Facebook Twitter
“అజ్ఞాత కులశీలస్య..” 40వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 40వ భాగం

కపిలేంద్రుడు రధము మీద పయనమవుతున్నంత సేపూ ఆలోచిస్తూనే ఉన్నాడు.     అంతవరకూ ఎన్నో యుద్ధములకు ఉత్సాహంగా వెళ్లాడు. కానీ ఇంతటి నిర్వేదం ఎన్నడూ కలగలేదు.

   కం.     అరివీర భయంకరుడై
             అరుల గడగడమనిపించ యల్పమయిననూ
             సరమమెరుగని కపిలుడే
             కొరగానక చనగనేమి కుందుని మహిమన్.

   మహారాజు గారి నిరుత్సాహం చూసి, సేనలు కూడా నెమ్మదిగా నడుస్తున్నాయి.
   తన సువిశాల సామ్రాజ్యం లోంచి వెళ్తుంటే కపిలేంద్ర దేవుని హృదయం అంత వ్యాకులిత స్థితిలోనూ ఉప్పొంగుతోంది.
   కనులారా కాంచుతూ ముందుకు సాగుతున్నాడు.
   ఒక్కొక్క దేశం వెనక్కి వెళ్తుంటే, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంత సమరం జరిపాడో, ఎందరు ప్రాణాలు కోల్పోయారో.. ఎంత మంది గాయపడ్డారో గుర్తుకొచ్చింది.
   అదంతా అవసరమా? తన రాజ్య పరి రక్షణకై చేశాడంటే అర్ధం ఉంది. దండయాత్రలు చేసి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడం అక్రమం కాదా?
   కానే కాదు.. అశ్వమేధయాగం పేరుతో దండయాత్రలు చేసి రాజ్యాలను కలుపుకోవడం పురాణ కాలం నుంచీ ఉంది. తను చేసింది తప్పే కాదు.
   మరి ఇప్పుడెందుకీ ఆందోళన?
   అంతే మరి తన దాకా వస్తే కానీ తెలియదు.
   ఇప్పుడు తన కుటుంబంలోనే చిచ్చు రగులుతోంది. పురుషోత్తముడిని రాజును చెయ్యడం అనుచితమేమో! కానీ.. అతడే సరైన వారసుడని తన అంతరాత్మ చెప్తోంది. ఏమైతే అది అవనీ. అంతా విధి లిఖితం.
   విధి.. కపిలేంద్ర దేవుడు భయపడినట్లే రాసి నట్లుంది.

   “స్వాగతం తండ్రీ! మీ రాకతో మా గృహం పావన మయింది.” హంవీరుడు స్వాగతం పలికాడు కృష్ణాతీరాన కొండపల్లి వద్ద.
   అలిగి వచ్చేసినా, తండ్రికి బహమనీ సుల్తానుల దాడిని తిప్పికొట్టడంలో సహాయ పడ్డాడు హంవీరుడు. ఆ సమరం సమసిన వెంటనే కృష్ణా తీరానికి వచ్చేశాడు.
   వచ్చేసినవాడు వెంటనే తన భవిష్యత్ ప్రణాలికలు వేసుకుంటున్నాడు.
   మహారాజు రాక మునుపే, పురుషోత్తమునికి జరిగిన పట్టాభిషేకం గురించి విన్నాడు. విని కూడా, చలించక తండ్రికి స్వాగతం పలికాడు.
   హంవీరుని చూడగానే ఒక్క సారి పుత్రప్రేమ పెల్లుబికింది కపిలేంద్రునిలో. తప్పుచేశానా అనుకున్నాడు. కానీ.. హంవీరునిలో ఉన్న ఆవేశం పరిపాలనకి సహకరించదని సర్ది చెప్పుకున్నాడు.
   హంవీరుని సరసన కూర్చుండ బెట్టుకుని, సంగతులన్నీ వివరించాడు. సామ్రాజ్య పరిరక్షణ చేయగల నైపుణ్యం హంవీర రాకుమారుని కున్నదనీ, పరిపాలనా సామర్ధ్యం పురుషోత్తమునకున్నదనీ, సంయమనంతో అన్నదమ్ములందరూ గజపతుల వంశ ప్రతిష్ఠ నిలపాలనీ.. కొన్ని తరాలు తమ వంశీయులు ఏలికలై చరిత్ర కెక్కాలని కోరాడు.
   “తప్పక చేసెదము తండ్రీ! మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.” కపిలేంద్రుని అతిథి మందిరానికి పంపి, తాను ఆంతరంగికులతో సమావేశ మయ్యాడు.
       
