా ఉండగల్గితే బాగుండును' అనిపిస్తున్నది. మీకిద్దరికీ నా తరపున చిన్నపాటి బహుమతి ఇస్తాను-కాదనకండి" అంటూ ఇద్దరికీ చెరొక వంద బంగారు నాణాలు ఇచ్చి వచ్చాడు.

తన వంతు డబ్బును కొడుకుకి, భార్యకు చూపించాడు రంగయ్య. వాళ్ళిద్దరూ మురిసిపోయారు. వాళ్ల సంతోషాన్ని చూసి రంగయ్య కూడా మురిసిపోయాడు.

రంగయ్య కొడుకు ముందుకొచ్చి ఒక నాణెం తీసుకోబోయాడు. నాణాల సంచీని గబుక్కున వెనక్కి లాక్కున్నాడు రంగయ్య. భార్య ఒక నాణాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుండగా భార్యని తిట్టి ఆ నాణాన్నీ లాగేసుకున్నాడు. 'ఏనాడూ లేనిది ఇవాళ్ల ఇలా ప్రవర్తిస్తున్నాడేమి?' అంటూ భార్య, కొడుకు ఇద్దరు ముఖాలు ముడుచుకున్నారు.

రంగయ్య ఇవన్నీ గమనించే స్థితిలో లేడు: 'నాణాలను ఎలా దాచాలి? ఎక్కడ దాచాలి? ఇంట్లో ఉంచితే భార్య-కొడుకు వీటిని మిగలనివ్వరు' అని దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెట్టాడు. చివరికి వాటిని తీసుకెళ్ళి తన పొలంలోనే ఎవ్వరూ చూడకుండా ఒక గుంతలో దాచి పెట్టాడు. రోజూ ఒక్కడే వెళ్ళి, గుంతను త్రవ్వి, బంగారు నాణాలను బయటికి తీసి, లెక్కపెట్టుకొని, మళ్ళీ యథాప్రకారం పాతిపెట్టి ఇంటికి రాసాగాడు రంగయ్య.

ఇక సోమయ్యకూడా షావుకారు తనకిచ్చిన నాణేలను భార్య, పిల్లలకు చూపించాడు. వాళ్ళూ చాలా ఆనందపడ్డారు. అయితే వెంటనే సోమయ్య భార్య అడిగింది: "షావుకారు మామూలుగా ఎవరికీ‌ ఏమీ ఇచ్చే రకం కాదే, మరి ఈ నాణాలను మనకి ఎందుకిచ్చాడబ్బా?" అని. "ఏమో, మనం సంతోషంగా ఉండటం చూసి ఇచ్చాడట. తనకూ మనలాగా ఉండాలని ఉందట" చెప్పాడు సోమయ్య.

సోమయ్య భార్య "అవునా!" అని ఊరుకున్నది. అది విన్న సోమయ్యకూ కొంచెం‌ అనుమానం వేసింది. "ఇందులో ఏదో మనకు తెలీని మతలబు ఉండవచ్చు. అందుకని అసలు ఈ నాణాలు మనవి కావనుకుందాం. ఎక్కడైనా భద్రంగా పెట్టి, ఇక పట్టించుకోనట్లు వదిలేద్దాం. ఆ సొమ్ము మనదే అయితే పర్లేదు; లేకపోతే షావుకారు మళ్ళీ వచ్చి అడుగుతాడు-ఇచ్చేయచ్చు. ఏమంటావు?" అన్నాడు సోమయ్య.

"అదే మంచిది" అని భార్య-పిల్లలు అన్నమీదట, వాళ్లంతా కలిసి దాన్ని ఇంటి పెరట్లో ఒక మూలన పాతిపెట్టి, ఇక ఆ సంగతి మరచిపోయారు.

షావుకారు తన పథకం ప్రకారం ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు. తను ఇచ్చిన నాణాలను ఎవరు ఎక్కడ దాచారో కూడా చూశాడు. రంగయ్య ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సోమయ్య మటుకు ఎప్పటిమాదిరే ప్రశాంతంగా ఉన్నాడు. ఇద్దరినీ చూసిన షావుకారు నవ్వుకున్నాడు. తన గురువుగారికి మనసులోనే నమస్కారం పెట్టుకున్నాడు. పధకంలో రెండో భాగానికి శ్రీకారం చుట్టాడు.

తర్వాతి రోజున పొలంలో ఖాళీ గుంతను చూసిన రంగయ్యకు గుండె ఆగినంత పనైంది. రంకెలు వేసుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ఊరంతా అల్లరి చేస్తూ పరుగులు పెట్టాడతను- "నా డబ్బెవరు దొంగిలించారు?" అని పెడబొబ్బలు పెట్టాడు.

రంగయ్య కుటుంబ సభ్యులందరూ గొల్లుమన్నారు. ఇరుగు పొరుగులంతా చేరి వాళ్లను ఓదార్చాల్సి వచ్చింది. రంగయ్యకు ఆ రోజునుండీ కంగారు ఎక్కువైంది; అతని ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది. ఇంటికి వెళితే కంచంలోనూ గ్లాసుల్లోనూ ముద్దకు, నీళ్లకు బదులు బంగారు నాణేలే కనబడసాగాయి. 'నా పిల్లలెలా బ్రతుకుతారు? ఇప్పుడెలా?' అన్న బెంగతో అతను చిక్కి సగం అయిపోయాడు.

ఈ సంగతి తెలిసి, "విన్నారా, షావుకారు మీ అన్నకిచ్చిన సొమ్మును ఎవరో ఎత్తుకెళ్ళారట. మన సొమ్ము ఎలా ఉందో మరి?" అన్నది సోమయ్య భార్య. ఇద్దరూ కలిసి పెరట్లో త్రవ్వి చూశారు- నాణాలు లేవు! "నేను అప్పుడే అన్నానుగా, మనది కాని సొమ్ముకు మనం ఆశ పడకూడదు" అన్నది సోమయ్య భార్య. "అవును. ఆ సొమ్ము మనది కాదు- అందుకే పోయింది" అన్నాడు సోమయ్య, తిరిగి గుంతను పూడ్చేస్తూ. అటుపైన వాళ్ళంతా ఎప్పటిమాదిరే ప్రశాంతంగా నిద్రపోయారు.

వీళ్ళిద్దరినీ గమనిస్తున్న షావుకారికి అర్థమైంది: సంతోషానికి కారణం తృప్తి. అయితే తృప్తి అనే జీవితాదర్శం నిలవాలంటే దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలోకి స్వాగతించటం అవసరం. అలా కానప్పుడు, 'తృప్తి' అనే ఆ వస్తువు యాంత్రికంగా నిలవజాలదు. ఏదో ఒకనాడు అది పోతుంది; అసంతృప్తినే మిగుల్చుతుంది. తృప్తిని తమ స్వభావంలో ఒకటిగా చేసుకోగల్గినవాళ్ళు ధన్యులు.

మరునాడు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిన షావుకారు ఇద్దరి చేతుల్లోనూ రెండు వందల నాణాలు పెడుతూ "మిమ్మల్ని ఆందోళనకు గురిచేశాను- నన్ను క్షమించండి. మీరు దాచిన సొమ్మును అవసరం కొద్దీ తిరిగి తీసుకున్నది నేనే. మీకు ముందుగా చెప్పి ఉండాల్సింది" అన్నాడు.

రంగయ్య వాటిని తీసుకొని, గుండెలకు హత్తుకుంటూ నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు. సోమయ్య చిరునవ్వు నవ్వాడు. షావుకారుకు సోమయ్యంటే గౌరవం మరింత పెరిగింది.

Courtesy..
kottapalli.in