Facebook Twitter
" ఏడు రోజులు " 19వ భాగం

" ఏడు రోజులు " 19వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 ఆ ప్రాంతంలో ఎక్కువగా వేశ్యలు వుంటారు. కాబట్టి సాయంకాలం కాగానే ఆ ప్రాంతం విటులతో నిండిపోతుంది. అదేమీ ఆమెకు తెలియదు. కేవలం తనను ఆ యువకులు గమనించి వెంబడిస్తున్నారేమో నన్న భయంతో, వుండుండీ వెనక్కి చూస్తూ ముందుకుసాగిపోతోంది.
    
    కాని ఒకస్త్రీ ఆమెను గమనించి వెంబడిస్తోంది. అది కూడా గౌసియా పసిగట్టలేదు. నేరుగా ముందుకు నడిచి అక్కడున్న ఒక దేవాలయంలోకి వెళ్ళిపోయింది.
    
    దేవాలయంలో స్త్రీ పురుషులు ఇరువురూ చెరోవైపు గుంపులుగా కూర్చుని భజనచేస్తున్నారు. వెళ్ళి స్త్రీల గుంపులో కూర్చుంది. గౌసియా పక్కనే కూర్చుంది.
    
    "పాపా! నీ పేరేంటి? "కాసేపటి తర్వాత అడిగింది ఆ స్త్రీ.
    
    "గౌ..." తన పేరు చెప్పబోతూ ఆగిపోయింది. ఎందుకంటే 'ముస్లింలు దేవాలయాల్లోకి రాకూడదు అనే నిబంధనగాని, ఆచారంగాని వుందేమో? అన్న ఆలోచన మనసులో మెదిలింది. అందుకే తడబడుతూనే మరో పేరు చెప్పుకుంది.
    
    "గౌ....గౌతమి"
    
    "మంచి పేరు ఈ వీధిలోకి కొత్తగా వచ్చారా?"
    
    "అవును"
    
    "మీ ఇంట్లో ఎవరెవరు వుంటారు?" ఆరాతీస్తున్నట్టుగా అడిగింది.        
    
    "అందరమూ"
    
    "అంటే... మీ నాన్నగారు కూడానా?"
    
    "ఆ!" అవును అన్నట్టుగా తల ఊపింది గౌసియా.
    
    నిజానికి ఆ ప్రాంతంలో సంసారకుటుంబాలు వందకు ఐదు మాత్రమే వున్నాయి. మిగతా అందరూ వేశ్యలు అక్కడున్న సంసారకుటుంబాలు ఎంతో దీనస్థితిలో వున్నాయి కాని గౌసియాబేగం ఆమె కంటికి కొద్దో గొప్పో వున్నదానిలా కనబడ్డమే కాదు. తనలాంటి "అక్కా" దగ్గర్నుండి పారిపోయి వస్తున్నదానిలా కనబడింది అందుకే వెంబడిచింది.
    
    "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?" కావాలనే అడిగింది.
    
    "చాయ్ బండి అమ్ముతాడు"
    
    "ఎక్కడ?"
    
    సమాధానం కోసం గౌసియా చిక్కులో పడిపోయింది.
    
    "ఇ... ఇక్కడే"
    
    "నిజమే చెప్తున్నావా?" గొంతు మరీ తగ్గించి ఆ వెంటనే సూటిగా అడిగిందామె.
    
    భీతిల్లి చూసింది గౌసియా.
    
    "భయపడొద్దు పాపా! నేను ఇక్కడ ఒక స్కూలు నడుపుతున్నాను. ఆ స్కూల్లో ఇళ్ళ నుండి పారిపోయివచ్చిన పిల్లలు, అనాథ పిల్లలు, బలవంతంగా అపహరింపబడి తప్పించుకున్న పిల్లలు చాలా మందే వుంటారు" చెప్పి గౌసియావైపు పరిశీలనగా చూసిందామె.
    
    గౌసియా ఏదో ఆశ క్రమంగా కళ్ళ ల్లోంచి ప్రస్పుటం అవ్వసాగింది.
    
    "ఇప్పుడు చెప్పూ... మీ కుటుంబం ఎక్కడ వుంటుంది?" అడిగింది ఆమె.
    
    "నేను మీ వెంట రావొచ్చా" నెమ్మదిగా అడిగింది గౌసియా.
    
    "తప్పకుండా" కళ్ళను ఒకసారి మృదువుగా ఆర్పి తీసిందామె.
    
