Facebook Twitter
కదిలే అక్షరాలు- చాసో కథలు

 

కదిలే అక్షరాలు- చాసో కథలు

1940-1990ల మధ్య కాలం చాలా చిత్రమైనది. ప్రపంచీకరణ అప్పటికి మనకి పరిచయం లేదు. అయినా సమస్యలకి ఏమాత్రం కొదవ లేదు. రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని అత్యయిక పరిస్థితి వరకూ రకరకాల సమస్యలు వద్దన్నా మన ఇంట చొరబడేవి. విద్య, వైద్య సదుపాయాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. పేదలు, మధ్యతరగతివారు, ధనవంతులు అన్న గీతలు... ఆ గీతలననుసరించిన జీవితాలు అప్పటికి (ఇప్పటికీ, ఎప్పటికీ) స్పష్టంగానే ఉన్నాయి. అలాంటి సందర్భంలో తన చుట్టూ ఉన్న జీవితాన్ని కథలుగా మార్చినవాడు చాసో!

1915 జనవరి 17న శ్రీకాకుళంలో పుట్టిన చాసో, తన జీవితకాలంలో దాదాపు 40 కథలు మాత్రమే రాశారు. ఆ కథలన్నీ నాలుగు తరాలపాటు గుర్తుండిపోయేలా సాగుతాయి. చాసోకి ఆంగ్ల సాహిత్యం అంటే మహామక్కువ. ఆంగ్లంలో పేరుగాంచిన పద్యాలెన్నో ఆయన నోటి మీదే ఉండేవట. అయితేనేం! కళింగాంధ్ర మాండలికంలో అంతర్జాతీయ స్థాయి కథలను రాయడం ఆయనకే చెల్లింది.

చాసో తన 27 ఏట చిన్నాజీ పేరుతో కథని ప్రచురించారు. అది తన కూతురు చాగంటి తులసిని పాత్రగా చేసుకుని రాసిన కథే. అది మొదలుకొని చాసో రాసిన ప్రతి కథా విమర్శకుల ప్రశంశలను పొందినదే! చాసో కథలలో ఎక్కువగా మధ్యతరగతి జీవితాలు కనిపిస్తాయి. ఎత్తుకి ఎదగలేక, కిందకి జారలేకా వారు పడే అవస్థలు కళ్లకు కడతాయి. తాను అనుభవించినదైతేనేం, స్వయంగా చూసినదైతేనేం... మధ్యతరగతి జీవితాన్ని చాసో అక్షరబద్ధం చేసిన తీరు అసమాన్యం. అందుకనే ఆయన రచనల్లో వాయులీనం ఒక కళాఖండంగా మిగిలిపోతుంది.

సంగీతమంటే ప్రాణమిచ్చే భార్య, ఆ భార్య వైద్యం కోసం ఆమెకి ఇష్టమైన వాయులీనాన్ని అమ్మిన భర్త- ఇదే వాయులీనంలోని ఇతివృత్తం. కానీ ఈ ఇతివృత్తం ఆధారంగా చాసో ఒక సంసారాన్నే మనకి చూపిస్తారు. అద్దెకొంపలు, సంగీతం అంటే ఇష్టమున్నా దాన్ని సాగించలేని బతుకులు, వైద్యం కోసం తలకి మించి అయ్యే ఖర్చులు, పిల్లల అల్లరి, ఇంటి యజమాని ఆరాటం, ఇల్లాలి సర్దుబాటు... ఇన్ని కనిపిస్తాయి వాయులీనం కథలో.

కేవలం వాయులీనం కథ మాత్రమే కాదు- లేడీ కరుణాకరం, కర్మసిద్ధాంతం, కుంకుడాకు, గుడిసె- దీర్ఘరోగి, దుమ్మలగొండె... ఇలా చాసో రాసిన ప్రతి కథా మన మనసుకి దగ్గరగా తోస్తుంది. ఆ కథల్లోని పాత్రలు మనకి పరిచయం కాకపోవచ్చు. అప్పటి పరిస్థితులు ఈనాడు ఉండకపోవచ్చు. కానీ వీటిలోని మనస్తత్వాలు మాత్రం మనకు దగ్గరగా తోచక మానవు. వామపక్ష భావజాలంతో ప్రభావితం అవ్వడం వల్లనో, శ్రీశ్రీ వంటి మిత్రులతో తరచూ సిద్ధాంత చర్చలు చేయడం వల్లనో... చాసో రచనలన్నీ పీడితుల అణచివేతకు వ్యతిరేకంగానే సాగాయి. ఒక చిన్న పిల్ల పాత్రగా సాగే ‘కుంకుడాకు’లో సైతం తిరుగుబాటు ధోరణే కనిపిస్తుంది.

చాసో జన్మించి ఏ ఏడాదికి నూరేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ కొత్తగానే తోచే కథలు ఆయన దశాబ్దాల కిందటే రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ ‘లేడీ కరుణాకరం’! భర్త ఎదుగుదల కోసం తన శీలాన్నే తాకట్టు పెట్టిన ఈ కథ అటు ఆందోళననీ, ఇటు ఆశ్చర్యాన్నీ ఏకకాలంలో కలిగిస్తుంది. మనం గొప్పగా చెప్పుకునే విలువల గురించి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుంది.
చాసో కేవలం కథలు రాయడం మాత్రమే కాదు- కథా లోకానికి దిక్సూచిగా కూడా నిలిచారు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యునిగా, అధ్యక్షునిగా సాహిత్యాన్ని ఒక ఉద్యమ సాధనంగా మలిచారు. తను చనిపోయిన తరువాత తన దేహాన్నీ, కళ్లనీ దానం చేయమని సూచిస్తూ... మరణంలో కూడా తన అభ్యుదయ భావాల్ని ప్రతిఫలించారు. చాసో పుంఖానుపుంఖాలుగా రాయకపోయినా, పరుగులెత్తే అక్షరాలను మాత్రం ప్రపంచం మీదకు వదిలారు. వాటిలో పేదరికమన్నా కనిపిస్తుంది లేదా దైన్యమన్నా వినిపిస్తుంది. మనిషిలో ఆ దైన్యం ఉన్నంతవరకూ చాసో కథ నిలిచి ఉంటుంది.

- నిర్జర.