Facebook Twitter
" ఏడు రోజులు " 30వ భాగం

" ఏడు రోజులు " 30వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 


        


    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మద్రాసు నుండి వస్తున్న రైలు దిగాడు భవానీశంకర్.

    జుట్టుచెదిరి, బట్టలు మాసిపోయి పీక్కుపోయిన మొహంతో పిచ్చివాడులా తయారై వున్నాడు అతడు.

    బాగా పొద్దుపోయింది కాబట్టి స్టేషన్ లో జనాలు పూర్తిగా పలచబడి వున్నారు. కొందరు ప్రయాణికులు అప్పటికే గురకలు కొడుతూ పడుకుని వున్నారు.

    భవానీశంకర్ స్టేషన్ దాటి ఇవతలకి నడిచాడు. అతడి నడక ఒంట్లో శక్తి లేనట్లుగా తడబడుతోంది.

    "రేయ్... ఎవడ్రా అక్కడా?" స్టేషన్ బయట నిల్చుని వున్న రైల్వే పోలీసు కేకేశాడు.

    భవానీ శంకర్ భయపడలేదు. నేరుగా పోలీసు వైపు నడిచాడు.

    "ఎవడ్రా నువ్వు? తాగి తిరుగుతున్నావా ఏం?" దగ్గరగా వచ్చాడు పోలీసు.

    "నమస్తే సార్! మద్రాసు నుండి ఒస్తున్నాను" పోలీసు దగ్గరగా రాగానే నీరసంగా చెప్పాడు భవానీశంకర్.

    పోలీసు ఒకమారు భవానీశంకర్ ను ఆపాదమస్తకం పరిశీలనగా చూసి "నీది మద్రాసు నుండి వస్తున్న ఫేసేనట్రా?" ఎగాదిగా చూస్తూ అన్నాడు.

    అందుకు ఏం అనలేక ఇబ్బందిగా కదిలాడు భవానీశంకర్.

    "రేయ్ నీ మొహం చూస్తుంటే ఫుట్ పాత్ వెధవలా కనబడుతున్నావు. ఇంకొక్క నిముషం కూడా నా కళ్ల ఎదురుగా నిలబడొద్దు. చల్ బే చల్" గదమాయింపుగా అన్నాడు పోలీసు.

    "వెళ్తున్నాను సర్" అన్నాడు భవానీశంకర్.

    "చల్ బే" అన్నాడు పోలీసు.

    ముందుకు నడిచాడు భవానీశంకర్.

    "రేయ్" మళ్లీ పిలిచాడు పోలీసు.

    ఆగి వెనక్కి చూశాడు భవానీశంకర్.

    "ఇట్టారా" పిలిచాడు పోలీసు.

    దగ్గరగా వచ్చాడు భవానీశంకర్.

    "నీవు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడకూడదు. పొరపాటున కనబడ్డావనుకో రైల్వే దొంగ కింద కేసుబుక్ చేసి... బొక్కలో తోయిస్తాను కొడకా" బెదిరించాడు పోలీసు.

    "వెళ్లిపోతున్నాను" అంటూనే ముందుకు నడిచి "ఈ పోలీసునాయాళ్లకి జులుం చేయడం ఒక్కటి బాగా తెలుసు" మనసులో అనుకున్నాడు భవానీశంకర్.

    బస్టాపును దాటి ముందుకు నడిచాక ఎస్టీడీ బూతు ఒకటి కనబడింది. ముగ్గురు వ్యక్తులు కంటే ఎక్కువలేరు అక్కడ. వెళ్లి వాళ్ల మధ్యలో కూర్చున్నాడు భవానీశంకర్.

    అరగంట తర్వాత భవానీశంకర్ ఛాన్సు వచ్చింది. గ్లాస్ క్యాబిన్ లోకి వెళ్లి స్నేహితుడు గోపాల్ కు నంబర్ కలిపాడు భవానీశంకర్. ఎంగేజ్ వచ్చింది. అంతలో మరెవ్వరో కస్టమర్ వచ్చాడు.

    "బాయ్... నీది లోకలేకదా, తర్వాత చేసుకో" క్యాబిన్ తెరిచి మరీ చెప్పాడు ఎస్టీడీ యజమాని.

    "వీడొకడు" మనసులో తిట్టుకుంటూ వెలుపలికి వచ్చాడు.

    పావుగంట తర్వాత వచ్చిన కస్టమర్ వెళ్లిపోయాడు. అందుకోసమే టెన్షన్ గా ఎదురుచూస్తున్న వాడు వెంటనే క్యాబిన్ లోకి వెళ్లి తనక్కావల్సిన నంబర్ మరోసారి ప్రయత్నించాడు. అవతల రెండురింగులు రాగానే డైరెక్టుగా గోపాలే లైన్లోకి వచ్చాడు.

    "హలో"

    "అరే గోపాల్ నేనురా భవానీశంకర్" స్నేహితుడి గొంతును వెంటనే గుర్తుపట్టాడు భవానీశంకర్.

    "ఎక్కడున్నావురా?" గోపాల్ లో ఆతృత.

    "సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్లాలో తెలీడంలేదు" అన్నాడు భవానీశంకర్.