           “సీ.    భగ్గుమనే హృది భగభగ మండగా    
                         బలమునంతయును సేకరణ సేయ
                    గడగడ మనుచును హడలుచు నిలచిరి
                         హంవీర మంత్రాంగ యంత్ర మంత
                    జనకుడయిన నేమి జతనము లేకనే
                         న్యాయము సేయక నడచునాడు
                    భువనమందంతయు భోగ భాగ్యము లేక
                         భయభ్రాంతులన్ నిండి భంగపడదె
                    
            ఆ.వె.  చూచి గమ్మునుండ శోటీర్యమే లేద
                      చేవ లేక నేను చితికి చితికి
                      హీను డనయి బతుకు యీడ్వ లేను నిజము
                      తళ్లు జరిపి గెలువ తరుణ మిదియె.”
                   
    హంవీరుని ఆగ్రహానికి సభాస్థలి వణికినట్లయి పోయింది.
   “బహమనీ సుల్తానుల, దేవగిరి రాజులు సహకారం తీసుకుని మనం కటకం మీదికి దండెత్తుదాము. ఆ కపట సోదరుని గద్దె దించే వరకూ నాకు విశ్రాంతి లేదు.”
   “వారు మన చేతిలో ఓటమి చెందిన వారు ప్రభూ!” సైన్యాధిపతి అన్నాడు.
   “అందుకే. మన మాట వింటారు. పత్రాలు వ్రాయించండి. చారులను పంపుదాము. అంతే కాదు, గాంగేయుల సంతతి, వారి బంధువులు ఎచటనైన నున్న వారిని కూడ వెతకండి. శతృవులనందరినీ సమ కూర్చి నలువైపులా దండెత్తుదాము.” హంవీరుడు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుని, తన మందిరానికి వెళ్లి పోయాడు.
   
   సమావేశ నిర్ణయాలు వేగుల ద్వారా విన్న కపిలేంద్రుడు విలవిల లాడుతూ అప స్మారకం లోనికి వెళ్లి, నాలుగు రోజుల అనంతరం మరణించాడు.
   గంగా తీరం నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని విస్తరించిన గజపతి సామ్రాజ్య ఆది పురుషుడు నేల కూలాడు. ఎంత వారయినా చేర వలసినది నేల మీదికే.

       సీ.    మణుల హారములన్ని మాలలుగ మెడలో
                        మాణిక్య మకుటముల్ మస్తకమున
              చీనాంబరములెన్నొ చెలువము ధరియించి
                        దర్పమునొలికిస్తు తరల నెపుడు
              పంచభక్ష్య ములన్ని ప్రతిరోజు భక్షించి
                        తేనుపు లెన్నియో తేర్చగాను
              మందిరము లనెంతొ సుందరముగ కట్టి
                        ఆడంబరమునందు అధివసించి
              
   ఆ.వె.    రాచరికపు హొయలు రవళింప నంతనూ
              ఎదురు లేదు యనుచు ఎన్నటికిని
              మదిని తలచి యెంత మదియించి యున్ననూ
              అవని యొడికె చేర యదియె విధిగ.
           
   హుటాహుటీ వార్త కటకానికి చేరవేశారు హంవీర, దక్షిణ కపిలేంద్రులు. అన్నదమ్ములందరికీ, పరీక్షలుగా ఉన్న వారి సామంత రాజ్యాలకి కబురందించారు.
   పురుషోత్తమునికి వార్త చేరే సరికి వారం గడిచి పోయింది. ఇప్పుడు వెళ్లినా లాభం ఉండదు. మహానది ఒడ్డునకు తల్లితో సహా వెళ్లి కర్మ కాండలు చేశాడు.

