Facebook Twitter
ముని ‘మాణిక్యం’ కథలు

ముని ‘మాణిక్యం’ కథలు

ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాంఘిక సాహిత్యంలో నిజంగానే స్వర్ణయుగం అనుకోవచ్చు. చలం మొదలుకొని శ్రీశ్రీ వరకు ఎందరో రచయితలు తెలుగుసాహిత్యం మీద చెరిగిపోని ముద్ర వేశారు. భిన్నమైన దృక్పథాలతో, విభిన్నమైన రీతులలో ఎవరికి తోచినట్లు వారు జీవితం పట్ల తమ అభిప్రాయాలని అక్షరబద్ధం చేశారు. బడుగుల జీవితాల గురించి, శ్రామికుల కష్టాల గురించి పుంఖానుపుంఖాలుగా అక్షరాలు వెలువడ్డాయి. మరి మధ్యతరగతి ప్రజల సంగతేంటి! ఏ స్వామ్యం వచ్చినా, ఏ కాలం మారినా, మారని వారి జీవితాలని అక్షరబద్ధం చేసేదెవ్వరు! వారి చిన్న చిన్న సరదాలు, సంసారపు కలహాలను కథలుగా మార్చేదెవ్వరు. ఆ లోటుని పూడ్చినవారే మునిమాణిక్యం నరసింహరావు.

1898 మార్చి 15న గుంటూరులోని జాగర్లమూడిలో జన్మించిన మునిమాణిక్యం ఉపాధ్యాయునిగా గుంటూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయనకు మొదటి నుంచీ తెలుగు, ఆంగ్ల సాహిత్యాల మీద మంచి అభిరుచి ఉండేది. దానికి తోడుగా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రొడ్యూసరుగా కూడా పనిచేశారు. ఇక జరుక్‌శాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ వంటి సాహిత్యకారుల సాన్నిహిత్యం ఎలాగూ ఉంది. వీటన్నింటి కారణంగా తనలో ఉన్న హాస్య చతురతని అక్షరబద్ధం చేయాలనే సంకల్పం కలిగింది మునిమాణిక్యానికి. అలా ‘తేనీటి గిన్నెలో తుపాను’ వంటి రచనలు మొదలయ్యాయి. వీటిలో కనిపించిన కాంతం పాత్ర పాఠకులకు సజీవంగానూ, తమ ఇంట్లోని వ్యక్తిగానూ తోచడంతో... అదే కాంతం పాత్రతో అనేక కథలను రాశారు మునిమాణిక్యం.

 

 

తెలుగువారికి కాంతం అనగానే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. ఒకటి వెండితెర మీద చిటపటలాడిపోయే సూర్యకాంతం, రెండు మునిమాణిక్యంవారు సృష్టించిన కాంతం పాత్ర. అలాగని కాంతం ఆనాటి బారిస్టరు పార్వతీశం, గణపతి తరహాలో హాస్య పాత్రేమీ కాదు. ఇటు ఉదాత్తమైన పతివ్రతో, అటు ఆడిపోసుకునే అనుమానపు భార్యో కాదు. ఒక సగటు గృహిణి! ఉపాధ్యాయ వృత్తిలో చాలీచాలని జీతంలో నెట్టుకువచ్చే భర్తకు తోడుగా నిలిచే మనిషి. అదే సమయంలో తన చిన్నపాటి సరదాలను తీర్చుకోవాలని తపించే స్త్రీ. భర్త అమాయకత్వాన్ని కూలంకషంగా ఎండగట్టే మహిళ. గడుసు కాంతానికీ ఆమె మధ్యతరగతి భర్తకీ మధ్యా సాగే దాంపత్య సన్నివేశాలే కాంతం కథలు.