    అప్పటికి భజన పూర్తయ్యింది. భక్తులు లేచి వెళ్ళి గుడిలోపాల కొలువైన మహిషాసురమర్దినికి దణ్ణం పెట్టుకుని, తీర్ధప్రసాదాలు పుచ్చుకుంటున్నారు. ఆమెతోపాటుగా గౌసియా కూడా లేచివెళ్ళి దేవతకు దణ్ణంపెట్టుకుని తీర్ధప్రసాదాలు తీసుకుంది.
    
    "ఇక వెళ్దామా?" అడిగింది ఆమె.
    
    "వెళ్దాం" అన్నట్టుగా తలాడించింది గౌసియా.
    
    ఆమె గౌసియాని తీసుకుని వెంటనే ముందుకు నడిచింది. భక్తులు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా వేరే ప్రాంతాలకి చెందినవాళ్ళు మహిషాసురమర్ధిని గుడి అక్కడ వున్నందున పవిత్రది నాల్లో మాత్రమే అక్కడికి వచ్చి భజనలు చేస్తుంటారు. అది వేశ్యలు వుండే ప్రాంత మైనందున చీకటిపడకమునుపే భజన కార్యక్రమాల్ని ముగించుకుని వెళ్ళిపోతుంటారు అదేమీ గౌసియాబేగానికి తెలియదు కాబట్టి వెళ్తూ ఆమెతో ఇలా అంది.
    
    "మా దగ్గర చీకటిపడేవరకు భజన చేస్తారు"
    
    "ఇక్కడ మాత్రం చీకటి పడకుండానే వెళ్ళిపోతారు" అందామె.
    
    "రోజూ భజన చేస్తారా?" అడిగింది గౌసియా.
    
    "కాదు కొన్ని పుణ్యదినాల్లో మాత్రమే ఇక్కడ భజనచేస్తారు ఈరోజు శ్రావణమాసపు మొదటిరోజు" ఆమె చెప్తుంటేనే కొంచెం దూరంలో వస్తూ కనిపించాడు రాజేష్.
    
    అతడ్ని చూడగానే గౌసియా వణికిపోయింది. అతడి కంట్లోపడకూడదన్నట్లుగా ఆమెచాటుకి మెల్లగా నక్కబోయింది. అంత లోపే రాజేష్ దృష్టి గౌసియాను గమనించింది.
    
    "ఎందుకు అలా భయపడుతున్నావు?" ఆమె కూడా గౌసియాను గమనించింది.
    
    "వాడు...వాడు" అదురుతున్న పెదిమ లతో రాజేష్ ను చూపించింది.
    
    "ఏంచేసాడు వాడు?" నవ్విందామె.
    
    "వాడు నన్ను పట్టుకుపోతాడేమో..." భయంతో అక్కడే ఆగిపోతూ ఆమె చేతుల్ని బిగ్గరగా పట్టుకుంది గౌసియా.
    
    "వాడు నిన్నేంచేయడు" గౌసియా భుజం చరిచిందామె.
    
    "ఏంటక్కా? మా గౌసియాను నీవు తీసుకెళ్ళిపోతున్నావు?" వాళ్ళకు దగ్గరగా రాగానే అడిగాడు రాజేష్.
    
    "గౌసియా? ? గౌతమి? ?" గౌసియా వైపు ప్రశ్నార్ధకంగా చూసిందామె.
    
    "గౌతమి కాదు, గౌసియాబేగం! రాజ్ బజార్ పబ్లిక్ పార్క్ లో ఏడుస్తూ కనబడితే జాలిపడి తీసుకువచ్చాం. పాపం.... హైద్రాబాద్ నుండి వచ్చిందట. ఇక్కడ ఎవ్వరూ కూడా లేరట" ఆమెకు చెప్పి "మాకు తెలియకుండా పుష్పావతక్కను ఎలా కల్సుకున్నావు? అక్క దగ్గరకి రేపు వెళ్దువుగాని, ఇంటికి వెళ్దాంరా" ప్రేమగా పిలుస్తూ గౌసియా చేయి పట్టబోయాడు రాజేష్.
    
    ఆమె ఎవరో తెలియగానే గౌసియాబేగానికి ఒక్కసారిగా తనని ఎవరో సమూలంగా కబళించివేసిన భావన కలిగింది.
    
    "హా..." హడలిపోతూ ఆ ఇద్దర్నీ చూసింది.
    
    "అదేంటి పాపా?" ఆమెలో కొండంత ప్రేమ.
    
    పట్టించుకోలేదు గౌసియా అదే తడవుగా వెనుతిరిగి వేగంగా పరుగెట్టసాగింది.
    
    "అయ్యో...అయ్యో" పుష్పావతి గుండెలు బాదుకుంటుంటేనే- "ఏయ్...పోరీ" అంటూ వెనకే పరుగెట్టాడు రాజేష్.

...... ఇంకా వుంది .........