   కటకానికి తిరిగి వచ్చిన మరునాడు..
   తెలతెల వారుతుండగా, మాధవుడు పరుగున వచ్చాడు, తటాకం వద్ద అర్ఘ్యమిడుస్తున్న పురుషోత్తముని వద్దకు.
   “వేగులు వార్త తెచ్చారు మహరాజా! హంవీరుడు, రాజులందరినీ కూడగట్టుకుని దండెత్తి వస్తున్నాడట. కృష్ణా, గోదావరీ, నాగావళీ తీరాలన్నీ పర రాజుల పాలు చేసి. కళింగ సింహాసనమాక్రమించడమే అతడి ధ్యేయమట.”
   పురుషోత్తముడు, ఒడ్డునకు వచ్చి, పొడి వస్త్రములు ధరించి, చెట్టు నీడను గట్టు మీద కూర్చున్నాడు.
   “సమయం లేదు మహారాజా! వారందరూ వస్తే ప్రాణాలకే ప్రమాదం. మనం తప్పించుకోవడమే సమంజసం. నమ్మకమైన వారిని తీసుకుని మనం పక్క దారులవెంట దక్షిణ దిశగా వెళ్దాం. అక్కడ మనకి మిత్రులున్నారు కృష్ణా తీరాన.” మాధవుడు ఆందోళనగా రెట్టించాడు.
   “అంతేనా మాధవా?”
   “అవును మహారాజా! జగన్నాధ బలభద్రులు ఆదుకుంటే గెలవ గలమేమో కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందిరాలన్నీ ఖాళీ చేసి, వెళ్ల పోదాం. అనువు గాని చోట ఆధిపత్యం పనికి రాదు. మనకు ప్రజల అండ ఉంది. సైన్యాలను సమకూర్చుకుని, తిరిగి వచ్చి, సింహాసనం చేజిక్కించుకుందాం. కపిలేంద్ర దేవుల వారి ఆశ నెర వేరుద్దాం.”
   “దారిలో ఎదురు పడితే..” పురుషోత్తమునికి హంవీరుని శక్తి బాగుగా తెలుసు.
   “చాలా ప్రదేశాలలో రహస్య మార్గాలు చేయించాను. అక్కడక్కడ ఎవరైనా ఎదురైనా మనం ఎదుర్కోవచ్చును. వారికి మన పయనం ఊహాతీతమే కదా? హంవీర కుమారుడు, తనయునితో కలిసి ఉత్తర దిక్కున విడిది చేశారు. విష్ణు కుండినులు, శిలా వంశీయులు, మత్సర వంశీయులందరినీ కూడగట్టి తిరుగు బాటు చెయ్యాలని ప్రణాలిక వేస్తున్నారు. అందుకని దక్షిణ దిక్కున వారి నుంచి మనకు భయం లేదు. ఇంకెవరైనా దాడి చేసినా మన సైన్యం సామర్ధ్యం తక్కువేమీ కాదు.”
   “సరే.. అదే విధంగా చేద్దాము. అనుకూల పరిస్థితులు ఆసన్న మయే వరకూ అజ్ఞాత వాసం చేద్దాము.” పురుషోత్తముడు లేచాడు.
   “పారిపోవడం పిరికి వారి లక్షణమే.. అయిననూ సముద్రంలో అలల వలే, వెనక్కి తగ్గుట విజృంభించుటకే మహారాజా! మనం మళ్లీ తళ్లు కొనసాగించి సింహాసనం దక్కించు కుందాము.” వ్యాకులిత మనస్కుడైన పురుషోత్తమునికి ధైర్యం చెప్పాడు మాధవుడు.
   అనుకున్నట్లుగానే, మార్గ మధ్యమున శతృదాడి తప్పలేదు.


               
   
 
    సుశిక్షితులైన సైనికుల సహాయంతో, దాడిని తిప్పి కొట్టి తాము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు, పురుషోత్తమ మాధవులు భార్యా బిడ్డలతో, బంధుమిత్ర సపరివారంగా.
   