    "అసలు నీవు నిజంగా ఎక్కడున్నావురా? నువ్వు ఘనకార్యం చేసివెళ్లాక ఇక్కడ పరిస్థితులు పూర్తిగా విషమించి పోయాయి" కొద్దిగా కోప్పడ్డాడు గోపాల్.

    "రోజూ పేపర్ చూస్తున్నాను. నాకు అన్ని విషయాలు తెల్సు. ఈ రోజు పేపర్లో గౌసియా గురించి చదివాను"

    "గౌసియా గురించి చదివావు సరే. కాని ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ మళ్లీ అల్లర్లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నీవు చేసిన పని ఇంతదూరం వచ్చింది"

    "అదంతా సరే ముందు నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పు?"

    "ఎక్కడికి వెళ్లాలని వచ్చావు?"

    "గౌసియా హైదరాబాద్ వచ్చివుంటుందనె ఆశతో వచ్చాను. మా ఇంటికి మాత్రం వెళ్లాలనుకోలేదు. అమ్మానాన్నా క్షేమంగా వుంటే చాలు. కనబడితే నా గురించి చెప్పు.

    "ముఖ్యంగా నేను కబడితే నన్ను పోలీసులు అరెస్టు చేస్తారు. అందుకే ఎక్కడైనా రహస్యంగా వుండిపోయి మీ అందరి సహాయంతో గౌసియాను తీస్కుని ఎక్కడికైనా వెళ్లిపోవాలని వుంది"

    "అరే పిచ్చోడా నీ కారణంగా తండ్రిని కోల్పోయి కూడా ఆ పిల్ల మళ్లీ నీ వెంట వస్తుందా?

    "తప్పకుండా వస్తుంది"

    "ఏంటోరా నీ పిచ్చి. రోజురోజుకి బాగా ముదిరిపోతున్నట్టుంది"

    "గౌసియాను మర్చిపోలేను"

    "ప్చ్... ఏం చూసి ఆ పిల్లను అంత ఇదిగా ఇష్టపడుతున్నావురా? ఆస్తిమంతురాలు కాదు, అక్షరం ముక్కరాదు. ఏదో కాసింత అందం వుంది. ఆ అందాన్ని పట్టుకుని తింటావా?"

    "నీవు ఏమైనా మాట్లాడు గోపాల్! గౌసియా నా ప్రాణం! ఆమె లేకుండా నేను బతకలేను. ఈ పరిస్థితిలో కూడా నన్ను, నా ప్రేమను నిందించే ప్రయత్నం చేయొద్దు.

    "దయచేసి నన్ను అర్థం చేసుకోరా! నేను గౌసియాను ఇష్టపడి పొరపాటు చేశానేమో తెలియదుకాని ఇప్పుడు ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను"

    "ఆమె లేకుండా నీవు బతకలేవు సరే! మరి ఒకవేళ గౌసియా అరబ్బుషేకు వెంట చిరునామా లేకుండా వెళ్లిపోయి వుంటే ఏం చేసేవాడివి?"

    "నీకు తెలీదురా! ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా పేపరు చదవడం, గౌసియా గురించి తెలవడం, నిజంగా నాకు పునర్జన్మ లాంటిది"

    "సర్లేగాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రిపూట ఎక్కడికీ వెళ్లలేవు కూడా! కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు బండి తీసుకుని వస్తాను"

    "వద్దురా! మీ ఇంటికి రావడం కూడా అంత మంచిదికాదు"

    "మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?"

    "రాబర్ట్ వాళ్ల ఇంటికి వెళ్తాను. అక్కడ వుంటే నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు"

    "రాబర్ట్ వాళ్లు నిన్ననే వూరెళ్ళారు"

    "ఓ గాడ్! మరి ఇప్పుడు ఎలా?"

    "అందుకే మా ఇంటికి వచ్చేయ్"

    "కాదురా, ముంతాజ్ గాడి దగ్గరకి వెళ్తే?"

    "ఈ టైమ్ లో వాడి దగ్గరకి ఎలా వెళ్తావు"

    "ఇప్పుడు పన్నెండు గంటలకు ట్రెయిన్ వుందికదా"

    "చార్జీకి డబ్బులు వున్నాయా?"

    "వున్నాయి"

    "నిజం చెప్పు"

    "వున్నాయిరా"

    "ఎంతవుంది?"

    "వంద రూపాయలు వున్నాయి"

    "సరిపోతాయిలే! అక్కడికి వెళ్లాక ఒకవేళ డబ్బు అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయి! లేదంటే ముంతాజ్ గాడిని అడిగి తీసుకో"

    "అట్లాగే"

    "ఇంకో విషయం! అది వేరే వూరుకదాని బయట తిరుగొద్దు"

    "నాకు అన్నీ తెల్సుగాని గౌసియా గురించి ఏ విషయం తెల్సుకుని రేపు నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను" అన్నాడు భవానిశంకర్.

    "తప్పకుండా" అన్నాడు గోపాల్.

    భవానీశంకర్ ఇంకేం మాట్లాడలేదు. ఫోన్ కట్ చేసి క్యాబిన్ లోంచి వెలుపలికి వచ్చి బిల్ చెల్లించి తిరిగి రైల్వేస్టేషన్ వైపు నడిచాడు.