మునిమాణిక్యం కేవలం కాంతం కథలే రాశారనుకోవడానికి లేదు. ‘రుక్కుతల్లి’ వంటి విషాదగాథను అక్షరబద్ధం చేశారు. తల్లి చనిపోయిన తరువాత కుటుంబభారాన్ని తన మీద వేసుకునే పధ్నాలుగేళ్ల రుక్కుతల్లి అనే బాలిక కథే ఇది. ఆసాంతం విషాదంగా సాగుతూ చివరికి రుక్కుతల్లి కూడా మరణించడంతో కథనం ముగుస్తుంది. కాంతం కథలను రాసిన మునిమాణిక్యం కలం నుంచి ఇంతటి విషాదాన్ని ఊహించడం కష్టమే! మరోవైపు ‘మాణిక్య వచనాలు’ వంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను కూడా రాశారు. ఇది ఇంచుమించుగా ‘How to win friends and influence people’ పుస్తకాన్ని గుర్తుచేస్తుంది.

దాంపత్య జీవితం గురించి మునిమాణిక్యం కేవలం కాంతం కథల్లోనే ప్రస్తావించలేదు. దాంపత్యోపనిషత్తు, ఇంటావిడతో పోట్లాట వంటి రచనలలో సైతం మధ్యతరగతి గృహస్థ జీవనమే ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. వీటిలో కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఎలా మెలగాలో అక్షరబద్ధం చేసిన ఆయన మాటలను కేవలం హాస్యంగా కొట్టిపారేయలేం. ఇందులో భేషజాలకు తావు ఉండదు, అధికారానికి చోటు ఉండదు- ‘మీ ఆవిడను మీ అభిప్రాయాలతో ఏకీభవింపచేయాలనీ, తన్మూలంగా ఆమెను నీ ఎడల సుముఖురాలునుగా చేసికొనవలయుననీ ఎప్పుడూ ప్రయత్నించకు. మహామహావాళ్లే ఈ విషయంలో ప్రయత్నం చేసి విఫలులైనారు. ప్రయత్నం వృధా, కాలం వృధా, నీవే ఆమె ఎడల సుముఖుడవు కా’ (దాంపత్యోపనిషత్తు).

 

మునిమాణిక్యం రచనల్లో ప్రధాన ఇతివృత్తం దాంపత్య జీవితమే అయినప్పటికీ, అందులో హాస్యమే ధ్వనించినప్పటికీ అటు స్త్రీలను కించపరిచినట్లు కానీ, ఇటు పురుషల అహాన్ని దెబ్బతీసినట్లు కానీ కనిపించదు. పైగా కుటుంబ కలహాలను, భార్యాభర్తల పంతాలను సైతం హాస్యం మిళితం చేసిన విశ్లేషణతో రచన సాగుతుంది. ‘యోగులు ఏళ్ల తరబడి తపస్సు చేసి సంపాదించే నిర్వికల్ప సమాధి ఈ తగవుల వలన లభిస్తుంది. ఎంత పెద్ద పెద్ద కష్టమైన లెక్కచేయకపోవడమూ, ఎంత పెద్ద శబ్దమైనా చలించకోవడమూ, ఈ రెండూ బహుకాల తపఃఫలితముగా రాతగినవి. అవి ఈ తగవుల వలననే లభిస్తవి’ (కలహ ప్రయోజనము).

మునిమాణిక్యాన్ని అంతర్జాతీయ స్థాయి రచయితగా విమర్శకులు గుర్తించకపోవచ్చు. ఆయన రాసిన కథలను అద్భుత కళాఖండాలుగా ఎవ్వరూ భావించకపోవచ్చు. కానీ ఒక గృహస్థు జీవితాన్ని ప్రతిబింబించే ఆయన రచనలకి తెలుగు సాహిత్యంలో తగిన చోటు ఉంది. ఆయన రచనలు చదివినవారెవ్వరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. మునిమాణిక్యం మాటల్లోనే చెప్పాలంటే- ‘నా రచనలో ధ్వని ఉంది, ఔచిత్యముంది, ఉదాత్తత ఉన్నది, శ్రవణ సుభగత్వము ఉన్నది చూసుకోండి!’ అందుకే మునిమాణిక్యం 1973లో మరణించినా ఇప్పటికీ ఆయన రాసిన కాంతం కథలు ప్రతి తెలుగు సంసారాన్నీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.

- నిర్జర.