   హంవీరుడు నిరాటంకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు.
   కానీ.. ప్రజలు సంతృప్తిగా కాలం గడపటం లేదు. మహారాజు దృష్టి అంతా రాజ్యాన్ని రక్షించుకోవడం తో, విస్తరించు కోవడం తోనే గడిచి పోతోంది.
   కపిలేంద్ర వర్మ దండయాత్రలకు వెళ్లినప్పుడు, పురుషోత్తముడు ప్రజాపాలన చేసే వాడు. ఇప్పుడు మొత్తం మంత్రుల ఆధీనంలో సాగుతోంది.
   ఒకరి మాట మీద ఒకరికి గౌరవం లేదు. ఒకరు చెప్పినది ఇంకొకరు కాదంటారు. రాజులేని రాజ్యంలాగ.   
   కపిలేంద్రుడు సమరాలు తగ్గించి, పాలన మీద దృష్టి పెట్టిన రోజుల్లోనే, కృష్ణా తీరంలో కొండల వెనుక ఒక పట్టణాన్ని మాధవుడు ముందుచూపుతో కట్టించి, జనావాస కేంద్రం కింద చేశాడు.
   దక్షిణాన ఉన్న గజపతుల రాజ్యాలన్నింటికీ మధ్యలో..  అది కొండవీడా, రాయల రాజ్యమా, గుంటూరా అనే సందిగ్ధంలో ఉండే ప్రాంతం. అన్ని సదుపాయాలతో రాచ మందిరం దగ్గరనుంచీ కట్టించి ఉంచాడు.
   కపిలేంద్ర గజపతి కొండపల్లి, కొండవీడు మొదలైన కృష్ణా తీర ప్రాంతాలన్నీ ఆక్రమించినప్పటి నుంచే ఆ ప్రయత్నం మొదలు పెట్టాడు, భవిష్యత్తుని ఊహించి.
   హంవీరుని ఏలుబడి కిందనే ఉన్ననూ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందని ప్రాంతంగా ఉండి పోయింది.
      
   దక్షిణాన ఉన్న రాజ్యాలన్నింటినీ సామంతరాజుల, పరీక్షల పర్యవేక్షణకి పూర్తిగా వదిలెయ్యడంతో అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది.
   ప్రజలవద్ద నుండి సుంకాలు వసూలు చెయ్యడంలో నున్న శ్రద్ధ, పాడిపంటల అభివృద్ధిలో కనబర్చుటలేదెవ్వరూ. అతివృష్టి అనావృష్టిలతో అల్లకల్లోలం అయిపోతున్నారు ప్రజలంతా.
   అరాచకం ప్రబలిపోతోంది.
   పురుషోత్తముడు ఒక పద్ధతిలో తన సైన్యాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. యువకులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతున్నారు. నెమ్మదిగా కోరుకొండ వరకూ పురుషోత్తముడే రాజు కావాలని ప్రజ అనుకునేట్లు ప్రచారం సాగిస్తున్నాడు. అధిక సుంకాల బారి నుంచి అతడే తమని కాపాడుతాడని అందరూ భావించేలాగ జనంలో ప్రాచుర్యం తీసుకొచ్చాడు.
   తాము ఏలవలసినది ఏదీ లేకపోవడంతో పూర్తిగా సంచారము మీదనే దృష్టి కేంద్రీకరించి అశ్వ, గజ, సైన్య సమీకరణలో ప్రతీ క్షణం గడుపుతున్నారు పురుషోత్తమ మాధవులు. కలిసి కొన్ని సార్లు, విడి విడిగా ఇరు దిక్కులా కొన్ని సార్లు.
   అటువంటి యాత్రలోనే, కొంత సైన్యంతో కృష్ణా తీరంలోని ఒక పట్టణ వీధుల్లో మాధవుని కంట పడింది.. ఒక హృదయ విదారకమైన దృశ్యం.
   ఆ ప్రాంతం ఆ సమయంలో ఎవరి అధికారంలో ఉందో అయోమయమే! బహమనీ సుల్తానులా, దేవరకొండ ప్రభువులా, విజయనగరం రాయలా, హంవీర గజపతా!
                                       ………………………….

 

 

 

  ......మంథాభానుమతి